జనక మహారాజు - మరొక సాధువు
జనక మహారాజు - మరొక సాధువు మిథిలానగరాన్ని పరిపాలించే జనకునికి రాజర్షి అని బిరుదు. ఆయనను గొప్ప జ్ఞానిగా అందరూ భావించి గౌరవించేవారు. అయితే ఆయనలోని జ్ఞానం ఆయన ముఖంమీద తాండవిస్తూ ఉంటుందా? అందులోనూ ఉదయం నుంచి రాత్రివరకు రకరకాల లౌకిక వ్యవహారాలలో మునిగి తేలే ఒక రాజును జ్ఞానిగా ఎలా భావించడం!. జనకున్ని రాజర్షిగా, జ్ఞానిగా అందరూ ఎందుకంటున్నారో, అందులోని విశేషమేమిటో తేల్చుకుందామను కున్నాడు ఒక సాధువు. నేరుగా జనకుని ఆస్థానానికి వెళ్ళాడు. జనకుడప్పుడు మంత్రులతో మంతనాలు జరుపుతున్నాడు. ప్రజల బాగోగుల గురించి అడిగి తెలుసు కుంటున్నాడు. కప్పం చెల్లించని సామంత రాజులపై కోపం ప్రకటిస్తున్నాడు. ఎతైన సింహాసనం మీద కూర్చున్న జనకునికి పరిచారకులు అటూ ఇటూ నిలబడి వింజామరలు వీస్తున్నారు. ఒకరు పాదాలు ఒత్తుతున్నారు. ఆయన కిరీటంలో పొదిగిన మణిరత్నాలు జిగేలుమంటున్నాయి. ఎటుచూసినా ఆడంబరమూ, అతిశయమే. సాధువు ఇదంతా గమనిస్తున్నాడు. అతనకీ వరస ఏమీ నచ్చలేదు. ఇతడన్నీ లౌకికవిషయాలే మాట్లాడుతున్నాడు. లౌకికమైన సిరిసంపదలతో తులదూగుతున్నాడు. ఇతడు రాజర్షీ, జ్ఞానీ ఎలా అవుతాడు? ఇతణ్ణి జ్ఞాని అన్నవాళ్ళు పరమ అజ్ఞానులు - అనుకున్నాడు. సా...