పూరీజగన్నాథం: జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన
పూరీ జగన్నాధుని రథోత్సవం
పౌరాణిక గాథా మహిమలకు, నిష్కపటమైన శ్రద్ధావిశ్వాసాలకు, చక్కని సంస్కృతికి, వైభవ చరిత్రకు కేంద్రంగా విలసిల్లుతున్న క్షేత్రం - పూరీజగన్నాథం. ఎన్నో తీర్థాలు, కుండాలు, దేవతా మందిరాలు శోభిల్లుతున్న ఈ క్షేత్రంలో ప్రధాన మందిరం - బలభద్రాసుభద్రాసమేత జగన్నాథస్వామి వేంచేసిన దివ్యాలయం. వీరి ముగ్గురితోపాటు సుదర్శనమూర్తీ నెలకొని ఉన్న ఆలయమిది. పురాణాలప్రకారం - ఈ రూపాన్ని తీర్చిదిద్దినవాడు బ్రహ్మదేవుడే. ’ఇది కేవలం కోష్ఠమయం కాదు, దారు(కర్ర) రూపంలో ఉన్న నారాయణ బ్రహ్మమే’ అని స్కాందపురాణం చెబుతోంది. దివ్యత్వాన్ని వదనం ద్వారా సంపూర్ణంగా ప్రకటించే ప్రత్యేకత ఈ విగ్రహాల్లో ఉంది. అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసే సుదర్శన శక్తి, విష్ణు వైభవాన్ని స్పష్టంగా (సు)దర్శింపజేసే జ్ఞానదీప్తి...అని ఆగమాల సమన్వయం. ప్రకృతికీ, జీవునికీ అతీతుడై, ఇరువురినీ నియంత్రించే పరతత్వాన్ని ’పురుషోత్తముడు’ అంటారు. ఆ పురుషోత్తముడు నారాయణుడు ఈ క్షేత్రంలో ’పురుషోత్తమ’ నామంతో శోభిల్లుతున్నాడు. అందుకే ఆయన పేరుపైనే ఈ స్థలాన్ని ’పురుషోత్తమ క్షేత్రం’గా శాస్త్రం వ్యవహరించింది. ఐశ్వర్యకారిణియైన మహాలక్ష్మి ఇక్కడ అన్న సంప్రదాయకంగా విలసిల్లుతోందని ధార్మిక శాస్త్రాల మాట. శివ స్వరూపాలు, శక్తిరూపాలు, గణపతులు, ఆదిత్యులు కూడా ఈ క్షేత్రంలో ఉన్న దేవతలు. క్షేత్రం మొత్తాన్ని పరిశీలిస్తే ’సర్వదేవాత్మక విష్ణుక్షేత్రమిది’ అని స్పష్టమవుతుంది. మోక్షపట్టణాల్లో ఒకటిగా ఉన్న ఈ క్షేత్రాల్లో ఉన్న ప్రత్యేకతల్లో ’రథయాత్ర’ ఒకటి. ప్రతి ఆలయంలొ రథోత్సవమ్ ఒక ఉత్సవ సంప్రదాయమైనప్పటికీ, జగన్నాథ రథయాత్రకు ఎంతో ప్రాధాన్యముంది. ఆదియుగంలో నీలమాధవునిగా, ఇక్కడ నీలాచలాన విష్ణువు జ్యేష్ఠమాసంలో ఆవిర్భవించాడని పురాణోక్తి. దాని ఆధారంగా జ్యేష్ఠ పూర్ణిమనాడు ఈ దివ్య ప్రతిమలకు స్నానోత్సవం చేస్తారు. అటునుంచి ఆషాఢ శుద్ధ విదియ వరకు ప్రత్యేకంగా కనుమరుగుగా దాచిన విగ్రహాలను, నూతన వర్ణాలంకారాలతో భూషితం చేస్తారు. అటుపై రథోత్సవం. స్వామి దారుమూర్తులను ప్రతిష్ఠించడానికి పూర్వం, హరి స్వయంగా దారువుగా వ్యక్తం కావడానికై బ్రహ్మాదులు యజ్ఞం చేశారనీ, దాని ఫలంగా విష్ణువు ఒకే మహావృక్షంగా సముద్రం నుంచి వ్యక్తమయ్యాడనీ పురాణం చెబుతోంది. ఆ ఒక్క వృక్షపు చెక్కనే తొలుత నాలుగు విగ్రహాలుగా (జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన) మలచారని పురాణ కథనం. అటు తరువాతి నుంచి ఒక సంప్రదాయాన్ని అనురించి పన్నెండేళ్ళకోసారి ’నవకళేబరోత్సవం’ పేరుతో విగ్రహాలను పునర్నిర్మించి, పాతవి ఖననం చేయడం ఆనవాయితీ. ఒకే విష్ణుతత్త్వం నాలుగు రూపాలుగా వ్యక్తమై, చతుర్వేద తత్వంగా భాసిల్లుతున్నదని సంకేతం. యజ్ఞాలు జరిగిన చోటును ’మహావేది’ అంటారు. దాన్నే నేడు ’గుండిచా మందిరం’గా వ్యవహరిస్తున్నారు. ప్రధానాలయం నుంచి మూలదారు విరాట్టులే రథాల్లో కదలివచ్చి, ఈ మహావేదిలో ప్రవేశించి
సుమారు పదిరోజులపాటు ఇక్కడే కైంకర్యాలను అందుకొని దర్శనాలిస్తాయని, ఇక్కడి దర్శనం బహుయజ్ఞ ఫలదాయకం అని ధర్మశాస్త్ర వచనం. ఈ రథాలు మూడు. జగన్నాథుని ’గరుఢధ్వజం’ నందిఘోష’ అనే నామంతో కూడా పిలుస్తారు. బలభద్రుని ’తాళధ్వజం’ రథం. అంబ సుభద్రాదేవి ’దర్పదళన’ రథం. మూడు సర్వాంగ శోభితంగా భాసిస్తుంటాయి. పరిపూర్ణ వాసుదేవ పురుషోత్తముడే జగన్నాథునిగా, అంశావతారం సంకర్షణ తేజస్సుతో బలభద్రునిగా, విష్ణు సహోదరియైన శక్తి సుభద్రమ్మగా నెలకొన్న దివ్యధామిది. జగన్నాథునికి ఎడమవైపున చక్రరాజ సుదర్శనుడు - స్వామి చేతిలోని విశ్వచక్ర, కాలచక్ర పరిభ్రమణ శక్తికి ప్రతీక. ఈ రథాల గమన వేళలో సర్వం జగన్నాథమయమే. జగమంతా జగన్నాధునికి ప్రణమిల్లుతున్నదా అన్నంత జనవాహిని ప్రపంచ నలుమూలలనుంచి వచ్చి మూడు రథాల్లోని మూర్తులను దర్శించుకోవడం ఒక అద్భుతోత్సవం. దేవతలు, ఋషులు కూడా అసంఖ్యాకంగా ఈ రథస్థులైన దివ్యమూర్తుల్ని ఆరాధిస్తారని పురాణాలు చెబుతున్నాయి. జగద్రథాన్ని నడిపే జగన్నాథుని తత్వస్ఫూర్తి విభిన్న విశ్వానికి ఏకత్వ జ్ఞానదీప్తి..
Comments
Post a Comment