తెనాలి రామలింగడు
*తెనాలి రామకృష్ణ చికటకవి ఎలా అయ్యాడో తెలిపే నేపథ్యం*
*తెనాలి రామలింగడు*
*చిన్నప్పటినుంచి రామలింగం వట్టి చిలిపివాడు. ప్రతివాళ్లనీ పేర్లు పెట్టేవాడు. అతనికి నదురు బెదురు ఏకోశానా ఉండేది కాదు. తనకు నచ్చనిదాన్ని వెక్కిరించుటంలో మొనగాడు.*
*ఒకరోజున రామలింగం వీధిలో ఆడుకొంటూవున్నాడు. ఒక యోగి ఆ దారిని పోతూ అతన్ని చూచాడు. రామలింగం రూపురేఖల్లోనూ, అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి. వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గిరకు పిలిచి శక్తి మంత్రం ఉపదేశించి యిలా చెప్పాడు:*
*"నాయనా! ఈ మంత్రం వెయ్యిసార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే, దేవి నీకు ప్రత్యక్ష మౌతుంది. వెయ్యి తలలతో కనిపిస్తుంది. నీవు భయపడగూడదు. అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకొన్న వరం ఇస్తుంది," అని చెప్పి యోగి వెళ్లి పోయాడు.*
*ఒక మంచిరోజు వచ్చిందాకా ఆగి, ఆనాటి అర్ధరాత్రిపూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్లి యోగి చెప్పిన మంత్రం వెయ్యిసార్లు జపించాడు. కాళికాదేవి వెంటనే వేయి తలలతో ప్రత్యక్షమైంది. రామలింగం భయపడలేదు. అతనికి ఏమితోచిందో ఏమో ఫక్కున నవ్వాడు.*
*దేవి రామలింగాన్ని "ఎందుకు అబ్బాయీ, నవ్వుతా?"వని అడిగింది.*
*"మీరు కోపగించుకోమంటే మనవి చేసుకొంటాను," అన్నాడు జంకు గొంకూ లేకుండా రామలింగం,*
*దేవి సరేనన్నది. రామలింగం అప్పుడు చెప్పాడు:-*
*"అమ్మా! మాకు ఒకటే ముక్కు, కాని రెండుచేతులున్నాయి. ఎప్పుడన్నా జలుబు చేస్తే ఈ ఒకముక్కు చీదుకోటానికే రెండుచేతులు చాలటంలేదు. ఇక మీకా వెయ్యితలలు. కర్మంజాలక జలుబుచేస్తే ఆ వెయ్యిముక్కులు చీదుకోటానికి ఈ రెండుచేతులు ఎలా చాలుతాయా అని నవ్వు వచ్చింది."*
*దేవికూడా అతనిమాటకు నవ్వి - "నాయనా, నన్నుచూచి నవ్వినవాడివి ఇక నువ్వు ఎవరిని చూచి నవ్వవు గనుక. నీవు తప్పకుండా వికటకవి వవుతావు," అంది.*
*రామలింగం నమస్కరించి "తల్లీ ఎటుతిప్పి చదివినా చెడనిమాట వరంగా ఇచ్చావు. ఇంతకంటే నాకు ఏమికావాలి," అన్నాడు.*
*కాళిక అతని తెలివితేటలకు మెచ్చుకొన్నది. 'వికటకవి' అనే మాట ఎటు తిప్పిచదివినా మారేది ఏమి ఉంది> దేవి సంతోషించి మరొక వరంకూడా అతనికి ఇచ్చింది. "నీవు రాజాస్థానంలో విదూషకుడ వవుతావు. అంతే కాదు. నీలాగా పద్యం కూర్చటం మరొకరికి చేతకాదు." అని ఆశీర్వదించింది.*
Comments
Post a Comment