సూర్యనారయణ నేమాని

*బాటసారీ నీ పయనం ఎటు?

మనసులో ఎంత బాధ వున్నా బయటికి తెలియనివ్వకూడదు. ఏమీ కానట్లు, ఏదీ జరగనట్లు వుండాలి.  అప్పుడే మనిషి బలవంతుడౌతాడు.  కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎంత కష్టమో, సహనాన్ని అలవరచుకోవడం కూడా అంతే కష్టము.  కానీ, బ్రతుకుబాటలో విజయం సాధంచాలంటే పొరాటం తప్పదు.  కాలచక్రంలో వచ్చే పెనుమార్పులను జీర్ణించుకునే మనస్తత్త్వాన్ని అలవరచుకోవాలి.  మితిమీరిన సంతోషం, దుఖం అనర్ధదాయకం.  ఈ రోజు ఎలా గడుస్తుందో అన్న ఆలోచన మనిషిని నిలువునా కృంగదీస్తుంది.  సరి అయిన ఆలోచన జీవనపధాన్నే మార్చివేస్తుంది.  మనసంతా దిగులుతో నిండినపుడు అశావహ దృక్పధాన్ని అవలంబించాలి.  నిరాశ, నిస్పృహలు గుండె లోతుల్లోకి దరిచేరనివ్వకూడదు.  ఆలోచనలను నియంత్రించడం నేర్చుకోవాలి.  ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు.  జీవితం మీద విశ్వాసం కోల్పోతున్నప్పుడు గుండెను సవరదీసి ధైర్యం చిక్కబట్టుకోవాలి.  నిరాశ, నిస్పృహలతో జీవితం తో పోరాటం చేస్తున్నవారికి ఇదే నా స్ఫూర్తి.

ఓ నిరంతర బాటసారీ!  ఒంటరి జీవితంతో ఎంతకాలం పోరాడుతావు?  అలుపెరగని నీ పయనంలో తెలియని మజిలీలు ఎన్నో!  కాసింత విశ్రాంతి పిమ్మట నీ పయనం సాగనీ.  ప్రతి పయనం ఇస్తుంది ఒక అనుభవం.  అనుభవాల సారమే జీవితం.  చేదు అనుభవాలు ఎదురు అయితే వెన్ను చూపకు.  మనసు లోని బాధ ఎప్పుడూ తెలియనివ్వకు.  గుండె నిండా సాహసమనే ఊపిరి నింపుకో.  ఆకాశంలో ఎగిరే విహంగం నీ ఆదర్శం.  రేపు అన్న ఆశ నిలుపుతుంది శ్వాస.  పెదవి మీద చిరునవ్వు లోకానికే వెలుగు.  మానసిక దృఢత్వం మనిషికి పెట్టని కవచం.  ఎదుగుతున్నకొద్దీ ఒదిగుండాలనే విషయం మరచినవారికి జీవితం నరకప్రాయం.  చేసిన మేలు మరవకు.  నువ్వు చేసిన సహాయం తలవకు.  ఈ మాయలోకం లో మోసాల సాలెగూళ్లు ఎన్నో!  తెలివితో ఛేదించి కన్నవారికి ఎనలేని కీర్తి తెచ్చి ఆత్మవిశ్వాసాన్ని నీ నీడలా వుంచుకో. 

నీ జీవిత యానం చల్లగా సాగించు.

నేమాని సూర్యనారాయణ

*మా ఇంటికి ఎదురుగా ఉండే అపార్ట్ మెంట్ లో ఒక పెద్దాయన ఉన్నారు.  ఓ పది రోజుల క్రితం ఆయనను చూడడానికి వెళ్లాను.  సుమారు 75 సంవత్సరాలు ఉంటాయి.  గవర్నమెంట్ లో పెద్ద ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపుతున్నారు.  5 సంవత్సరాల క్రితం భార్య స్వర్గస్తురాలయ్యింది.  ఇద్దరు పిల్లలు.  ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు.  ఎలా ఉండగలుగుతున్నారు అని అడిగాను. 

"పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని కోరుకున్నాను.  పెద్ద చదువులు చదువుకున్నారు.  మా ప్రోద్బలంతోనే విదేశాలకు వెళ్ళారు.  మేమూ నాలుగు సార్లు వెళ్లి వచ్చాము.  మంచి జీవితం గడుపుతున్నారు.  మేమిద్దరం ఏం కోరుకొని వారిని అమెరికాకు పంపామో అదే రకమైన ప్రశాంతత తో వారు ఎదుగుతున్నారు.  పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.  ఇంతకన్నా మాకేం కావాలి?" అన్నారు.

మరి మీ భార్య మరణం సమయం లో వారు ఉన్నారా అని అడిగితే, "ఆమె అదృష్టం.  పిల్లలిద్దరూ అమెరికా నుండి ఇండియా వచ్చారు.  సరదాగా గడిపారు.  ఒకరోజు పిల్లలతో కలిసి భీమిలి వెళ్లి వచ్చాం.  రాత్రి పడుకుని ప్రొద్దున్న నిద్రలేచి చూస్తే ఆమె ఇంకా నా పక్కన పడుకునే ఉంది.  అలా ఎప్పుడూ జరగలేదు.  ఏమయ్యిందా అని చూస్తే ఆమె దివంగాతురాలయినట్లు అర్థమయ్యింది.  కార్యక్రమాలన్నీ పూర్తి అయిన తరువాతే పిల్లలు అమెరికా వెళ్ళారు" అన్నారు.

"ఇంక నావంతు కూడా వస్తుంది.  నేను నా పిల్లలు ఆ సమయం లో నాదగ్గర ఉండాలని ఆశించడం లేదు.  జనన మరణాలు మనకు చెప్పి రావు.  జీవితంలో ఎటువంటి పూజలు చెయ్యాలని నా భార్య కోరుకుందో అవన్నీ చేయించాను.  నాకు తోచినంత వరకు పేద విద్యార్థులకు ఆర్ధిక సాయం చేశాను.  సేవాసంస్థలకు ఆమె పేరు మీద గుప్త దానం చేశాను.  ఇంక నేనేమీ కోరుకోవడం లేదు.  నాభార్యలాగే నేను కూడా ఎవరిచేతా చేయుంచుకోకుండా వెళ్ళిపోతే చాలని భగవంతుని కోరుకుంటూ ఉంటాను" అన్నారు.

శనివారం (23/12/17) ఉదయం పని మనిషి తలుపు కొడితే ఆయన తీయలేదు.  చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిస్తే ఆయన మంచం మీద మరణించి ఉన్నారట.  పిల్లలకు ఫోన్ చేసి చెప్తే వెంటనే వారు నిన్నరాత్రికి చేరుకున్నారు.  చివరి చూపు నాకు దక్కింది.  ఈ రోజు ఉదయం ఆయనకు చెయ్యవలసిన అంతిమ సంస్కారలన్నీ చేశారు. 

అదృష్టవంతుడు.  కోరుకున్నట్లుగా పిల్లలను ఉన్నతులుగా చేశారు.  వారికి కావలసినవన్నీ సమకూర్చి ఇచ్చారు.  భార్య మరణానంతరం ఆమెకు చెయ్యవలసిన ఉత్తర క్రియలన్నీ నిర్వర్తించారు.  తానూ కూడా పిల్లలకు ఎటువంటి కష్టాన్నీ కలిగించకుండా చివరి శ్వాస తీసుకున్నారు.  ఎందరికో గానీ ఇటువంటి జీవినయానం సంభవించదు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరుగాక.

నేమాని సూర్యనారాయణ

*ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతాడో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్చగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
ఎక్కడ మాటలు అగాధమై సత్యం నుంచి బాహరిల్లుతాయో,
ఎక్కడ విరామమైన అన్వేషణ, పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో,
ఎక్కడ మనస్సు తలపులో, పనిలో నిత్య విశాల పధాలవైపు పయనిస్తుందో ........

ఆ స్వేచ్చా స్వర్గంలోకి, తండ్రీ!  నాదేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు.

రవీంద్రనాథ్ టాగూర్

*ఏకాగ్రత
.
ఆత్మశుద్ధి లేని ఆచారం, భాండశుద్ధి లేని పాకం, చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థమంటాడు వేమన. ఏకాగ్రత లేని పనులు సైతం వ్యర్థమైనవే. కార్యం - అది లౌకికమైనా, ఆధ్యాత్మికమైనా ఏకాగ్రత కొరవడితే చెడిపోతుంది. ‘ధ్యానం’ అనే మాట తరచుగా వింటుంటాం. ధ్యానం, ఏకాగ్రత - రెండూ సహ భావనలే! ఆ రెండింటికీ సన్నిహిత సామ్యం ఉంది.
.
ధ్యానం అనే మాటను పారమార్థిక దృష్టితో వాడతాం. సర్వసాధారణంగా ‘పరధ్యానం’ అనే మాటనూ ఉపయోగిస్తుంటాం. ఎవరికైనా ధ్యానం అలవడాలంటే, ఏకాగ్రత కుదరాలి. అది సాధించాలంటే, ధ్యానం సాగించాలి.
.
ప్రహ్లాదుడిది అనితరసాధ్యమైన విష్ణుభక్తి. తండ్రి ఎన్ని హింసలకు గురిచేసినా, అతడి మార్గానికి అవరోధం కలగలేదు. నమ్మిన దైవం పట్ల అచంచలమైన ఏకాగ్రతే దానికి కారణం. అలాగే, తండ్రి ప్రేమ పొందాలని ధృవుడు చెక్కుచెదరని దీక్షతో తపస్సు చేశాడు. ఆ ధ్యానానికి మూలం ఏకాగ్రత. వసిష్ఠుణ్ని మించిన బ్రహ్మర్షి కావాలన్నదే రాజర్షి విశ్వామిత్రుడి ప్రగాఢ కోరిక. దాన్ని ఆయన ఏకాగ్ర చిత్తం, పట్టుదలతో తపస్సు చేసి సాధించాడు. ‘భగీరథ ప్రయత్నం’ అనే మాట వింటుంటాం. తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింపజేయాలన్న తపన ఆయనది. అదే దీక్షతో, దివి నుంచి భువికి గంగ దిగి వచ్చేలా తపస్సు ఆచరించాడు.
.
ఒకే విషయం మీద దృష్టిని లగ్నం చేయడం ఏకాగ్రత. దాన్ని ‘లక్ష్యం’ అనీ పిలుస్తుంటాం. ద్రోణుడు చెట్టును చూపించిన తక్షణం, దాని కొమ్మమీద గల పక్షి కన్ను అర్జునుడి లక్ష్యమైంది. అందుకే మేటి విలుకాడయ్యాడు. అంటే - లక్ష్యం, ఏకాగ్రత ఒక్కటే.
.
మనిషి మనసు నిండా ఆలోచనల పరంపరలుంటాయి. అతడి స్వేచ్ఛకు, బంధానికి మనసే కారణమని విజ్ఞులు చెబుతారు. పరమ చంచలమైనది మనసు. దానికి స్థిరత్వం లేదు. ఆ స్థిరత్వాన్ని ఎలాగైనా సాధించడమే ఏకాగ్రత. అభ్యాసం కూసువిద్య అంటారు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అనీ చెబుతారు. అభ్యాసం, సాధన వల్ల ఏకాగ్రత సాధించవచ్చు. ఒకే లక్ష్యంపై మనసును కేంద్రీకరించవచ్చు. నిరంతర అభ్యాసం వల్ల మనసును ఎలా నిరోధించవచ్చో భగవద్గీత, పతంజలి యోగసూత్రాలు తెలియజేస్తాయి.
.
ఏకాగ్రతతో ఏదైనా పని చేయాలంటే, ముందుగా దానిమీద ఇష్టం ఉండాలి. అది లేకుండా ఏ పని చేసినా, ఏ కోశానా ఏకాగ్రత కుదరదు. వ్యక్తి ఎప్పుడైతే సర్వశక్తుల్నీ ఒక అంశంపైనే కేంద్రీకరిస్తాడో, అప్పుడే అతడి లక్ష్యసాధన మార్గంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అందుకు వివేకానంద, గాంధీజీ జీవితాలే ఉదాహరణలు.
.
అవధానాలు చేసే పండితులు ఏకాగ్రతకే అధిక ప్రాధాన్యమిస్తారు. వారి దృష్టి ఎప్పుడూ సంబంధిత అంశం మీదే ఉంటుంది. దానికి సంబంధించిన ఆలోచనలు తప్ప, వేరేవీ వారి మనసులోకి ప్రవేశించవు.
.
‘శబ్దం’ అనేది మనసును ఒక విషయంపై కేంద్రీకృతం చేయడానికి తోడ్పడుతుంది. పిల్లలు బిగ్గరగా చదువుతారు. అలా చదవడం వల్ల, వారి స్వరం సృష్టిస్తున్న శబ్దాలు చెవుల ద్వారా మనసులోకి చేరతాయి. ఆ మనసు వారు వల్లె వేస్తున్న విషయాలపైనే నిలిచి ఉంటుంది. బయటకు చదవడం వల్ల, వారి ఏకాగ్రత స్థిరపడుతుంది. వేదమంత్రాల్ని గట్టిగా చదవడం, వల్లె వేయడం వెనక అంతరార్థం అదే! ఏకాగ్రత సాధించేందుకు అదే మొదటి మెట్టు.
.
అందరిలోనూ ఏకాగ్రత స్థాయి ఒకేలా ఉండదు. అందరికీ అన్ని విషయాలపైనా ధ్యాస నిలవదు. చేసే పని మీద ఇష్టం పెంచుకుంటే, మనసులో దృఢమైన సంకల్పం ఉంటే, ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయవచ్చు. ఇష్టం, సంకల్పం - ఈ రెండే ఏకాగ్రతకు సోపానాలు. వ్యాకులత, ఆరాటం, చంచలత్వం ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. మనిషి ముందుగా వాటిని జయించాలి!
.
ముఖ్యంగా చదువుకునే పిల్లల కోసం, అలాంటి పిల్లలున్న కుటుంబాలకోసం ప్రత్యేకంగా అందిస్తున్న వ్యాసమిది.  చదివి వదిలెయ్యకండి.  పాటించడానికి ప్రయత్నించండి.

నేమాని సూర్యనారాయణ

*ఓ పెద్దాయన నాలాంటి వాణ్ని పిలిచి చేతిలో ఓ కాగితం పెట్టాడట.  అందులో "సంతకు చీటీ, లచ్చికి గాజులు" అని ఉందట.  వెంటనే ఆ కాగితం పట్టుకొని ఆ పిల్లవాడు సంతకు వెళ్ళాడట.  అక్కడ షాహుకారుకు చూపిస్తే ఆయన, "ఏ, లచ్చి, ఏ సైజు, ఏ రంగు, ఎంత ఖరీదు లో కావాలి  కావాలి అని అడిగాడట.  వీడు నోరు వెళ్ళబోసాడు.  

ఈ వివాహాల విషయం లో అందరూ కూడా వారికి తోచిన వివరాలు ఇస్తున్నారు.

ఉదాహరణకు
అబ్బాయి పేరు: "ABC Pappu",
తండ్రి గారి పేరు XYZ Pappu,
తల్లిగారి పేరు PQR Pappu,
చదువు: LMN California, 

ఎలాంటి అబ్బాయి/అమ్మాయి కావాలి:  మంచి కుటుంబం (నేను ఎన్నో పుస్తకాలు తిరగేశాను.  దీనికి definition కోసం. 

ఇప్పుడు PM నో, CM నో అడగాలి ఆధార్ కార్డ్ లో ఈ విషయం కూడా grade-wise పేర్కొనమని), ఉన్నతమైన విలువలు (మనకు ఏమున్నాయో ఎవరూ వివరించరు).

అమ్మాయైతే పగలు గోచి పోసి పట్టు చీర కట్టుకొని పతివ్రతా ధర్మాలు పాటించాలి, రాత్రి మోడరన్ డ్రెస్ వేసుకొని అబ్బాయితో PUB వెళ్ళాలి.

అబ్బాయి అయితే ఎటువంటి దురలవాట్లు ఉండకూడదు, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి (తప్పుగా అర్థం చేసుకోకండి తల్లిదండ్రులను అంటే అబ్బాయి తల్లిదండ్రులను కాదు అమ్మాయి తల్లిదండ్రులను), ఉద్యోగంలో చేరేసరికే 10 నుండి 12 లక్షలు జీతం, పెద్ద కారు, బంగాళా వంటివి అన్నీ ఉండాలి.

ఇవన్నీ చూసిన అవతల పార్టీ వారు చదివి ఆనందించి వెంటనే whatsapp లోనుండి ఈ వివరాలను తొలగించేస్తున్నారు. 

ఎందుకండీ ఇవన్నీ.  అర్థం లేని పటాటోపాలు. 

మనకున్న దాంట్లో కాలో గంజో తాగి మనతో ఆత్మీయంగా మెలిగే అబ్బాయో, అమ్మాయో కావాలని కోరితే చాలదా?

అయ్యా గత పదిహేను నెలలుగా వేలాది అప్లికేషన్స్ చూసి ఈ సమీక్ష వ్రాస్తున్నాను.  అన్యదా భావించకండి. 

మరో విషయం 35 ఏళ్ల అవివాహితుని వివరాలు మూడుగంటల క్రితం పోస్ట్ చేసి, వెంటనే ఓ ఫోన్ కాల్ : "ఏమండీ మా అబ్బాయికి సరియైన సంబంధ ఏమైనా దొరికిందాండీ" అని.  కాల్ వెనుక కాల్.  భలే థ్రిల్లింగ్ గా ఉంటోంది నాకు.

నేమాని సూర్యనారాయణ

*మంచి మార్గంలో ప్రయాణించి సంపాదించిన పుణ్యానికి సమానమైన పుణ్యం వారిని ఆ మార్గంలో నడిపించిన మార్గదర్శి కి కూడా వస్తుంది.

This group is exclusively created for Marriage Alliances.
But most of the members never ask me about that.

*ఆనందో బ్రహ్మ!

ఆనందం అద్భుతమైనది. అది అలౌకిక, అనిర్వచనీయ, అనుభవైకవేద్యమైన ఓ అనుభూతి. దాన్ని పొందాలే తప్ప, ఏ విధంగానూ నిర్వచించలేం. ఒక విధంగా, ఆనందమే సృష్టికి మూలం. ఈ క్షణంలో లభించని ఆనందం మరుక్షణంలోనైనా దొరుకుతుందన్న ఆశ ఒక్కటే దానికి కారణం.

ఆనందానికి వ్యతిరేక అవస్థ- దుఃఖం. ‘ఇక నాకేదీ అక్కర్లేదు’ అనే భావం ఆనందమైతే, ‘ఇది నాకు లేదే, పొందలేకపోయానే’ అనే భావనే దుఃఖం. ఆశలు రేపి, కర్తవ్య నిర్వహణను బోధించి, సరైన మార్గంలో నడిపించి... అనంతరం విజయాన్ని సాధింపజేసేదే ‘ఆనందం’.

‘అర్థ శౌచం’ ఆనందానికి మూలం- అంటారు విజ్ఞులు. వాక్‌శుద్ధి, మనశ్శుద్ధి, క్రియా శుద్ధి, శరీర శుద్ధి... అలా అనేకం మనిషికి ఆనందాన్ని కలగజేస్తాయి. సత్య, ప్రియ, హిత వచనాలన్నీ వాక్కు అంతర్‌ శుద్ధిని సూచించేవే. ధ్యానం, సద్భావనలు మనశ్శుద్ధి వల్ల సిద్ధిస్తాయి. పవిత్రమైన ప్రవర్తన, నడవడికల కారణంగా క్రియాశుద్ధి ఏర్పడుతుంది. స్నాన, ఆహార, పాన నియమాదుల వల్ల శరీర శుద్ధి కలుగుతుంది. వీటి వల్ల ఆంతరంగికమైన ఆనందం కలిగితే, శారీరక శుద్ధి కారణంగా భౌతికమైన ఆనందం లభిస్తుంది. ‘అర్థ శౌచమే నిజమైన శౌచం’ అంటాయి స్మృతులు. సంపాదన స్వచ్ఛంగా ఉండాలని, దానిలో శుద్ధత్వం కనిపించాలని; మూడు దశలుగా ద్రవ్యార్జన, వినిమయం, నియంత్రణ జరగాలని అవి బోధిస్తాయి.

‘ఆనంద సిద్ధి’ కి మరో మహామంత్రం ‘అల్ప సంతోషిత్వం’.  తనకు పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా భక్తితో సమర్పిస్తే – అదే పదివేలంటాడు కృష్ణ పరమాత్మ ‘గీత’లో.  అంత సంతోషి కనుకనే, ఆయన భగవంతుడయ్యాడు.

అల్ప సంతోషిత్వం వల్ల కోరికలూ అల్పంగా మారతాయి. నెరవేరిన కోరికల్ని చూసి ఆనందించగలుగుతాం. అటువంటి అల్పసంతోష భావన కలగడం అంత తేలిక కాదు. కేవలం అభ్యాసంతోనే అది సాధ్యపడుతుంది. అలా సిద్ధించిన ఆనందం స్థిరంగా ఉంటే, అదే ‘ఆనంద సిద్ధి’ అని పెద్దలు చెబుతారు.

సర్వ సాధారణంగా మనం పరిగణించే ఆనంద భావన ఇంద్రియాలకు, మనసుకు చెందుతుంది. అది అలౌకికమైన ఆనందం. ఆత్మను స్పృశించగలిగే అరుదైన అనుభవమే ‘ఆత్మానందం’ అవుతుంది. దాన్ని బహు కొద్దిమందే అనుభవించగలరు.

ఆనందం, పరమానందం, బ్రహ్మానందం... వీటి స్థాయి ఏమిటో, ఇవి కలిగించే ఆనందం ఎంతటిదో ‘తైత్తిరీయ ఉపనిషత్తు’ వివరిస్తుంది.

నేటి సామాజిక స్థితిగతుల్లో, అధునాతన జీవన సరళిలో, ఉరుకుల పరుగుల నేపథ్యంలో- మానవ సంబంధాలు మృగ్యమవుతున్నాయి. ఉపనిషత్తులు నిర్దేశించిన ఆనందానుభూతుల్ని ఆధునిక కాలంలో మనిషి ఆస్వాదించలేకపోతున్నాడు. ఆనందానికి, బ్రహ్మానందానికి మధ్య హస్తిమశకాంతరం ఉంటుంది. ప్రపంచంలో ‘ఆనందం’ ఒక బ్రహ్మపదార్థమైపోయింది! ఇక బ్రహ్మానందం గురించి ఆలోచించడం ఎలా?

తనలోని ఈర్ష్యాద్వేషాలు, దురభిమానం, అహంకారాన్ని మనిషి దూరం చేసుకోగలిగితే- అద్భుతమైన అంతరంగం ఆవిష్కృతమవుతుంది.అతడు అల్పసంతోషి కాగలడు. అనల్పమైన ఆనందాన్నీ పొందగలడు. అతడి జీవితంలో అంచెలంచెలుగా ఆనందాలు చోటుచేసుకుంటాయి.అన్నింటినీ మించిన బ్రహ్మానందాన్ని పొందాలన్న ఆకాంక్షా అతడిలో మొలకెత్తుతుంది!




Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: