58.స్త్రీ ధర్మము

58.స్త్రీ ధర్మము


సమస్త నదులను శివునకు పరిచయము చేయుచున్న పార్వతి...
పరమశివుడు పార్వతీ ! నా గురించి నేను చెప్తాను కదా ! మరి స్త్రీధర్మము గురించి నీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చెప్పవా అని అడిగాడు. ఆ మాటలకు పార్వతీదేవి సిగ్గుపడి అయ్యో ! నేను మీకు చెప్పగలదాననా ! మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది లేదు. కాని నన్ను కోరారు కనుక నేను చెప్పకుండా ఉండడం భావ్యము కాదు. అందుకని నాకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి చెప్తాను. కాని నేను ముందు నన్ను ఎన్నడూ విడువకుండా సేవించే నదులతో సంప్రదించి తరువాత మనవి చేస్తాను అని చెప్పి గంగా, యమునా, గోదావరి, కౌశికి, కావేరి, కృష్ణవేణి, పెన్న, నర్మద, బాహుద, రేవ, తమస మొదలైన నదులను మనసులో తలచుకుంది. వారు స్త్రీ స్వరూపములతో పార్వతి ముందు నిలిచారు. వారికి పరమేశ్వరుడు తనను స్త్రీ ధర్మము గురించి అడిగాడని తనకు ఎలా చెప్పాలో తెలియక మిమ్ము పిలిచానని తెలిపింది. వారు పార్వతీ ! నీ కంటే ఎక్కువగా మాకు ఏమి తెలుసు. నీకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి నీ భర్తకు చెప్పి ఆయనను సంతోషపెట్టు. మేము కూడా నీ నోటి నుండి వచ్చు అమృతధారలను వినడానికి కుతూహలంగా ఉన్నాము అన్నారు. అప్పుడు పార్వతీదేవి మహేశ్వరుడి మీద చూపు నిలిపి ఓ దేవా ! నీ అనుగ్రహంతో నాకు అబ్బిన తెలివితో మీ అందరకీ స్త్రీ ధర్మము గురించి చెబుతున్నాను. స్త్రీ వివాహత్పూర్వము కన్య అని పిలువబడుతుంది. తల్లి తండ్రులు కాని, పినతండ్రి కాని, మేనమామలు కానీ, అన్నదమ్ములు కానీ వీరిలో ఎవరైనా కన్యకు తగిన వరుడితో వివాహము జరిపించడానికి అర్హులు. స్త్రీ వివాహానంతరం భర్తకు ఆమె మీద సర్వహక్కులు సంక్రమిస్తాయి. భర్తయే భార్యకు ప్రభువు, దైవము. భర్తతో కూడి భార్య ఆయన అనుమతితో దేవతా పూజలు, పితృతర్పణములు, అతిథి పూజలు ఆచరించాలి. ఎల్లప్పుడూ భర్త హితము కోరాలి.
ఇటువంటి పతివ్రత ఈ లోకములోనే కాదు పరలోకములో కూడా సుఖములు అనుభవిస్తుంది.
బ్రాహ్మణుడి భార్యలు:
పార్వతీదేవి స్త్రీ ధర్మములగురించి ఇంకా చెప్తూ ఈ సందర్భంలో ఒకకథ చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగింది. ఒక బ్రాహ్మణుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సదా అతడి క్షేమము కోరుతూ ఆయన చెప్పినా చెప్పక పోయినా దేవతాపూజలు, పితృతర్పణలు, అతిధిపూజలు, చేస్తూ ఉండేది. రెండవభార్య భర్తను అనుసరిస్తూ ప్రతిపనీ ఆయన అనుమతితో చేస్తుడేది. ఆ భర్త, ఇద్దరు భార్యలు ఒకేసారి మరణించారు. భర్త రెండవభార్య భర్తను అనుసరిస్తూ స్వర్గానికి పోయారు. భర్త అనుమతి తీసుకోకుండా దేవతాకార్యములు చేసిన రెండవభార్యను యముడు స్వర్గలోకముకు పోవడానికి అనుమతి ఇవ్వలేదు. యముడు ఆమెతో నీవు నీ భర్త అనుమతి లేకుండా పూజలు చేసినందు వలన నీకు స్వర్గలోకార్హత లేదు. కనుక నిన్ను తిరిగి నీ శరీరంలో ప్రవేశపెడతాను అని శాసించాడు. ఆమె విలపిస్తూ తనను కాపాడమని యమధర్మరాజును వేడుకుంది. ఆమె మాటలకు కరిగిపోయిన యమధర్మరాజు ఓ వనితా ! భర్త అనుమతి లేకుండా పుణ్యకార్యము చేయడం తగదు. మరు జన్మలోనైనా భర్త అనుమతితో పుణ్యకార్యములు చెయ్యి అన్నాడు. పార్వతీదేవి ఇంకా స్త్రీధర్మము గురించి చెప్తూ ఇలా అన్నది. భర్తకు ఇష్టం అయిన వంట వండిపెట్టాలి, కోరినప్పుడు ఆయనకు సుఖాన్ని అందించాలి. భార్య భర్తమాటకు ఎదురు చెప్పకూడదు. అతడి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. పొరపాటున భర్త తాను చెయ్యవలసిన కార్యములను మరచిపోతే ఆయనకు గుర్తు చెయ్యాలి. తనకు మరొక సవతి ఉన్నచో ఆమెతో సఖ్యతతో మెలగాలి. భర్త తన వద్ద ఏదైనావస్తువు దాచిన దానిని భద్రంగాదాచి అతడు అడిగినప్పుడు అందచెయ్యాలి. భర్త తనకు ఏది ఇచ్చినా దానిని సంతోషంగా స్వీకరించాలి. భర్త ధనవంతుడినా, అందగాడైనా, కురూపి అయినా, తెలివి కలవాడైనా, ఆరోగ్యవంతుడైనా, అనారోగ్యంతో బాధపడుతున్నా, భర్తను భార్య గౌరవించాలి. ప్రేమతో ఆదరించాలి. వయసు వచ్చిన కుమారుడితోనైనా స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే శయ్య మీద కుర్చోకూడదు. పశుపక్ష్యాదులకు ఆహారం పెట్టడం, యాచకులకు అన్నదానం చెయ్యడం, దేవతలకు పితృదేవతలకు పూజచెయ్యడం. ఆ పనులన్నీ భర్త క్షేమంకోరి భార్య చెయ్యడం భార్య కర్తవ్యం. పరమేశ్వరా ! స్త్రీలందరూ ధర్మపరులు కారుకదా ! అధర్మపరులు అయిన స్త్రీలను రాక్షసి అంటారు. అటువంటి స్త్రీలు పరపుషులను కోరుకుంటారు. అటువంటి స్త్రీలు అసురవంశంలో జన్మించిన వారు. అటువంటి స్త్రీలకు మనసు నిలకడ ఉండదు. ఎప్పుడూ సుఖవాంఛల మీద కోరిక కలిగి ఉంటారు. క్రూరమైన పనులు చెయ్యడంలో ఆసక్తి కలిగి ఉంటాడు. అటువంటి స్త్రీ ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది. ఆమెకు కోపము ఎక్కువ. భర్తయందు, పిల్లల అందు ప్రేమ ఉండదు. ఇంటి పనులు చెయ్యదు. నిర్లక్ష్యము ఎక్కువ. ఎప్పుడూ అబద్ధాలు చాడీలు చెప్తుంటుంది. ఎప్పుడూ నిద్రపోవడానికి అలవాటు పడుతుంది. వీరివలన భర్త వంశం మొత్తము నరకానికి పోతుంది. అటువంటి స్త్రీలు కూడా తమతప్పు తెలుసుకుని భర్తకు అనుకూలంగా ప్రవర్తిస్తే వారు కూడా భర్తతో స్వర్గానికి పోగలరు. అలా కాకుండా జీవితమంతా భర్తను నానా హింసలు పెట్టినా, భర్తచనిపోయిన తరువాత ఆయనతో సహగమనము చేసిన భార్య, భర్తతో పుణ్యలోకాలకు పోతుంది. ఇందులో ఒక ధర్మసూక్ష్మము ఉంది. స్త్రీలు సంతానవంతులు అయినప్పుడు చనిపోయిన భర్తతో సహగమనము చెయ్యకూడదు. అది అధర్మము అని పార్వతీదేవి పరమేశ్వరుడికి స్త్రీల ధర్మము గురించి వివరించింది అని నారదుడు శ్రీకృష్ణుడికి వివరించాడు.


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: