2020 జ్ఞాపక కలశం! 

జ్ఞాపక కలశం! 


..అంతా మర్మమే


జ్ఞాపకమే ఆధారం. మన కథ జ్ఞాపకంతోనే ఆరంభం. మనం పలికే ప్రతి మాట.. వేసే అడుగు.. చేసే పని.. అన్నింటికీ జ్ఞాపకమే ఆలంబన. ప్రతీ అనుభవం జ్ఞాపకంగా మెదడు పొరల్లో స్థిరపడి.. అవసరమైనప్పుడు బయటకు తొంగిచూస్తూ మనల్ని నిరంతరం నడిపిస్తుంది. అందుకే మనిషి మనుగడకు, అభివృద్ధికి కీలకమైన జ్ఞాపకశక్తి మీద వైద్య పరిశోధనారంగం చాలాకాలంగా దృష్టి సారించింది. అసలు జ్ఞాపకమంటే ఏంటి? అదెలా ఏర్పడుతుంది? దీన్ని కోల్పోకుండా కాపాడుకోవటమెలా? అనే వాటిపై విస్తృతంగా అధ్యయనాలు చేసింది, చేస్తోంది. అయినా ఈ మర్మ కలశం గుట్టు ఇంకా అంతు చిక్కటం లేదు. లోతుకు వెళ్తున్నకొద్దీ ఎన్నెన్నో కొత్త రహస్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. శాస్త్రవేత్తలకే కాదు, సామాన్యులకూ జ్ఞాపకశక్తి రహస్యాల మీద ఆసక్తి ఎక్కువే. నిద్రలో జ్ఞాపకాలు ఏమవుతాయి? మతిమరుపు ఎందుకు పలకరిస్తుంది? మొబైల్‌ ఫోన్లు మతిమరుపునకు కారణమవుతున్నాయా? ఇలాంటి ప్రశ్నలతో  కూడిన ఆసక్తికరమైన కథనం ఈవారం మీకోసం.



?తాళం వేశానా లేదా?


ఇంటికి తాళం వేస్తాం. గట్టిగా లాగి చూస్తాం. అయినా సరే నాలుగడుగులు వేయగానే ‘తాళం వేశానా లేదా? వేస్తే పడిందా లేదా?’ అన్న సందేహం వస్తుంది. గ్యాస్‌ కట్టేసి పక్కగదిలోకి అడుగెడతాం. వెంటనే ‘గ్యాస్‌ కట్టేశానా? లేదా?’ అనే ప్రశ్న పుట్టుకొస్తుంది. అప్పుడే.. ఐదారు సెకండ్ల క్రితం చేసిన పనులే అయినా ఎందుకు గుర్తుండవు? కొందరు దీన్ని మతిమరుపు సమస్యకు సంకేతమేమోననీ భయపడుతుంటారు. నిజానికి రోజూ తరచుగా చేసే పనులను, అలవాటైన పనులను మన శరీరం ఎలాంటి ఆలోచనల అవసరం లేకుండా యథాలాపంగానే చేసేస్తుంటుంది. ఇలాంటి పనులను ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరముండదు కాబట్టి మెదడు కూడా పెద్దగా పట్టించుకోదు. వాటి తాలూకు అనుభవాలను నిక్షిప్తం చేసుకోవటానికి ప్రయత్నించదు. అందుకే మనకు ఆయా పనులు అంతగా గుర్తుండవు. తరచూ చేసే పనులను మెదడు పట్టించుకోకపోవటమూ మన మంచికే. వీటి స్థానాన్ని మరింత ముఖ్యమైన జ్ఞాపకాలను పదిల పరచుకోవటానికి మెదడు వాడుకుంటుంది. అయితే రోజువారీగా చేసేవే అయినా ముఖ్యమైన పనులు గుర్తుండకపోవటం శ్రుతిమించితే మాత్రం ఇబ్బందులు తప్పవు.

?నేనెందుకు పూస గుచ్చినట్టు వివరించలేను?


చాలా ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలనైనా కొందరు పూస గుచ్చినట్టుగా గలగలమని వివరిస్తుంటారు. కొందరికి నెల క్రితం వెళ్లిన హోటల్లో ఏం చేశారో చెప్పటమే కష్టమైపోతుంది. మనకు ఎదురైన అనుభవాలను, ఘటనలను ఎంతవరకు గుర్తుంచుకుంటామన్నది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సవివరణాత్మక జ్ఞాపకశక్తి (ఆటోబయోగ్రఫికల్‌ మెమరీ) గలవారు వ్యక్తిగత అనుభవాలను, తాము కలిసిన వ్యక్తులను, తిరిగిన ప్రాంతాలను, అక్కడి విశేషాలను సమగ్రంగా చాలాకాలం పాటు గుర్తుంచుకోగలుగుతారు. ఆయా అనుభవాలను దృశ్యాలతో జోడించి చూస్తుండటమే దీనికి ప్రధాన కారణం. తాము ఎక్కడ, ఎలా ప్రవర్తిస్తున్నామన్న చైతన్యం ఉండటమూ ఇందుకు దోహదం చేస్తుంది. కొందరిలో ఈ సవివరణాత్మక జ్ఞాపకశక్తి అంతగా ఉండదు. అందువల్ల ఎప్పుడు, ఎక్కడికి వెళ్లామో అనేవి బాగానే గుర్తుంటాయి గానీ అక్కడ ఏం జరిగింది? పరిసరాల వివరాలేంటి? అనేవి మాత్రం సరిగా వివరించటం సాధ్యం కాదు. 

?ఒత్తిడితో జ్ఞాపకశక్తి తగ్గటం నిజమేనా?


ఏదైనా గుర్తుకురానప్పుడు కళ్లు మూసుకొని కాసేపు ఆలోచించటం తెలిసిందే. చాలాసార్లు ఆయా విషయాలు గుర్తుకొస్తుంటాయి కూడా. దీనికి కారణం లేకపోలేదు. జ్ఞానేంద్రియాల్లో కళ్లు చాలా కీలకమైనవి. కొత్త సమాచారం మెదడుకు చేరటానికి చూపు ఎంతగానో తోడ్పడుతుంది. మనం దేని గురించైనా ఆలోచిస్తున్నప్పుడు ఎదురుగా కనబడే దృశ్యాలు దృష్టి మళ్లిస్తాయి. అదే కళ్లు మూసుకున్నప్పుడు ఏకాగ్రతతో ఆలోచించటం సాధ్యమవుతుంది. దీంతో ఆయా విషయాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా దృశ్యాలతో ముడిపడిన వివరాలు బాగా గుర్తుకొస్తాయి. అయితే ఇది ఆయా వ్యక్తులను బట్టి మారుతుండొచ్చు. కొందరికి అసలేమీ గుర్తురాకపోవచ్చు కూడా.

?నిద్రలో జ్ఞాపకాలు ఏమవుతాయి?


జ్ఞాపకానికీ నిద్రకూ అవినాభావ సంబంధముంది. కొత్తగా ఎదురైన సంఘటనలు జ్ఞాపకాలుగా స్థిరపడేది నిద్రపోతున్నప్పుడే. వాటిని దీర్ఘకాలం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరముందా? ఒకవేళ అలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తే మెదడులో ఎక్కడ దాచుకోవాలన్నదీ నిద్రలోనే నిర్ణయమైపోతుంది. అప్పటికే ఏర్పడిన జ్ఞాపకాల అనుసంధానాలతో కొత్త జ్ఞాపకాలు జతకూడేది కూడా నిద్రలోనే. ఈ తతంగం నిర్విరామంగా రాత్రంతా కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఏయే జ్ఞాపకాలను దాచుకోవాలి? వేటిని వదిలేయాలి? అనేది ‘నిద్రపోతున్న మెదడు’కు ఎలా తెలుసన్నది మాత్రం అంతుచిక్కని ప్రశ్న. సాధారణంగా తాజా జ్ఞాపకాలు హిప్పోక్యాంపస్‌లో, దీర్ఘకాల జ్ఞాపకాలు కార్టెక్స్‌లో నిక్షిప్తమవుతుంటాయి. మనం నిద్రపోతున్నప్పుడు వీటి మధ్య అనుసంధానాలు ఉత్తేజితమవుతాయి. అనవసర జ్ఞాపకాలను వదిలించుకొని.. వాటి స్థానంలో తాజా జ్ఞాపకాల సమాచారం నిక్షిప్తం కావటానికి ఇది వీలు కల్పిస్తుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోజూ ఎన్నో పనులు చేస్తుంటాం. ఎన్నో సంఘటనలను ఎదుర్కొంటాం. అన్నింటినీ తిరిగి గుర్తుకుతెచ్చుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వీటి మధ్య తేడాను కూడా మెదడు నిద్రలోనే తేల్చుకుంటుంది. మర్నాడు అవసరపడుతుండొచ్చని అనుకున్న సమాచారాన్ని దీర్ఘకాల జ్ఞాపకాలను నిల్వచేసుకునే చోటులో పెడుతుంది. భావోద్వేగాలతో ముడిపడిన.. ముఖ్యంగా ప్రతికూల భావోద్వేగాల సమాచారాన్ని గుర్తుపెట్టుకోవటానికి మెదడు చాలా ప్రాధాన్యమిస్తుంది. ఇది పరిణామక్రమంలో భాగంగానే మనిషికి అబ్బింది. ఎందుకంటే చేసిన తప్పులను గుర్తుపెట్టుకుంటే మళ్లీ అలాంటివి జరగకుండా చూసుకుంటాం కదా. అందుకే వాటిపై ఎక్కువ దృష్టి సారిస్తుంది. భావోద్వేగాలతో ముడిపడిన జ్ఞాపకాలు నిద్రలో మారిపోతుంటాయి కూడా. భావోద్వేగాల నుంచి జ్ఞాపకాలను వేరుచేసి.. కేవలం ఆ సమాచారాన్ని మాత్రమే పదిలపరచుకుంటుందన్నమాట. ఇది మానసిక ఆరోగ్యానికి చాలా కీలకం. నిద్ర సరిగా పట్టకపోతే సానుకూల జ్ఞాపకాలపై ప్రతికూల జ్ఞాపకాలు పైచేయి సాధిస్తాయి. దీంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కొరవడుతుంది.

?మహా జ్ఞాపకశక్తి సాధ్యమా?


ఎలాంటి ప్రయత్నం చేయకుండానే అన్ని విషయాలూ గుర్తుండిపోతే? చదవటం తేలికవుతుంది. ఎలాంటి పరీక్షనైనా ఇట్టే రాసేయొచ్చు. తాళాలు ఎక్కడ పెట్టామో మరచిపోయే అవకాశమే లేదు. అల్జీమర్స్‌, డిమెన్షియా వంటి మతిమరుపు సమస్యల ఊసే ఉండదు. మరి ఇలాంటి మహా జ్ఞాపకశక్తి సాధ్యమేనా? శాస్త్రవేత్తలు ఈ దిశగానూ పరిశోధనలు ఆరంభించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జ్ఞాపకశక్తిని పెంపొందించటమే కాదు.. మెదడులోని కొన్ని భాగాలను అనుకరించే పరికరాల రూపకల్పనకు నడుం బిగించారు. పార్కిన్సన్స్‌, మూర్ఛ వంటి సమస్యల చికిత్సల్లో ఇప్పటికే ఉపయోగిస్తున్న డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేటర్‌ వంటి పరికరాలను జ్ఞాపకశక్తిని ఇనుమడింప జేయటానికీ వాడుకోవచ్చని భావిస్తున్నారు. మెదడులో జ్ఞాపకశక్తికి మూలమైన హిప్పోక్యాంపస్‌ వంటి భాగాల్లో ఎలక్ట్రోడ్‌లను అమర్చటం ద్వారా స్వల్పకాలిక జ్ఞాపకాలు పుంజుకునేలా చేసే అవకాశం లేకపోలేదు. దీంతో అల్జీమర్స్‌ బాధితుల్లో హిప్పోక్యాంపస్‌ క్షీణించటం తగ్గుతున్నట్టూ కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. జ్ఞాపకాలు ఏర్పడే సమయంలో మెదడులో తలెత్తే విద్యుత్‌ చర్యలను కృత్రిమంగా సృష్టించేలా చేయటం మీదా పరిశోధకులు కన్నేశారు. మూర్ఛ కారణంగా మతిమరుపు సమస్యల బారినపడ్డ కొందరిలో ఈ పద్ధతి మంచి ఫలితం కనబరుస్తున్నట్టు తేలింది కూడా. నిజానికి ఇలాంటి జ్ఞాపక కృత్రిమ పరికరాల ఉద్దేశం మతిమరుపు సమస్యలకు చికిత్స చేయటమే అయినా మున్ముందు వీటిని రోజువారీ అవసరాలకు ఉపయోగించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. 

?శిశుదశ విషయాలు గుర్తుండవేం?


శిశువులు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. అయితే రెండేళ్ల లోపు జరిగిన సంగతులు గుర్తుండేది చాలా కొద్దిమందికే. దీనికి కారణం- శిశువుల్లో దీర్ఘకాల జ్ఞాపకాలకు నిలయమైన భాగాలు పూర్తిగా ఎదకపోవటమే. అందువల్ల జ్ఞాపకాలు ఏర్పడినా ఎక్కువకాలం ఉండవు. ఆర్నెల్ల వయసు పిల్లలు ఆయా పనుల కోసం జ్ఞాపకాలను వాడుకుంటారు గానీ అవి 3 వారాల వరకే గుర్తుంటాయి. మెదడు ఎదుగుతున్నకొద్దీ నాడీ యంత్రాంగం కూడా సామర్థ్యం సంతరించుకుంటూ వస్తుంది. ఏడేళ్ల వయసు వచ్చేసరికి జ్ఞాపకాలు స్థిరపడటం మొదలవుతుంది. చిత్రంగా ఆ తర్వాత హఠాత్తుగా ఇది తగ్గిపోతుంది. అందుకే ఏడేళ్ల వయసులో పిల్లలు అంతకుముందు విషయాలను బాగానే గుర్తుతెచ్చుకుంటారు. కానీ ఏడాది తర్వాత.. అంటే ఎనిమిదేళ్లు నిండినపుడు పాత సంగతుల గురించి అడిగితే కాస్త తడబడతారు. దీన్నే ‘బాల మరుపు’ అంటారు. అప్పటివరకూ అంతగా వినియోగించుకోని అనుసంధానాలను పక్కకుపెట్టి మిగిలిన వాటిని బలోపేతం చేసుకోవటానికి మెదడు ప్రయత్నిస్తుండటమే దీనికి మూలం. కాస్త పెద్దపిల్లలు కొన్ని విషయాలను వల్లె వేస్తుండొచ్చు గానీ అవన్నీ వివరణాత్మకంగా ఉంటాయి. కొన్ని సమాజాల్లో పిల్లలకు చిన్నప్పుడు వాళ్లు చేసిన పనులను తరచుగా చెబుతుంటారు. ఇలాంటివారిలో చిన్ననాటి విషయాలు బాగానే గుర్తుండే అవకాశముంది.

జ్ఞాపకశక్తికి మెరుగు ఇలా..


* వ్యాయామం చేయండి: ఏదైనా నేర్చుకున్నాక వ్యాయామం చేయటం మంచిది. దీంతో నేర్చుకున్నది మనసులో బాగా నాటుకుపోతుంది. చదివిన వెంటనే కాకుండా కొద్ది గంటల తర్వాత శరీరానికి పనిచెబితే మరింత ప్రయోజనం కనబడుతుంది. 


* తరచూ ప్రశ్నించుకోండి: పునశ్చరణ విషయంలో ఆయా విషయాలను వల్లె వేస్తే సరిపోదు. మనకు మనమే తరచుగా ప్రశ్నలు వేసుకుంటూ పరీక్ష పెట్టుకోవటం ఎంతో మంచిది. 


* విరామం ఇవ్వండి: ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు మధ్యమధ్యలో కాసేపు విరామం ఇవ్వటం ఉత్తమం. నేర్చుకునే విషయానికి భిన్నమైన పనులు చేయటం మరీ ఉత్తమం.


 


* సమయాన్నీ చూసుకోండి: యుక్తవయసు పిల్లలు మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో చదివితే బాగా జ్ఞాపకముంటుంది. పెద్దవాళ్లయితే ఉదయం పూట చదువుకోవటం మంచిది. 



* కునుకు తీయండి: కొత్త విషయాలను, నైపుణ్యాలను నేర్చుకున్నాక కాసేపు కునుకు తీయండి. దీంతో అవి బాగా గుర్తుండిపోతాయి. ముఖ్యంగా పరీక్షలకు వెళ్లే ముందురోజు ఇలా చేస్తే చాలా ప్రయోజనముంటుంది. 



* గమ్‌ నమలండి: పరీక్ష రాస్తున్నప్పుడు బబుల్‌గమ్‌ నములుతుంటే చదివిన విషయాలు గుర్తుకురావటానికి తోడ్పడుతుంది. అయితే దీని ప్రయోజనాలు కొద్దిసేపు ఉంటాయి. అందువల్ల అత్యవసరమైనప్పుడే గమ్‌ నమలటం మంచిది.


?టెక్నాలజీ మతిమరుపును తెచ్చిపెడుతోందా?


డీడీటీ అంటే ఏంటి? ఒకప్పుడు ఇలాంటి ప్రశ్న వేస్తే ముందుగా బుర్రకు పని చెప్పేవాళ్లు. మరిప్పుడో? వెంటనే ఇంటర్నెట్‌లో వెతికేయటమే. ఒకప్పుడు బంధువులు, మిత్రుల ఫోన్‌ నంబర్లు, పుట్టిన తేదీల వంటివన్నీ నోట్లోనే ఉండేవి. ఆ సమాచారమంతా మెదడులో నిక్షిప్తమై ఉండేది. ఇప్పుడదంతా స్మార్ట్‌ఫోన్‌లోకి ఒదిగిపోయింది. ఆయా విషయాలను గుర్తుపెట్టుకోవటానికి బయటి సాధనాల మీద ఆధారపడటం (ఉదా: కాగితం మీద రాసిపెట్టుకోవటం) కొత్తేమీ కాదు. కానీ చేతిలో కదలాడుతూ, తేలికగా వాడుకోగలిగే మొబైల్‌ ఫోన్ల వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. బుర్రకు పని చెప్పకుండా ప్రతిదానికీ వీటి మీద ఆధారపడటం పెరిగిపోయింది. అందుకే వీటి మూలంగా మన జ్ఞాపకశక్తి తగ్గిపోతోందా? అనే సందేహం పుట్టుకొస్తోంది. ఇందులో కొంత నిజం లేకపోలేదు. ఇది సామాజిక మాధ్యమాల యుగం. బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా నిమిషానికో ఫోటో అప్‌లోడ్‌ చేయటం మామూలైపోయింది. ఇలా ఫోటోలను, వివరాలను పంపించుకోవటం ద్వారా ఆయా సంఘటనల జ్ఞాపకాలను పదిలపరచుకుంటున్నామని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇది మన జ్ఞాపకశక్తి మీద విపరీత ప్రభావం చూపుతుందని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం చెబుతోంది. పర్యటనలకు వెళ్లినవారిలో తరచుగా ఫొటోలు షేర్‌ చేసినవారు అనంతరం అక్కడి వివరాలను అంతగా గుర్తుకుతెచ్చుకోలేకపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మ్యాప్‌లను ఉపయోగించేవారితో పోలిస్తే ఉపగ్రహ నావిగేషన్‌ మీద ఆధారపడ్డవారు ఆయా ప్రాంతాలకు చేరుకోవటంలో ఇబ్బందులు పడుతున్నారనీ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవన్నీ టెక్నాలజీ మన జ్ఞాపకాలను మార్చేస్తోందనే సూచిస్తున్నాయి. సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుంటే చాలనే ధోరణి మనలో పెరిగిపోతోందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రయోజనాలను పక్కనపెడితే.. మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి వాటిపై మరీ ఎక్కువగా ఆధారపడితే జ్ఞాపకశక్తి దెబ్బతినే అవకాశం లేకపోలేదనే విషయాన్ని ఇవి స్పష్టం చేస్తున్నాయి.

?కొంతకాలానికి జ్ఞాపకాలు మాయమవుతాయేం?


కొన్ని జ్ఞాపకాలు కొంతకాలానికి మాసిపోతాయన్నది అందరికీ తెలిసిందే. కొత్త విషయాల కన్నా పాత సంగతులను గుర్తుకుతెచ్చుకోవటం ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ ఈ మరచిపోవటమన్నది యాదృచ్ఛికంగా జరిగేది కాదు. మెదడులో తలెత్తే ప్రక్రియలు ఇందుకు దోహదం చేస్తుంటాయి. జ్ఞాపకశక్తిలో కీలకపాత్ర పోషించే హిప్పోక్యాంపస్‌లో నిరంతరం కొత్త కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇవి పాత జ్ఞాపకాలను తొలగిస్తూ వాటి మీద కొత్త జ్ఞాపకాలను పొందుపరుస్తుంటాయి. ఇందుకు కొంత శక్తిని కూడా వినియోగించుకుంటాయి. ఇలా శక్తిని వినియోగించుకొని మరీ మెదడు తన జ్ఞాపకాలను తనే ఎందుకు తుడిచేసుకుంటుంది? నిల్వ చేసుకోవటానికి చోటు లేక కాదు. మెదడు కణాలు, అనుసంధానాల పరంగా చూస్తే మనం ఇంతకన్నా ఎక్కువ విషయాలనే గుర్తుంచుకోగలం. కానీ జ్ఞాపకశక్తి లక్ష్యం నిరంతరం సమాచారాన్ని నిల్వ చేసుకోవటం కాదు. మున్ముందు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచటమేనన్నది శాస్త్రవేత్తల భావన. అంటే ఒకరకంగా మరచిపోవటం వల్ల ముఖ్యమైన విషయాలను నేర్చుకోవటానికి అవసరమైన ఖాళీ ఏర్పడుతోందని చెప్పుకోవచ్చు. ఇది భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందించుకోవటానికి బాగా తోడ్పడుతుంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: