ఆలస్య వివాహానికి కొన్ని జ్యోతిష్య సూత్రాలు
శాస్త్రం-94
ఆలస్య వివాహానికి కొన్ని జ్యోతిష్య సూత్రాలు
పూర్వం బాల్య వివాహాలు జరిగేవి. అప్పటి సమాజ పరిస్ధితులను బట్టి రజస్వల కాకుండానే పెత్తందార్లకు బలికాకూడదని తల్లిదండ్రులు వివాహాం చేసేవారు. ఇప్పటి సామాజిక పరిస్ధితులలో మనిషికి స్వేచ్చా స్వాతంత్ర్యాలు రావటం, బాలికల రక్షణ ఏర్పడిన తరువాత రజస్వల అయిన తరువాత వివాహం చేయటం మొదలుపెట్టారు. ఈ రోజుల్లో తన కాళ్ళ మీద తాను నిలబడటానికి సమాజానికి వీరి వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండటానికి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి చదువుకోవటం వల్ల కొంత వివాహ ఆలస్యం అవుతుంది.
సాధారణంగా చట్టరీత్యా బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తరువాత వివాహ అనుమతి ఉంది. చదువు పూర్తయ్యేవరకు 23 సంవత్సరాలు పడుతుంది. ఉద్యోగం దొరికే సరికి 2 సంవత్సరాలు పడుతుంది. 25 సంవత్సరాలు అనుకుంటే 25 సంవత్సరాలు దాటినవన్నీ ఆలస్య వివాహాలే అనవచ్చును.
సమాజంలో వస్తున్న నూతన పోకడలు, సినిమాల ప్రభావం, శారీరక, మానసిక వ్యాధుల ప్రభావం, అధికమైన, ఇష్టమైన మరియు నియంత్రణలేని ఆహార పదార్ధాలు తీసుకోవటం వలన సరియైన వ్యాయామం లేక శరీర అవయవాలు అందవికారంగా తయారు కావటం, ప్రతి ఒక్కరూ అందమైన వాళ్ళు కావాలని కోరుకోవటం, కోరికలు నియంత్రణ లేకపోవటం, ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య, ఉద్యోగం కావాలని కోరుకోవటం, తాను సొంతంగా నిలబడాలని కోరుకోవటం, తను చేసుకునేవాళ్ళు కూడా ఇలానే ఉండాలని కోరుకోవటం వలన ఇవన్నీ జరగటానికి చాలాకాలం పడటం వలన వయస్సు దాటుతుంది. ఈ విధమైన సమాజ పరిస్ధితుల వలన వివాహాలు ఆలస్యం అవుతున్నాయి.
ప్రస్తుత కాలంలో వివాహా వ్యవస్ధ సమస్యగా తయారైంది. వివాహం, విడాకులు, ప్రేమ వివాహాలు, మనస్పర్ధలు విడిపోవాలనే బలమైన కోరికలు, కోరికలు తీరకుండానే వృధాగా కాలం గడిచిపోతుందనుకునే వారు ఇలా ప్రతి కుటుంబంలోను సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారు. ఇటువంటి సమస్యలు మన కుటుంబంలోనో, ఆత్మీయ కుటుంబాలలోనో జరిగితే మనస్సు గాయపడుతుంది. ఇలా ఎన్నో సామాజిక పరిస్ధితులు ఆలస్య వివాహానికి కారణమవుతున్నాయి.
ఆలస్య వివాహానికి జాతక పరంగా కొన్ని గ్రహాల అనుకూలతలు లేకపోవటం వలన కూడా ఆలస్య వివాహాలు జరుగుతున్నాయి. ఆలస్య వివాహానికి జాతక ప్రభావం ఒక్కటే కాకుండా మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్ధితులు అనుకూలించక పోవటం వలన కూడా కొంతమందికి వివాహాం ఆలస్యమవుతుంది. ఆలస్య వివాహానికి కొన్ని జ్యోతిష్య సూత్రాలను పరిశీలిద్దాం.
జాతకంలో వివాహ స్ధానం సప్తమ స్ధానం. సహజ వివాహా కారకుడు శుక్రుడు, స్త్రీలకు గురువుని చూడాలి. సప్తమ భావానికి బావాత్ భావం అయిన లగ్నాన్ని కూడా పరిశీలించాలి. అపోహలకి కారకుడైన రాహువుని, చంచలత్వానికి కారకుడైన చంద్రగ్రహాన్ని పరిశీలించాలి. పంచమ స్ధానం ప్రేమ వివాహనికి కారణం కావున ఆ స్ధానాన్ని పరిశీలించాలి. కుజ, శుక్ర గ్రహాలను పరిశీలించాలి.
లగ్న స్ధానం- సప్తమానికి భావాత్ భావం
సప్తమ స్ధానం – భార్య, భర్తల గుణగణాల కోసం.
చతుర్ధ స్దానం – సుఖాల కోసం.
వ్యయ స్ధానం – శయ్యా సుఖం కోసం.
ద్వితీయ స్ధానం – కుటుంబ అభివృద్ధి కోసం.
పంచమ స్ధానం – సంతానం కోసం.
నవమ స్ధానం – సత్ సంతానం కోసం.
లాభస్ధానం – దర్మ, అర్ధ, కామ, మోక్ష స్ధానాలలో కామ స్ధానం, వివాహానంతర ప్రేమాభిమానాలకు.
షష్టమ స్ధానం – గొడవలు, కోర్టు సమస్యలు, ఎడబాటు ( ఉద్యోగ పరంగా, విద్యాపరంగా దూరంగా ఉండటం కూడా కావచ్చు)
అష్టమ స్ధానం – కష్ట, నష్టాల కోసం ఆయా స్ధానాలను వివాహానికి పరిశీలించాలి.
1. శని రాహువులు సప్తమభావంలో ఉంటే ఆలస్య వివాహం అవుతుంది. వర్ణాంతర వివాహాం జరిగే అవకాశాలు ఉండవచ్చు.
2. సప్తమ భావంలో నెప్ట్యూన్ ఉన్న ఆలస్య వివాహం అవుతుంది.
3. శని, శుక్ర సంబందం వలన ఆలస్య వివాహం అవుతుంది.
4. లగ్నానికి కుజుడు అష్టమంలో శత్రు రాశిలో ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది.
5. 2, 7, 11 భావాలపైన శని రాహువుల దృష్టి ఉండటం వలన కూడా వివాహం ఆలస్యం అవుతుంది.
6. తులా లగ్నం అయి శుక్రుడు సప్తమ భావంలో ఉన్న ఆలస్య వివాహం అవుతుంది.
7. అష్టమంలో రాహువు ఉన్న కుటుంబ సమస్యల మూలంగా వివాహం ఆలస్యమవుతుంది.
8. 2, 7, 11 భావ అధిపతులకి 6, 8, 12 భావాధిపతులతో సంబందం ఏర్పడిన వివాహం ఆలస్యమవుతుంది.
9. సప్తమాధిపతి నీచలో ఉన్న, నవాంశలో సప్తమాదిపతి 6, 8, 12 భావాలలో ఉన్న వివాహం ఆలస్యమవుతుంది.
10. సప్తమాధిపతి శని, రాహు, కేతువులతో కలసి ఉన్న, షష్టాధిపతి, వ్యయాధిపతి సప్తమాన్ని చూస్తున్న, కుటుంబ స్ధానాన్ని చూస్తున్న, సప్తమంలో కుజుడు నీచలో ఉన్న, వివాహం ఆలస్యమవుతుంది.
11. శని దశమ భావంలో ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది. సప్తమంలో ఉన్న గ్రహం గాని, సప్తమాధిపతి గాని వక్రించటం వలన వివాహం ఆలస్యం కావటం కాని, వివాహం పట్ల విముఖత చూపటం కాని చేస్తారు.
12. కర్కాటక, సింహలగ్నం వాళ్ళకు సప్తమాధిపతి శని కావటం వలన వివాహం ఆలస్యం కావటం లేదా వివాహం అయిన తరువాత చిన్న చిన్న మనస్పర్ధలు రావటం జరుగుతాయి.
Comments
Post a Comment