కన్యాదానము
కన్యాదానము
కన్యాదానము
తైత్తరీయ ఉపనిషత్(2.9.4.7)లో 'అథో అర్థో వా ఆత్మనః యత్పత్నీః' అని ఉంది. అంటే 'ఏ పురుషుడైనా తనంత తానుగా సగమే. రెండవ సగం అతని భార్య' అని అర్థం. జీవితంలో అంతటి ప్రధానమైన పాత్రగా స్త్రీని వరుని అర్ధాంగిగా చేసేది వివాహం. ఏ వర్ణమున కావర్ణము వారు వివాహ యోగ్యత వచ్చిన వరునికి యోగ్యమైన వధువును చూడటము, పరస్పర ఆమోదముతో కన్యక తండ్రి కన్యను దానము చేయటము ఆర్షధర్మము. నన్ను అపార్థము చేసుకొనకుంటే ఒక్క మాట. మన వేదమంత్రములలో కన్యను గూర్చి మాత్రమె చెప్పినారు. విధవలు, భర్తను వదలినవారు కన్యలనిపించుకోరు.
వరుడు, వధువు లేకుండా తన వంశాంకురమును పొందలేడు. కావున మీ అమ్మాయిని దానము చేస్తారా అని అర్థించవలసినదే, లేక మా కన్యకను దానముగా గ్రహించుతారా అని వధువు తండ్రి అయినా అడుగవచ్చు అబ్బాయి గుణగణములు నచ్చితే! కొందరు ఈ కన్యాదానము అను మాటను కన్య+ఆదానముగా విభాజించుతారు. అప్పుడు కూడా కన్యకను గ్రహించుట అనే అర్థము. అంటే 'ప్రదానము' వుంటే 'ఆదానము' వుంటుంది. బహుమతి ప్రదానము అంటే బహుమతినిచ్చుట అన్న మాట గుర్తుంటుందనుకొంటాను. దానము వుంటే ఆదాన ప్రదానములు వుంటాయి.
ఒక దానం నిర్వహించవలెననుకుంటే దాత ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయవలసి వుంటుంది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదని శాస్త్రం చెప్తుంది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయము ఒకటి వుంది. గ్రహీత, ఇచ్చేవాని అభిమతము మేరకు ఇచ్చినది పుచ్చుకోవలసినదేకానీ, ఇది కావాలి, అది కావాలి, ఇట్లు కావాలి అట్లు కావాలి అని అడిగే అధికారమునకు అతనికి అర్హత ఉండదు.
కన్యాదాత, అంటే తండ్రి, దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవారు వరుడు, అతని తలిదండ్రులు. సకలసద్గుణ సంశోభితునిగా వరుని తలచుటచేత వారి వంశమును నిలబెట్టుటకు కన్యాదాత అంతవరకు అల్లారుముద్దుగా పెంచిన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తలవంచాలిగదా! మరి గొంతెమ్మ కోరికలు కోరవచ్చునా?
కావున పెళ్లిని ఒక వేడుకగా జరుపదలచితే ఇరువైపులా ఆమోదయోగ్యమైన, దాతకు ఆర్థికముగా ఇబ్బంది కలుగని రీతి లో మెలగవలసివుంటుంది. అవసరమైతే ఆడుకోనవలసికూడా వుంటుంది. అంతేకానీ పెత్తనము చలాయించే అధికారము ఉండదు. ముఖ్యముగా వరుని వైపు పెద్దలు తమ ఇంటికి, అంత వరకూ అల్లారు ముద్దుగా పెంచుకొన్న తమ లక్ష్మిని నిస్వార్థముగా, ఆమె తలిదండ్రులు, పరాయి ఇంటికి పంపుచున్నారు. అంతవరకు అమ్మాయి పేరును అంటిపెట్టుకొనియున్న తమ ఇంటిపేరునే త్యాగము చేయుచున్నారు. అంతకన్నా ఇంకేమీ కావలయునో ఆలోచించడి? ఇంతకు మించిన త్యాగము ఉంటుందా తెలుపండి.
"సీతారాములలా ఉండండి!" అని వధూవరులను ఆశీర్వదించడం కాదు, అసలు నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు, దశరథ మహారాజును అడుగుతారు "మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?" అని. అప్పుడు దశరథ మహారాజు "అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది" అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్రుడు ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు. ఇది మనము నేర్చుకోవలసినది.
అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు! అసలు ఒక ఇంటి మట్టు మర్యాద ఏమిటో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది. ఇరువైపులా వారిని గూర్చీ తెలుస్తుంది. కుటుంబ సంస్కారాలు బయట పడే సమయము అదే!
తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? "పెళ్ళి బాగా గొప్పగా జరిపించండి!" అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకు ఉన్నదానిలో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.
కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు - ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.
'సాలంకారం మమ సుతాం కన్యాం దాస్యామి తే ద్విజః
పాణిం గృహీత్వా సాగ్నిస్త్వం గచ్ఛ స్వాగచ్ఛ మద్గృహమ్'
అంటే 'నీకు సర్వాలంకార భూషిత అయిన మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేయిస్తాము. ఆమె చేతిని గ్రహించి, ధర్మపత్నీ సమేతుడవై, త్రేతాగ్నులతో వెళ్లగలవు. ఇప్పుడు మా ఇంటికి రాగోరుతున్నాం' అని అర్థం. ఈ వినతితో ఆ బ్రహ్మచారి, తన కాశీయాత్రను తాత్కాలికంగా పక్కన పెట్టి వివాహానికి అంగీకరిస్తూ, కల్యాణమండపం వైపు అడుగులు వేస్తాడు. ఇక్కడ అగ్ని యొక్క ప్రస్తాపన వచ్చింది కాబట్టి ఒక్క మాట చెబుతాను. శూద్ర అన్నది ఒక సంపూర్ణ సేవాసహకార వర్గమే కానీ దానికి ఎటువంటి న్యూనత కూడా వేదములలో ఆపాదించబడిలేదు. వారు పనిలోనే పరమాత్మను చూసే వర్గము. వారి కొరకు కూడా వేదమూర్తులగు బ్రాహ్మలు ఎన్నో క్రతువులు చేస్తారు. ముఖ్యముగా శంకరులవారి నాలుగు ఆమ్నాయ పీఠములు ఇటువంటి ఎన్నో కార్యములను నిర్వహిస్తూవుంటాయి. ప్రచారము వారి గుణము కాదు. ఈ విషయమును ఇప్పుడు ఎందుకు చెప్పినానంటే అగ్ని కార్యములు శూద్రులకు వుండవు కానీ వారు కర్తలుగా క్రతువులను చేయించవచ్చు. పై శ్లోకములో తెల్పిన ఈ అగ్ని, దేహములోని అగ్నికి ఆహూతులను అంటే వంటకాలను తయారు చేయుటకు వధువు ఉపయోగిస్తుంది. మనము తినే ఆహారము నియమబద్ధముగా ఉండవలెను. మన శరీరమే పరమాత్ముని నివాసగృహము. అందువల్ల మనము తినే తిండి దేవునికి నైవేద్యముతో సమానము.
ఇక ఈ మంత్రమును గమనించండి.
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాంI
దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషయాII
అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం-"ఈమె బంగారం వంటి మనస్సు కలది. కుందనము వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత పరమపదప్రాప్తి పొందినట్లు పూర్వులచే విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇది చతుర్వర్ణములకూ సమానమే! మన వివాహ మంత్రములు ఎంత ఉదాత్తభావములను కలిగి వున్నాయో గమనించండి.
పరమతములలో వివాహములు ఒడంబడికలతో కూడుకొన్న పత్రములు మాత్రమే.
ఇక ఇక్కడ అబ్బాయి తండ్రిగా ముందు దశరథుడు జనకునితో ఏమి చెబుతాడో చూడండి.
ప్రతిగ్రహో దాత్రువశశ్రుతమే తన్మయా పురాI
యథా వక్ష్యసి ధర్మజ్ఞతత్కరిశ్యామహే వయంII (బాల కాండ 69/14)
దశరథుడు ఆనందముతో “కన్యను ఒసంగుట అన్నది, ఆమెను దానము చేయుచున్న మీ ఆధీనములో వున్నది. మాలో ఏమున్నది? మీరు చెప్పినట్లే తప్పక చేయగలవారము.” ఇది వరుడు శ్రీరామచంద్రుని తండ్రియగు దశరథుడు చెప్పిన మాట. మరి అంతటి మహానీయునిమాట మనకు ఆదర్శము కావలెనుకదా!
అందుకు జవాబుగా మనకు రామాయణము బాలకాండము లోని 73 వ సర్గ సీతా కళ్యాణ వైభోగమును గూర్చి తెలుపుతుంది. అందులోని 26, 27 శ్లోకములు అత్యంత ముఖ్యమైనవి. ప్రతి తండ్రీ తన బిడ్డను ధారా దత్తము చేయునపుడు ఈ రెండు శ్లోకముల నాలుగు పాదములలోని మొదటి మూడు పాదములూ చెప్పితీరవలసిందే!
ఇయం సీతా మమ సుతా సహధర్మ చరీ తవI
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినాII.
పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదాI
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్ రాజా మంత్రంపూతం జాలం తథాII .
కళ్యాణమును సప్తపది అని కూడా అంటారని అందరికీ తెలిసిందే!
జనకుడు సీతను గూర్చి ఏమేమి చెప్పినాడో చూడండి:
1. ఈ సీత ….2. నా కుమార్తె … 3. నీకు సహధర్మ చరి
4ఈమెను స్వీకరించు … 5నీకు మంగళమగు గాక…. 6. ఈమె చేతిని నీ చేతితో గ్రహించు.
7. పతివ్రతాశిరోమణియైన మహానుభావురాలు, అయిన ఆమె ఎల్లప్పుడూ నిన్ను ఛాయ వలె అనుసరించి నడుస్తుంది.
ఏడు మాటలే మాట్లాడేడు జనకుడు . సప్తపది అది . వివాహం అనేది జీవితాంతం ఉండే స్నేహం . 'సఖ్యం సాప్తపదీనం' అని ఏడు మాటలతో స్నేహితులై పోతారు .
ఇందులోని ప్రతి పదం అసలు ఎందుకు వాడి ఉంటారు మహర్షి అని కనుక మనము యోచించుట మొదలు పెడితే తెలియజేయుటకు నా మేధస్సు చాలదు, ఒకవేళ వుంటే!
ఒక్క విషయము చెప్పి ఈ వ్యాసమును ముగిస్తాను.
భార్యాభర్తల సంబంధం ఎట్లుండవలెనని మన పెద్దలు నిర్దేశించినారో చూడండి :--
“వివాహ సమయంలో “సప్తపది” అనే తంతలో చదివే మంత్రాలలో
ఒక మంత్రం:
“సఖా సప్త పదాభవ, సఖావౌ సప్త పదా బభూవః,
సఖ్యంతే గమేయం, సఖాత్తేమాయోషం, సఖ్యాన్యే మయోష్టా:”
అనగా ఈ ఏడడుగల బంధంతో భార్య, భర్తలమైన మనం ఇకపై
స్నేహితులుగా ఉంటూ, పరస్పరం స్నేహ భావాన్ని విడవకుండా
పయనిద్దాం. ఎంత ఉదాత్తమైనభావన! “ఆపత్స మిత్రం జానీమః ”
కష్టాలలో ఆదుకొను వాడే మిత్రుడు. అట్టి మిత్రభావంతో భార్యాభార్తలు
ఉంటే, వారి మధ్య కలతలు, కార్పణ్యాలు , ఆవేశకావేశాలు,
అసమానతలు లేకుండా నిత్య వసంతంలా వారి జీవితం సాగిపోతంది.
ఇంకా—
“ సంతుష్టో భార్యయా భర్తా భర్తా భార్య తధైవచ/
యస్మిన్నేవ కులేన్నిత్యం కల్యాణం తత్రవైధృవం ” అనగా
భార్య ,భర్తలు పరస్పరం ఒకర్ని ఒకరు గౌరవించుకొంటూ ప్రేమానురాగాలతో సంతుష్టంగా ఉంటారో! ఆ ఇల్లు నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా విలసిల్లుతుంది.
నేను తెలియజేసిన ఈ విషయములు సనాతన ధర్మమును పాటించే ప్రతిఒక్కరికీ సంబంధించినవి. ఇందులో సంకుచితత్వమునకు తావు లేదు.
స్వస్తి.
Comments
Post a Comment