క్రియాయోగులు-2
క్రియాయోగులు-2
భారతదేశానికి హిమాలయాలు శిరఃప్రాయములు, కన్యాకుమారి పాదపీఠంగా, మూడు దిక్కులా సముద్ర జలాలు, పాదప్రక్షాళన చేస్తుంటాయి. ఇక మధ్య కటి సూత్రమైన వడ్డాణమై వింధ్య పర్వతం విరాజిల్లుతుంటుంది. ఆ వింధ్య పర్వత రాజుకు కొద్దిగా అహం కలిగింది. నేనింతటి వాడిని ఉండగా లెక్కచేయకండా మేరు పర్వతానికి మాత్రమే ప్రదక్షిణం చేస్తున్నాడు ఆ భాస్కరుడు అనుకుని.. ‘‘మతి తప్పిందా నీకు’’ అని ఆ సూర్యుడిని అడిగాడు.
దానికి సూర్యుడు.. ''బ్రహ్మదేవుడి ఆదేశం ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరగటం నా ధర్మం. దాన్ని నేను నిర్వర్తిస్తున్నాను'' అని చెప్పాడు. దీనికి ఆగహ్రించిన వింధ్య పర్వతరాజు చుక్కలు తాకునట్లు అమితంగా పెరగజూశాడు. దాని వల్ల సూర్యచంద్రుల కాంతి భూమిపై ప్రసరించడానికి అవరోధం కలిగి, అంధకారమైంది. దేవతలెందరో చెప్పి చూసినా వినలేదు. ఇక మన మాట వినడని వేలుపులు నిర్ణయించుకొని ఆఘటనా ఘటన సమర్థుడైన అగస్త్యుని చెంతకు చేరి.. దేవా మునీంద్రా! ఈ వింధ్య గర్వం వలన భువనాలకు ఉపద్రవం కలుగుతోందని, దాన్ని నివారించాలని ప్రార్థించారు. అగస్త్యుడు కూడా ఆ త్రోవనే దక్షిణం చేరాలని బయలు దేరాడు. వింద్యాచలం చేరాడు. అగస్త్యుల మహత్వం గురించి విన్న పర్వతరాజు శిరస్సు వంచి, వినయ వినమిత శిరస్కుడయ్యాడు, పూజించాడు. ‘ఓ పర్వతరాజా! నేను దక్షిణ దిశగా ప్రయాణమై వచ్చాను. నాకు మార్గం ఇవ్వమని అడిగాడు. అందుకు సరేనని పర్వతరాజు అగస్త్యమహాముని పోవటానికి బాగా శిరస్సువంచి, భుజం వంచి, నడుం వంచి, సాగిలపడినట్లుగా ప్రణతులు చేసి మార్గమిచ్చాడు.
‘పర్వతరాజా! నేను మళ్లీ వచ్చేవరకూ, లోకాలకు మేలు చేసేటట్లు ఉండమని కోరగా అగస్త్యుల ఆగ్రహానికి భయపడి అలానే ఉండిపోయాడు. ఆ తర్వాత అగస్త్యుడు తిరిగి వచ్చిందీ లేదు.. వింధ్య తలఎత్తినదీ లేదు. అలా వింధ్య పర్వత గర్వాన్ని అణచిన ఘనుడు కుంభసంభవుడు.
ఆయన కొంతకాలం ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఒక చెట్టు కొమ్మను అగస్త్యుని పితరులు అథో ముఖులై వేలాడుతున్నారు. ‘‘పితృదేవతలారా మీరు ఇలా ఉండటానికి కారణం ఏమిటి?’’ అని అడిగాడు అగస్త్యుడు. ‘‘మేము మీ పితృదేవతలం నీవు వివాహం చేసుకోక బ్రహ్మచారిగా ఉన్నావు. సంతానం లేకపోయినందున మాకు పుణ్యగతులు ప్రాప్తించక ఉన్నాయి’’ అని చెప్పగా, వివాహం చేసుకోడానికి నిశ్చయించుకొన్నాడు. సంతానం లేదని పరితపిస్తున్న విదర్భరాజుకు తన తపః శక్తితో, కుమార్తె కలిగేలా చేశాడు. ఆ రాజు పరమానంద భరితుడై ఆ కన్యకు లోపాముద్ర అని నామకరణం చేశాడు. ఆ బాలిక సరస్సులో పద్మంలా స్త్రీలలో లక్ష్మిలా రోజు రోజుకూ యవ్వన రూపవంతురాలైంది. కాని ఎవ్వరూ అగస్త్యునకు భయపడి ఆమెను వివాహం చేసుకోవడానికి సాహసించట్లేదు. అలాంటి సమయంలో అగస్త్యుడు, విదర్భరాజు వద్దకు వచ్చి ఆయన కుమార్తెను వివాహం చేసుకుంటానన్నాడు. చూస్తూ చూస్తూ నార వస్త్రాలు కట్టి, తపోనిష్టతో శాకాహారాలు తినేవాడు భార్యకు ఏం పెడతాడు. ఎరిగి ఎవరు ఇవ్వగలరని చింతిస్తున్న తండ్రిని చూసిన లోపాముద్ర.. ‘నాన్నగారూ.. నన్ను ఆ మహామునికి ఇచ్చి వివాహం చేయండి, సంతోషంతో సమ్మతిస్తున్నాను. అనగా విదర్భరాజు అగస్త్యునకు లోపాముద్రనిచ్చి వివాహం చేశాడు.
వివాహం తర్వాత అగస్త్యుడు లోపాముద్రతో వనభూములకు చేరి తపస్సు చేస్తున్నాడు. లోపాముద్ర భర్తతో ‘స్వామీ స్త్రీ సహజమైన కోర్కెతో అడుగుతున్నాను. నాకు నగలు, వస్త్రాలు విలువైనవి ధరించాలని ఉంది’ అని అడిగింది. భార్య కోరిక తీర్చడానికి తపోధనం ఖర్చుచేయడం ఆ మునీశ్వరుడి ఇష్టం లేకపోయింది. దాంతో యాచకుడై రాజులను అర్థించాడు. శృత పర్వుడనే రాజును కోరగా ‘మహామునీ నీవు కోరిన ధనం నా వద్ద లేదు’ అన్నాడు. దీంతో వారిరువురూ కలిసి బ్రద్నశ్యుండనే రాజు వద్దకు వెళ్ళారు. ద్రస సదస్యుడు అనే ఇంకో రాజును అర్థించారు. ‘అయ్యా యతీంద్రా.. నీవు కోరిన ధనం ఇవ్వగలవారం కాము. మణిమతీ పూరాధిపుడు. ఇల్వలుడు అనే మహరాజు అతి ధనవంతుడని ప్రసిద్ధి చెందాడు, వారి వద్దకు వెళ్లి అర్థించండి మీ కోరిక తీరుతుంది’ అని చెప్పాడు. అగస్త్యమునీంద్రుడు మణమతీపురం వెళ్ళి రాజును సందర్శించి తన కోరిక తెలిపాడు. ‘సరే ముందు మా ఆతిథ్యం స్వీకరించండి తరువాత మీరు కోరిన ధనం ఇస్తాను’ అన్నాడు. ఆ మణిమతిపురం రాజు ఇల్వలుడు, వాని సోదరుడు వాతాపి. దేవ బ్రాహ్మణ ద్వేషులు, అకాలవైరం పూనినవారు. తమ పుత్రునకు ఇంద్రపదవి ఇప్పించమని అనేక మంది తపోధనులను, బ్రాహ్మణోత్తములను, దేవర్షులను ప్రార్థించారు. దానికి వారు.. ఇంద్రపదవి దైవదత్తం. తమ వల్ల కాని పని అని నిష్కర్షగా చెప్పారు. ఆ కారణంగా వారు దేవ బ్రాహ్మణుల ద్వేషులై మాయోపాయంతో తమ ఇంటికి అతిథులుగా వచ్చే బ్రాహ్మణులను వధించేవారు. అతిథులకు చాలా మర్యాదలు చేసి, ఆప్యాయంగా ఆదరించి తమ ఆతిథ్యం స్వీకరించి కృతార్థులను చేయమని వేడుకునేవారు. పాపం అమాయకులైన అతిథులు వారి మాయోపాయం తెలియక, మోసపోయి వారిచే నిహతులయ్యేవారు. వచ్చిన అతిథులకు తన సోదరుడు వాతాపిని మేషం(మేక)గా మార్చి, వధించి మాంసాహారం వడ్డించేవాడు. అతిథులు ఆనందంతో తృప్తిగా ఆరగించేవారు. అతిథులు సేదతీర్చుకునే సమయంలో వాతాపీ అని ఇల్వలుడు పిలిచేవాడు. వాతాపి తన స్వీయ రూపు దాల్చి అతిథుల పొట్ట చీల్చుకొని వచ్చేవాడు. అలా వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి అతిథుల కళేబరాల్ని ఆనందంతో ఆరగించేవారు. ఆ అన్నదమ్ములు ఇలా ఎందరో సన్యాసులను సాధు బ్రాహ్మణులను వధించారు.
ఆ కాలంలో మాంసాహారం నిషిద్ధం కాదు.
రామాయణంలో శ్రీరామచంద్రుడు తన తండ్రి అబ్దీక సమయంలో భోక్తలకు జింక మాంసం ఇచ్చినట్లుగా ఉంది. యజ్ఞ యాగాదుల సమయాలలో బలులు ఇచ్చేవారు. మేషాన్ని నవరంధ్రాలు మూసి, వధించి, దాని డొక్క భాగంలోని వప అనే పొరను గారమండపై ఉంచి, హోమాగ్నిలో ఆజ్యంతో వ్రేల్చి, యజ్ఞప్రసాదంగా స్వీకరించి, సోమపానం చేసేవారు. శాక్యముని, గౌతమ బుద్ధుడు అనంతరకాలంలో అహింసాధర్మం, ప్రతిపాదించి, ప్రచారం చేశారు. యజ్ఞ యాగాదులను, ఆ సమయంలో జంతు వధను ఖండించారు. అశోకుడు, కనిష్కుడు మొదలైన మహారాజుల ఆ మతాన్ని ఆదరించి, విస్తృతంగా ప్రచారం చేశారు. సారనాధ్, అమరావతి, బుద్ధగయ, నాగార్జున కొండ బౌద్ధమత శేష చిహ్నాలుగా ఉన్నాయి. సింహళం, చైనా, టిబెట్టు మొదలైన దేశాలలో నేటికి ఆ మతం వ్యాపించి ఉంది. ఒక హిందూ మతమే అంతరించే ప్రమాదావస్థ కాలంలో ''ఆదిశంకరాచార్యులు'' బౌద్ధమతాన్ని పాషాండ మతంగా ఖండించి, హిందూ ధర్మాన్ని పునరుద్ధరిస్తూ కొంత వైశిష్ట్యత ఆపాదించడానికి యజ్ఞ యగాదులలో, లాజలు, పాయసాన్నం మొదలైన ప్రత్యామ్నాయ పద్ధతులు విధించారు. అట్టి కాలంలో మాంసాహారాన్ని నిషేధించి, మాషచక్రాలు అనగా మిరపగారెలు ఉపయోగించవచ్చని శాస్త్రరీత్యా నిరూపించాడు. మళ్లీ కథలోకి వస్తే.. అగస్త్య ముని మణిమతీపురం విచ్చేశాడు. ఇల్వలరాజును అపార ధనం అర్థించాడు. ఆ రాజు కోరిక మేరకు ఆతిథ్యం స్వీకరింప సన్నద్ధుడయ్యాడు. ఎప్పటిలాగే ఇల్వలుడు, వాతాపిని మేకను చేసి వధించి వండించి వడ్డించాడు. అగస్త్యుడు ఇల్వలుడి దురాగతం గ్రహించాడు. ఇల్వలుడు వాతాపీ అని పిలుస్తున్నాడు. అగస్త్యుడు బొజ్జ నిమురుకొని ''జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం'' అంటూ బ్రేవుమని త్రేన్చాడు. దీంతో అగస్త్యుడి కడుపులో ఉన్న వాతాపి జీర్ణమయిపోయాడు. అగస్త్యునిచే హతుడై పోయాడు. దీంతో ఇల్వలుడు ఆ మహాముని శక్తికి భయపడి తన సంపదంతా మునీంద్రులకు సమర్పించుకొన్నాడు. అగస్త్యుడు ఆ సంపదను, అభరణములను, తన భార్య లోపాముద్రదేవీకి ఇచ్చి ఆనందింపచేశాడు.
కాగా.. వాతాపి, ఇల్వలుల రాజ్యం మణిమతీపురాన్ని చాళుక్యులు పరిపాలించారు. అది బాదామిగా ప్రసిద్ధికెక్కింది. దండకారణ్య ప్రాంతంలో ఉండగానే శ్రీరామచంద్రులు, లక్ష్మణ, సీతాసమేతులై అగస్త్యాశ్రమం సందర్శించారు. అగస్త్యులవారి మహాప్రభావాన్ని ఆగ్రహానుగ్రహాలను రామచంద్రులు, లక్ష్మణునకు వర్ణించి చెప్పారు. దండకారణ్యంలోని, రాక్షసులను అదుపులో ఉంచిన వివరము. వాతాపి ఇల్వలుల వధలను కథలుగా చెప్పారు.
శ్రీరాముడు, విశ్వామిత్ర యాగ సంరక్షణార్ధమై దండకారణ్యానికి వచ్చిన కాలంలో శ్రీరాముడు వధించిన తాటకి భర్త సునందుడిని అగస్త్యులవారే వధించారు. అగస్త్యులు తపోధనులే కాదు, అస్త్ర, శస్త్ర విద్యలలో అఖండ ప్రజ్ఞావంతుడు. తాటకిని, మారీచసుబాహులను రాక్షసుల కమ్మని వికృత రూపులుగా చేసిందీ ఈ కుంభసంభవుడే. ఆ పగతోనే తాటకి విశ్వామిత్రులతో వచ్చిన రామలక్ష్మణులు ఎదిరించి ప్రాణాలు కోల్పోయింది. అగస్య్తులు తనను సందర్శించిన రామ దంపతులను ఆదరించి, ఆశీస్సులిచ్చి, అప్రతిహతమైన అనేక అస్త్రాలను ప్రసాదించాడు. మళ్లీ రామ రావణ యుద్ధ సమయంలో సమరజయం సంశయాత్మకంగా ఉన్న సమయంలో ''తతో యుద్ధ పరిశ్రాంతే, సమరేచింతా యాస్తింతం, అగస్య్తో భగవాన్ ఋషిః...'' అగస్త్య భగవానులు విచ్చేసి, పరమ రహస్యం, శక్తియుతం శత్రు సంహారకం అయిన ''ఆదిత్య హృదయం'' అనే స్తోత్రాన్ని ఉపదేశించగా శ్రీరాముడు జపించి, రామ రావణ యుద్ధంలో జయం పొందారు.
రావణ వధ అనంతరం.. విజయలక్ష్ష్మితో, అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడిని ఆశీర్వదించి, రామ రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించి ఆశీస్సులిచ్చారు మహా మునీంద్రుడు అగస్త్యులవారు. రావణుడు మహావీరుడు, సకలశాస్త్రవేత్త, కోరి శ్రీరామునిచే మరణం పొందిన ధన్యుడు అని తెల్పుచూ జయ విజయములే శాప వశాత్తుగా, తొలి జన్మలో హిరణ్యాక్ష హిరణకశ్యపులుగా, రెండో జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించి వైర భక్తితో విష్ణుని కొలిచి విష్ణువుచే మరణం పొందిన వైనం, రావణ కుంభకర్ణుల జననం మాతామహుల వంశాలు, రావణ తపస్సు, శివభక్తి, విజయాలు, అపజయాలు, కుటుంబ కలహాలతో విసిగిపోవుట.. అన్నీ వివరంగా కథగా అగస్త్యులు శ్రీరామునకు వివరించాడు. ఐదు అడుగుల పొట్టివాడైననూ గట్టివాడు, ఎందరో దేవతలను రాక్షసులను ఎదిరించి, యుద్ధంలో జయించాడు. వేదాంతం మీద, యోగా మీద, వైద్యం, జోతిష్యముపై ప్రామాణిక గ్రంథాలు రచించాడు. అగస్త్యుడి రచనల్లో.. దీక్షానిధి, కర్మకాండ, కాలజ్ఞానం, అగస్త్యవైద్యం, అగస్త్యనాడి మొదలైనవి సుప్రసిద్దాలు.
అగస్త్యుడు విదేశాలలో కూడా పర్యటించాడు. బోర్నియో, కుశద్వీపం, మలయద్వీపం, సయాం, కంబోడియా మొదలైన ప్రాచ్యదేశాలు తిరిగారు. ఆ పర్యటనలో అప్పటి సౌందర్యవతి యువరాణి యశోవతిని వివాహమాడారని, వారి సంతానమే ప్రసిద్ధ ప్రభువు యశోధర్మయని చరిత్ర ప్రసిద్ధి.
దక్షిణాదిన మధురను పాలించిన కులశేఖర పాండ్యులు, శివపార్వతుల వరప్రసాదుల వారికి అగస్త్యులు గురువులు.
మహాగణపతిని ప్రార్ధించిన శివజటాఝూటం నుంచి, కావేరి, తామ్ర పర్ణి నదులను భూమిపై పారించిన మహనీయులు. వారు చిరంజీవులు, తమిళదేశంలోని పోతంగి అడవిలో కుర్తాళం ప్రాంతంలో నేటికీ తపస్సు చేస్తుంటారని భక్తుల నమ్మకం. ఎవరో అదృష్టవంతులకు మాత్రమే దర్శనమిస్తుంటారని ప్రతీతి. వారిని దీక్షతో తపస్సు చేసి మెప్పించేవారికి దర్శనమిచ్చి, క్రియాయోగ, ప్రాణాయామం ఉపదేశం ఇస్తారని విశ్వాసం. అగస్త్యులచే దీక్ష పొందిన మహానీయుడు గురుడు, పరమ గురుడు పరాపరగురుడు. మహావతార్ బాబాజీ. ఎవరా మహావతర్ బాబాజీ ? ఎలా అగస్త్యుల అనుగ్రహం పొందారు? వారు ఎలా ప్రసిద్ధులయ్యారు? అనే విషయాలను మనం తెలుసుకుందాం.
Comments
Post a Comment