గొప్పనేతల లక్షణాలు ఇవే!
భీష్ముడు చెప్పిన రాజనీతి కేవలం అలనాటి రాజులకు, నేటి రాజకీయనేతలకు మాత్రమే కాదని నాయకత్వ లక్షణాలు కావలసిన అందరికీ ఆధునిక పాఠ్యాంశాలుగా అంతా గుర్తించాలి. దీన్నే నేడు లీడర్ షిప్ క్వాలిటీస్ అంటారు. మార్కెటింగ్, సాఫ్ట్ వేర్ వంటి రంగాలతోపాటు టీం వర్కు కావాల్సి ప్రతీ చోట భీష్ముడు చెప్పిన రాజనీతి అవసరం ఉంది.
నేడు యుగాలు మారి రాజరికం స్థానంలో ప్రజాస్వామ్యం వచ్చింది. వారసత్వంగా వచ్చే రాజులు పోయి ఎవరైనా పాలకులు అయ్యే రోజులు వచ్చాయి. కానీ నేడు పాలకులకు ఉండాల్సిన లక్షణాలు నేర్పే రాజనీతి శాస్ర్తాలు మాత్రం లేకుండా పోయాయి. దీని వల్ల అధికారం వస్తే ఏంచేయాలో తెలియని పరిస్థితిలో ఎవరికి వారు అధికారం అంటే దీపం ఉండగా చీకటికూపం నింపుకోవడం అనే భావనకు దిగజారిన నేతలు అయ్యారు.
మహాభారతంలోని రాజనీతి ధర్మరాజుకు కంటే నేడు ప్రజాస్వామ్యానికే అతిముఖ్యమైంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి నుంచీ పంచాయతీబోర్డు మెంబరు వరకూ విస్తరించిన పాలనాధికారాలు రాజరికవారసత్వం నుంచీ కాకుండా ప్రజలే ఈ స్థానాలు ఆక్రమిస్తున్నారు. కనుక వీరికి పరిపాలనా సామర్ధ్యాన్ని పెంచే మనదైన సనాతన విజ్ఞానం సశాస్త్రీయంగా అందించాల్సి ఉంది.
ప్రజాస్వామ్యం వచ్చిన కొత్తలో ఈ భయంకర అవినీతి లోయలు ఏర్పడలేదు. దీనికి కారణం పూర్వం సంస్కృతభాష రాజభాషగా ఉండేది. భారతదేశాన్ని ఏకం చేసిన దేవభాష. ఈ అమరభాషలో ఉన్న మహాభారతాది రాజనీతి ప్రాయాస లేకుండా అందరికీ తెలిసి రాజనీతిజ్ఞులు అయ్యారు. కనుకనే ఏం చేయవచ్చు, ఏం చేయరాదు అనే సన్నని గీత దాటేవారు కాదు.
మహాభారతంలో మహారాజుగా అభిషిక్తుడయ్యాక ధర్మరాజు తన తాత భీష్ముడిని చేరి ఇహపరాల్లో సుఖంగా రాజు ఉండాలంటే ఏవిధంగా ప్రవర్తించాలని ప్రశ్నించాడు.
ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది. ఎందుకంటే రాజ్యాంతే నరకం ధ్రువం అని ఆర్యోక్తి. ఎంత ధర్మబద్ధుడైన రాజుగా పాలించినా పదవీ విరమణ తరువాత అతనికి నరకమే కలుగుతుందని దీని అర్ధం. అటువంటిది తరతరాలకూ సరిపడా కూడబెట్టుకునే అవినీతిపరులకు ఏ దుర్గతి పట్టనుందో ఊహించడం కూడా కష్టమే. ధర్మరాజు వంటి మహాత్ముడు కూడా పాలనానంతరం దుర్గతి పాలు కాకుండా ఉండాలంటే ఏవిధమైన ప్రవర్తనతో పాలకుడు ఉండాలని తెలుసుకోవడానికి ప్రశ్నించాడు.
మహాభారతంలోని రాజనీతిని అలనాటి మహారాజులను ఉద్దేశించి చెప్పారు. నిజానికి ఆ రోజుల్లో మహారాజుకు ఉత్తమ లక్షణాలున్నా రాక్షస లక్షణాలున్నా ప్రజలు చేయగలిగింది ఏమీ లేదు. వారిని భరించడం తప్ప. అదృష్టవశాత్తూ వారు ఉత్తమ విద్య పొందిన రాజనీతజ్ఞులు అయితే ప్రజల అదృష్టం. లేదంటే వారి ఖర్మ. కనుక మహాభారతంలోని రాజనీతి కేవలం కొద్ది మంది రాజులకు మాత్రమే చెందింది.
ఈ కారణాల చేత అటు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకునేవారు, ఇటు ఉన్నతమైన ఉద్యోగాలు కావాలనుకునే వారు భీష్ముడు చెప్పిన నేతల ముఖ్య లక్షణాలు పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
నేతలకు 36 లక్షణాలుండాలని భీష్ముడు చెప్పాడు. కనుక నాయత్వ లక్షణాలు కావాలనుకుంటున్నవారు ఈ క్రింది శ్లోకాలు ప్రతి దినం పారాయణ చేసి ఆచరణలో పొందాలి.
భీష్మ ఉవాచ।
అయం గుణానాం షట్త్రింశత్షట్త్రింశద్గుణసంయుతః।
యాన్గుణాంస్తు గుణోపేతః కుర్వన్గుణమవాప్నుయాత్॥
చరేద్ధర్మానకటుకః ముంచేత్స్నేహం న చాస్తికః।
అనృశంసశ్చరేదర్థం చరేత్కామమనుద్ధతః॥
ప్రియం బ్రూయాదకృపణః శూరః స్యాదవికత్థనః।
దాతా నాపాత్రవర్షీ స్యాత్ప్రగల్భః స్యాదనిష్ఠురః॥
సందధీత న చానార్యైర్విగృహ్ణీయాచ్చ బంధుభిః।
నాభక్తం చారయేచ్చారం కుర్యాత్కార్యమపీడయా॥
అర్థం బ్రూయాన్న చాసత్సు గుణాన్బ్రూయాన్న చాత్మనః।
ఆదద్యాన్న చ సాధుభ్యో నాసత్పురుషమాశ్రయేత్॥
నాపరీక్ష్య నయేద్దండం న చ మంత్రం ప్రకాశయేత్।
విసృజేన్న చ లుబ్ధేభ్యో విశ్వసేన్నాపకారిషు॥
అనీర్షుర్గుప్తదారః స్యాచ్చోక్షః స్యాదఘృణీ నృపః।
స్త్రియః సేవేత నాత్యర్థం మృష్టం భుంజీత నాహితం॥
అస్తబ్ధః పూజయన్మాన్యాన్గురూన్సేవేదమాయయా।
అర్చేద్దేవానదంభేన శ్రియమిచ్ఛేదకుత్సితాం॥
సేవేత ప్రణయం హిత్వా దక్షః స్యాన్న త్వకాలవిత్।
సాంత్వయేన్న చ మోక్షాయ అనుగృహ్ణన్న చాక్షిపేత్॥
ప్రహరేన్న త్వవిజ్ఞాయ హత్వా శత్రూన్న శోచయేత్।
క్రోథం కుర్యాన్న చాకస్మాన్మృదుః స్యాన్నాపకారిషు॥
ఏవం చరస్వ రాజ్యస్థో యది శ్రేయ ఇహేచ్ఛసి।
అతోఽన్యథా నరపతిర్భయమృచ్ఛత్యనుత్తమం॥
ఇతి సర్వాన్గుణానేతాన్యథోక్తాన్యోఽనువర్తతే।
అనుభూయేహ భద్రాణి ప్రేత్య స్వర్గే మహీయతే॥
ఈ 12 శ్లోకాల్లో అధికారం కావాల్సిన వారు ప్రయత్నించి పొందాల్సిన నాయకత్వలక్షణాలు భీష్ముడు చెప్పాడు. అవి ఇవి.
1) తాను చేయాల్సిన ధర్మాలు రాగద్వేషాలు, కటుత్వం లేకుండా నిర్వర్తించాలి.
నాయకత్వం కావాలనుకునే వారు ముందుగా తాను ఏంచేయాలి? ఏంచేయకూడదు? తన బాధ్యతలు ఏమిటి? తన హక్కులు ఏమిటో తెలుసుకోవాలి. ఇవి ముందుగా తెలుసుకుంటేనే తాను ఏంచేస్తున్నాడు అనేదానిపై మార్గదర్శకత్వం ఏర్పడుతుంది. ఈ విధమైన దృక్పథం ఏర్పడ్డాక తన విధులు రాగద్వేషాలకు అతీతంగా చేయగలుగుతాడు. విధులు, బాధ్యతలు అని చెప్పినా వీటిని ఇతరులకు చేదుగా, భరించలేనిదిగా ప్రవర్తించకూడదు.
2) దైవభక్తి కలిగి ఉండి, అందరితో స్నేహభావం విడవకూడదు.
దైవభక్తి లేని వాడు రాజ్యార్హుడు కాడు. అటువంటి వాడికి ఏ శక్తులూ సహకరించవు. అవి దైవశక్తులు కావచ్చు. లేదా భౌతిక శక్తులైన పంచభూతాలు కావచ్చు. తనను పుట్టించిన పితృదేవతలనైనా విశ్వసించని వాడు ఎందుకూ కొరగానివాడు. కనుక అటువంటి వాడిని ఎవరూ నేతగా అంగీకరించలేరు. అలాగే ఇతరులతో ఇతరప్రార్థనారీతుల వారితో స్నేహభావంతో ఉండాలి.
3)క్రూరత్వం లేకుండా ధనాన్ని ఆర్జించాలి.
నేడు చాలా మంది నేతలుగా పతనం కావడానికి ఈ లక్షణం లేకపోవడమే ప్రధాన కారణం.
4) ధర్మాన్ని విడవకుండా విషయోపభోగాలు అనుభవించాలి.
రాజుగా ఉన్నవాడు అర్థ కామాలకు దూరంగా ఉండాలా అనేది ప్రధాన ప్రశ్న. ధర్మబద్ధమైన కామం, ధర్మబ్ధమైన అర్ధం అనుభవించవచ్చు. అంటే తనకు రాజ్యసంప్రదాయాల ప్రకారం వచ్చిన భోగాలు అనుభవించవచ్చు. అంతేకానీ, పదవిని భోగాల కోసం దుర్వినియోగం చేయడం పతనాన్ని చేకూరుస్తుంది.
5) దీనత్వం కలిగించని ప్రియాన్నే పలకాలి.
ఇతరులతో ప్రియమైన మాటలు పలుకడం మాత్రమే కాక, వారిలో ధీరత్వం కలిగించే మాటలు కూడా పలుకాలి. అంటే వారిని నైరాశ్యం, నిస్పృహల్లోకి నెట్టేవి కాకుండా కార్యోన్ముఖులను చేసే ప్రియమైన మాటలు పలుకాలి.
6) పనులు చేయగలిగిన శూరత్వం కలిగి ఉండీ అనవసరంగా వ్యర్థమైన ఆత్మస్తుతి మాటలు పగల్భాలు పలుకకూడదు.
చేసి చూపించడమే. రెచ్చగొట్టినా అనవసరంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు.
7) దానం చేయాలి. కానీ అపాత్రులకు దానం చేయరాదు.
అపాత్రులకు చేసే దానం ప్రాణాల మీదకు తెస్తుంది.
8) నిష్ఠూరంగా ప్రవర్తించకూడదు.
ఇతరులపై నిందలూ నిష్ఠూరాలు వేసే మాటలు పలుకకూడదు. అటువంటి ఆలోచనలు చేయకూడదు. అటువంటి పనులు చేయకూడదు.
9)కలియకూడని వారిని కలవకూడదు.
ఎవరిని కలవాలి? ఎవరిని కలువ కూడదు అనేదానికి ఇది మరొక సూత్రం. రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. కనుక మిత్రత్వం ఉంది కనుక వారి శత్రువులందనీ తనకు శత్రువులుగా చేసుకోవల్సిన అవసరం లేదు. అలాగే మనకు ముఖ్యమైన వారితో శత్రుత్వం పెట్టుకొంటున్నవారిని ఉపేక్షించాలి. దూరంగా పెట్టాలి.
10) బంధువులను దూరం చేసుకోకూడదు.
బంధువులు జ్ఞాతుల్లో ఎన్ని దుర్లక్షణాలున్నా వారిని దూరం పెట్టుకోకూడదు. అలాగని వారిని నమ్మనూ కూడదు. మెడలో పామును పెట్టుకున్న వాడిలా ఎల్లప్పుడూ అప్రత్తతతో ఉండాలి.
11) తనపై విశ్వాసం లేని వారిని గూఢచర్యానికి ఉపయోగించరాదు. వారి మాటలు విశ్వసించరాదు.
ఎంత చిన్న నాయకత్వమైనా గూఢచారుల అవసరం ఉంటూనే ఉంటుంది. వీరు ఇచ్చే సమాచారాల మేరకే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత కీలకమైన స్థానంలో తనపై విశ్వాసం లేని వారిని ఉంచుకుంటే, వారు తప్పుడు సమాచారాలు చెప్పి నేతలను నాశనం చేస్తారు.
12) ఇతరులను పీడంచకుండా పనులు చేయించగలనేర్పరి అవ్వాలి.
13) దుష్టులు అని తెలిసిన వారికి తాను చేయబోయే మంచిపనుల గురించి చెప్పకూడదు.
14)తన లోని మంచి గుణాలు తాను చెప్పుకోకూడదు.
15) సజ్జనుల నుంచీ ధనాన్ని లాక్కోకూడదు.
16) నీచులు అని తెలిసి వారిని ఆశ్రయించకూడదు.
17) అపరాధులకు శిక్షను ఆధారరహితంగా విధించకూడదు.
18) మంత్రులతో చర్చించిన రహస్య విషయాలు బయటపెట్టరాదు.
19) పిసినారులకు ధనాన్ని ఇవ్వరాదు.
లోభులకు ధనం వెళితే అది పెట్టిపూజకే పరిమితం అవుతుంది. ధనాన్ని స్వేచ్ఛగా ఉండనిస్తే అది తిరిగే కొద్దీ ధనాన్ని సృష్టిస్తుంది. కనుకనే ధనమే ధనాన్ని సృష్టిస్తుంది అంటారు.
20) అపకారం చేసేవారిని ఎప్పుడూ విశ్వసించకు.
21) భార్యను సంరక్షించుకోవాలి.
కొంత మంది నేతలు తమ భార్యలు చేసిన అవినీతి వల్ల మసకబారిపోయారు. కనుక ప్రలోభాలకు గురికాకుండా అంతఃపురాలను సంరక్షించుకోవాలి.
22) మనస్సు పరమస్వచ్ఛంగా ఉండాలి. కానీ కరిగిపోయేది కాకూడదు.
23) ఆడవారిని అధికంగా చేరదీయ కూడదు. అలాగని దూరం ఉంచకూడదు.
24) రుచికరమైనదే తినాలి, కానీ ఆరోగ్యాన్ని నాశనం చేసేవాటికి దూరంగా ఉండాలి.
25) పూజ్యులైనవారిని సదా వినయంతో పూజించాలి.
దీని తరువాత లక్షణం కూడా దీనికి చెందినదే.
26) గురువులను కపటం లేకుండా పూజించాలి.
చాలా మంది రాజకీయ నేతలు ఈ రెండూ పాటిస్తారు. పూజ్యులను పూజించడం, గురువులను, స్వామీజీలను సేవించడం చేయమని భీష్ముడే చెప్పాడు. అలా పూజించినందువల్ల వారి భక్తుల ఓట్లన్నీ వస్తాయి. ఇది రాజకీయం. వారికి సమస్కరించడం వలన రాజ్యాధికారపుణ్యం కూడా వస్తుంది. ఇది ఆధ్యాత్మికం. కనుకనే భీష్ముడు వీరిని సేవించమని పనిగట్టుకొని 25, 26ల్లో చెప్పాడు. అయితే సనాతన ధర్మ ప్రచారం చేసే వారిని నమ్మడం ఉత్తమ మార్గం. అయితే ఎవరిని విశ్వసించాలనేది ఎవరికి వారు జాగరూకతతో తెలుసుకోవాల్సిన అంశం. లేదంటే గతంలో అనేక మంది దుష్టమతాధికారుల వల్ల రాజ్యాలే నాశనం అయ్యాయి.
27) దంభము లేకుండా దైవాన్ని అర్చించాలి.
ఇది చాలా ముఖ్యమైంది. తాను ఎంత మహారాజైనా తన హంగు హోషు (గర్వం) భగవంతుని ముందు ప్రదర్శించకూడదు. అక్కడ సామాన్య భక్తుని మాదిరిగానే ఉండాలి. తాను దర్శించడం భగవంతుడికి పబ్లిసిటీ కలిగిస్తుందనే భావంతో వెళ్ళేవాడు పతనమవుతాడు. భక్తి లేకుండా రాజకీయకారణాలతో ఫోటోల కోసం వెళ్ళకూడదు. ఇది నేడు ఎన్నికల తరుణంలో చూస్తున్నాము. ఇతర మతాల ఓట్ల కోసం పడే పాట్లు మనకు కొత్త కాదు. ఇది గమనించే భీష్ముడు కొన్ని వేల ఏళ్ళనాడే చెప్పాడు. ఇటువంటి వారిని పగటి వేషగాళ్ళని తీసిపారేయాలి.
28) కుయుక్తులు, దుష్టకార్యాలతో సంపాదించిన సొమ్ము పామువంటిది.
29) తాను ఎవరిని సేవించినా ప్రేమతో సేవించాలి. రాజకీయ లబ్ధితో చేయకూడదు. ప్రేమ లేని సేవ ఫలించదు.
30) సమయాసమయాలు తెలుసుకొని కార్యాలు చేయాలి.
అన్ని సమయాలు అనుకులమైనవి కావు. అలాగే సరైన సమయంలో చేసే పనే సానుకూలమవుతుంది. గ్రీష్మ ఎండల్లో నారుమడి వేస్తే, మిత్రుడైన నీరు వేడెక్కి నారు మాడిపోతుంది.
31)ప్రతికూలమైన వారిని కూడా బుజ్జగించగలిగిన శక్తి ఉండాలి.
విముఖులను వదిలేస్తే చిన్న నిప్పు కణిక దావానలంగా మారి మహారణ్యాన్ని తగులబెట్టినట్టు మొత్తానికే మోసం వస్తుంది. కనుక అవసరమైతే శ్రీకృష్ణుడు మాదిరి కాళ్ళుపట్టుకోవాలి.
32) ఇచ్చేటప్పుడు ఆక్షేపించరాదు అనేది చాలా ముఖ్యంగా చెప్పాడు.
ఏదో నేను గాక ఇస్తున్నాను. నీ అంత పనికిమాలినవాడు మరొకడు లేడు... అంటూ ఇవ్వడం వలన ఇచ్చిన ఫలం దక్కదూ, అనిపించుకున్నవాడు శత్రువుగా బలపడతాడు. కనుక ఇచ్చేటప్పుడు ప్రేమ మాటలు చెబుతూనే ఇవ్వాలి.
33) తాను ఎందుకు శిక్షిస్తున్నాడో సర్వం తెలిసే శిక్షించాలి.
34) శత్రువును చంపినా వారి బంధువులను ఓదార్చాలి.
35) ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో తెలియని వారు నేతను చూసి భయపడతారు. కనుక ఆకస్మిక కోపాలు నిగ్రహించుకోవాలి.
36) ఒకడు పాము అని తెలిసిన తరువాత ఉపేక్షంచకూడదు. కఠినమైన నిర్ణయాలే తీసుకోవాలి.
నేతలకు ఉండాల్సిన ఈ 36 పాలకలక్షణాలు చెప్పి ఇవి ఉన్న నేత సుఖపడతాడని ఇవి లేకపోతే అనుక్షణం భయంతో ఉంటాడని కూడా హెచ్చరించాడు. వీటిని పుణికి పుచ్చుకుంటే ఇహంలో రాజ్య లాభం పరంలో స్వర్గం కూడా కలుగుతాయని భీష్ముడు హామీ ఇచ్చాడు.
నేడు రాజకీయాల్లోకి రావాలనుకునేవారు, ఉద్యోగవ్యాపారాల్లో నాయకత్వలక్షణాలు కావాలనుకునే యువత ఈ 36 లక్షణాలు అలవరచుకోవాలి.
Comments
Post a Comment