నాడీ జోతిషం - అసలు రహస్యం (చివరి 




(ఇది వ్యాసంలొ మూడో భాగం
మొదటి భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి
రెండో భాగం చదవాలంటే ఇక్కడ నొక్కండి)

అతను అశ్వనీ నక్షత్రం అనగానే నాకు విషయం అర్థమైపోయింది.

"మాష్టారు..! మీరు నా వివరాలు ఎలా కనిపెట్టారో నాకు తెలుసు" అన్నాను.
ముందు ఎదురు చెప్పాడు, తరువాత మెత్తబడ్డాడు ఆ తరువాత ఒప్పుకున్నాడు. ఆ రహస్యమేమిటో మీకు చెప్తా వినండి. కానీ దానికి ముందొక పిట్ట కథ:

చిన్నప్పుడు మనం ఒక ఆట ఆడే వాళ్ళం.. గుర్తుందా? ఏదైనా బొమ్మల చార్టుతోనో (అందులో అడ్డంగా అయిదు, నిలువుగా ఆరు మొత్తం ముఫై బొమ్మలుండేవి), లేదా పేకముక్కలతోనో ఒక ట్రిక్ చేసేవాళ్ళం. అయిదు ఇంటూ ఆరు ముప్పై బొమ్మలో/పేకలో పేర్చాక, ఎదుటివాణ్ణి అందులో ఏదో ఒకటి మనసులో తల్చుకోమనేవాళ్ళం. ఆ తరువాత ఈ వరుసలో వుందా, ఈ వరుసలో వుందా అంటూ అడ్డంగా, ఆ తరువాత అదే రకంగా నిలువు వరసలపైనా ప్రశ్నించేవాళ్ళం. అడ్డం వరుస నిలువు వరుస తెలిసిపోతే ఆ రెండు కలిసే గడి/పేకే వాళ్ళనుకున్నదని చెప్పేవాళ్ళం. అంటే మనకి కావల్సిన సమాధానం అవతలి వారి దగ్గరనించే రాబట్టేవాళ్ళం.

సరిగ్గా ఇలాగే నాడీ జ్యోతిషం చెప్పేవాళ్ళు కూడా ప్రశ్నల ద్వారా వాళ్ళకి కావాల్సిన విషయాన్ని మన నించే రాబడతారు. వారికి ప్రధానంగా కావల్సింది మన పేరు, జనన తేది, సమయం. ఇవి తెలుసుకోడానికి ఒక వంద, నూటాభై ప్రశ్నలుంటాయి. ఏవీ నేరుగా వుండవు - ఒకసారి ఇంగ్లీషు నెల గురించి అడిగితే మరోసారి వారం, మరో సారి తిధి, నక్షత్రం, సంవత్సరం, తెలుగు నెల, వయసు ఇలాగన్నమాట. ప్రతిసారి మనం చెప్పిన సమాధానం ఆధారంగా మన జనన తేదీకి దగ్గరవుతారు. మధ్యలో "రెండో" గ్రంధం తేవడానికి వెళ్ళినప్పుడు అవసరమైతే పాత పంచాంగాలో క్యాలుకులేటర్లో వాడుకుంటారు. ఇలా జనన తేది సమయం కనుక్కోలేకపోతే "అగస్త్యుడు ఈ రోజు కాదన్నాడు, మళ్ళీ రండి నెల తరువాత (అప్పటికి మీరు మా ప్రశ్నలు మర్చిపోతారు)" అని చెప్తారు.

పేరు ఎందుకు అంటే - అది మన వ్యక్తిగత వివరాలలో అతి ముఖ్యమైనది. అది చెప్పగలిగితే అవతలి వారిని పట్టేసినట్టే. దీంట్లో కూడా నక్షత్రం ఆధారంగా, పుట్టిన ప్రాంతం ఆధారంగా, కులం ఆధారంగా కొన్ని వూహించి ప్రశ్నలు అడుగుతారు.

ఇక మిగిలిన ప్రశ్నలు. ఇవి ప్రధానంగా జననతేదీ కనుక్కునే ప్రశ్నల మధ్యలో అడిగేవి. అంటే జననతేది సంబంధించిన ప్రశ్నలే వేస్తున్నారు అని అనుమానం రాకుండా ఏమార్చేందుకు వుపయోగపడతాయి. చాలా తెలివిగా సర్వ సాధారణమైనవి, ఓపెన్ ఎండెడ్ (open ended) ప్రశ్నలు వేస్తారు. "మీకు చిన్నప్పుడు ఒక ప్రమాదం తప్పింది కదా?" లాంటివి. చిన్నప్పుడు అంటే ఎంత చిన్నప్పుడు? 90% మందికి చిన్నప్పుడు ఏదో ఒక గాయమో, దెబ్బో, ఇంట్లోంచి తప్పిపోవడమో ఏదో ఒకటి జరిగేవుంటుంది కదా. ఇందులో "అవును" అని సమాధానం వచ్చినవన్నీ ఒక పక్క మెమొరీలో స్టోర్ అవుతుంటాయి. వాటి వుపయోగం చివర్లో చెప్తాను.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే - ప్రశ్నలు అడిగే విధానం. ఇది స్కూల్ మాష్టరు పిల్లల్ని అడిగినట్లు కాకుండా ఏదో క్లూ ఇస్తున్నట్టు అడుగుతారు.
"మీకు పెళ్ళి ఇరవై నాలుగూ ఇరవై ఎనిమిదీ మధ్య అయ్యిందా?" అంటూ.

వచ్చిన వాళ్ళలో కొంతమంది (పూర్వ జన్మలో!!) కూచిపూడి కళాకారులు వుంటారు. ప్రశ్న సగంలో వుండగానే ముఖం చిట్లించి, తల వూపేస్తారు. అలాంటి ఎక్ష్ప్రెషన్ కనపడగానే ప్రశ్న మారిపోతుంది.

"మీకు పెళ్ళి అయ్యి ఇప్పటికి (అప్పటికే ముఖం చిట్లిస్తే అసలు పెళ్ళికాలేదు అని) నాలుగు, అయిదు సంవత్సరాలూ... (ఇక్కడ చిట్లిస్తే) పోనీ ఏడు ఎనిమిది సంవత్సరాలు అయ్యింది" అంటాడు

మరికొంతమంది (పూర్వ జన్మలో) దానకర్ణులు వుంటారు. వీళ్ళు ప్రశ్న అడగాన్నే "అవునండీ అసలేం జరిగిందంటే చిన్నప్పుడు నేను మా తాతయ్య వాళ్ళింట్లోనే వుండేదాన్నేమో... అబ్బ దబ్బ జబ్బ అబ్బ్బ జాబ్బ్బ"

ఇలాంటి వాళ్ళు దొరికితే అదేంటో అన్నీ అగస్త్యమహాముని వ్రాసిన పుస్తకాలే దొరుకుతాయి. నాడీ జాతకం చెప్పించుకొని హాశ్చర్యపడిపోయిన మా మిత్రులు ఇలాంటివారే.

ఇంతవరకు విషయ సేకరణ పూర్తయ్యాక మీ ఆఖరు మరియు అసలైన నాడీ గ్రంథం తీసుకు రావటానికి లోపలికి వెళ్తాడు. లోపల కప్యూటరో, రెండు వేల సంవత్సరాల పంచాంగమో వుంటుంది. మీ జాతక చక్రం వేసేస్తారు. ఇక బయటికి వచ్చి గ్రంధం తెరుస్తూనే లొడ లొడా మీరు ఇందాక ప్రశ్నలలో అవునన్న విషయాలు, అబ్బ దబ్బ జబ్బ అని చెప్పిన విషయాలు, కొంత కల్పిత కథలు, కొంత మీ జాతకం ఆధారంగా విషయాలు చెప్పేస్తారు. -

"అగస్య మహాముని తేదీ (ఈ రోజు డేటు) న ఇక్కడికి వస్తారని. (మిస్టర్ సొ సొ) చేత నాడీ జ్యోతిష్యం చెప్పించుకుంటారని ఇక్కడ వ్రాసుంది. పూర్వ జన్మలో మీరు భంభోజం అనే ఏనుగు. అప్పుడు ఒక ముని శాపం వల్ల ఈ జన్మ ఎత్తి గ్యాస్ తదితర ఉదర సంబంధమైన వ్యాధులతో బాధ పడుతున్నారు. (ఇందులో ముని శాపం అబద్ధం, పర్సనాలిటి చూస్తే గ్యాస్ ప్రాబ్లం వుందని చెప్పచ్చు/జాతకం ఆధారంగా కూడా చెప్పచ్చు లేదా మీ జేబులో జెలుసిల్ స్ట్రిప్ కనపడి వుండొచ్చు)." ఇలా సాగుతుంది. డబ్బులు సంగతి వేరే చెప్పక్కర్లేదనుకుంటా.

ఈ విషయం ఇలా జరుగుతుందని చెప్పగానే నాకు జాతకం చెప్పిన జ్యోస్యుడు ఒప్పుకున్నాడు. ముందు నేను ఆవేశంలో - "నీ బోర్డు పీకించేస్తాను, మా బ్యాచినేసుకొని వచ్చానంటే అయిపోతావ్.. ఈనాడుకి చెప్తాను" అని వీరంగం చేసాను. తరువాత అతను నిజాయితీగా - "సార్ నేను జాతక చక్రం చూడటం నేర్చుకున్నాను. మా విద్యలో ఏ లోపమూలేదు. అందరిలాగానే జనన తేదీని బట్టి జాతకం వేస్తాము. కాకపోతే ఆ జనన తేదీ తెలుసుకోడానికే ఈ నాటకం. ఏదైనా కడుపు నింపుకోడానికే" అన్నాడు. నేను వచ్చేసాను.

ఇది జరిగింది గుంటూరులో ఒక బ్రాంచిలో. హెడ్డఫీసులో కూడా ఇలాగే జరుగుతుందని నేననుకున్నాను. కాకపోతే అక్కడా ఇంత సులభంగా దొరికే ఘఠాలు వుండకపోవచ్చు. ఏది ఏమైనా అసలు ఈ కాన్సెప్ట్ కనిపెట్టి, ఇలాంటి ప్రశ్నలు తయారు చేసి, పుస్తకాలు తయారుచేసినవాడు మహా మేధావి. ఈ ప్రశ్నలు అడగటానికీ చాలా తెలివితేటలు కావాలి. కాకపోతే నేనుకూడా కొంచెం తెలివైనవాణ్నే కదా..! అక్కడ దొరికిపోయారు...!!

Manohar12 ఫిబ్రవరి, 2009 11:42 AM

నాడీ జ్యోస్యం అనేది నిజము. కాకపోతే కొంతమంది దాని డిమాండ్ ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు అంతమాత్రాన అందరినీ అదే గాటన కట్టేస్తానంటే అది వివేకం అనిపించుకోదు. కొన్నిచోట్ల మొహం చూసి రూపాయి తీసుకోకుండా జాతకం చెప్పేవాళ్ళున్నారు.
అంతెందుకు మా తాతగారు జన్మతహ: బ్రాహ్మణుడు కాకపోయినా మా కుటుంబంలో ఎవరికైనా ఆయనే ముహూర్తం నిర్ణయించేవాడు. మా తాతగారు పెట్టారని తెలిస్తే ఊరి పూజారులు కూడా అదే ఖాయం చేసేవారు. జాతకాలు కూడా మొహం చూసి చెప్పేవారు. మరి దానికేమంటారు?



నాడీ జ్యోతిష్యము అనేది అబద్దపు ప్రక్రియ కాదు.మహర్షులు అందించిన మహా విజ్ఞానము.ఐతే అది ఎక్కడపదితే అక్కడ బజారులో దొరికే చవకరకం మందులవంటిది కాదు. కొన్ని కుటుంబాలకు మాత్రమే తెలిసిన రహస్య విద్య.వాటిలో వ్రాతలు నేటికీ మారుతున్న విషయాన్ని వేదవ్యాస్ గారి లాంటి వారు పరిశీలించి ధృవీకరించుకున్నారు. అందులో అగస్త్యులవారిదేకాక,కాకభుశుండి నాడి అలానే ఇతరమహర్షుల నాడీగ్రంధాలు కూడావున్నాయి.అయితే సాధారణముగా ఆయాకుటుంబీకులు వాటిని బయటపెట్టరు.వాటికి లోకొన్ని కాలగర్భములో కలసి పోగా ,కొన్ని బయటకు తీసుకు రావటము వీలుపడక మరుగున వున్నాయి.వచ్చినా వాటివలన లోకానికి మేలు కాదు.అనర్హుల పాలిటబడే ప్రమాదము వున్నది.ఇక నకిలీ లంటారా ఇప్పటిలో అవే ఎక్కువ.ఎమ్.బి.బి.యెస్. సర్తిఫికెట్లనేశ్రుష్టిస్తున్నారు. నకిలీ నోట్లున్నవని అసలు నోట్లకు విలువతగ్గదు కదా?అలానే ఆపేరు చెప్పుకుని పొట్టకూటికోసము వేషధారులు ఎక్కువగా కనపడుతున్నారు. నేను కూడా గుంటూరు లో వాళ్ల ను కలిశాను.మొదలు పెట్టగనే నాకర్థమయినది సరుకు లేదు అని.మరలా రమ్మని వాల్లు చెబుతుమ్టే నవ్వి వచ్చేశాను ఇక మీవల్ల కాదులే నాజాతకము మీకుదొరకదుఅని, ఒక యాభైరూపాయలేకదా అని వదలి వచ్చాను. మీరు పరిశోధనచేయగల ఓర్పు నేర్పు ఉన్నవారు.తీరికలేనంతమాత్రాన ఇప్పటిలో తీర్మానాలు చేస్తున్న వారిలా ముగించేస్తే ఎలా? మీకు బాధ్యతకూడా వున్నది.నిజాలు నిగ్గుతేల్చాలని.శుభం

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: