క్రియాయోగులు
క్రియాయోగులు
ఎందరో మహానుభావుల పుట్టినిల్లు మన భారతదేశం. యోగిపుంగవులు హిమాలయాలయ పర్వత గుహల్లో తపస్సు చేసుకొని ముక్తి మార్గంలో ముందుకు సాగారు. దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు ఈ హిమాలయ సొగసులను క్రీడావనంగా చేసుకున్నారు. దేవతలంతా పున్నమి నాడు జ్యోతి స్వరూపంలో వచ్చి స్నానమాడి పునీతులయ్యే సుందర ప్రదేశమే మానససరోవరం. ఎందరో మహనీయులకు ఇది ఆవాసం, మహిమలకు నిలయం హిమాలయం.
ఇచ్చోటనే కదా ఈశుని శిరమున
జారిన జాహ్నవి, చేరి భూమికి,
ఇచ్చోటనే కదా హిమగిరి పుత్రిక
వలపుల తేలించె పరమశివుని
ఇచ్చోటనే కదా ఇక్షు బాణము వాని
ఇల్లాలి మాంగల్యమేటకలసె
ఇచ్చోటనే కదా పిచ్చి ప్రవరాఖ్యుండు
కామించు వనితను కాదుయనెను.
మానససరోవరాంర మధురపవన
హతులనూగెడి హిమగిరి వావ్యభూమి
సర్వఔషధుల నెలవు సాధుమునుల
మాన్య జనులకు వాసంబు మంచు కొండ
దక్షయజ్ఞంలో పరమేశుని అర్ధాంగి సతీదేవి ఆహుతైపోగా వైరాగ్యంతో మహేశుడు తీవ్ర తపోదీక్షలో ఉన్నాడు. ఆ సతీదేవి సాంబశివుడినే కోరి హిమవంతుని పుత్రికయై పార్వతి అనే పేరుతో పుట్టింది. దేవతలు, మునులు ఎంతో పరితపించి వారి మనస్సులో వలపు రగిలించడానికి రతీ మన్మథులను పంపారు. ఇక్షు బాణాలతో పుష్ప మదన శరాలతో రతీ సమేతుడైన శుకవాహనుడై, మన్మథుడు హిమగిరికి వచ్చి వసంతుడిని తోడుగా తెచ్చుకొని, ఆ వనమంతా పరిమళ శోభలు వెదజల్లి వచ్చి పార్వతి పరమేశులపై సుమశరాలు కురింపించాడు. మదన మోహితులను చేశాడు. మదన శరాఘాతాలకు మనస్సు పరవశమై, శివుడు పార్వతీలోలుడయ్యాడు. కాని, ఏదో చెప్పినట్లు పాపం మదనుడు, ముక్కంటి తీవ్ర కోపాగ్నికి ఆహుతయ్యాడు. మళ్లీ ఏదో వరాలతో అదృశ్య శరీరుడయ్యాడు. లోకకల్యాణార్ధం తారకాసుర వధ కోసం జన్మించవలసిన కుమార సంభవం కోసం పార్వతీ పరమేశ్వరుల వివాహానికి సర్వసన్నద్ధమైంది. ఆ శుభముహూర్తం వచ్చేసింది. సర్వదేవతలు, దిక్పాలకులు, మహామునులు, రుషులు, బ్రహ్మ, విష్ణు మొదలైన లోకనాథులు అందరూ పార్వతీ పరమేశ్వరుల వివాహానికి విచ్చేశారు. అంతా కోలాహలం, రమణీయ దృశ్యం మనోహరం. అంటే నానాలంకృతమైన హిమగిరిపై కైలాస శిఖరంలో లోకోత్తరమైన జగత్ పితరులు, గౌరీశంకరుల వివాహం జరుగబోతోంది. కానీ ఓ ఉపద్రవం కలిగింది. కైలాసం అధిక భారమైది. ఉత్తరం వైపు కుంగిపోతోంది. సమతౌల్యం తప్పింది. అంతే.. దేవతలూ, దిక్పాలకులూ, బ్రహ్మను చేరి ‘స్వామీ పరమేష్టీ, కమల సంభవా, ఏమిటీ ఉపద్రవం? దీన్ని నివారించగల మార్గం అనుగ్రహించండి’ అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువు వైపు చూశాడు. చిరునవ్వుతో కేశవుడు తన అంగీకారాన్ని తెల్పగా.. ''పుణ్యజనులారా! ముల్లోకాల జనులూ ఈ వైభవం కనులారా చూసి తరించడానికి, ఆది దంపతుల లోకకల్యాణ కారణాన్ని అవలోకించడానికి అధికంగా విచ్చేయగా, హిమనగం ఉత్తర భాగం కుంగిపోతోంది. దీన్ని నిరోధించగల మహనీయుడు ఒక్కడే. ఈ అరిష్టాన్ని తప్పించగల రుషిపుంగవుడు, సర్వసమర్ధుడు, మహాశక్తి యుతుడు ఆగస్త్య మునీంద్రుడు అదిగో అతడే అని చెప్పాడు. అందరూ ఒక్కసారిగా అటు చూశారు. పొట్టివాడు, జటాఝూటధరుడు కనిపించాడు. అక్కడో మూల ఉన్నాడాయన. ఎవరా మహాశక్తియుతుడు, ఆయన పుట్టుపుర్వోత్తరాలు ఏమిటి? అని ఆశ్చర్యంగా అడిగారు అమరులందరూ. వారికి విధాత అగస్త్యుల జన్మవృత్తాంతం, మహిమలు ఇలా వివరించాడు.
అగస్త్య మునీంద్రుల వృత్తాంతం
''అగస్త్య భగవాన్ ఋషిః'' అని సర్వతా ప్రస్తుతించే మహనీయుడే అగస్త్యుడు. కామదేవుడైన మిత్రుడు, జలదేవుడైన వరుణుడు, స్నేహితులు. వారు లోకహితకారులు, ప్రభావాన్వితులు. అయినా కామాన్ని జయించడం తరమా! దేవలోక అప్సర గణంలో రంభ, మేనక, తిలోత్తమలలో ఊర్వశి జగదేక సౌందర్యమూర్తి. ఆమె అందానికి ముగ్ధులైన ఇరువురూ ఆమెను కామించారు, మోహించారు. కానీ దరి చేరలేకపోయారు. అంత రజోపతమైంది. వరుణుని రేతస్సు జలంలో పడింది. దాన్నుంచి వశిష్టుడు జన్మించాడు. మిత్రుడు తన ఇంద్రియాన్ని ఘటంలో నిక్షిప్తం చేసి, భద్రంగా పెంచాడు. ఆ ఘటంలోనుంచి అగస్త్యుడు జన్మించాడు. అందువల్లే ఆయనకు కుంభసంభవుడని ఘటోద్భవుడని, మైత్రావరణుడని, ఊర్వశి కారణంగా జనించినవాడు అయినందున ఔర్వశీయుడని పేర్లు ఏర్పడ్డాయి. అగస్త్యుడని సర్వజనులూ అంటారు. చిన్నప్పటి నుంచే తీవ్ర తపోనిష్టుడై, వరిష్టుడై, గరిష్టుడై, మహిమాన్వితుడయ్యాడు. వేద, పురాణ ఇతిహాసాలలో ప్రవీణుడయ్యాడు. ఆగ్రహానుగ్రహదక్షుడయ్యాడు.
సత్య యుగంలో వృత్తాసురుడు, అతని పరివారం మదించి, గర్వించి అహంకరించి, దేవేంద్రుడినీ, దేవతలనూ అనేక విధాలుగా బాధించారు. ఆ బాధలు పడలేక వాడి బారి నుంచి తప్పించుకొనే విధానాన్ని తెలుసుకునేందుకు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. అయితే.. వారందరినీ సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకొంటున్న దధీచి ముని వద్దకు వెళ్ళి ప్రార్థించమని బ్రహ్మ చెప్పాడు. దధీచి బ్రహ్మ ఆజ్ఞానుసారం తన అస్త్రాలను వారికిచ్చాడు. అవి వజ్రాయుధం మొదలైన శక్తిమంతమైన ఆయుధాలయ్యాయి. నూరు ముఖాలతో అగ్ని జ్వాలలతో వజ్రాయుధం అనూపమైనది. దానిని ధరించి దేవేంద్రుడు వృత్తాసురుని వధించాడు. భయపడిన కాలకేయాదులు సముద్రంలోకి వెళ్లి దాగి, రాత్రి సమయాలలో వచ్చి భూ జనులను బాధించేవారు. వారు రాక్షసులు, వశిష్ట, చ్యవన, భారద్వాజాశ్రమాలలోని వారిని చాలా మందిని వధించారు, బాధించారు. ముని గణాలకు అపాయం చేశారు. అందరూ ఆ కాలకేయాదుల బాధ భరించలేక, వైకుంఠ నారాయణుడిని ప్రార్ధించారు. తమ ఉపద్రవాలను దూరం చేయమని వేడుకున్నారు. యజ్ఞాలతో పితృదేవతలను తృప్తి చేస్తుంటే లోకం క్షేమంగా ఉంటుంది. అందువల్ల కమల నయనా! మునులనూ విప్రులనూ లోక ధర్మాలను రక్షించు అని ప్రార్థించగా, లక్ష్మీనాథుడు ''దేవతలారా, కాలకేయాదులు బలవంతులు, వారు సముద్రంలో దాగి ఉన్నారు. మకరులు నీటిలో ఉండగా గెలువజాలం.. అలాగే వారిని సముద్రంలో వుండగా శిక్షించలేం. వారు జలము నుంచి బయటపడే విధానం ఆలోచించాలి. అందుకు మిత్రావరుణ తనూజుడైన అగస్త్యుడు సమర్థుడు, ఆయనను ప్రార్థించి ఒప్పించండి'' అన్నాడు. అప్పుడు దేవతలు.. ‘మహామునీంద్రా! మాకు కల్గిన ఈ ఉపద్రవాన్ని తొలగించడానికి నీవే సమర్ధుడవు. మహావిష్ణువు కూడా తమరిని ఆశ్రయించమని తెలిపారు. కాలకేయాదులు సముద్రంలో దాగారు. వారు బయటపడేలా చేయటానికి మీరే సమర్థులు. మీరు ఆ సముద్ర జలం తాగితే వారు బయటపడతారు. వారిని వజ్రాయుధం మొదలైన వాటితో అప్పుడు శిక్షిస్తాం అని ప్రార్ధించారు’ దీంతో అగస్త్యుడు దయతలచి ప్రళయ గంభీరంగా కనిపిస్తున్న సముద్రం వద్దకు చేరాడు. అతని వెంట వేడుక చూడడానికి సకల దేవగణాలూ వెళ్లాయి. అగస్త్యుడు దోసిలి పట్టి మహాసముద్రజలాన్ని తాగగా దేవతలు సంతోషించి పుష్పవృష్టి కురిపించారు. కోలాహలం చేశారు. సముద్రం నుండి చేపల్లాగా కాలకేయాదులు బయటపడగా దేవేంద్రాదులు తమ ఆయుధాలతో ముట్టడించారు. దీంతో కొందరు హతులయ్యారు. కొందరు పారిపోయి పాతాళంలోకి చేరారు. అలా కాలకేయాది రాక్షసుల బెడద తప్పింది. అలా నిర్జలంగా ఉన్న సముద్రంలో ఇక్ష్వాకుల వంశానికి చెందిన సగరుడు అశ్వమేధ యాగం చేశాడు. అశ్వం వెంట సగర పుత్రులు రక్షకుల్లా వెళ్లారు. వారు కపిల మహామునిని అవమానించి, ఆ ముని శాపానికి గురై భస్మంగా మిగిలిపోయారు. వారికి పరలోక క్రియలు చేసి పుణ్యలోకములు కలిగించేందుకు, సగరపుత్రుడు అంశుమంతుడు, దిలీపుడు ప్రయత్నించి, విఫలులయ్యారు. తరువాత వారి సోదరుడైన భగీరథుడు పట్టుదలతో గంగ గూర్చి తపస్సు చేశాడు. గంగాదేవి తాను భూమికి దిగినప్పుడు భూమి వ్రయ్యలుకాక ఆపే సమర్థుడు శంకరుడేనని కాబట్టి ఆ స్వామిని ప్రార్ధించమని చెప్పింది. దీంతో భగీరథుడు శంకరుని ప్రార్థించగా.. స్వామి తన జటాజూటంపై గంగమ్మ దిగడానికి ఆనతిచ్చాడు. అలా గంగానది భూమికి వచ్చింది. ఎన్నో ఆటంకాలు గడిచి, భగీరథ ప్రయత్నం చేసి, గంగను సముద్ర గర్భంలో పారించి నింపాడు భగీరథుడు.
పాండవులు అరణ్యవాసం చేస్తున్న కాలంలో హిమవత్పర్వత ప్రాంతంలో శిఖరాలతో, అరణ్యాలతో ఉన్న ప్రాంతానికి భీముడు వేటకు వచ్చాడు. అతడు అలసి విశ్రాంతి తీసుకొంటున్న సమయంలో ఓ పెద్ద సర్పం అతని చుట్టుకుంది. అమిత బలాడ్యుడైన భీముడు కూడా ఆ పాము పట్టును విడిపించుకోలేకపోయాడు. ఎంతకూ తిరిగిరాని భీముని వెతుకుతూ ధర్మరాజు, దౌమ్యాది పురోహితులతో వచ్చి పాముకు చిక్కిన భీముని చూసాడు. 'ఏమి ఆశ్చర్యం, సకల దేవతలు, యక్ష, రాక్షస, పన్నగుల అలవోకగా జయింపగల భీముడు ఓ అల్ప పాముకు పట్టుబడుట ఆశ్చర్యంగా ఉంద'నుకున్నాడు. ''మహానుభావా సర్పాకృతి దాల్చిన సర్వోత్తమా నీవు పాము రూపం దాల్చిన దేవతవా, దైత్యుడవా! లేకుంటే మా భీమున్ని పట్టగల శక్తి ఎలా వచ్చింది. మా తమ్ముడిని దయతో విడిచిపెట్టు'' అని ప్రార్థించాడు ధర్మరాజు. ''ఓ ధర్మ రాజా! నేను నహుషడనే పేరుగల రాజేంద్రుడను, నూరు అశ్వమేధ యగాలు చేశాను. అన్ని వేద శాస్త్రాలూ చదివాను. దేవేంద్ర పదవి పొందాను. కానీ అహంకారంతో ఇంద్రాణినే కోరి, సహస్ర ఉత్తమ బ్రాహ్మణులు మోసే బ్రహ్మరథం ఎక్కాను..’ అని జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు వివరించాడు.
ఆ శాపం వెనుక నేపథ్యం ఇది...
సర్వాలంకార భూషితుడై మదోన్మత్తుడైన నహుషుడు బ్రహ్మరథం ఎక్కి సాగుతూ ఉన్నాడు. ఆ బృందంలో సప్త రుషులతోపాటు అగస్త్యుడుకూడా రథవాహులలో ఉన్నాడు. పొట్టివాడు, అందీ అందని బ్రహ్మరథాన్ని సరిగా మోయలేపోతున్న అగస్త్యుని చూచాడు నహుషుడు. అసలే అహంకారి, ఇంద్రాణి సంగమోత్సాహంతో త్వరగా కదలలేదని బెత్తం పూని అగస్త్యుని సర్ప సర్ప అని మందలించాడు. దాంతో అగస్త్యుడు ఆగ్రహించాడు. 'సర్పమై ఉరగమై పడి ఉండు... పో' అని శపించాడు. నహుషుడి మదం దిగింది. బ్రహ్మరథం దిగి అగస్త్యుడి పాదాల మీద పడి క్షమించమని వేయి విధాల వేడుకొన్నాడు. నిండు మనంబు నవ్యనవనీత సమానము. పల్కు దారుణాకండల శస్త్ర తుల్యం. ఇది ఉత్తమ మునీంద్రుల లక్షణం. ఉత్తమ క్షణ కోపస్య.. ఉత్తములకు కోపం క్షణం మాత్రమే. మాధ్యమేతు ఘటికా ద్వయం. అధమో దిన పర్యంతం, పాపిష్టో ప్రాణాంతకం అంటారు. అలా పరమోత్తముడైన అగస్త్య మునీంద్రులు కనికరించి ఆ నహుషునకు పూర్వ వృత్తాంత స్మృతి కలిగేటట్లు చేశాడు. ద్వాపర యుగంలో ధర్మరాజు వాని ప్రశ్నలకు సమాధానం చెప్పగా శాపవిమోచనం అగునట్లు వరమిచ్చాడు. అలా నహుషుడు శాపవిమోచనుడయ్యాడు. శాపానుగ్రహ దక్షుడు, పరిపూర్ణ శక్తియుతుడు అయిన అగస్త్య మునీంద్రులవారిని రావించి, ప్రస్తుత పరిస్థితిని నివేదించి ఈ ముప్పును నివారించాలని కోరమని తెలిపారు. బ్రహ్మదేవుడు - దేవతలు, మహామునులు అగస్త్యుని వద్దకు చేరారు. సమర్థుడయ్యి తన బలం తెలియక సాగర తీరంలోని హనుమంతుని సముద్రోల్లంఘన ప్రయాత్నానికి ఉద్యమింపజేసినట్లు, అందరూ అగస్త్యుని స్తుతించారు. దేవకార్యమని విన్నవించారు. అగస్త్యుడు సభాస్థలిని పరికించాడు. బ్రహ్మాది దేవతలను మనస్సులో ధ్యానించాడు. ''నా ప్రాప్తం అంతే పార్వతీ పరమేశ్వరుల కల్యాణం కనులారా చూసే అదృష్టం లేదు. ఎలా రాసి ఉందో నా నుదుట? ఎందుకు పంపుతున్నాడో ఆ భగవంతుడు నన్ను దక్షిణ భారతానికి?'' అనుకుంటూ హిమవత్పర్వతాన్ని అవరోహించి, దక్షిణ మార్గమున పయనమైనాడు. మనసులో ఆ మహోత్సవాన్ని దర్శిస్తూ, ఊహిస్తూ, సాగుతూ ఉన్నాడు. సన్నిధిలో ఉన్నవారు సరిగ్గా చూడగలరో లేదో గానీ మనో యవనికపై పార్వతీ పరమేశ్వరుల వివాహ మహోత్సవాన్ని దూరదృష్టి, దూరశ్రవణ సిద్ధులతో అవలోకిస్తూ, ఆనందిస్తూ దేవతల ఆజ్ఞ శిరసా వహిస్తూ దక్షిణ దేశానికి కదిలాడు అగస్త్య మహాముని.
(మిగతా వచ్చే సంచికలో)
Comments
Post a Comment