-:: జగన్నాథ పంచకమ్ ::-

ఈ రోజు శ్రీ జగన్నాథ రథయాత్ర. జగన్నాథుని ధ్యానించుకోడానికి అనువైన శ్రీ జగన్నాథ పంచకము 

-:: జగన్నాథ పంచకమ్ ::-

రక్తాంభోరుహదర్పభంజన మహాసౌందర్యనేత్రద్వయం
ముక్తాహారవిలంబి హేమముకుటం రత్నోజ్జ్వలత్కుండలమ్ ।
వర్షామేఘసమాననీలవపుషం గ్రైవేయహారాన్వితం
పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే ॥ 1॥

ఫుల్లేందీవరలోచనం నవఘనశ్యామాభిరామాకృతిం
విశ్వేశం కమలావిలాసవిలసత్పాదారవిందద్వయమ్ ।
దైత్యారిం సకలేందుమండితముఖం చక్రాబ్జహస్తద్వయం
వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీనివాసాలయమ్ ॥ 2॥

ఉద్యన్నీరదనీలసుందరతనుం పూర్ణేందుబింబాననం
రాజీవోత్పలపత్రనేత్రయుగలం కారుణ్యవారాంనిధిమ్ ।
భక్తానాం సకలార్తినాశనకరం చింతార్థిచింతామణిం
వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రిచూడామణిమ్ ॥ 3॥

నీలాద్రౌ శంఖమధ్యే శతదలకమలే రత్నసింహాసనస్థం
సర్వాలంకారయుక్తం నవఘన రుచిరం సంయుతం చాగ్రజేన ।
భద్రాయా వామభాగే రథచరణయుతం బ్రహ్మరుద్రేంద్రవంద్యం 
వేదానాం సారమీశం సుజనపరివృతం బ్రహ్మదారుం స్మరామి ॥ 4॥
   
దోర్భ్యాం శోభితలాంగలం సముసలం కాదంబరీచంచలం
రత్నాఢ్యం వరకుండలం భుజబలైరాకాన్తభూమండలమ్ ।
వజ్రాభామల చారుగండయుగలం నాగేంద్రచూడోజ్జ్వలం
సంగ్రామే చపలం శశాంకధవళం  శ్రీకామపాలం భజే ॥ 5॥

ఎర్రతామరల యొక్క సొగసును మించిన మహా సౌందర్యవంతమైన రెండు కనులు కలవాడు, ముత్యముల హారములు వ్రేలాడుతున్న బంగారు కిరీటము, రత్నములు పొదగబడిన కుండలములతో ప్రకాశించువాడు, మేఘములవంటి నీలపు రంగుతో ప్రకాశించువాడు, కంఠమునందు అనేకవిధములైన హారములను ధరించినవాడు, ప్రక్కన సుదర్శన చక్రము కలవాడై ప్రసన్నమైన వదనముతో అలరారే నీలాద్రినాథుడైన జగన్నాథుని భజిస్తున్నాను.   

పూర్తిగా విచ్చుకున్న కలువరేకులవంటి కన్నులతో దట్టమైన నల్లని మేఘమువలె సుందరమైనవాడు, విశ్వేశ్వరుడు, లక్ష్మీదేవి యొక్క మృదువైన హస్తములతో సేవింపబడుతున్న పాదపద్మములు కలవాడు, రాక్షసులకు శతృవైనవాడు, అనేక చంద్రమండలములతో సమానమైన ముఖముతో ప్రకాశిస్తూ, చక్రమును, శంఖమును తన చేతులలో ధరించినవాడు, లక్ష్మీదేవికి నివాసభూతుడైన శ్రీ పురుషోత్తమునకు ప్రతిదినము వందనములు సమర్పించుకుంటున్నాను.  

కారుణ్య సముద్రుడు, భక్తుల ఆర్తిని పోగుట్టువాడు, కోరినకోర్కెలు తీర్చే చింతామణి,  నీలాద్రి పై భాగమున అందమైన చూడామణినవలె ప్రకాశిస్తున్న జగన్నాథుని  నమస్కరిస్తున్నాను.

నీలాద్రియందు, శంఖమధ్యములో (పూరీకి శంఖక్షేత్రమని మరో పేరు), వందలరేకులుగల కమలమునందుగల రత్నసింహాసనమునందు సకల అలంకారాములతో అన్నగారైన బలభద్రుడు ఎడమబాగమునందు కొలువుదీరగా బ్రహ్మేంద్ర రుద్రాదులు నమస్కరించుచుండగా దారు(కర్ర)బ్రహ్మగా  కొలువై యున్న వేదాల సారమైన పరబ్రహ్మను స్మరిస్తున్నాను. 

ఒకచేతిలో నాగలి, మరొక చేతిలో రోకలి(ముసలం)ని ధరించి, రత్నములచే చేయబడిన శ్రేష్ఠమైన కుండలముల కాంతి చెక్కిళ్ళపై బడి వజ్రము వలె ప్రకాశిస్తూండగా, భుజ బలముతో భూమండలాన్నంతటినీ ఆక్రమించినవాడై, నాగేంద్రుడినే చూడామణిగా శిరసున ధరించి పూర్ణచంద్రుని వలె తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్న బలభద్రుని భజిస్తున్నాను.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: