రామచిలుకల భక్తి....

ఔరా!        రామచిలుకల భక్తి....
.
రామచిలుకల మేత కోసం వేలాది కేజీల ఆహారధాన్యాలను వెదజల్లే దృశ్యాలను మీరెక్కడైనా, ఎపుడైనా చూశారా? అలా చల్లిన ధాన్యాలను వందాలది రామ చిలుకలు క్షణాల్లో హాయిగా ఆరగించడాన్ని మీరు కనులారా వీక్షించారా?. ఈ రెండు ప్రశ్నలకు మీ వద్ద నుంచి లేదనే సమాధానం వస్తుంది. అయితే.. ఇలాంటి అపురూప సుందర దృశ్యాలు మీకు చూడాలని ఉందా? .. మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇండోర్‌ సమీపంలోని పంచకుయాన్ మందిరానికి మిమ్ములను తీసుకెళతాం రండి.
ఇక్కడ వెలసివున్న హనుమాన్ ఆలయం అత్యంత పురాతనమైంది. ఇక్కడకు రామచిలుకలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ ఆలయానికి ‘పంచకుయాన్ హనుమాన్ మందిరం’ అనే మరో పేరు ఉంది. ఈ ఆలయానికి వందలాది కాదండీ.. వేలాది రామచిలుకలు ప్రతిరోజూ వస్తుంటాయి.
ఈ ఆలయం ప్రాంగణంలోనే చిన్నపాటి శివుని ఆలయం కూడా ఉంది. ఈ సమాజంలో కేవలం మనుషులు మాత్రమే కాకుండా.. పక్షులు సైతం భగవంతునిపై నమ్మకం కలిగి వుంటాయని ఈ ఆలయాన్ని సందర్శించిన వారికే తెలుస్తుంది. ఈ ఆలయానికి కొన్ని సంవత్సరాలుగా రామచిలుకలు వస్తుంటాయని, ఇక్కడ నివశించే సిద్ధులు చెబుతారు .
ఈ ఆలయంలో నాలుగు వేల కిలోల ఆహార ధాన్యాలను రామచిలుకల కోసం ప్రతిరోజు వినియోగిస్తారు. ఆలయ ప్రాంగణంలో వెదజల్లే ఆహార ధాన్యాలను చిలుకలు ఆరగించే ముందుగా.. గర్భగుడిలోని హనుమంతుని విగ్రహం వైపు ఒక సారి చూసి తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తాయి. ఆ తర్వాత పశ్చిమ దిశకు తిరిగి ధ్యానం చేస్తాయి. నోరులేని ఈ చిలుకల భక్తిని చూసి ఇక్కడకు వచ్చే భక్తులు ఔరా..! అని ఆశ్చర్యం చెందుతారు.
ఇక్కడకు వచ్చే చిలుకల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో పలువురి భక్తుల సహాయంతో మూడు వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో కాంక్రీట్ పైకప్పును ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య కాంక్రీట్ కప్పుమీద ధాన్యాలను వెదజల్లుతారు. ఇలా ధాన్యాలు వెదజల్లిన తర్వాత ఒక గంట కాలంలో వేలాది కేజీల ఆహార ధాన్యాలను రామచిలుకలు ఆరగిస్తాయని ఆలయ సిబ్బంది రమేష్ అగర్వాల్ తెలిపారు.
ఆలయానికి వచ్చే భక్తులు తమ ప్రార్థనలు పూర్తయిన తర్వాత ప్రసాదం ఆరగించే సమయంలోనే రామచిలుకలు కూడా ఆహారాన్ని ఆరగించడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడకు వచ్చే ప్రతి చిలుక, సాటి చిలుకలతో ఏదో సంబంధం కలిగి వున్నట్టుగా మెలగడం విశేషo.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: