మహిషాసురమర్దినిగా
మహిషాసురమర్దినిగా
మహిషాసురమర్దినిగా అమ్మవారు వచ్చిన స్వరూపం చాలా అద్భుతమైన కథ అది. అసలు మహిషాసుర ఆ శబ్దమే చాలా చిత్రమైనది.
దున్నపోతు రాక్షసుడు వీడు. దున్నపోతు అంటేనే కరడుగట్టినటువంటి జడత్వమది. అందుకు రజోగుణ తమోగుణాలయొక్క కరడుగట్టిన తనమే మహిషాసురుడు అని చెప్పబడుతున్నది. ఆ దున్నపోతు రాక్షసుడిని సంహరించడానికి ఆ తల్లి అవిర్భవించింది. ఆ ఆవిర్భవించిన కథ కూడా చాలా విశేషమైనది. దేవతలు, ఋషులు అందరూ కూడా ఈ అసుర బాధలు చూసి భరించలేక బ్రహ్మవిష్ణుమహేశ్వరుల వద్దకు వెళ్ళి ప్రార్థన చేశారట. బ్రహ్మవిష్ణుమహదేవులు ముగ్గురినీ మహాదేవులు అంటారు. ఎందుకంటే దేవతలకు కూడా వాళ్ళే శాసకులు. ఏ కష్టమొచ్చినా వాళ్ళతోనే చెప్పుకుంటారు. అప్పుడు వెంటనే ఆరాక్షసుడి పట్ల ధర్మబద్ధమైన ఆగ్రహం కలిగిందిట పరమేశ్వరుడికి. ఎందుకంటే అధర్మం ఎవడు చేస్తాడో వాడిపట్ల భగవంతుడికి ఆగ్రహం వస్తుంది. ఆ ఆగ్రహమే లోకాన్ని రక్షిస్తుంది. ఎందుకంటే అధర్మంపై ఆగ్రహం రాకపోతే ధర్మానికి రక్ష ఎవరు? అందుకు అధర్మంపై ఆగ్రహం రావడం సాత్త్వికులయొక్క లక్షణం, మహాత్ముల యొక్క లక్షణం, రక్షకులయొక్క లక్షణం. అందుకు జగద్రక్షకుడైన పరమేశ్వరుడు అధర్మం పట్ల ఆగ్రహం కలగగానే కనుబొమలు ముడివేశాడట. ఆయన కనుబొమల ముడిలోనుంచి ఒక మహాతేజస్సు ఎదురుగా ఆవిర్భవించింది. ఇక్కడ మనం గమనించవలసిన మరొక విశేషమేమిటంటే కోపం వల్ల శక్తి బయటికి వస్తుంది. మన ఇంద్రియాలలో కూడా ఎంత శక్తి ఉంది తెలియాలంటే కోపం వచ్చినప్పుడు బయటపడుతుంది. అవతలి వాడిని కొట్టేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. కోపంతో ఉన్నప్పుడు ఉన్న శక్తి అంతా బయటికి వస్తుంది. అలా శివుని ఆగ్రహం చేత ఆయన కనుబొమల ముడిలోంచి చండమైన శక్తి వచ్చింది. భరించలేనటువంటి శక్తి. ఆ శక్తిని ఎప్పుడైతే చూశాడో విష్ణువు ఆయనకి కూడా ఆగ్రహం కలిగిందిట అధర్మం మీద. ఎందుకంటే బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఏక హృదయులు. ఒకే ఈశ్వరుడు మూడు రూపాలు ధరించాడు కనుక ముగ్గురికీ ఒకే రకమైన భావం కలిగింది. విష్ణువుకి కూడా ఆగ్రహం కలిగితే ఆయననుంచి కూడా వెలుపలికి తేజస్సు వచ్చి అంతకుముందు ఉన్నటువంటి ఆ శివ తేజస్సుతో కలిసిందిట. అదేవిధంగా బ్రహ్మయొక్క ఆగ్రహం కూడా వెలికి వచ్చింది.. అది కూడా అక్కడ కలిసింది. మొత్తం ముగ్గురియొక్క ఆగ్రహం వల్ల ముగ్గురినుంచి శక్తి బయటికి వచ్చింది. అంటే ఏ శక్తియైతే శివునియందు, బ్రహ్మయందు, విష్ణువునందు ఉన్నదో అది ఇప్పుడు లోకరక్షణ కోసం ధర్మపు ఆగ్రహం నుంచి వెలికి వచ్చింది. ఆ వచ్చినది బ్రహ్మవిష్ణుశివాత్మకమైన తేజస్సు. ఆ తేజస్సును ఎప్పుడైతే దేవతలందరూ చూశారో వాళ్ళకి దానిలోంచి ఒక సందేశం లభించింది. మీలో ఉన్న శక్తిని కూడా ఇలా బయట పెట్టండి అని. వెంటనే ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు, బృహస్పతి, కుబేరుడు ఇత్యాది దేవతలందరూ వారినుంచి వారి శక్తిని వెలికి తీసుకువచ్చారుట. అంటే ఇంద్రుడిలో ఇంద్రరూపంలో పరిమితమైన శక్తి, వరుణుడిలో వరుణ రూపంతో పరిమితమైన శక్తి అవన్నీ ఇప్పుడు బయటికి వచ్చాయి. ప్రతివారిలో పరిమితంగా పరిమితంగా శక్తి ఉంటుంది. అందరి శక్తి కలిపితే సమూహ శక్తి ఒకటి ఆవిర్భవిస్తుంది. Collective force అని అంటారిక్కడ. సమూహ శక్తికి చాలా బలమెక్కువ ఇక్కడ. ప్రతిదేవతలో ఉన్న శక్తీ ఆ పరాశక్తి ఇచ్చినటువంటిదే. అది కిరణాలలాగా ఒక్కొక్క దేవతలోనూ ఉన్నది. ఇంద్రుడిలో ఇంద్రత్వం, అగ్నిలో అగ్నిత్వం, వరుణుడిలో వరుణత్వం, - ఇప్పుడు అవన్నీ వెలికి వచ్చి ఒకటిగా అయిపోయినాయి. అంటే కలిసినటువంటి మహాతేజస్సు సర్వదేవతల నుంచి వచ్చిన శక్తియొక్క సమూహ స్వరూపం అన్నమాట.
అన్యేషాం చైవ దేవానాం శక్రాదీనాం శరీరతః!
నిర్గతం సుమహఃతేజః తచ్చైక్యం సమగచ్ఛతః!!
సర్వదేవతలనుంచి వచ్చినటువంటి మహాతేజస్సు ఏకరూపంతో కనపడింది. ఈ భావనే చాలా రమ్యమైనటువంటి భావము. ఎందుకంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అన్ని శక్తులూ కలబోసి ఏర్పడిన ఒక మహాశక్తి ఇది. అంటె ఈ మహాశక్తి ప్రతి దేవతనుంచి శక్తిని తెచ్చుకు వచ్చిందా? ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే వాళ్ళ నుంచి తెచ్చుకున్న రూపం కాదు. వాళ్ళకు శక్తినిచ్చిన పరాశక్తి ఆవిడ. వాళ్ళనుంచి వెలికి వచ్చింది అంటే అంతకుముందు వాళ్ళల్లో ప్రవేశించింది ఆ తల్లి. ఇప్పుడు లోకరక్షణ కోసం వాళ్ళనుంచి వెలికి వచ్చింది. సర్వదేవతలకీ మూలమైనది, సర్వదేవతాత్మకమైనది. ఎప్పుడైనా సరే దుర్గమ్మ రూపాన్ని స్మరిస్తే చాలు మనకు స్ఫురించిన వలసిన భావం ఏమిటంటే సర్వదేవతాత్మిక అని. అందుకు ఒక్కసారి దుర్గను ఆశ్రయిస్తే మరింకే దేవతను పట్టుకోవలసిన అవసరం లేదు. సర్వదేవతల శక్తి ఆ తల్లిదే. అంతవరకు దేవతలలో ఉండి ఆడించింది ఆ తల్లే, ఇప్పుడు దేవతలలోనుంచి వెలికి వచ్చి వాళ్ళను అనుగ్రహించబోతున్నదీ ఆ తల్లే. ఆ ఏర్పడ్డ రూపం ఎలా ఉన్నది అంటే
అతీవ తేజసః కూటం జ్వలంతమివ పర్వతమ్!
దదృశుస్తే సురాస్తత్ర జ్వాలా వ్యాప్తదిగంతరమ్!!
జ్వలిస్తున్న పర్వతమా అన్నట్లుందిట మహాతేజస్సు. ఆ జ్వాలలయొక్క కాంతులతో దిక్కులన్నీ ప్రకాశమానమైపోతున్నాయి.
అతులం తత్ర తత్తేజః సర్వదేవ శరీరజమ్!
ఏకస్థం తదభూన్నారీ వ్యాప్తలోకత్రయం త్విషా!!
ఆ తల్లి క్రమంగా ఆ తేజస్సు ఒక స్త్రీ రూపం ధరించి కనపడింది. అంతవరకు కాంతిపుంజంగా ఉన్నటువంటి స్వరూపము ఇప్పుడు అద్భుతమైన స్త్రీమూర్తిగా ఆవిర్భవించిందిట. ఆవిర్భవించిన ఆ స్త్రీమూర్తియొక్క కాంతులు ముల్లోకాలనూ ఆక్రమించుకున్నాయి. వ్యాప్తలోకత్రయం త్విషా – ఈమాట దేవీమహాత్మ్యం చాలా అద్భుతంగా చెప్తున్నది. అమ్మ వెలుగులు ముల్లోకాలనూ ఆక్రమించుకున్నాయి అంటే అర్థం ముల్లోకాలలో వెలుగులన్నీ అమ్మవే అని చెప్పడం. ప్రతి చైతన్యం ఆమె స్వరూపమే
Comments
Post a Comment