ఈశ్వరుడు ఇచ్చిన సంపద.....*

*Spiritual Seekers 🙏*

*ఈశ్వరుడు ఇచ్చిన సంపద.....*

ఈ ప్రకృతి యావత్తు ఈశ్వరుడు ఇచ్చిన సంపదే. ప్రకృతిలో ఏమున్నాయి... భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే "పంచభూతాలు" ఉన్నాయి. ఇంకా వృక్షాలు, జంతువులు, పర్వతాలు, నదులు, సముద్రాలు, సూర్యచంద్రులు.. ఈ మొత్తం ప్రకృతి సంపదయే. దీనిని ఇచ్చింది భగవంతుడేగాని ఏ సైంటిస్ట్ స్వయంగా తయారు చేయలేదు.

వీటన్నింటిని ఎందుకు ఇచ్చినట్లు...

1) భూమి...

భూమి మనకు ఆధారంగా ఉంటున్నది. కూర్చోటానికి, నిలుచోటానికి, ప్రయాణం చేయటానికి, ఇళ్ళు కట్టుకొని నివాసం ఉండటానికి ఈ భూమియే ఆధారం. ఇంకా భూమి నుండే మనం తినే ఆహారం వస్తున్నది. సస్యాలు, కాయకూరలు, పండ్లు మొదలైనవి వన్నీ వస్తున్నవి. భూమి నుండే ఖనిజాలు వస్తున్నాయి. ఇవన్నీ మానవుడు ఉపయోగింకుంటున్నాడు.

2) నీరు...

నీరు మానవుడికి, ఇతర ప్రాణులకు దప్పికదీరుస్తున్నది. ఈ నీరే చెట్లకు కూడా కావాలి. మానవ మనుగడకు నీరు ఎంతో అవసరం.

3) అగ్ని...

ఆహారాన్ని పచనం చేయటానికి అగ్ని అవసరం. అలాగే మన శరీరంలో 98.4F అగ్ని ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండేది. అగ్ని లేకపోతే - శరీరం చల్లబడితే కట్టె అయిపోతుంది.

4) వాయువు...

ముఖ్యంగా ప్రాణికోటి జీవనానికి తప్పనిసరి అవసరం. గాలి లేకపోతే శరీరం చెమటలు పట్టి ప్రశాంతంగా ఉండలేం. అంతేగాదు బయటనున్న ఈ వాయువే మన ముక్కు రంధ్రాల ద్వారా లోనికి ప్రవేశించి ప్రాణవాయువుగా మారుతుంది. జీవన చర్యలకు సాయపడుతుంది.

5) ఆకాశం...

మనం ఈ భూమి మీద తిరగటానికి అవకాశం కలిగించేదే ఆకాశం. శబ్దాలు వినపడాలంటే ఆకాశం ఉండాలి.

6) వృక్షాలు...

మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వృక్షాలు కాయకూరలు, పండ్లు, పూలు, మాత్రమేగాక రకరకాల ఔషధాలను ఇచ్చే ఔషధవృక్షాలు కూడా ఉన్నాయి. అనేక రకాల జబ్బులకు వాడే ఆయుర్వేద మందులలోను, కొన్ని ఇంగ్లీషు మందులలో కూడా ఈ ఓషధీ మొక్కలను వాడుతారు. ఇంకా వృక్షాలు నీడనిస్తాయి. వంటచెరకునిస్తాయి. గృహ నిర్మాణాలలో ద్వారాలు, తలుపులు, కిటికీలు అన్నీ ఈ వృక్షాల ద్వారానే.

7) జంతువులు...

అనేక జంతువులు మానవులకు ఉపయోగపడతాయి. వ్యవసాయంలో సాయంచేస్తాయి. పాలు పెరుగు, వెన్న నెయ్యి జంతువుల ద్వారానే వస్తాయి. కుక్కలు ఇంటి కాపలాగా కొన్ని జాతులు దొంగలను పట్టటానికి ఉపయోగపడతాయి.

8) పర్వతాలు...

అనేక ఔషధాలనిస్తాయి. మేఘాలను అడ్డగించి వర్షాన్నిస్తాయి. కొన్ని రక్షణగా ఉంటాయి.

9) నదులు సముద్రాలు...

సముద్రాల వల్ల అనంత జలరాశి లభ్యం. సముద్రంలోని నీరే వేడెక్కి మేఘాలుగా ఏర్పడి వర్షిస్తాయి. ఆ వర్షం నదులకు చేరుతుంది. ఆ నీరు త్రాగటానికి, పంటలకు ఉపయోగపడుతుంది. ఆనకట్ట కట్టి, కరెంటు తయారు చేయవచ్చు.

10) సూర్యచంద్రులు...

ప్రపంచాన్ని వెలిగించి చూపేవారు సూర్య చంద్రులు. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు వెలుగునిస్తాడు. సూర్యుడు వేడిని, చంద్రుడు చల్లదనాన్నిచ్చి ఆహ్లాదం కలిగిస్తాడు. చంద్రుని కిరణాల వల్ల కొన్ని పంటలు బాగా పండుతాయి. సూర్యుని లేలేత కిరణాలు శరీరానికి మేలుచేస్తాయి.

ఈ విధంగా ప్రకృతి అంతా మానవులకు మేలు కలిగించేదే. ఈ ప్రకృతి మానవుల మేలుకోసం, మానవుల మనుగడ కోసం భగవంతుని చేతనే ప్రసాదించబడింది.

ఇవన్నీ గాక మానవుడికి భగవంతుడు మరొక మేలు చేస్తున్నాడు. అదేమిటంటే మనం హాయిగా తిని పడుకుంటే మనలోనే ఉన్న పరమాత్మ జఠరాగ్ని రూపంలో ఉండి మనం తిన్న ఆహారాన్ని అరిగించి, సారాన్ని రక్తంలో కలిపి మన దేహము నందంతటా ప్రసరింపజేస్తూ అన్ని అవయవాలకు శక్తిని ప్రసాదిస్తున్నాడు. పనికిరాని పిప్పిని బయటకు పంపటానికి సిద్ధం చేస్తున్నాడు. ఇన్ని విధాలుగా మనకు ప్రకృతిని ప్రసాదించి, రక్షించే ఈశ్వరుడు ని స్మరించటం ప్రతి మానవుడి కనీస భాద్యత.. అదే కృతజ్ఞతగా నమస్కరించుట...

*|| ఓం నమః శివాయ ||*

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: