రంభ-ఊర్వశి-మేనక-తిలోత్తమ
#రంభ-ఊర్వశి-మేనక-తిలోత్తమ
అందానికి అప్సరస అంటారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి అందరూ అప్సరసలే! అసలు అప్సరసల పుట్టుక వెనుక కూడా ఒక కథ ఉంది. బ్రహ్మ పిరుదులనుండి పుట్టిన రాక్షసులు వెంటపడితే విష్ణుమూర్తి ఊపాయంతో బ్రహ్మ తన శరీరాన్ని విడిచి పెట్టాడట. అప్పుడే తన చేతిని సంతోషంతో వాసన చూసుకున్నాడట. అప్పుడు గంధర్వులూ అప్సరసలూ పుట్టారట. అలాగే క్షీర సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అప్సరసలు పుట్టారని కూడా చెపుతారు!
ఈ అప్సరసలందరూ దేవలోకంలో ఇంద్రుని కొలువులో ఉండి ఆడిపాడి దేవతలకు ఆనందాన్ని అందించేవారు. ఎవరు తపస్సు చేసినా ఎసరు తన సింహాసనానికి వస్తుందేమోనని భయపడి అప్సరసలను ఆటంకపరచమని పంపేవాడు ఇంద్రుడు. వీరంతా పెళ్ళికాని వారే. దేవకన్యలే!
రంభ: అప్సరసల్లో ఒక అప్సరస. రంభకు నలకుభేరుడంటే మక్కువ ఎక్కువ. అతని అంతఃపురానికి వెళ్తూవుంటే రావణుడు చూసాడు. ఆపాడు. బలాత్కారం చేయబోతే తప్పించుకుంది. నలకుభేరునికి చెప్పింది. అతడు రావణుని శపించాడు. పర స్త్రీలను బలాత్కరిస్తే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అన్నాడు. అయితే రంభ ఆ తరువాత అంతకన్నా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంది. ఇంద్రుని ఆనతి మీద విశ్వామిత్రుని తపోభంగం చెయ్యాలని భయపడుతూనే వెళ్ళింది. భయపడినంతా జరిగింది. పదివేల సంవత్సరాలు శిలవై ఉండమని విశ్వామిత్రుడు శపించాడట!
ఊర్వశి: ఒకసారి నరనారాయణుల తపోభంగం చేయడానికి ఇంద్రుడు అప్సరసలను పంపించాడట. వారు ఆడిపాడి ఆటంకం చేసారట. దృష్టి మరల్చబోయారట. తమ అందంతో అన్నీ సాధ్యమనుకున్నారట. అప్పుడు నారాయణుడు తన ఊరువు (తొడ)ను గోరుతో గీసాడట. అప్సరసల అందాన్ని తలదన్నే అందంతో పుట్టిందట… ఊరువు నుండి పుట్టింది కాబట్టి ఊర్వశి అయ్యిందట! అలాగే ఎండా వానా ఎదురయ్యాయట ఓసారి… అదే సూర్యుడు, వరుణుడు ఊర్వశిని చూసారట. తేజస్సు జారగా వారికి పుట్టిన వాళ్ళే వశిష్ట, అగస్త్యులు! అయితే వరుణునితో కలిసినందుకు భంగపడిన సూర్యుడు భూలోకం వెళ్ళి పురూరవునికి భార్యగా పుట్టమని శపించాడట! అందుకే ఊర్వశి పురూరవునితో సంసారం చేసి ధీమంతుడు, ఆయువు, శతాయువు, ధృడాయువు అనే కొడుకుల్ని కూడా కన్నదట! భారతంలోనూ ఊర్వశి ప్రస్థావన ఉంది. ఊర్వశి వలచి వస్తే అర్జునుడు పురూరవుని భార్యగా గుర్తుచేసి తనకు తల్లి వంటిదానవని చెపితే – షండుడు (నపుంసకుడు/పేడి) కమ్మని శపిస్తుంది!
మేనక: కపిలకు పుట్టిన కూతురు. విశ్వామిత్రుని తపోభంగం చేయడానిక మేనకను పంపించాడు. ఇంద్రుని వ్యూహం నెరవేరింది. అయితే విశ్వామిత్రుని వలన మేనకకు “శకుంతల” పుట్టింది. తర్వాత తిరిగి దేవలోకం చేరింది. విశ్వావసుడనే గంధర్వరాజుతో “ప్రమద్వర”ని కన్నది. ఆ కూతుర్ని కూడా వదిలి వెళ్ళింది.
తిలోత్తమ: అంతకన్నా ముందు వృక్షక. ఈశ్వరునికి ప్రదక్షినాలు చేసింది. దేవకార్యం చేసి రమ్మని కోరితే వింది. తిరిగింది. తిరిగిన దిక్కున తిలోత్తమయ్యింది. అంటే బ్రహ్మవరాలు పొందిన సుందోపసుందుల ఆగడాలు మితిమీరడంతో – విశ్వకర్మను పిలిచి అందాల సుందరిని తయారుచెయ్యమన్నాడు. చేసాడు. ఆయస్సు పోసాడు బ్రహ్మ. ఆమే తిలోత్తమ అయ్యింది. సందోపసుందులు తనకోసం పోటీపడితే ఎవరిని పొడిచి ఎవరుగెలిస్తే తాను వారి సొంతమంది. సందోపసుందులు పొడుచుకు చచ్చారు. బ్రహ్మ వైవర్త పురాణంలో తిలోత్తమ చంద్రుని దగ్గరకు వెళ్తుంటే సాహసికుడు ఆపాడట. వారి చెట్టా పట్టాల వల్ల ఆనందపు అరుపుల వల్ల దుర్వాసుని తపోభంగం జరిగి తిలోత్తమ శాపానికి లోనయిందట. బాణాసురుడి కూతురుగా రాక్షసిగా పుట్టిందట. కృష్ణుని మనవణ్ణి పెళ్ళాడి శాప విముక్తమైందట!
అతిలోక సుందరీమణులైన రంభ-ఊర్వశి-మేనక-తిలోత్తమలది ఒక్కొక్కరిదీ ఒక్కో కథ!
Comments
Post a Comment