మంత్రం_ఫలించాలంటే_ఈ_మూడు_తప్పనిసరి

#మంత్రం_ఫలించాలంటే_ఈ_మూడు_తప్పనిసరి..

ఏదైనా విషయాన్ని విన్నప్పుడు, విషయం మీద ఇది వాస్తవం అని నమ్మకం ఉండాలి, దానికి ముందు ఆ విషయం చెప్పిన వ్యక్తి మీద విశ్వాసం ఉండాలి. తర్వాత ఆ విషయం ప్రతిపాదించే అంశం పై విశ్వాసం ఉండాలి. అంటే వాక్యం, వాక్య తాత్పర్యం, ఆ వాక్యాన్ని పలికిన వ్యక్తిపై ఆదరం ఉన్నట్టయితే ఆ వాక్యం సరియైన అర్థాన్ని గోచరింపజేస్తున్నట్టు. పెద్దలు ఉపదేశం చేసే మంత్రం తత్ సిద్ధిని అందించాలి..... అంటే మూడింటియందు తప్పని సరిగా విశ్వాసం ఉండి తీరాలి అని శాస్త్రం చెబుతుంది.

*మంత్రే తత్* *దేవతాయాంచ తదా* *మంత్రప్రదే గురౌ |*
*త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం ||*

మంత్రం యందు భక్తి కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు విశ్వాసం కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత అంటే మంత్రం వల్ల తెలిసే వ్యక్తి లేక మంత్రం యొక్క తాత్పర్యము అని అర్థం. క్షీరము అంటే పాలు అని అర్థం కాదు, అది అనువాదం అని అంటారు. తెల్లటి పుష్టి కలిగించే ద్రవాహారం, దానికి పాలు అని పేరు. అంటే క్షీరం అనే శబ్దం ఒక వస్తువును సూచిస్తుంది. ఆ వస్తువు దాని అర్థం అవుతుంది. అట్లా మంత్రం అనగానే ఆయా మంత్రంలోని పదాల అర్థం అని కాదు, ఆ మంత్రం ప్రతిపాదించే దేవతా విశేషం ఏదో ఆ మంత్రానికి అర్థం అవుతుంది. ఆ దేవతా విశేషాన్ని కనిపించేటట్టుగా స్పష్టం అయితే అప్పుడు మంత్ర అర్థం తెలిసినట్లు. అంతే కాని మంత్రంలో పదాల అర్థం మాత్రమే తెలుసు అని అంటే మంత్ర తాత్పర్యం తెలియదు అనే లెక్క. మంత్రం గోచరించాలి అంటే మంత్రాన్ని వినవల్సిన క్రమంలో విని, అనుసంధించే క్రమంలో అనుసంధిస్తేనే ఫలిస్తుంది. మంత్రం పై విశ్వాసం అంటే ఆ మంత్రం యొక్క నియమాలపై విశ్వాసం అని అర్థం. ఎవరో ఎవరికో చెబుతుంటే విని, పుస్తకం చూసి చేస్తే మంత్రం ఫలించదు. ఒక గురు ముఖతః శ్రవణం చేసినప్పుడు మాత్రమే ఫలిస్తుంది. ఇది మంత్రానికి నియమం.

మంత్రాలు రెండు రకాలు అవి 1. స్వరం కల్గినవి, 2. స్వరం లేనివి.

 విష్ణు సహస్ర నామాలలో ఉన్నవి, ఎన్నో మంత్రాలు. ఒక్కోటి ఒక్కో ఋషి దర్శించినవి. ఇవన్నీ స్వరం లేనివి.... కానీ మననం చేస్తే కాపాడేవి, అందుకే అవి మంత్రాలు. గాయత్రి మంత్రం లాంటివి స్వరం కల్గినవి. ఈ మంత్రాన్ని విశ్వామిత్రుడు అనే మహర్షి దర్షించాడు. దాన్ని తర్వాతి వారికి అందించాడు.

విశ్వామిత్రుడు ఆ మంత్రాన్ని ఒక స్వరంతో ఉపాసించాడు. అట్లా స్వరం కల మంత్రాలకి ఒక్కో వేదంలో ఒక్కో స్వరం ఉంటుంది. కానీ ఈ మద్య కాలంలో గాయత్రి మంత్రానికి తోచిన స్వరాలు కల్పిస్తున్నారు. స్వరం మార్చి చదవడం తప్పు. అట్లా చేయడం ఆ మంత్రార్థమైన దేవతని హింసించినట్లు అవుతుంది. అపౌరుషేయం అయిన వేద రాశికి స్వరం మారిస్తే అది శుభం కాదు. విశ్వామిత్రుడు కూడా ఆ మంత్రాన్ని తయారు చేయలేదు. దాన్ని దర్శించి ఇచ్చాడు. మంత్రానికి స్వరమే ప్రాణం అని అంటారు. అట్లా మంత్రాలని పాటించడం అంటే దానికున్న స్వరంతోనే ఉపాసించాలి. మంత్రం యందు భక్తి అంటే ఇది.

ఈ మద్య కాలంలో గాయత్రి మంత్రం అనగానే ఒక స్త్రీరూపం వేస్తున్నారు. కానీ ఆ మంత్రానికి తాత్పర్యం ఎవరు అనేది ఆ మంత్ర ద్రష్టని అడగాలి. ఆయన చేసిన గాయత్రి మంత్ర ప్రభావంచే ఆయన రాముడినే శిష్యుడిగా పొందాడు. ఇది తాను చేసిన మంత్ర మహిమ. ఆ మంత్రానికి తాత్పర్యం రాముడు అని గుర్తించాడు, తత్ ఫలితంగా శ్రీరామచంద్రుడిని సీతమ్మతో చేర్చి తాని ఆర్జించిన తపో శక్తి స్వామి పాదాలయందు అర్పించాడు. ఇది ఫలితం అని అనుకున్నాడు. అందుకే సీతా రామ కళ్యాణం అయ్యాక ఆయన చరిత్రలో ఎక్కడ కనిపించడు, కారణం ఆ మంత్రానికి తాత్పర్యాన్ని పొంది సిద్ధుడు అయ్యాడు. గాయత్రి మంత్రానికి తాత్పర్యం సూర్య మండలానికి మధ్య ఉండే దివ్యమైన సౌందర్య రాశి ఒక పురుష స్వరూపం అని తెలుస్తుంది. దాని తాత్పర్యాన్ని సూచిస్తూ ఒక శ్లోకం చెబుతుంటారు.

*ధ్యేయః సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణః సరసిజాసనః సన్నివిష్టః* 

*కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః భృత శంఖ చక్రః*

సూర్యగోళపు మధ్యన ఉండే, విశాలమైన నేత్రాలు కల్గిన, చేతనాచేతనముల లోన, బయట ఉండి నడిపే ధివ్యమంగళ విగ్రహానికి నమస్కరిస్తున్నా అని అర్థం. గాయత్రి మంత్ర అర్థాన్ని ఇలా చెబుతారు. ఇది ఉపనిషత్తులు చెప్పినదాన్నే శ్లోకంగా ఎవరో అందించారు. చాందోగ్యం అనే ఉపనిషత్తు సూర్య మండలానికి మధ్యన ఎవరు ఉన్నారు అని ప్రశ్నవేసుకొని సమాధానంగా "యయేశో అంతరాదిత్యే హిరణ్మయ పురుషః" అని అంటుంది. సూర్యగోళపు మధ్యన ఉండే ఆయన, పాదాలనుండి కేశాల వరకు ప్రకాశవంతమైఅన రూపం కల పురుషుడు అని చెబుతుంది. గాయత్రి మంత్ర అర్థం సూర్యమండలం మధ్యలో ఉండి తేజస్సుకు కారణమేదో అది నాలో ఉండే బుద్దిని కూడా ప్రేరేపించి నన్నూ మంచి మార్గంలో నడుపుగాక. అది పురుషుడిని చెబుతుంది కనక 'యహ' అని ఆ మంత్రంలో ఉంటుంది. స్త్రీ రూపం దాని అర్థం కాదు అనేది గుర్తించాలి. అది జగత్ కారణమైన తత్వాన్ని తెలిపేది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు.

*యదాదిత్య గతం తేజః* *జగత్ భాసయతేఖిలం* 
*యద్ చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజోవిద్దిమామకం*

జగత్తుని రక్షించగల సూర్యుడి మధ్య ఉన్న తేజస్సు ఎదైతే ఉందో, ఆహ్లాదాన్నిచ్చే చంద్రుడిలో కాంతిలీడే తేజస్సు ఏదైతే ఉందో అది నాదే అని చెప్పాడు.

మంత్రంలో అదిష్టాన మూర్తి ఉండాలి, ఆయన అలౌకికమై ఉండాలి, జగత్ కారణమై ఉండాలి. అప్పుడు సాత్వికం అవుతుంది. లోకంలో ఎన్నో మంత్రాలు ఉండవచ్చు, కానీ ఏది స్వీకరించతగునో వాటినే స్వీకరించాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు విశ్వాసం అంటే ఇది.

దానికి తోడు మంత్రాన్ని ఒక గురువు ద్వారానే పొందాలి. ఈ మంత్రం వీడికి ఫలించుగాక అని గురువు సంకల్పించి ఉపదేశం చేస్తాడు కనక ఆ సంకల్పానికి ఒక శక్తి విశేషం ఉంటుంది. అయితే గురువు ద్వారానే ఎందుకు పొందాలి అంటే ఈ కాలంలో ఎందరో వారికి తోచిన మంత్రాలని వాటికి స్వరాలను కల్పించి చలామని చేస్తున్నారు. అసలు ఏదో, నకిలీ ఏదో కూడా తెలియనంతగా స్థితిలో లోకం సాగుతోంది. ఈ నాడు ఎందరెందరికి గాయత్రి మంతాలు తయారయ్యాయో చూస్తే అర్థం అవుతుంది. అందుకే మంత్రం అనేది పొందాలి అంటే దాన్ని దర్శించినవాడై ఉండాలి. అది మనకు ఫలించాలి అనే వాత్సల్యంతో వారు అందించాలి.

అట్లా మంత్రం, మంత్రం తెలిపే దేవతా విశేషం, మంత్రాన్ని అందించే గురువు ఈ మూడు ఒక చోట చేరితే, ఈ మూడింటిపై విశ్వాసం ఉంటే అది మొదటి మెట్టు అవుతుంది, ఆ మంత్రం అనేది తప్పక ఫలిస్తుంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: