2020-ఆటిజమ్
చిక్కుల చట్రం!
నేడు ప్రపంచ ఆటిజమ్ దినం
పుట్టినప్పట్నుంచీ శిశువు ప్రతి కదలికా అద్భుతమే. ప్రతి దశా పెద్ద సంబరమే. మెడ నిలబెట్టటం, బోర్లాపడటం దగ్గర్నుంచి.. పాకటం, పారాడటం, నిలబడటం, తప్పటడుగులు వేయటం వరకూ అన్నీ అపురూప దృశ్యాలే. అత్తా.. తాత్తాత.. మాటలన్నీ గొప్పగా చెప్పుకొనే ముచ్చటలే. ఇలా అంతా సాఫీగా సాగిపోవాల్సిన తరుణంలో ఎక్కడో ఏదో అనుమానం. ఏదో తెలియని వెలితి. ‘పాప ఎందుకనో కళ్లలోకి నేరుగా చూడటం లేదు’.. ‘నవ్వించినా నవ్వటం లేదు’.. తల్లిదండ్రుల మనసులో ఏదో సంశయం. నిజంగా ఇది అనుమానించాల్సిన సమయమే. ఎదుగుదల దశలను అస్తవ్యస్తం చేసే ఆటిజమ్ ఇలాగే మొగ్గతొడగటం ఆరంభిస్తుంది. ఇది ఒక్క సమస్య కాదు. రకరకాల అంశాలతో ముడిపడిన చట్రం. దీని ఆనవాళ్లను గుర్తించటం అత్యవసరం. త్వరగా చికిత్స ఆరంభిస్తే దీన్ని అధిగమించే అవకాశం లేకపోలేదు. కాబట్టి ‘ప్రపంచ ఆటిజమ్ దినం’ సందర్భంగా సవివర కథనం మీకోసం.

బుద్ధిమాంద్యం కాదు
ఇతరులతో కలవలేకపోవటం, సరిగా మాట్లాడలేకపోవటం వల్ల మొదట్లో ఆటిజమ్‌ను బుద్ధిమాంద్యం అని అనుకునేవారు. కానీ ఇది బుద్ధిమాంద్యం కాదు. ఆటిజమ్ పిల్లలు బుద్ధిమాంద్యం గలవారి మాదిరిగా స్తబ్ధుగా ఉండరు. చురుకుగానే ఉంటారు. పరిసరాలను గమనిస్తూ ఉంటారు. కొందరు కొన్ని విషయాల్లో మరింత చురుకుగానూ ఉంటారు. అంకెలు, సంఖ్యల వంటివి టకటకా చెప్పేస్తుంటారు కూడా. అయితే ఇతరులతో కలివిడిగా ఉండకపోవటం, నేర్చుకోకపోవటం వంటి వాటి మూలంగా కొందరు ఆటిజమ్ పిల్లల్లో పెద్దయ్యాక బుద్ధిమాంద్యం లక్షణాలు కనబడొచ్చు.
పాశ్చాత్య సమస్య కానే కాదు
ఒకప్పుడు ఆటిజమ్‌ను పాశ్చాత్య దేశాల, సంపన్నుల సమస్యగానే భావించేవారు. ఇప్పుడిది పాశ్చాత్య దేశాల్లో మాదిరిగానే మనదేశంలోనూ.. అదీ అన్ని వర్గాల్లోనూ ఎక్కువగానే కనబడుతోంది. 3-6 ఏళ్ల పిల్లల్లో ప్రతి 125 మందిలో ఒకరు.. 6-9 ఏళ్ల పిల్లల్లో ప్రతి 85 మందిలో ఒకరు ఆటిజమ్‌తో బాధపడుతున్నట్టు ఐఎన్‌సీఎల్‌ఈఎన్ అధ్యయనంలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో 0.90%.. కొండ ప్రాంతాల్లో 0.60%.. పట్టణ ప్రాంతాల్లో 1.02%.. గిరిజన ప్రాంతాల్లో 0.61%.. తీరప్రాంతాల్లో 0.61% మంది ఆటిజమ్ బాధితులు ఉన్నారని అంచనా.
ఆటిజమ్ అంటే?
ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో ఎదుగుదల సమస్య. కాకపోతే రకరకాల విభాగాలకు విస్తరించిన సమస్య. దీని బారినపడ్డవారిలో ప్రధానంగా మూడు లక్షణాలు కనబడుతుంటాయి.
1. ఇతరులతో కలవలేకపోవటం. వీళ్లు తోటి పిల్లలతో ఆడుకోవటానికి అంతగా ఇష్టపడరు. ఒంటరిగా గడుపుతుంటారు.
2. భావాలను సరిగా వ్యక్తం చేయలేకపోవటం.మాటలు రావటం ఆలస్యం కావొచ్చు. ఒకవేళ వచ్చినా పూర్తిగా రాకపోనూవచ్చు. ఏదైనా కావాలంటే నోటితో అడక్కుండా పెద్దవాళ్ల చేయి పట్టుకొని తీసుకెళ్లటం వంటివి చేయొచ్చు.
3. ప్రవర్తన లోపాలు. చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తుండొచ్చు. ఆయా పనులను ఎప్పుడూ ఒకేలా చేయాలని చూస్తుండొచ్చు. కొందరు సంతోషం వేసినపుడు కాళ్లూ చేతులూ పైకీ కిందికీ ఆడిస్తుండొచ్చు. మరికొందరు ఒకేరకం వస్తువులను సేకరించటానికి ఇష్టపడుతుంటారు కూడా.
* కొందరిలో ఒకట్రెండు లక్షణాలే ఎక్కువగా కనబడినా మిగతా లక్షణాలు కూడా ఏదో ఒక స్థాయిలో ఉంటుండటం గమనార్హం.
కచ్చితమైన కారణం తెలియదు
ఆటిజమ్‌కు కారణమేంటన్నది కచ్చితంగా తెలియదు. అయితే జన్యు, పర్యావరణ అంశాలు రెండూ ఆటిజమ్‌కు దారితీస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, క్రోమోజోములు ఆటిజమ్‌కు కారణమవుతుండొచ్చనే భావన ఉంది. గర్భదారణ సమయంలో తల్లికి వచ్చే వైరల్ ఇన్‌ఫెక్షన్లు, కాన్పు సమయంలో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం, నెలలు నిండక ముందే కాన్పు కావటం, తక్కువ బరువుతో పుట్టటం వంటివన్నీ ఇందులో పాలు పంచుకోవచ్చని అనుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ వంటి కొన్ని వృత్తుల్లోని తల్లులకు పుట్టే బిడ్డలో ఆటిజమ్ ఎక్కువగా కనబడుతున్నట్టు ఇటీవలి కాలంలో అనుమానిస్తున్నారు. కొన్ని ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నవారు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవటం, పనిగంటలు అస్తవ్యస్తంగా ఉండటం, పిల్లలకు పరిసరాల నుంచి సరైన ప్రేరణ లభించకపోవటం, రేడియేషన్ ప్రభావం వంటివి ఇందుకు కారణమవుతుండొచ్చని భావిస్తున్నారు. ఇలా ఆటిజమ్ మీద రకరకాల సిద్ధాంతాలున్నాయి గానీ ఇవేవీ పూర్తిగా నిరూపణ కాలేదు.
ప్రధానంగా నాలుగు రకాలు
అటిజమ్‌ను ‘పర్వేసివ్ డెవలప్‌మెంట్ డిజార్డర్’ కింద వర్గీకరించారు. లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయి? ఎంత తీవ్రంగా ఉన్నాయి? వంటి వాటిని బట్టి దీన్ని ప్రధానంగా 4 నాలుగు రకాలుగా విభజించారు.
1. ఆటిస్టిక్ సమస్య: ఎక్కువగా కనబడేది ఇదే. దీన్నే చైల్డ్‌హుడ్ ఆటిజమ్’ అంటారు. ఇది ఆడపిల్లల్లో కన్నా మగ పిల్లల్లో ఎక్కువ.
2. రట్స్ సమస్య: ఇది అరుదైన రకం. ఆడపిల్లల్లో ఎక్కువ. ఏడాది వయసు దాటిన తర్వాత లక్షణాలు కనబడటం దీని ప్రత్యేకత. ఇవి రెండు మూడేళ్లలోనే తీవ్రమవుతుంటాయి కూడా. అప్పటికి వచ్చిన ఒకట్రెండు మాటలు కూడా పలకలేకపోవచ్చు. రట్స్ సమస్య క్రమంగా ముదురుతూ వస్తుంటుంది. కొంతకాలానికి ఫిట్స్ వంటి నాడీ సంబంధ సమస్యలూ మొదలవుతుంటాయి. వయసుతో పాటు పెరగాల్సిన తల చిన్నదవుతుంటుంది. చొంగ కారుస్తుండటం, చేతులు కాళ్లు ఒకేలా ఆడిస్తుండటం, చేతులతో చప్పుళ్లు చేయటం వంటివి చేస్తుంటారు.
3. ఆస్పర్జెర్స్ సమస్య: ఇది మగపిల్లల్లో ఎక్కువ. వీరిలో మాటలు, తెలివి తేటలు మామూలుగానే ఉంటాయి గానీ తక్కువగా మాట్లాడతారు. అడిగిన దానికి జవాబు చెప్పేసి ఆపేస్తారు. కొన్ని పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపించటం వల్ల ఆయా అంశాల్లో మంచి నైపుణ్యమూ సాధిస్తారు. కాకపోతే ప్రవర్తన పరమైన సమస్యలు ఎక్కువ.
4. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ సమస్య: ఇది తీవ్రమైన ఆటిజమ్ సమస్య. దీని బారినపడ్డవాళ్లు పుట్టినపుడు బాగానే ఉంటారు. ఒకట్రెండు సంవత్సరాల వరకు ఎదుగుదలా బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఎదుగుదల వెనక్కి మళ్లటం మొదలవుతుంది. వీరిలో ముఖం రఫ్‌గా, ముదిరినట్టుగా ఉంటుంది. తలకట్టు కిందికి ఉంటుంది. వీళ్లు పొట్టిగా, లావుగానూ ఉండొచ్చు. నాడీ సమస్యలు ఆరంభమై ఫిట్స్ వచ్చి నెమ్మదిగా మంచానికే పరిమితం కావొచ్చు.
చికిత్స- మానసిక స్థితి కీలకం
ఆటిజమ్ రేటింగ్ స్కేల్స్, ఐక్యూ ఆధారంగా సమస్య తీవ్రత, లక్షణాలను గుర్తించి చికిత్స నిర్ణయిస్తారు. ఫిట్స్, మెదడులో లోపాలు, ఉద్రేకంగా ప్రవర్తించటం వంటి వాటికి మందులు ఇచ్చినప్పటికీ.. మానసిక స్థితిని సరిదిద్దటమే అన్నింటికన్నా ప్రధానం. ఇందుకు స్పీచ్ థెరపీ, ప్రవర్తనను సరిచేయటం వంటివి బాగా తోడ్పడతాయి.
* పిల్లలతో తరచుగా మాట్లాడుతూ ఉండటం వల్ల మాట్లాడే తీరు మెరుగవుతుంది. కళ్లలో కళ్లు పెట్టి చూడటం వంటివి నేర్పిస్తుంటే క్రమేపీ కుదురుకోవటానికి వీలవుతుంది.
* ఇష్టమైన వస్తువులను వెంటనే కాకుండా చెప్పిన పని చేసిన తర్వాత ఇవ్వటం వంటివి ప్రవర్తన మెరుగుపడటానికి దోహదం చేస్తాయి.
* మరీ చిన్నపిల్లలైతే స్పర్శ, చప్పుడు వంటి వాటి ద్వారా నేర్చుకులా జ్ఞానేంద్రియాలను ప్రేరేపించే చికిత్స మేలు చేస్తుంది.
* సంగీతం, బొమ్మలు వేయటం వంటి వాటిల్లో ప్రతేక శ్రద్ధ కనబరుస్తుంటే అవి మెరుగు పడేలా శిక్షణ ఇస్తే మంచి ఫలితం కనబడుతుంది.
గుర్తించటమెలా?
సాధారణంగా ఆటిజమ్ లక్షణాలు ఏడాది వయసులోపే కనబడటం ఆరంభిస్తుంటాయి. అయితే చాలామందిలో నాలుగేళ్లు దాటిన తర్వాత గానీ గుర్తించటం లేదు. ఆలస్యమైనకొద్దీ సమస్య తీవ్రమవుతూ వస్తుంటుంది. కాబట్టి ముందుగానే గుర్తించటం ఎంతైనా అవసరం.
ఎలాంటి కారణం లేకుండా ఎప్పుడూ ఏడుస్తుండటంఅడిగింది ఇవ్వకపోతే అరవటం, గీపెట్టటంపదిమందిలో ఉన్నా తమ బొమ్మలతోనే ఆడుకోవటం
ఏదైనా వస్తువు లేదా బొమ్మ మీద వ్యామోహం పెంచుకోవటం, యావంతా దాని మీదే ఉండటంస్తబ్ధుగా ఉండిపోవటం లేదా అతిగా స్పందించటంతల్లిదండ్రులు చేతులు చాచినా ఉత్సాహం చూపకపోవటం
చేతులు, కాళ్లు అసహజంగా, ఒకే తీరులో కదిలిస్తుండటంసంతోషం, బాధ వంటి భావాలేవీ ముఖంలో కనిపించకపోవటంకళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోవటం
ప్రమాదాలను పసిగట్టలేకపోవటంతమకు దెబ్బలు తగిలినా పట్టనట్టు ఉండిపోవటంతెలిసిన వాళ్లు చూసినా స్పందించకపోవటం
మనుషుల కన్నా బొమ్మలు, వస్తువుల పట్ల ఆసక్తి చూపుతుండటం
శబ్దాలకు గట్టిగా చెవులు మూసుకోవటం లేదా అసలు పట్టించుకోకపోవటంపిలిస్తే వెంటనే సమాధానం ఇవ్వకపోవటం
ఒకేలా పనులు చేయటం. ఆ పనులు మారిపోతే ఇబ్బంది పడటంమాటలు సరిగా రాకపోవటం, సరిగా మాట్లాడలేకపోవటం‘నేను నువ్వు, నాది నీది’ అనే తారతమ్యం తెలియకపోవటం
నలుగురితో కలవలేకపోవటం, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుండటం.
Comments
Post a Comment