న్యూరాన్లకు స్వపరభేదం లేదు.

ప్రతి మనిషి జీవితంలోనూ బాలకాండకీ యుద్ధకాండకీ మధ్య అరణ్యకాండ కూడా ఒకటి ఉంటుంది. జీవితవేగం మందగించి మనిషి ఒక చెట్టు కింద కూచుని నేనేమిటి? ఇదంతా ఏమిటి? నాకేమి జరిగింది అని తనను తాను పరిశీలించుకునే సమయం కూడా ఒకటి ఉంటుంది. సరిగ్గా అప్పుడే కథలు అవసరమవుతాయి. మహాభారతాన్నే తీసుకోండి. ఆ వృక్షానికి ఆదిపర్వం మూలం, శాంతి పర్వం ఫలం అనుకుంటే, అరణ్యపర్వం ఆ చెట్టుకి కాండం లాంటిది. అరణ్యవాసం పొడుగుతా ధర్మరాజు ఎన్నో కథలు విన్నాడు. ఆ కథలే అతణ్ణి యుధిష్టిరుడిగా మార్చాయి. ఆ కథలవల్లనే అతడు కురుక్షేత్రానికి సంసిద్ధుడు కాగలిగాడు.

మన జీవితాల్లో కూడా ఇది కథలు చెప్పుకోవలసిన తరుణం. కొన్ని రోజుల పాటు మన ఆరాటాల్ని పక్కనపెట్టి మన లోకి మనం చూపు సారించుకోవలసిన సమయం.

~

నిన్న మనం కథ వెనక కథ గురించి చెప్పుకుంటూ, కేవలం సమాచారం మనలో ఉద్దీపన తీసుకురాదనీ, అది భావావేశంగా మారినప్పుడు మాత్రమే మనం చలిస్తామనీ చెప్పుకున్నాం.  

ఇలా ఒక మనిషి ఉద్దీపన చెందుతున్నప్పుడు ఆ మనిషిని చూస్తున్న మరొక మనిషి కూడా అటువంటి ఉద్దీపనకే లోనవుతున్నాడు. దానికి కారణం మనిషి మెదడులో ఉండే ‘మిర్రర్‌ న్యూరాన్లు’ అని న్యూరో సైంటిస్టులు చెప్తున్నారు. మిర్రర్‌ న్యూరాన్ల వల్ల ఒక మనిషి తనకు కలుగుతున్న బాధను గ్రహించడమే కాక, అదే పరిస్థితుల్లో ఎదుటి మనిషికి కలుగుతున్న బాధకి కూడా అంతే తీవ్రంగా స్పందించగలు గుతున్నాడు. 

న్యూరాన్లకు స్వపరభేదం లేదు. 

అందువల్ల ఒక మనిషి తాను  పొందే సంతోషాన్ని మొత్తం  తెగకీ, జాతికీ, తన చుట్టూ ఉండే మానవసమూహమంతటికీ కూడా అందించడానికి ఉత్సాహపడటమే ప్రాచీన కళాస్వభావం, కథాస్వభావం. అందుకనే, ప్రాచీనమానవుడి కళారహస్యానికి అత్యంత సమీపంగా ప్రయాణించగలిగిన ఆధునిక చిత్రకారుడు పికాసో  ‘అసత్యం ద్వారా సత్యాన్ని వెల్లడి  చేయడమే కళ’ అన్నాడు. 

ప్రాచీన గుహాలయాల్లో, స్పెయిన్‌ నుంచి ఆస్ట్రేలియా దాకా మానవుడు చిత్రించిన చిత్రలేఖనాల్లో ఈ కథనస్వభావాన్ని మనం గుర్తు పట్టవచ్చు. ఆ చిత్రలేఖనాల్లోని అడవి దున్నల కాళ్లు సన్నగా ఉంటాయి. కానీ మాంస పరిపుష్టమైన వాటి దేహాలు మాత్రం  పరిపూర్ణ వికాసంతో కనిపిస్తాయి. ఖడ్గమృగమంటే కొమ్ములే. ఎలుగుబంట్లు బాగా బలిసి కనబడతాయి. మానవుల్ని చిత్రించడంలోనూ ఇదే ధోరణి. ప్రాచీన స్త్రీ ప్రతిమల్ని చూడండి, వాటిలో మనకు కనబడేవి బాగా పరిపుష్టంగా ఊగే వక్షోజద్వయం, పెద్ద కడుపు, కొట్టొచ్చినట్టు కనబడే స్త్రీ జననేంద్రియాలూనూ. ఆ ప్రతిమలకు కాళ్లూ, చేతులూ, తలా ముఖ్యం కావు. 25 వేల సంవత్సరాల కిందట మానవుడి దృష్టిలో స్త్రీ అంటే రతి, ప్రత్యుత్పత్తి, పుష్కలత్వం. అంతే. ఆ స్త్రీల ప్రతిమలను చూడగానే ఆ మానవుడికీ, అతడి తెగకీ కూడా అవిచ్ఛిన్న సంతానక్రతువూ, ఆహారభద్రతా సాక్షాత్కరించేవి. 

మానవుడి మెదడులోని కుడిభాగం విషయ సేకరణకు సంబంధించింది కాగా, ఎడమభాగం ఆ విధంగా సేకరించిన విషయాల్ని బట్టి మానవుడికొక కథ అల్లి పెడుతుందని గమనించిన న్యూరో సైంటిస్టులు మరొక విషయం కూడా గమనించారు. అదేమంటే, రకరకాల సందర్భాల్లో మానవుడి మెదడు దెబ్బ తిన్నప్పుడూ,  లేదా మెదడులోని రెండు భాగాల మధ్య పరస్పర సంకేతాలు తెగిపోయినప్పుడూ కుడిభాగం నుంచి సంకేతాలు అందినా అందకపోయినా ఎడమభాగం ఏదో ఒక విధంగా ఆ ఖాళీల్ని తనకైతాను పూరించుకుని ఏదో ఒకవిధంగా తన ముందున్న ప్రపంచాన్ని లేదా తాను లోనవుతున్న అనుభవాల్నీ ఏదో ఒక విధంగా వివరించడానికి ప్రయత్నిస్తుంది. కనుకనే ప్రసిద్ధ రచయిత జొనాథన్‌ గాడ్షాల్‌ మనిషిని ‘ద స్టోరీ టెల్లింగ్‌ ఏనిమల్‌’ అన్నాడు. 

అతడిట్లా రాశాడు: 

'పరిణామక్రమం కాలక్రమంలో మన మెదడు లోపల ఒక షెర్లాక్‌ హోమ్స్‌ని రూపొందించింది. ఎందుకంటే ఈ ప్రపంచం (ఇతివృత్తాలు, సమస్యలు, సంఘటనలు, కార్యకారణ సంబంధాలు మొదలైన వాటితో) పూర్తిగా కథామయం. కారణాల్నీ, కథల్నీ వెతకడంలో ఒక ప్రయోజనం ఉంది. మానవుడు పరిణామక్రమంలో స్థితిగతులకు తగ్గట్టుగా తననుతాను సర్దుబాటు చేసుకునే క్రమంలో కథలు చెప్పే మనస్సు కూడా ఒక ప్రాకృతిక అవసరంగా రూపొందింది. దానివల్ల మనం మన జీవితాల్నీ, సువ్యవస్థితంగానూ, సార్థకంగానూ అర్థం చేసుకునే అవకాశం లభిస్తున్నది. జీవితం తెంపు లేని రణగొణధ్వనిగానూ, సంక్షోభంగానూ కాకుండా అదే మనను కాపాడుతున్నది.'

అయితే కథలు చెప్పే మనస్తత్వం పూర్తిగా పరిపూర్ణమైనది కాదు. మానవుడి మెదడులోని ఎడమభాగంలో కథలల్లే భాగాన్ని దాదాపు ఐదు దశాబ్దాలపాటు పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత మనలోని ఈ చిన్న మానవుడు నిజంగానే ఎంతో విలువైనవాడే అయినప్పటికీ చతురుడూ, కట్టుకథలల్లే వాడూ కూడానని మైఖేల్‌ గజనిగ భావించాడు. ఎందుకంటే మానవుడిలోని కథలల్లే మనస్తత్వం అనిశ్చయాన్నీ, యాదృచ్ఛికతనీ, కాకతాళీయతనీ భరించలేదు. దానికి ఏదో ఒక అర్థం కావాలి. అట్లా అర్థం చెప్పుకోవడానికి అది అలవాటు పడిపోయింది. ఈ ప్రపంచంలో కనిపిస్తున్న వివిధ విషయాల మధ్య సార్థకమైన అమరిక కనిపించకపోతే అది అటువంటి అమరికనొకదాన్ని తనంతటతనుగా ప్రపంచంమీద ఆరోపించడానికి వెనుకాడదు. క్లుప్తంగా చెప్పాలంటే, కథలు చెప్పే మనస్సు ఎంత వీలయితే అంత నిజమైన కథలు చెప్తుంది. అట్లా చెప్పలేనప్పుడు అబద్ధాలు కూడా చెప్తుంది.

ఇట్లా తనముందు కనిపిస్తున్న వాటికి ఏదో ఒక అర్థం చెప్పుకోవడానికి ప్రయత్నించడంలోనూ, అటువంటి అర్థం స్పష్టంగా గోచరించనప్పుడు తానే ఏదో ఒక అర్థాన్ని ఆరోపించి చెప్పడంలోనూ, మానవుడు తొలి కథకుడుగా రూపొందాడని మనం ఊహించవచ్చు. 

అటువంటి తొలికథలు ఎలా ఉండేవో తెలుసుకోవాలంటే, మనం చరిత్ర పూర్వయుగంలోకి,  అంటే, ఇప్పటికి ఐదువేల సంవత్సరాల వెనక్కి వెళ్లాలి.  ప్రపంచమంతటా నేడు అన్ని జాతుల్లోనూ లిఖితవాఙ్మయానికి సమాంతరంగా మౌఖికవాఙ్మయం కూడా ప్రచలితంగా కనిపిస్తున్నది. దీన్నిమనం ‘ఫోక్‌లోర్‌’ అని పిలుస్తున్నాం. కానీ ఈ ఫోక్‌లోర్‌ మీద చరిత్రయుగపు మానవుడి భావజాలం, లిఖితవాఙ్మయ ప్రభావం కూడా గణనీయంగా ఉన్నందువల్ల ఈ మౌఖికవాఙ్మయం ఆధారంగా మనం ఆదిమానవుడి తొలికథల్ని గుర్తుపట్టడం కష్టం. ఇటువంటి ప్రభావాలకు అతీతమైన తొలికథల్ని గుర్తుపట్టాలంటే నాగరికమానవుడి నీడపడని ఆదిమమానవ సమూహాలకథల్ని అన్వేషించాలి.కానీ ఆ కథలు రాతపూర్వకంగా మనకు లభ్యం కావడంలేదు కాబట్టి, మనం చేయగలిగిందల్లా ఆనాటి మానవుడు జీవించిన జీవితానికి సన్నిహితంగా ఉండే జీవనసరళితో జీవిస్తున్న వివిధ మానవసమూహాల కథల్ని అధ్యయనం చేయడం. 

ప్రపంచమంతటా అక్షరపూర్వ జీవనవిధానాన్ని అనుసరిస్తున్న అనేక ఆదిమజాతులు చెప్పుకునే కథల్లో మనకు చరిత్రపూర్వ యుగం నాటి మానవుడు చెప్పుకున్న కథల తాలూకు ఆనవాళ్లు  కనిపిస్తున్నాయి. ఆఫ్రికాలోని బుష్‌మన్లు, జపాన్‌లోని ఐనూలు, ఆస్ట్రేలియాలోని వార్లిపిరి, నర్రిన్యేరి తెగలు, పసిఫిక్‌ మహాసముద్ర ద్వీపాల్లో నివసించే టికోపియా, ఇఫలుక్ తెగలు, తూర్పుదీవుల్లోని రాపానుయి తెగ, ఆనవాళ్లు లేకుండా అంతరించిపోయిన టాస్మేనియన్లు, యమాన వంటి మానవ సమూహాల కథల్లో మానవుడి తొలి కథ పోలికలు కనిపిస్తాయి. 
 
గత రెండు శతాబ్దాలుగా మానవశాస్త్రజ్ఞులు, భాషాశాస్త్రజ్ఞులు, అన్వేషకులు చేస్తూ వచ్చిన వివిధ పరిశోధనల ద్వారా, అధ్యయనాల ద్వారా, తులనాత్మక అధ్యయనాల ద్వారా మనకు అటువంటి కథల ప్రాథమిక రూపాలగురించి స్థూలమైన అవగాహన లభిస్తున్నది. ఆంద్రే జోల్స్‌ అనే ఒక కళాచరిత్రకారుడు వీటిని ‘సరళరూపాలు’ అన్నాడు. అతడి ప్రకారం ఆ సరళరూపాలు పురాగాథ, వీరగాథ, పురాణగాథ, పొడుపుకథ, సుభాషితం, ప్రామాణికగాథ, స్మృతిగాథ, జానపద కథ, ఛలోక్తీను.
 
అలాగని ప్రాచీనకాలంలో కథ సరళంగా ఉండేదని భావించడం కూడా పొరపాటే. మానవజీవితంలోని సంక్లిష్టతను అర్థం చేసుకుని వ్యాఖ్యానించే క్రమంలో ఆధునిక కథ ప్రాచీనకథ కన్నా సంక్లిష్టంగా వికసించిందని సాహిత్యవేత్తలు భావిస్తున్నారు. కానీ ప్రాచీనకథావాఙ్మయాన్ని పరిశీలించినప్పుడు ఈ అభిప్రాయం తప్పనిపిస్తుంది. బహుశా ఆధునిక కథకన్నా ప్రాచీనకథనే మరింత సంక్లిష్టంగానూ, మరింత నిగూఢంగానూ, మరింత ఆసక్తికరంగానూ కనిపిస్తున్నది. 

ఒకవిధంగా చెప్పాలంటే ప్రాచీనకథా రూపాల్లో ఒక పరిణామక్రమం ఉంది. 

దాని తొలిదశలో కొన్ని సరళరూపాలున్నాయి. అవి పురాగాథ, జానపదకథ, పొడుపుకథ, సామెత, ఛలోక్తి. ఆ సరళరూపాల్ని వినియోగించుకుని అత్యంత సంక్లిష్టమైన ప్రాచీన కథానిర్మాణంగా పురాణగాథలు (మైథాలజీ) వికసించాయి. ఆ పురాణగాథల్ని ఎప్పటికి తగ్గట్టుగా అప్పటికి అన్వయించుకునే క్రమంలో కథారూపకాలు (అలిగరి) వికసించగా, పురాణగాథమీద తిరుగుబాటుగా స్వానుభవ కథనాలు (నెరేటివ్‌), పూర్వవృత్తాంతకథనం (ఏనక్డోట్‌), ఉదాహరణ (ఎగ్జంప్లమ్‌), నీతికథ (ఫేబుల్‌), దృష్టాంతం (పారబుల్‌), వ్యంగ్యకథ (అపొలాగ్‌) వికసించాయని చెప్పవచ్చు. మళ్ళా వీటిల్లో పురాగాథ (లెజెండ్‌), జానపదకథ (ఫోక్‌ టేల్‌), పొడుపుకథ (రిడిల్‌) చరిత్రపూర్వయుగంలో తలెత్తి ఇప్పటిదాకా కూడా కొనసాగుతూ వస్తున్న సరళకథారూపాలు.

తరువాతి రోజుల్లో నాగరిక మానవుడు పురాణగాథల్ని నిర్మిస్తూ వచ్చినప్పటికీ, మధ్యయుగాల్లోనూ, ఆధునికయుగంలోనూ కథ ఎన్నో కొత్త రూపాల్ని సంతరించుకుంటూ వస్తున్నప్పటికీ ఈ సరళరూపాలు కూడా సమాంతరంగా, సజీవంగా కొనసాగుతూనే వచ్చాయి. అంతేకాదు. ఈ సరళరూపాలే ఎప్పటికప్పుడు కథని మరింత కొత్తగానూ, మరింత ఆకర్షణీయంగానూ రూపొందిస్తూ వచ్చాయని కూడా మనం ముందుముందు చూడబోతున్నాం. 

ఏ అతీతకాలంలోనో ఎన్నో సహస్రాబ్దాలకు పూర్వం గుహల్లో, నెగడి చుట్టూ కూచుని చరిత్రపూర్వయుగ మానవుడు, అక్షరపూర్వ యుగ మానవుడు తాను చూసినదాన్నీ, చూడనిదాన్నీ కూడా కథలు చెప్పుకోవడం మొదుపెట్టాడు. బహుశా వినోదం కోసమే ఆ కథలు పుట్టి ఉండవచ్చు. కాని కాలక్రమంలో అవి సామాజిక, సాంస్కృతిక అవసరాలుగా మారిపోయాయి. కథలే లేకపోతే, సుమేరియన్‌, ఈజిప్షియన్‌, గ్రీకు, చీనా, భారతీయ, పారశీక సంస్కృతులిట్లా రూపొంది ఉండేవా అన్నది ప్రశ్నార్థకమే. కథ ఒక సామాజిక అవసరమే కాకపోయుంటే హోమర్‌, హెసియోద్‌, వర్జిల్‌, వ్యాసవాల్మీకులు ప్రభవించి ఉండేవారే కాదు. కథలు చెప్తే మనుషులు తమ మాటలు మరింత బాగా వింటారని గ్రహించినందువల్లనే బుద్ధుడూ, క్రీస్తూ వంటి ప్రవక్తలు కూడా కథకులుగా, ఇంకా చెప్పాలంటే అద్వితీయ కథకులుగా, మారారు. ఒకవేళ కన్‌ఫ్యూషియస్‌ వంటి గురువు కథలు చెప్పకపోతే, వాళ్ళ జీవితంలోని చిన్న చిన్న సంఘటనల్నే వాళ్ల శిష్యులు కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. సామాజిక సమగ్రతని కాపాడటం కోసం తమ చక్రవర్తుల్ని దైవాంశసంభూతులుగా ప్రతిష్టిస్తూ పురోహితులు చెప్పిన కథల్లోంచి చరిత్ర యుగం మొదలైతే, మళ్లా ఆ అభూతకల్పనలనుంచి సామాజిక సమగ్రతను కాపాడుకోవడం కోసం నిరక్షరాస్యులైన బానిసలు చెప్పుకున్న కథలతో చరిత్ర మరో మలుపు తిరిగింది.

ఈ పరిణామమూ, ప్రయాణమూ సవివరంగా ముందుముందు.

(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: