చందమామ కథలు*

*చందమామ కథలు* 
🍃🌹🦜🍃🌹🦚
14-9-2020
*మహేంద్రపురి రాజ్యంలో, సర్పవరం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సాంబన్న అనే పాములు పట్టేవాడుండేవాడు. పాముకాటుకు చికిత్స చేయడంలో కూడా అతడికి మంచి పేరుండేది. సాంబన్నకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు. సాంబన్న వాడికి నాగరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. సాంబన్న భార్యకు మహా జాతకాలపిచ్చి.*

*ఆమె ఒకసారి కొడుకు జాతకం, ఆ గ్రామంలో పేరుమోసిన ఒక జ్యోతిష్కుడికి చూపించింది. ఆ జాతకాన్ని ఒకటికి రెండు సార్లు పరీక్షించి చూసిన జ్యోతిష్కుడు సంభ్రమాశ్చర్యాలతో సాంబన్న దంపతులకు, ‘‘ఔరా, ఏమిటీ వింత! మీ కొడుక్కు రాజయోగం ఉంది,'' అని చెప్పాడు. ‘‘రాజయోగమా! హాస్యాలు మాని అసలు సంగతి చెప్పండి, సాములూ,'' అన్నాడు సాంబన్న. ‘‘హాస్యం కాదురా, సాంబూ.*

*నిజమే చెబుతున్నాను. నీ కొడుకు రాజయ్యూక, నన్ను మరిచిపోకు,'' అన్నాడు జ్యోతిష్కుడు, జాతక పత్రాన్ని కళ్ళకద్దుకుని సాంబన్న చేతికిస్తూ. ఆ మాటలతో సాంబన్నకు, కొడుకు రాజయోగం పట్ల కొంత నమ్మకం కలిగింది. జ్యోతిష్కుడు చెప్పినట్లు కొడుకు రాజైతే, చదువు రాకపోవడం బాగుండదని, నాగరాజును బడిలో చేర్పించాడు.*

*నాగరాజు పదేళ్ళ వయసు వాడయ్యూడు. వాడిక్కూడా తండ్రిలాగే పాములు పట్టడంలో మంచి ఒడుపూ, నేర్పూ చాలా సహజంగా అలవడ్డాయి. చదువులో కూడా నాగరాజు మిగతా పిల్లలకంటే ముందుండేవాడు. తమకంటే నాగరాజు బాగా చదువుతాడన్న అక్కసుతో, వాడి రాజయోగం గురించి విన్న బడిపిల్లలు, వాణ్ణి పాములు పట్టేరాజు అని గేలిచేసేవారు.*

*నాగరాజు యుక్తవయస్కుడయ్యే నాటికి సాంబన్న వృద్ధుడయ్యాడు. అప్పటికే నాగరాజు అన్నిరకాల సర్పాల గురించీ, వాటి విషాల విరుగుడుల గురించీ తండ్రి నుంచి క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. పాముకాటుకు వాడిచ్చే మందుకు తిరుగుండేది కాదు. జ్యోతిష్కుడు చెప్పినట్లు తన కొడుకు రాజైతే చూసి చనిపోవాలని సాంబన్న ఆశపడుతూండేవాడు. ఆ ఘడియ ఎంతకూ రాలేదు. నాగరాజుకు పెళ్ళీడు వచ్చింది.*

*అయినా, పెళ్ళి చేయడానికి సాంబన్నకు మనసొప్పలేదు. వాడు రాజయ్యాక పెళ్ళంటే, ఆ వేడుక చూడముచ్చటగా, ఘనంగా వుంటుందని భావించాడు సాంబన్న. పోనీ జ్యోతిష్కుడి సలహా అడుగుదామంటే - ఆయన కాలంచేసి సంవత్సరమైంది. అంతలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది. రాజుగారి సైనికుడొకడు గుర్రం మీద సర్పవరం గ్రామవీధిలోంచి వెళ్తుండగా, చూడక నాగరాజు అడ్డుగా వచ్చాడు.*

*రాజసైనికుడు అతణ్ణి, ‘‘ఎవడ్రా నువ్వు! మందమతివా? పొగరుబోతువా?'' అంటూ గట్టిగా మందలించాడు. అది విన్న గ్రామస్థుడొకడు సైనికుడితో, ‘‘మా నాగరాజుతో మర్యాదగా మసలుకో! అతడు కాబోయే రాజు,'' అని హెచ్చరికగా అన్నాడు. రాజ సైనికుడు వాళ్ళిద్దరి కేసీ వింతగా చూసి ముందుకు సాగిపోయూడు. ఐతే, ఒక పక్షం రోజుల తర్వాత, కొందరు సైనికులు గ్రామానికి వచ్చి, నాగరాజును వెంటబెట్టుకుని మహారాజు విజయవర్థనుడి వద్దకు తీసుకుపోయూరు.*

*ఈ విషయమై గ్రామంలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. ‘‘కాబోయే రాజు అని చెప్పుకుంటున్న విషయం రాజుగారికి తెలిస్తే ఊరుకుంటాడా? తలతీయించడానికే పిలిపించివుంటాడు!'' అని గ్రామంలో కొందరు గుసగుసలాడుకున్నారు. అది విన్న సాంబన్న కాళీమాత గుడికి వెళ్ళి, ‘‘తల్లీ! నా కొడుకు రాజు కాకపోయినా చింతలేదు. వాడికేహానీ కలగకుండా చల్లగా చూడు,'' అని ప్రార్థించాడు. ఐతే, రాజు విజయవర్థనుడు, తన కుమార్తె నాగమాంబతో నాగరాజు వివాహం ప్రకటించాడు. అది విన్న రాజ్య ప్రజలందరూ పాములు పట్టేవాడితో రాజకుమార్తె వివాహమా? అని ఆశ్చర్యపోయారు.*

*నెల గడిచేసరికి రాజకుమారికీ, నాగరాజుకూ వివాహం ఘనంగా జరిగింది. నాగరాజు తల్లిదండ్రులకు రాజమర్యాదలు జరిగాయి. ఒక రోజు రాత్రి నాగరాజు, రాకుమారి హంసతూలికా తల్పం మీద ఆదమరిచి నిద్రిస్తుండగా, నాగరాజుకు పాము బుసకొట్టిన సవ్వడి వినిపించింది. అతడు తటాలున కళ్ళు తెరిచి చూడగా, పడగ విప్పిన సర్పం ఒకటి రాకుమారిని సమీపిస్తున్నది.*

*వెంటనే, నాగరాజు తల్పందిగి సర్పంతోక పట్టుకుని గిరగిరా తిప్పి గట్టిగా నేలకేసి కొట్టాడు. సర్పం గిలగిలా కొట్టుకుని కొంత సేపటికి ప్రాణంవిడిచింది. ఆ మరుక్షణం రాకుమారి నిద్రలేచి, తనకు తప్పిన ప్రమాదాన్ని గురించి నాగరాజు చెప్పగా విని, అతడి ధైర్య సాహసాలను ఎంతగానో మెచ్చుకున్నది. క్షణాల మీద ఈ వార్త తెలిసిన రాజు విజయవర్థనుడు సంతోషంతో అక్కడికి వచ్చి నాగరాజును ఆప్యాయంగా కౌగలించుకుని, ‘‘నాయనా!*

*నా ఒక్కగానొక్క కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టావు,'' అని, అసలు రాకుమార్తెను, నాగరాజు కిచ్చి ఏకారణం వల్ల వివాహం జరపవలసి వచ్చిందో వివరించాడు: విజయవర్థనుడి తాతగారైన అజయవర్థనుడు, మహేంద్రపురి రాజ్యాన్ని ప్రజారంజకంగా చాలా కాలం పాలించి, వార్థక్యదశలో కుమారుడు జయవర్థనుడికి రాజ్యాభిషేకం చేసి, శేషజీవితాన్ని దైవచింతనలో గడిపేందుకు, అరణ్యంలోని ఒకానొక ముని ఆశ్రమంలో స్థిరపడ్డాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకు, జయవర్థనుడు అడవికి వేటకు పోయి, అక్కడ పాము కాటుకు గురై మరణించాడు.*

*దానితో విజయవర్థనుడు మహేంద్రపురికి రాజైన ఆరు సంవత్సరాలకు రాణి ఒక చక్కని ఆడబిడ్డకు తల్లి అయింది. అరణ్యంలోని ఆశ్రమంలో వున్న తాతగారి నుంచి బిడ్డకు ఆశీస్సులు పొందేందుకు విజయవర్థనుడు, ఆయనవుంటున్న ఆశ్రమానికి వెళ్ళాడు. అజయవర్థనుడు మనమరాలిని చూసి ఉలిక్కి పడ్డాడు. కళ్ళు మూసుకుని కొంతసేపు ధ్యానంలో గడిపి, ఆ తరవాత విజయవర్థనుడితో, ‘‘నీ తండ్రికిలాగే నీ కుమార్తెకూ సర్పగండం ఉంది.*

*అయినా, ఈ శిశువుకు నాగమాంబ అని పేరుపెట్టి నాగదేవతకు నిత్యపూజలు నిర్వహించు. గండం తొలగిపోయి మంచి జరుగుతుంది. అంతేగాక, బిడ్డయుక్త వయస్కురాలైనాక, భర్త ఎంపికలో కూడా తగు జాగ్రత్త తీసుకో. అతడు సర్ప భీతిలేనివాడూ, ధైర్యసాహసాలు కలవాడూ అయివుండడం అవసరం,'' అని అన్నాడు. రాజకుమార్తెకు యుక్తవయసు వచ్చాక, విజయవర్థనుడు సర్పగండం గురించి ఆలోచిస్తూనే వివాహ ప్రయత్నాలు తలపెట్టాడు.*

*ఎందరు రాజకుమారులను చూసినా ఒక్కరూ తృప్తికరంగా తోచలేదు. అటువంటి సమయంలో సర్పవరం గ్రామస్థులు తమగ్రామం వాడైన నాగరాజును, కాబోయే రాజుగా చెప్పుకోవడం విన్న విజయవర్థనుడు, నాగరాజును పిలిపించి అతడి గురించి తెలుసుకున్నాడు. రాకుమారి నాగమాంబ జాతకం, నాగరాజు జాతకంతో అతికినట్లు సరిపోయింది. పైగా నాగరాజుకు విషసర్పాలను పట్టడంలోనూ, వాటికాటుకు చికిత్స చేయడంలోనూ మంచి ప్రావీణ్యంవున్నదని తెలుసుకున్నాడు.*

*ఇదంతా దైవసంకల్పంగా భావించిన రాజు విజయవర్థనుడు సంతోషంగా, నాగరాజుతో తన కుమార్తె వివాహం జరిపించాడు. బాగా వయసు పైబడిన తర్వాత రాజు విజయవర్థనుడు, నాగరాజుకు, నాగరాజవర్థనుడు అని నామకరణం చేసి అత్యంత వైభవంగా రాజ్యాభిషేకం జరిపించాడు. ఐతే, సర్పవరం గ్రామస్థులు మాత్రం నాగరాజును పాములుపట్టే రాజు అంటూ ముచ్చటగా పిలుచుకునేవారు.*

 🍃🌹🦜🍃🌹🦚

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: