గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు - లాస్య రామకృష్ణ
గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు - లాస్య రామకృష్ణ
గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు మీ పాపాయి అవయవాల ఎదుగుదలకు ఎంతో కీలకమైనవి. మద్యం, ఔషదాలు అలాగే డ్రగ్స్ వాడకాలలో గర్భదారణ సమయం లో చాలా జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీలు తరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కింద వివరించబడ్డాయి. కడుపులో మీ పాపాయి ఎదుగుదల సరిగ్గా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో కూడా వివరించడం జరిగింది.
చేపలు మరియు సముద్రపు ఆహారం (సీ ఫుడ్)
చేపలు మరియు సముద్రపు ఆహారం తక్కువ కొవ్వు కలిగిన ఆహారం. అంతే కాకుండా, విలువైన పోషకాలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం. అయినప్పటికీ గర్భిణీలు పాదరసం యొక్క స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని రకాల చేపలు మరియు సముద్రపు ఆహారానికి దూరం గా ఉండాలి. చేపలని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి.
కెఫైన్
భయము, ఆందోళన, గుండెదడ, నిద్ర లేమి వంటి సమస్యలు కెఫైన్ వల్ల కలుగుతాయి. గర్భస్థ శిశువుపై కెఫైన్ ప్రభావం పై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొందరి శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం నెలలు నిండకుండా పిల్లలు పుట్టే అవకాశం ఉంది. జనన లోపాలు కలిగే అవకాశం కలదు.
ఆహరం మరియు పానియాల్లో కెఫైన్ లేనివి ఎంచుకోవాలి. కాఫీ, టీ, కోలా మరియు ఇతర శీతల పానీయాలను నిర్మూలించాలి. మందుల చీటీ అవసరం లేకుండా దొరికే తలనొప్పి, జలుబు, ఎలర్జీ మరియు మత్తుని కలిగించే కొన్ని మాత్రలలో కెఫైన్ ముఖ్యమైన పదార్ధం. అందుచేత గర్భిణీలు వీటిని వాడేముందు వైద్యుల సలహా తీసుకోవాలి.ఒక వేళ మీరు కాఫీ ని ఎక్కువ మొత్తం లో తీసుకునే అలవాటు ఉంటే మెల్లి మెల్లిగా తగ్గించుకోండి. ఒకే సారి ఆపివేస్తే తీవ్రమైన తలనొప్పి, వికారం, అలసట వంటి లక్షణాలు కనబడవచ్చు.
ఔషదాలు మరియు మూలికలు
కొన్ని రకాల ఔషదాలు మరియు మూలికలు మీ పాపాయి కి హానీ కలిగించవచ్చు. ఏదైనా ఔషదం వాడే ముందు గర్భిణీలు వైద్యుల సలహా తీసుకోవలసి ఉంటుంది.
ఆవిరి స్నానాలు
గర్భిణీలు ఆవిరి స్నానాలకి దూరం గా ఉండాలి. శరీర ఉష్ణోగ్రత కంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండటం వలన పాపాయి ఎదుగుదలకి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. అధిక వేడి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మద్యపానం
మారుతున్నజీవన విధానం వల్ల కొన్ని పాశ్చాత్య అలవాట్ల వెంట ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆడ మగ తేడా లేకుండా అందరు మద్యపానాన్ని అలవాటు చేసుకుంటున్నారు.గర్భిణీలు ఎంత మోతాదులో మద్యం తీసుకుంటే హనీ కలుగదో ఇంకా ఎవరూ నిర్ధారించలేదు. గర్భిణీలు మద్యాన్ని సేవించడం వల్ల గర్భస్థ శిశువుకు ఫెటల్ ఆల్కహాల్ సిండ్రోమ్(FAS) వచ్చే అవకాశం ఉంది.
ఈ సిండ్రోమ్ తో జన్మించిన పిల్లలలో ఎదుగుదల తక్కువగా ఉంటుంది. అభ్యాసన సమస్యలు కలుగుతాయి. ఇంకా అసాధారణమైన ముఖ లక్షణాలు ఉంటాయి.
ఈ సమస్యలకి ఎటువంటి నివారణ లేదు.
ఆల్కహాల్ ఎన్నో ఔషదాలలో ముఖ్యమైన పదార్ధం. ఉదాహరణకు, దగ్గుమందులో 25 శాతం ఆల్కహాల్ ఉంటుంది. అందుచేత, ఏవైనా ఔషదాలు వాడేటప్పుడు మీ వైద్యున్ని సంప్రదించాలీ. ఏదైనా ఔషదం కొనేముందు లేబిల్ ని చదివి కొనాలి.
ధూమపానం
ధూమపానం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యం గా గర్భిణీలు ఈ అలవాటుని మానుకోవాలి. ధూమపానం సేవించిన గర్భిణీలు ధూమపానం సేవించని గర్భిణీల తో పోలిస్తే అతి తక్కువ బరువున్న బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు కలవు. అతి తక్కువ బరువున్న బిడ్డలలో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలేత్తుతాయి. కొన్ని సార్లు మరణం కూడా సంభవించవచ్చు.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పండంటి పాపాయి ని మీరు ఆహ్వానించినట్టే.
Comments
Post a Comment