గాయత్రీ దేవి


గాయత్రీ దేవి

పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలతచెంది. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై 'వరం కోరుకో' అన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. 'మరేదైనా వరం కోరుకో' అన్నాడు.

అంతట, ఆ రాక్షసుడు "చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని , శస్త్రాస్త్రాలచేత కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరిచేత కాని, రెండు కాళ్ళు గల ప్రాణిచేత గాని, నాలుగు కాళ్ళ గల జంతువు చేతగాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరమి"మ్మని కోరాడు. బ్రహ్మ "తథాస్తు" అన్నాడు.

బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడుమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొఱపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంటపెట్టుకుని వైకుంఠానికి రాగా, విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యాముద్రలో ఉన్న శంకరుడు వారి

మొఱ విని, ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమో, మరచిపోవడమో చేస్తే తప్ప, అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి, అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించ వలసిందిగా సూచించాడు.

బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి, బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూచి, అరుణుడు అతిథి సత్కారాలు చేసి," మునీంద్రా నేను రాక్షసుడను కదా! మీరు దేవగురువులు. దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని? మీరాకకు కారణం ఏమిటి! అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, "రాక్షసరాజా! నీవిలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ, ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వూ జపిస్తున్నావు. కనుక, ఆ రీత్యా మనం మిత్రులమే కాని, శత్రువులం కాదు "అని సమాధాన మిచ్చాడు. ఈ మాటలు విన్న అరుణునితో దురభిమానము. దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి, గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి, అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు.

గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు, దుర్భలుడు అయిపోయాడు, ఎందుకూ కొరగాని వాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలసి దేవిని ప్రార్థించగా, ఆమె వారికి సాక్షాత్కరించింది.

"వరాభయ కరా శాంత కరుణామృత సాగరా !

నానా భ్రమర సంయుక్త పుష్పమాలా విరాజితా||"

అయిన జగన్మాతను చూచి

"నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి|

నమః కమల పత్రాక్షి సర్వాధారే నమో7స్తుతే||

భ్రమరై ర్వేష్టితా యస్మాత్‌ భ్రామరీ యా తత స్స్మృతా|

తసై#్య దేవ్యై నమో నిత్యం నిత్యమేవ నమో నమః||

అని పలువిధములుగా ఆమెను ప్రార్థించగా, ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది.

అంతట పరాశక్తి తన మాయా విలాసంచేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి ,భూమ్యాకాశాలను కప్పివేసి, రాక్షసుల శరీరాలను ఆక్రమించి, చెవుల్లో భరించరాని రొదచేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి , వినడానికి అవకాశం లేకుండై, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా తేశాయి. దేవి అజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి, అరుణుని, అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే, శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద. చతుష్పాద ప్రాణులవల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పది(ఆఱు పాదాలు గలది తుమ్మెద) వల్ల మరణించాడు.

తమను కనికరించి, రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను అనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి, ఆమె అనుగ్రహం పొందసాగారు.

ఈ కథ చెప్పి , వ్యాసమహర్షి గాయత్రీ మంత్రజప ప్రభావాన్ని వివిరించగా, జనమేజయుడు గాయత్రీ దేవతను గురించి ఇంకా వినిలనే జిజ్ఞాసను వ్యక్తం చేశాడు. వ్యాసమహర్షి కొనసాగించాడు.

గాయత్రీ పరాశక్తి స్వరూపము. అమెకు ఐదు ముఖాలు, ఈ ఐదు ముఖాలూ సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. ఐదు శిరస్సులతో, పదిచేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సరలైశ్వర్యాలను, అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది.

గాయత్రీ దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతఃకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది.

గాయత్రీ మంత్రానికి నాలుగ పాదాలు. ఒక్కొక్క పాదంలో ఎనిమిగి అక్షరాలు. మొదటి మూడు పాదాలూ ఋగ్యజుస్సామ వేదాల నుండి, నాల్గవ పాదం అధర్వ వేదం నుండి ఉద్భవించాయి. అందువల్లనే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి మూడు పాదాల్లో ఐరవైనాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్నే ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కన్పిస్తూండగాను, మధ్నాహ్న సంధ్య, సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను, సాయంసంధ్య సూర్యస్తమయం కంటె ముదుగాను అచరించాలని పెద్దలు చెప్పారు. సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి. ఈఉపాసనవల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు. ఈ మంత్రాన్ని దేవాలయంలో, యాగశాలలో, తులసీవృక్ష సమీపంలో, నదీతీరాల్లో, పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం.

"తస్మాత్‌ సర్వే ద్విజా శ్శాక్తాః న శైవా న చ వైష్ణవాః"

ద్విజులందరూ గాయత్రీ దేవతారాధనం చేసే వారే కనుక, వారు వైష్ణవులైనా, శైవులైనా- ముందుగా అందరూ శాక్తేయులు.

గాయత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలూ సృష్టిలోని ఇరవై నాలుగ తత్త్వాలకు సంకేతాలు, కర్మేంద్రియాలు ఐదు. (కాళ్ళు, చేతులు, వాక్కు, మల, మూత్రావయవాలు) జ్ఞానేంద్రియాలు ఐదు, (చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు) , పంచప్రాణాలు(ప్రాణ, %్‌పాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు), పంచభూతాలు(నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం), మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగు(అంతఃకరమ చతుష్టయం) కలసి సృష్టిలోని ఇరవై నాలగు తత్త్వాలు.

జీవుడు ఇరవై అయిదవవాడు. ఇరవైనాలుగు అక్షరాల గాయత్రీ మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై అయిదు అక్షరాలు అవుతాయి.

ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి. ఒక్కొక్క చంధస్సు, ఒక్కొక్క దేవత ఉన్నారు. ఇరవై నాలుగు, రంగులు, ఇరవై నాలుగు శక్తులు, ఇరవైనాలుగు ముద్రలూ గల గాయత్రీ మంత్రానికి వేదోక్తమైన సంప్రదాయాన్ని అనుసరించి, కవచము, హృదయము, శక్తి, బీజము, కీలకము ఉన్నాయి. ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి.

ముందుగా గాయత్రీ కవచాన్ని ధారణ చేసి, తర్వాత గాయత్రీ మంత్రాన్ని హృదయంలో భవన చేయాలి. గాయత్రీ హృదయానికి నారాయణుడే ఋషి గాయత్రియే చందస్సు. పరాశక్తియే దేవత.

గాయత్రీ దేవతకు ఐదు ముఖాలు. నాలుగు దిక్కుల వైపు నాలుగు, ఐదవది ఊర్ధ్వముఖంగాను ఉంటాయి. ఆమెకు పదిచేతులు. కుడి ఎడమల రెండు చేతులలో రెండు పద్మాలను , మిగిలిన ఎనిమిది చేతులలో వరద, అభయ అంకుశ కళాది శక్తులనూ ధరించి ఉంటుంది. సాధకుడు ఇలా భావించి, సుఖాసనాసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి.

"ఓ జగన్మాతా!నీవే ఆదిశక్తివి. అనంత రూపాలు ధరించి, అంతటా వ్యాపించి, భక్తులను అనుగ్రహించే దయా స్వరూపిణివి. త్రిసంధ్యలకూ దేవతవైన నీకు నమస్కారము. సావిత్రి, సరస్వతి, వైష్ణవి, రౌద్రి అనే పేర్లతో వ్యవహరింపబడే దేవతవు నీవే. మహర్షులు నిన్ను #9; ప్రాతఃకాలంలో బాలగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు.

హంసవాహన అయిన బ్రాహ్మీ శక్తి, గరుడవాహన అయిన వైష్ణవీ శక్తి, వృషభవాహన అయిన సావిత్రీ శక్తి నీవే. భూమిపై ఋగ్వేదాన్ని, అంతరిక్షంలో యజుస్సామ వేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు. నీ నేత్రాల నుండి, సాత్విక బావమైన స్వేదం నుండి, ఆనంద రూపమైన కన్నీటి నుండి పది అంశాంశ రూపాలను సాధకులు వరేణ్య, వరద, వరిష్ఠ, వరవర్ణిని, గరిష్ఠా, వరారోహ, నీలగంగా, సంధ్యా, భోగమోక్షదా అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు.

మర్త్యలోకంలో భాగీరథి, పాతాళంలో భోగవతి, స్వర్గంలో గంగ అనే పేర్లతో వ్యవహరింపబడేది. నీవే. త్రిలోత వాసులనూ తరింప చేయడానికి నదీరూపంలో ప్రవహించే దేవతవు నీవే. భూలోకంలో శోక భారాన్ని వహిస్తూ, భువర్లోకంలో సిద్ధివై, సత్యలోకంలో సత్యస్వరూపిణివై నీవే ప్రవహిస్తూ ఉంటావు.

ఉపాసకుని శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్నాది దశవిధ ప్రాణ నాడులూ నీవే. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు నీ స్వరూపాలే. హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి

నీవే. మూలాధారంలోని కుండలినీ శక్తి నీ రూపమే" అని సాధకులు ఆమెను ధ్యానిస్తారు.

ఈ విధంగా గాయత్రీ దేవతా వైభవాన్ని వివరించి, గాయత్రీ సహస్ర నామాలను, దీక్షావిధానాన్ని వ్యాసమహర్షి జనమేజయునకు వివరించాడు.

జనమేజయుని ఆసక్తిని, అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించాడు.

వేదము నుండి ఉద్భవించిన గాయత్రీ మంత్రాన్ని ద్విజులు గురుముఖతః విధి విధానంగా గ్రహించి, శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే, సర్వశక్తులూ స్వాధీనమవుతాయి. భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక.

గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రీ మాతను ఉపాసించి, దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింప చేశాడు.

"నమో దేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే|é

వ్యాహృత్యాది మహా మంత్ర రూపే ప్రణవ రూపిణి||

భక్త కల్పలతాం దేవీం అవస్థాత్రయ సాక్షిణీం|

తుర్యాతీత స్వరూపాం చ సచ్చిదానంద రూపిణీం|| "

అని గౌతముడు గాయత్రీ మాతను ప్రార్థించి, ఆమె పరిపూర్ణనుగ్రహానికి పాత్రుడయ్యాడు.

గాయత్రీ దేవతానుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపురాసులనూ, షడ్రసోపేతమైన వంటకాలను, నానాలంకార వస్త్ర మాల్య భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంద్యుడయ్యుడు.

కనుక, జనమేజయ మహారాజా! గాయత్రీ రూపాన్నీ మనసులో భావించినా, ఆమెను పూజించినా, ఆమె మంత్రాన్ని జపించినా, సర్వారిష్టాలు తొలగి, సకల సంపదలూ లభిస్తాయి.

గాయత్రీ మంత్ర శక్తిని దుర్వినియోగం పరచి, లోకకంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు.

గాయత్రీ మంత్ర శక్తిని సద్వినియోగం చేసి, గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి, లోకాన్ని ఆదుకుని లోకపూజ్యుడయ్యాడు.

కనుక మంత్ర శక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే గాని, స్వార్థంతో, అహంకారంతో, ఆ శక్తిని దుర్వినియోదం చేయరాదు.

ఈ విధంగా వ్యాసమహర్షి జనమేజయునకు గాయత్రీ వృత్తాంతాన్ని సవిస్తరంగా అందించాడు.(Shri Kanchi Kamakoti Peetham).

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: