2019 4th Qr Results gainers

ట్రెంట్‌ లాభం 37 శాతం అప్‌ 

30 Apr, 2019 08:37 IST|Sakshi


టాటా గ్రూప్‌ రిటైల్‌ సంస్థ, ట్రెంట్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 37 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.12 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.16 కోట్లకు పెరిగిందని ట్రెంట్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.539 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.677 కోట్లకు పెరిగిందని ట్రెంట్‌ చైర్మన్‌ నోయల్‌ ఎన్‌. టాటా చెప్పారు.. మొత్తం వ్యయాలు రూ.522 కోట్ల నుంచి రూ.659 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఒక్కో షేర్‌కు రూ.1.30 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ)తో కలుపుకుంటే మొత్తం డివిడెండ్‌ చెల్లింపులు రూ.52.08 కోట్లవుతాయని వివరించారు. గత క్యూ4లో తమ సంస్థ బ్రాండ్, వెస్ట్‌సైడ్‌ కొత్తగా 27 స్టోర్స్‌ను ప్రారంభించిందని  గతంలో ఏ సంవత్సరంలోనూ ఈ స్థాయిలో స్టోర్స్‌ను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు.  

పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్ల లాభం  
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.117 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్లకు పెరిగిందని నోయల్‌ తెలిపారు. ఆదాయం రూ.2,109 కోట్ల నుంచి రూ.2,568 కోట్లకు పెరిగింది. గత శుక్రవారం బీఎస్‌ఈలో ట్రెంట్‌ షేర్‌ 0.7% నష్టంతో రూ.355 వద్ద ముగిసింది


ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ లాభం రూ.1,006 కోట్లు

25 Apr, 2019 01:17 IST|Sakshi

ముంబై: దేశంలో రెండో అతిపెద్ద హౌసింగ్‌ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభం మార్చి త్రైమాసికంలో 2 శాతం తగ్గింది. రూ.1,006 కోట్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.3,658 కోట్ల నుంచి రూ.4,091 కోట్లకు పెరిగింది. 2017–18లో మొత్తం ఆదాయం రూ.14,959 కోట్లుగా ఉంటే, 2018–19లో రూ.17,027 కోట్లకు వృద్ధి చెందాయి.  తిరిగి వృద్ధి పథంలోకి ప్రవేశించామని, రుణ వితరణ సాధారణంగానే కొనసాగుతోందని కంపెనీ వైస్‌ చైర్మన్, ఎండీ గగన్‌బంగా తెలిపారు.

2019–20లో రుణాల్లో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రుణ పుస్తక వృద్ధి నిదానంగానే ఉండాలని తాము తీసుకున్న నిర్ణయం వల్లే రుణాల వితరణ తక్కువగా ఉండడానికి కారణమని గగన్‌బంగా తెలిపారు. రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు రూ.10ను మధ్యంతర డివిడెండ్‌గా ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఇక ఈ ఫలితాలను 2017–18 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూడరాదని కంపెనీ కోరింది. 2017 నవంబర్‌లో ఓక్‌నార్త్‌ బ్యాంకులో వాటాను జీఐసీ సింగపూర్‌కు విక్రయించడం వల్ల రూ.524 కోట్లు గడించినట్టు తెలిపింది.   


రిలయన్స్‌ ‘రికార్డ్‌’ లాభం

19 Apr, 2019 05:05 IST|Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్‌లో రికార్డ్‌ స్థాయిలో రూ.10,362 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్‌)ఆర్జించింది. రిటైల్, టెలికం విభాగాలు మంచి పనితీరు సాధించడంతో రిలయన్స్‌ నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. కంపెనీకి కీలకమైన చమురు శుద్ధి, పెట్రో కెమికల్‌ విభాగాలు బలహీనంగా ఉన్నప్పటికీ, రిటైల్, టెలికం విభాగాల జోరు కారణంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు రికార్డ్‌ స్థాయి లాభం వచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. భారత్‌లోనే ఏ ప్రైవేట్‌ కంపెనీ కూడా ఇప్పటివరకూ ఈ స్థాయి లాభాలను ప్రకటించలేదు. రిటైల్‌ వ్యాపారం 52 శాతం, డిజిటల్‌ సర్వీసుల వ్యాపారం 62 శాతం చొప్పున వృద్ధి చెందాయని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలియజేసింది. పెట్రో కెమికల్‌ విభాగం అమ్మకాలు అధికంగా ఉండటం కూడా కలసివచ్చిందని పేర్కొంది. ఆదాయం జోరుగా పెరగడానికి ఇవే ముఖ్య కారణాలని వివరించింది.

10 శాతం పెరిగిన లాభం....
అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) నాలుగో త్రైమాసిక కాలంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నికరలాభం రూ.9,438 కోట్లుగా ఉంది.  దీంతో పోలిస్తే తాజా నాలుగో క్వార్టర్లో (2018–19) నికర లాభం 10 శాతం పెరిగి రూ.10,362 కోట్లు చేరింది. షేర్‌ పరంగా చూస్తే, ఒక్కో షేరు వారీ నికర లాభం రూ.15.9 నుంచి రూ.17.5కు ఎగసింది. స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన చూస్తే మాత్రం నికర లాభం తగ్గింది. స్థూల రిఫైనింగ్, పెట్రో కెమికల్స్‌ మార్జిన్‌ తగ్గడంతో నికర లాభం 2 శాతం తగ్గి రూ.8,556 కోట్లకు పరిమితమైంది. ఇక ఆదాయం 19 శాతం పెరిగి రూ.1,54,110 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది.  క్యూ4 మొత్తం ఆదాయం సీక్వెన్షియల్‌గా చూస్తే, 10 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆదాయం రూ.1,70,709 కోట్లుగా ఉంది.

వడ్డీ వ్యయాలు రూ.2,566 కోట్ల నుంచి రూ.4,894 కోట్లకు పెరిగాయి. రిటైల్‌ వ్యాపారం ఎబిటా 77 శాతం ఎగసి రూ.1,923 కోట్లకు చేరగా,  టెలికం విభాగం లాభం 65 శాతం పెరిగింది. క్వార్టర్లీ ఎబిటా 13 శాతం వృద్ధితో రూ.20,832 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్‌ మార్జిన్‌ 15 శాతం సాధించామని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, కంపెనీ ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.6.22 లక్షల కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.39,588 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చినాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.2.87 లక్షల కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,33,027 కోట్లకు పెరిగాయి. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6.50 డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.

పెట్రో కెమికల్స్‌ విభాగం.. తగ్గిన జీఆర్‌ఎమ్‌!
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో పెట్రో కెమికల్స్‌ విభాగం ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.42,414 కోట్లకు పెరిగింది.  రియలైజేషన్లు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఇక ఎబిట్‌ 24 శాతం వృద్ధితో రూ.7,975 కోట్లుగా నమోదైంది.  ఎబిట్‌ మార్జిన్‌ 19 శాతంగా నమోదైంది. అయితే  స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ (జీఆర్‌ఎమ్‌) తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 11 డాలర్లుగా ఉన్న జీఆర్‌ఎమ్‌(ఒక్కో బ్యారెల్‌కు) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 8.2 డాలర్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో జీఆర్‌ఎమ్‌ 8.8 డాలర్లుగా ఉంది. రిఫైనింగ్, మార్కెటింగ్‌ సెగ్మెంట్‌ ఆదాయం 6 శాతం తగ్గి రూ.87,844 కోట్లకు చేరింది.  

మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పెట్రో కెమికల్స్‌ వ్యాపారంలో  సౌదీ ఆరామ్‌కో కంపెనీ 25 శాతం వాటా కొనుగోలు చేయనున్నదన్న వార్తలు, ఫలితాలు సానుకూలంగా ఉండగలవన్న అంచనాల కారణంగా ఈ షేర్‌ పెరిగింది. బీఎస్‌ఈలో 2.7  శాతం లాభంతో రూ.1,383 వద్ద ముగిసింది. స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసినప్పటికీ, సెన్సెక్స్‌లో అత్యధికంగా పెరిగిన షేర్‌ ఇదే. ఈ ఏడాదిలో ఈ షేర్‌ ఇప్పటివరకూ 20 శాతం లాభపడింది.

రిలయన్స్‌ జియో...జిగేల్‌!
టెలికం విభాగం రిలయన్స్‌ జియో నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 65 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.510 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.840 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.7,128 కోట్ల నుంచి 56 శాతం వృద్ధితో రూ.11,106 కోట్లకు పెరిగింది.  ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.723 కోట్లుగా ఉన్న నికర లాభం 2018–19 ఆర్థిక సంవత్సరంలో 309 శాతం వృద్ధితో రూ.2,964 కోట్లకు పెరిగింది. దాదాపు నాలుగు రెట్లు వృద్ధి నమోదైంది. ఆదాయం 93 శాతం వృద్ధితో రూ.38,838 కోట్లకు పెరిగింది. రిలయన్స్‌ జియో వినియోగదారుల సంఖ్య 30 కోట్లను దాటింది. తక్కువ సమయంలోనే ఈ స్థాయి వినియోగదారులను సాధించిన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఇదే. కంపెనీ ఏఆర్‌పీయూ (ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి) రూ.126.2గా ఉంది. ఏఆర్‌పీయూ గత క్యూ3లో రూ.130గా ఉంది.

రిటైల్‌ వ్యాపారం... లక్ష కోట్ల మైలురాయి !
గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రిటైల్‌ వ్యాపారం ఆదాయం 52% పెరిగి రూ.36,663 కోట్లకు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ.24,183 కోట్లుగా ఉంది. ఎబిటా 77 శాతం వృద్ధితో రూ.1,923 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం  ఆదాయం 89 శాతం వృద్ధితో రూ.1,30,566 కోట్లకు పెరిగింది. ఎబిటా 145 శాతం వృద్ధితో రూ.6,201 కోట్లకు పెరిగింది.  ఆదాయం, లాభాల వృద్ధి పరంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం రికార్డ్‌లు సృష్టించింది. అంతర్జాతీయ టాప్‌ 100 కంపెనీల జాబితాలో చోటు సాధించిన ఏకైక భారత కంపెనీ ఇదే.

‘గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాం. రిలయన్స్‌ భవిష్యత్తు కోసం చెప్పుకోదగిన ప్రయత్నాలు చేశాం. రిలయన్స్‌ రిటైల్‌ ఆదాయం రూ. లక్ష కోట్లను దాటేసింది.  రిలయన్స్‌ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లకు పెరిగింది. పెట్రో కెమికల్స్‌ విభాగం ఎన్నడూ లేనంత లాభాన్ని సాధించింది’.
– ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ సీఎండీ



ఫలితాల్లో అదరగొట్టిన కోటక్‌ మహీంద్ర 

కోటక్‌ మహీంద్ర బ్యాంకు  2018-19 సంవత్సరంలోని క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. మార్చి 31తో ముగిసిన నాలుగవ   త్రైమాసికంలో రూ.1408కోట్ల నికర లాభాలను ఆర్జించింది.  గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 25.24  శాతం లాభాలు పుంజుకున్నాయి.  ఆదాయం కూడా 19శాతం ఎగిసి రూ.7672కోట్లను సాధించింది.

మరోవైపు ప్రతీ ఈక్వీటీ  షేరుకు 80పైసల డివిడెండ్‌ను  చెల్లించేందుకు బ్యాంకు  బోర్డు ప్రతిపాదించింది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలో కోటక్‌  బ్యాంకు షేరు స్వల్పంగా లాభపడుతోంది. 


Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: