2018 ఫాల్గుణం మాసం. 

త్రేతాయుగంలో రావణాసురుడితో యుద్ధానికి శ్రీరాముడు ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే కదిలాడు. వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని లంకకు తరలివెళ్లాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో సమరాన్ని ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు ప్రారంభించాడు. త్రయోదశి దాకా అది కొనసాగింది. రావణుణ్ని రాముడు అమావాస్యనాడు వధించాడు. ద్వాపర యుగంలో- పాండవులు, కౌరవుల్లోనూ కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు.


దేవతలైన హరిహర సుత అయ్యప్పస్వామి, లక్ష్మీదేవి; మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి ఈ మాసంలోనే జన్మించారు. ఇదే నక్షత్రాన జన్మించాడు కనుక, అర్జునుడికి ‘ఫల్గుణ’ అనే పేరుంది. పిడుగుల భయం పోవడానికి ‘ఫల్గుణ’ అంటూ ఆయన నామాల్ని స్మరిస్తారు. ధర్మరాజు ఫాల్గుణ బహుళ అష్టమిన, భీముడు ఫాల్గుణ శుద్ధ త్రయోదశిన జన్మించారంటాయి పురాణాలు. అదేరోజున దుర్యోధనుడు, దుశ్శాసనుడు పుట్టారు.


ఫాల్గుణం శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసం. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే, ఆ మాసాన్ని ‘ఫాల్గుణి’గా పిలుస్తారు. గ విష్ణుపూజకు పేరొందిన ‘పయో వ్రతం’ విశిష్టమైంది. ఇది శుద్ధ పాడ్యమినాడు ప్రారంభమై పన్నెండు రోజులు సాగుతుంది. సమీపంలోని నదిలో స్నానంచేస్తూ, పవిత్ర నదులన్నింటినీ స్మరిస్తారు. లక్ష్మీనారాయణుల్ని పూజిస్తారు.


సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, విష్ణువును షోడశోపచారాలతో అర్చించాలి. పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం చేయడంవల్ల వామనుడు జన్మించాడని పురాణాలు చెబుతాయి. లక్ష్మీనారాయణులు లేదా పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియ నాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ని ఆరాధిస్తారు. కాశీలో, ద్రాక్షారామంలో వెలసిన డుండి గణపతికి సంబంధించిన పూజ అది. శుక్ల పాడ్యమి, చతుర్థినాడు అవిఘ్న; పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. పయోవ్రతం చివరిరోజు శుద్ధ ద్వాదశిన నరసింహస్వామి పూజ చేస్తారు.


దివ్య ఔషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి, ఆ చెట్టు వద్దనే ‘అమలక ఏకాదశి’ వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని ‘అమృత ఏకాదశి’ గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ జరుపుతారు.


ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైనది  ‘వసంతోత్సవం’. ఇది కాముని పండుగగా, హోలికా పూర్ణిమగా, కామ దహనంగా ప్రఖ్యాతి చెందింది. శుద్ధ త్రయోదశి- కాముని పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ పర్వదినాన శివుడు, మన్మథుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి పూజలందుకుంటారు. సత్యనారాయణస్వామి వ్రతాలూ జరుగుతాయి.


ఫాల్గుణమాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంది. చవితినాడు ‘సంకట గణేశ’ వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమినాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. ఆ రోజు రామాయణాన్ని చదివి, సీతారాముల్ని కొలుస్తారు. బహుళ అమావాస్యనాడు పితృదేవతలకు పిండప్రదానం జరిపి అన్నదానం చేస్తారు. ఆనందకరమైన వాతావరణంలో మహాపురుషుల జయంతుల్ని పాటిస్తారు. !


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: