💐నవరాత్రులు - శ్రీ దుర్గాదేవి💐

💐నవరాత్రులు - శ్రీ దుర్గాదేవి💐
ఎనిమిదవరోజు ఇంద్రకీలాద్రిపై వెలసిన ఆ కనకదుర్గను ఆశ్వయుజ శుక్ల పక్ష అష్టమి తిథి రోజు  శ్రీ దుర్గాదేవిగా అలంకరించి  ఆ తల్లి కృపకు పాత్రులం అవుతాము.

ఆశ్వయుజమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు ఆ తల్లిని దుర్గాదేవిగా ఆరాధన చేస్తాము. నిజానికి అమ్మవారి ఆరాధన అన్ని తిథులలో కూడా శ్రేష్టమైన ఫలితాలనే అందిస్తుంది. కాని, కొన్ని తిధులు ద్విగుణీకృత ఫలితాలను అందిస్తాయి. ఆ తిధులు ప్రతి మాసంలో వచ్చే అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య. ఈ తిథులలో అమ్మవారిని ఆరాధన చేసి చక్కటి ఫలితాలను పొందినవారు ఉన్నారు.

మేనకాదేవి అష్టమి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి నవమి నాడు సువాసిని పూజ త్రికరణశుద్ధిగా చేసింది. కాబట్టే ఆ ఇంట పార్వతీదేవి ఉద్భవించింది. ఇలా మోక్షాన్ని పొందినవారు ఎంతో మంది ఉన్నారు. మరి ఈ తల్లి ఆరాధనే ప్రత్యేకంగా చేసే ఈ కాలంలో మరి అష్టమి రోజు అమ్మవారి పూజ...అది కూడా దుర్గాదేవిగా ఆరాధన మనము చేసుకుంటే విశేష ఫలితాలను పొందుతాము.

దుర్గ అని పేరు కలిగిన అమ్మవారి ఆరాధన ప్రకృతి అంతటికి ఉపశాంతి కల్పిస్తుంది. జన నష్టం జరగకుండా, చతుష్పాదులైన ప్రాణులకు నష్టం కలగకుండా లోకాన్ని సుభిక్షంగా ఉంచగలిగిన శక్తిని అనుగ్రహించగలిగిన పరదేవతా స్వరూపం దుర్గమ్మ. దుర్గ అన్న నామంలో 'ద' కారం చేత దైత్య అనగా రాక్షస ప్రవృత్తి నాశనము అవుతుంది. దుర్గా నామంలో ఉన్న 'ర' అన్న అక్షరాన్ని విచారించిన మాత్రంచేత ఇది అగ్ని బీజం కాబట్టి రోగ నాశనం చేస్తుంది. దుర్గలో 'ఉ' కారం చేత విఘ్న నాశనం 'గ' అక్షరం పాపనాశనం చేస్తుంది.

ఈ దుర్గాష్టమికి గొప్పదైన విషయం ఒకటి దాగుకుని ఉంది. ఈ దుర్గాష్టమి రోజు అర్దరాత్రి పూట భద్రకాళీదేవి ఆవిర్భవించింది అని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి. దుర్గానామము మహా మంత్రము. దుర్గానామాన్ని మనం నిరంతరం పఠించినంత మాత్రం చేత ఆ నామం వల్ల అది మనలో ఉన్నటువంటి భయాలను పోగొడుతుంది. నిజానికి అజ్ఞానానికి, భయానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ నామం పలికినంత మాత్రం చేత మన అజ్ఞానంతో కూడుకుని ఉన్న భయం తొలగిపోతుంది.

దుర్గ అనగా దుఃఖాన్ని బాధలను మన దరి చేరనీయక పోవడమే కాక దుష్టులను కూడా ఆ తల్లి తన వైపుకు రానియ్యదు. ఈ దుర్గ అన్నటువంటి నామాన్ని పట్టుకున్నంత మాత్రం చేత మనలను ఆ తల్లి సంసారము అనే ఈ సాగరం నుంచి అనగా కష్టాల కడలి నుండి దాటించగలదు.

ఈ తల్లి క్షేమ స్వరూపిణి, ఆశ్రయ స్వరూపిణి. తనని నమ్ముకుని పిలిచినవారికి ఈ తల్లి క్షేమ స్వరూపిణి అయి రక్షణ కల్పిస్తుంది. ఒకానొక సమయంలో కృష్ణ భగవానుడి మనవడు అయిన అనిరుద్ధుడు రాక్షసుల చేత నాగపాశంతో బంధింపబడ్డాడు. ఏమి చెయ్యాలో తోచని స్థితిలో అనిరుద్ధుడు ఉండగా అప్పుడు, కృష్ణ పరమాత్మ వచ్చి దుర్గ యొక్క ఎనిమిది నామాలను నీవు పఠించు. నీకు మేలు జరుగుతుంది అని వెళ్ళిపోయాడు. ఆ నామాలను పఠించి అనిరుద్ధుడు బంధ విముక్తుడైనాడు. వెనువెంటనే కృష్ణపరమాత్మ వచ్చి అతనిని రక్షించాడు. ఈ తల్లి దేవతలందరికీ మాట ఇచ్చింది. నేను మిమ్ములను రాక్షసుల బారినుండి రక్షిస్తానని ... ఇప్పటికీ అలా రక్షిస్తూనే ఉంది. ఆ తల్లి చేసేటటువంటి రాక్షస సంహారం అనుసరించి ఆ తల్లి చేతుల్లో ఆయుధాలు ఉంటాయి.

మనము కూడా ఆ దుర్గాదేవి ఆరాధన చేసి మన మనసులో ఉన్న దురితాలను పోగొట్టుకుని ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులమవుదాం.
నైవేద్యం: కదంబం
'అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే'

సర్వేజనా సుఖినోభవంతు

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

KAPU SURNAME AND GOTRALU:

శ్రీ లలిత దేవి చరిత్ర Part-12