*శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ దత్తాత్రేయ షట్చక్ర జాగరణ స్త్రోత్రం*
*శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ దత్తాత్రేయ షట్చక్ర జాగరణ స్త్రోత్రం*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
🕉🌞🌏🌙🌟🚩
కుండలిని జాగృతికి, దత్తోపాసనకు, శ్రీ దత్త ప్రభువు దివ్య అనుగ్రహమునకు ఈ స్తోత్రరాజం విశేషమైనది.
1) దిగంబరం భస్మసుగన్ధలేపనం
చక్రం త్రిశూలం డమరుం గదాం చ ।
పద్మాసనస్థం ఋషిదేవవన్దితం
దత్తాత్రేయధ్యానమభీష్టసిద్ధిదమ్ ॥
భావం:- దిగంబరులు, భస్మ, సుగంధములతో అలంకరించిన దేహము కలవాడు, చక్రం,త్రిశూలం, డమరుకం,గద, ధరించినవాడు,పద్మాసనంలో విరాజమానులై ఋషులు,దేవతలతో పూజింపబడుతున్న దత్తాత్రేయుని ధ్యానించువారి అభీష్టములు సిధ్ధించును.
2) మూలాధారే వారిజపద్మే సచతుష్కే
వంశంషంసం వర్ణవిశాలైః సువిశాలైః ।
రక్తం వర్ణం శ్రీభగవతం గణనాథం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥
భావం:- మూలాధారచక్రస్థానం లో నాలుగు దళములు వున్న పద్మం వుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము లకు సంకేతం. చిక్కటి ఎరుపు వర్ణం తో కూడివున్న ఆ దళాలపై వం, శం, షం, సం అనే బీజాక్షరాలు వుంటాయి. దీనికి భగవంతుడు (అధిష్ఠాన దేవత) గణనాథుడు. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించుచున్నాను.
3) స్వాధిష్ఠానే షట్దలపద్మే తనులింగే
బాలాన్తైస్తద్వర్ణవిశాలైః సువిశాలైః ।
పీతం వర్ణం వాక్పతిరూపం ద్రుహిణం తం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥
భావము:- స్వాధిష్టానచక్రం ( లింగమూలమున వుండు) ఆరు దళములు కలిగిన పద్మము వలె వుండి, అగ్ని తత్వం కలది. సింధూర వర్ణం కల ఈ పద్మం మీద బం, భం, యం,యం,రం , లం, అక్షరాలు వుంటాయి. దీని అధిపతి బ్రహ్మ. వాహనం మొసలి. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
4) నాభౌ పద్మే పత్రదశాంకే డఫవర్ణే
లక్ష్మీకాన్తం గరూఢారూఢం మణిపూరే ।
నీలవర్ణం నిర్గుణరూపం నిగమాక్షం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥
భావము:- మణిపూరక చక్రం బొడ్డు మూలములో పది దళములతో కూడిన పద్మము లాగా వుండును. బీజాక్షరాలు డ,ఢ,ణ,త,థ ద,ధ,న,ప,ఫ లిఖించబడి యుండును. అధిపతి లక్ష్మీకాంతుడు ( విష్ణువు). మణిపూరక మందున్న మేఘం నిలవర్ణము కలది, నిర్గుణ రూపం కలది, అంధకారమును పోగొట్టు మెరుపు లాంటిది. శ్రీగురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
5) హృత్పద్మాంతే ద్వాదశపత్రే కఠవర్ణే
అనాహతాంతే వృషభారూఢం శివరూపమ్ ।
సర్గస్థిత్యంతాం కుర్వాణం ధవలాంగం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి !!
భావము:- హృదయము వెనుక విలసిల్లే ఈ చక్రం పన్నెండు దళములు కల పద్మము వలె వుండును. క,ఖ,గ,ఘ,ఙ,చ,ఛ,జ,ఝ,ఞ,ట,ఠ అను అక్షరములు కలది. అనాహత (తగలకుండా వచ్చే శబ్దం) చక్రమునకు అధిదేవత సృష్టి స్థితి లయ కారకుడు, ధవల వర్ణము కలవాడు, వృషభ వాహనుడైన శివుడు. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
6) కంఠస్థానే చక్రవిశుద్ధే కమలాన్తే
చంద్రాకారే షోడశపత్రే స్వరవర్ణే
మాయాధీశం జీవశివం తం భగవంతం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥
భావము:- విశుద్ధ చక్రం ( పవిత్రము చేయునది) కంఠస్థానంలో వెనుక పదహారు దళములతో కూడిన శ్వేత వర్ణ కమలమ వలె వుండును.
అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ ,ఋ,ౠ,ఎ,ఏ,ఐ ,ఒ ,ఓ,ఔ,అం, అః అక్షరాలు వుండును. ఇది చంద్రుని ఆకారము లో వుండును. పదహారు అక్షరాలు చంద్రుని పదహారు కళలకు, శుద్ధ చైతన్యమునకు సంకేతము. దీని అధిపతి మాయాధీశుడైన శివుడు.శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
7) ఆజ్ఞాచక్రే భృకుటిస్థానే ద్విదలాన్తే
హం క్షం బీజం జ్ఞానసముద్రం గురూమూర్తిం
విద్యుత్వర్ణం జ్ఞానమయం తం నిటిలాక్షం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥
భావము:- ఆజ్ఞాచక్రం భృకుటి స్థానంలో రెండు దళములతో కూడిన పద్మము వలె వుండును. హం , క్షం అను బీజాక్షరాలు వుండును. దీనినే జ్ఞానచక్షువు అంటారు. ఈ చక్రమును సాధన చేస్తే, ఆత్మ దర్శనం అయి బ్రహ్మ జ్ఞాని అవుతాడు. ప్రకాశవంతమైన వర్ణముతో, జ్ఞానమయుడు, త్రినేత్రుడు, అయిన సదాశివుడు దీనికి అధిపతి. శ్రీ గురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
8) మూర్ధ్నిస్థానే వారిజపద్మే శశిబీజం
శుభ్రం వర్ణం పత్రసహస్రే లలనాఖ్యే
హం బీజాఖ్యం వర్ణసహస్రం తూర్యాంతం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥
భావము:- కపాలం పై బాగంలో (బ్రహ్మారంధ్రం అని కూడా అంటారు ) ఓం కారంతో వేయి దళముల పద్మము లాగా వుండును. ప్రకాశించు తెల్లని రంగులో సకల వర్ణములు కలిగి వుండును. హం బీజాక్షరాలు తో వుండును.ఆత్మజ్ఞానం సాధించిన పరమహంసలు పొందేస్థితి. పరిపూర్ణ జ్ఞానమునకు ప్రతీక. అద్వైత స్థితి. శ్రీ గురు మూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
9) బ్రహ్మానన్దం బ్రహ్మముకున్దం భగవన్తం
బ్రహ్మజ్ఞానం జ్ఞానమయం తం స్వయమేవ
పరమాత్మానం బ్రహ్మమునీద్రం భసితాఙ్గం
దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥ 9॥
భావం:- బ్రహ్మానందము ప్రసాదించువాడు, బ్రహ్మముకుందుడు, భగవంతుడు, బ్రహ్మజ్ఞాని మరియు జ్ఞానమయుడు, నిర్గుణ శుద్ధ చైతన్య ముతో ప్రకాశించుచూ స్వయంగా పరమాత్మ అయిన వాడు, బ్రహ్మ మునీంద్రుడు, ప్రకాశమానమైన అంగములు కలవాడు, శ్రీగురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించు చున్నాను.
ఇతి శ్రీమద్శఙ్కరాచార్య విరచితం శ్రీదత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రం సమ్పూర్ణమ్ ।
🕉🌞🌍🌙🌟🚩
*శ్రీ దత్త షట్చక్ర జాగరణ స్త్రోత్రం ఒకొక్క చక్రానికి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం సాధన పారాయణ 40 రోజులు చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి.*
*సాధన :- పద్మాసనం లో కూర్చొని వెన్ను నిటారుగా ఉంచి మొట్టమొదట మూలాధారం నుండి మొదలు పెట్టి సహస్రారం వరకు,..., ఒక్కొక్క చక్రానికి సంబంధించిన స్త్రోత్రంను ఆచక్రం వద్ద పారాయణ చేయాలి.*
*ఈ పారాయణ రోజుకి 11 సార్లు కన్నా ఎక్కువ చేయకూడదు దాని నుండి వచ్చే శక్తి తట్టుకోవడం కష్టం అతిగా చక్రాలు క్రియావంతం అయినా సమస్యలు వస్తాయి
గర్భిణీ స్త్రీలు చేయకూడదు.*
*ఏ చక్రానికి సంబంధించిన స్త్రోత్రం చేస్తున్నారో ఆ చక్రం మీద దృష్టి పెట్టి చేయవలెను.*
*11 సార్లు పారాయణ ముగిసిన తర్వాత శ్వాస మీద ధ్యాస ఉంచి 15 నిమిషాలు ఉంచండి.భైరవ ముద్ర,కుండలిని ముద్ర,నాగ ముద్ర ఒకొక్క ముద్ర 5 నిమిషాలు చెప్పున 15 నిమిషాలు ధ్యానం చేయాలి.*
*తరువాత గంట వ్యవధి ఇచ్చి మీ ఇష్ట దేవత మంతాన్ని గాని స్త్రోత్రం గాని దండకం కానీ 108 సార్లు పారాయణ చేయండి.*
*ఇలా 40 రోజులు చేయండి మీ శక్తి ని బట్టి
90 రోజులు కూడా చేయండి.*
*సాత్విక ఆహారం బ్రహ్మచర్యం
అవసరానికి మించి ఎక్కువగా వృధాగా మాట్లాడకూడదు పనికి వచ్చే మాటలు ఎంత సేపు అయిన పరవలేదు ఉపయోగం లేనివి వృదా మాటలు ఈ సాధన చేసినప్పడు వద్దు.ఎందుకు అంటే విశుద్ధి చక్రంలో శక్తి క్షీణిస్తుంది ఈ చక్రం గొంతు దగ్గర ఉంటుంది.*
*ఈ దత్త షట్చక్ర స్త్రోత్రం ఒకొక్క చక్రానికి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం పారాయణ 40 రోజులు చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి.*
*మనిషి శరీరంలోని శక్తి కేంద్రాలనే యోగ సాధకులు చక్రాలంటారు.మనిషి వెన్నుపూసలో నిద్రాణ స్థితిలో దాగివుండే ఒక అనిర్వచనీయమైన శక్తినే కుండలిని శక్తిగా యోగ శాస్త్రం అభివర్ణిస్తోంది. విశేష యోగ సాధన ద్వారా వెన్నుపూస దిగువనుండే మూలాధారం వద్ద నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసి సహస్రారం వరకు సుషుమ్న నాడి సాయంతో చేర్చే పద్ధతిని కుండలినీ యోగం వివరిస్తోంది. ప్రాణ శక్తిని సమతుల్యం చేయటం తెలుసుకున్న మనిషికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది.*
*చక్రాలు*
----------------
*మూలాధార చక్రము:- గుద భాగానికి పైన ,లింగ స్థానానికి కింది భాగంలో ఈ చక్రం ఉంటుంది. ఇక్కడే కుండలినీ శక్తి నిద్రాణమై ఉంటుంది. ఈ చక్రం పనితీరు బాగున్న వారు ధైర్యం, భద్రతతో జీవిస్తారు. ఈ చక్రం పనితీరు దెబ్బతిన్న వ్యక్తులు నిరంతరం అసంతృప్తి, భయం వంటి భావనలతో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. వీరు తరచూ ఎముకలు, దంతాలు, పేగులకు సంబంధించిన అనారోగ్యాలను ఎదుర్కొంటుంటారు. మొక్కలు పెంచటం, పచ్చిక మీద చెప్పులు లేకుండా నడవటం వల్ల ఈ చక్ర పనితీరును మెరుగుపరచుకోవచ్చు. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని వెన్నుపూస దిగువ భాగాన ఎరుపు రంగు ఉన్నట్లు భావిస్తూ 'నేను సరైన రక్షణలో ఉన్నాను. నా అవసరాలన్నీ చక్కగా సమకూరుతున్నాయి. నాకెలాంటి భయం లేదు' అని భావన చేయటం ద్వారా ఈ చక్రం పనితీరును మెరుగు పరచుకోవచ్చు.*
*స్వాధిష్ఠాన చక్రము:- బొడ్డు దిగువ భాగాన ఉండే నారింజ రంగు చక్రమే స్వాధిష్ఠానం. ఇది భావోద్వేగాల కేంద్రం. మంచి చెడులను భరించే శక్తితో బాటు ఇంద్రియాలనూ ఇది ప్రభావితం చేస్తుంది. ఆనందమయ జీవితాన్ని కోరే ప్రతి వ్యక్తీ ఈ చక్ర గతిని గాడిలో పెట్టుకోవాలి. దీని పనితీరు దెబ్బతింటే ఆ ప్రభావం మనసు మీద పడి మనిషి వ్యసనాల పాలవుతాడు. నిజ జీవితంలో కోల్పోయే ఆనందాన్ని వ్యసనాల ద్వారా పొందేందుకు ప్రయత్నిస్తూ ఊహా జగతిలో ఉండిపోతాడు. ఈ చక్రం పనితీరు బాగుండాలంటే బొడ్డు కింద భాగంలో నారింజ రంగును ఊహించుకొని 'ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచే స్థితిని ఆహ్వానిస్తాను. వాటిని ఆసాంతం అనుభవిస్తాను' అని పదే పదే మనసులో అనుకోవాలి.*
*మణిపూరక చక్రము:- బొడ్డు పై భాగంలో పసుపు రంగులో ఉండే చక్రమే మణిపూరకం. మానసిక ప్రవృత్తిని, ఆత్మ నిగ్రహాలను ఇది ప్రభావితం చేస్తుంది. సమస్యలను ఎదుర్కొని సానుకూల పరిష్కారాలను కనుగొనేందుకు ఈ చక్రం దోహదపడుతుంది. దీని పనితీరు బాగున్న వ్యక్తులలో ఏదో తెలియని ఆకర్షణ, వెలుగు ఉంటుంది. దీని పనితీరు దెబ్బతిన్న వ్యక్తులు సొంతనిర్ణయాలు తీసుకోలేరు. తరచూ మాట మార్చటం, ఇతరుల మీద ఆధారపడటం, ఒప్పుకున్న పనిని పూర్తి చేయలేకపోవటం, ఒకే సమయంలో పలు పనులు మొదలుపెట్టి ఒక్క పనీ చేయలేక పోవటం, ఎదుటి వారిని సంతోషపు పెట్టేందుకు సొంత సమయాన్ని వృధా చేసుకోవటం వంటి లక్షణాలుంటాయి. ఈ పరిస్థితి మారాలంటే క్రమబద్ధమైన జీవనానికి అలవాటు పడాలి. రోజూ వ్యాయామం చేయట, ధ్యానం చేయటం తప్పనిసరి. బొడ్డు, గుండె మధ్య భాగంలో పసుపు రంగు గోళాన్ని ఊహించుకొని ' నేను చేసే ప్రతి పనికీ నేనే బాధ్యుడను. నన్ను నేను అదుపు చేసుకోగలను' అని మళ్ళీ మళ్ళీ భావన చేసుకోవటం ద్వారా ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది.*
*అనాహత చక్రము:- ఇది హృదయ స్థానములో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ప్రేమ వంటి సున్నితమైన భావనలకు ఇది కేంద్రం. ఈ చక్రం ఛాతీ, వీపు భాగాల పనితీరును నియంత్రిస్తుంది. ప్రతి క్షణాన్ని ప్రేమించేలా చేయటంతో బాటు ప్రాణ శక్తిని, చైతన్యాన్ని పెంపొందిస్తుంది. దీని పనితీరు బాగున్న వారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి భేషజాలు లేకుండా వాస్తవాలని అంగీకరిస్తారు. ఈ చక్రం పనితీరు దెబ్బ తిన్నవారికి ఏ పనిలోనూ సంతోషం, సంతృప్తి లభించవు. ఎవరినీ నమ్మరు. ఎప్పుడూ తక్షణ ఫలితాలను ఆశిస్తారు. పనులను మధ్యలోనే వదిలేస్తారు. పెంపుడు జంతువుల ఆలనా పాలనా చూడటం ద్వారా ఈ చక్రం పనితీరు బాగుపడుతుంది. గుండె భాగంలో ఆకుపచ్చ గోళాన్ని ఊహిస్తూ ' నేను అందరి ప్రేమనూ పొందగలను. నా చుటూ ఉన్నవారికి ప్రేమను పంచుతాను. మంచి చెడులను ఏకరీతిన జీవితంలోకి ఆహ్వానిస్తాను.' అని రోజూ పదే పదే మననం చేసుకోవటం ద్వారా ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది.*
*విశుద్ధి చక్రము:- కంఠ స్థానములో నీలి రంగులో ఉండే ఈ చక్రం సృజన, భావ వ్యక్తీకరణకు కేంద్రం. ఇది దవడ, మెడ, ఊపిరితిత్తుల పనితీరును నియంత్రిస్తుంది. దీని పనితీరు బాగున్న వారు ఏ రంగంలోనైనా నాయకులుగా, మార్గదర్శులుగా ఎదుగుతారు. వీరిమాటను అందరూ ఆమోదిస్తారు. ప్రణాళికా బద్ధంగా పనిచేయటమే గాక ఇతరులు చెప్పేదాన్నీ శ్రద్దగా వింటారు. ఈ చక్రం పనితీరు దెబ్బవారు కంగారు, గందరగోళానికి గురికావటం, అనాలోచితంగా పనులు చేయటం వంటి ఇబ్బందులకు గురవుతారు . మనసుకు సంతోషాన్ని కలిగించే పనులు చేయటం, ఇంటిపని, రచనా వ్యాసంగం, పుస్తకాలు చదవటం, క్రీడలు వంటి వాటిని అలవాటు చేసుకుంటే ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది. ప్రశాంతంగా కూర్చొని గొంతు భాగాన నీలిరంగు గోళం ఉందని భావిస్తూ ' నేను ఏ విషయాన్నైనా కొత్తగా ఆలోచిస్తాను. దాన్ని నలుగురికీ ఆసక్తి కలిగేలా చెప్పగలను' అని మననం చేయటం ద్వారా కూడా ఈ చక్రం పనితీరు మెరుగుపడుతుంది.*
*ఆజ్ఞా చక్రము:- భ్రూ (కనుబొమల) మధ్య భాగంలో ముదురు నీలం రంగులో ఉండే ఈ చక్రమే అంతర్బుద్దికి కేంద్రం. ఊహించటం, ఆలోచించటం దీని పని. దీన్నే త్రినేత్రం అనీ అంటారు. దీని పనితీరు బాగుంటే భవిష్యత్తులో రానున్న సంకేతాలను, మార్పులనూ సరిగా ఊహించగలరు. కళాకారులుగా గుర్తింపు పొందుతారు. ఈ చక్రం పని తీరు దెబ్బ తిన్నవారు కంటికి కనిపించే వాటినే నమ్ముతారు. సొంతనిర్ణయాలు తీసుకోలేరు. చిన్న చిన్న విషయాలకూ అతిజాగ్రత్త పడుతుంటారు. బొమ్మలు వేయటం, రంగులద్డటం వంటి పనులతో ఈ చక్రం పనితీరు మెరుగు పడుతుంది. కనుబొమ్మల మధ్యభాగంలో ముదురు నీలిరంగు గోళాన్ని ఊహిస్తూ ' అంతర్బుద్దిని, ఊహాశక్తిని పెంచుకొంటాను. ఈ క్రమంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటాను' అని సంకల్పం చెప్పుకుంటే ఈ చక్రం పనితీరు మెరుగు పడుతుంది.*
*సహస్రార చక్రము :- మాడు భాగంలో బచ్చలి పండు రంగులో ఉంటుంది. ఈ చక్రాన్ని చేరుకున్న వ్యక్తి జీవాత్మ, పరమాత్మల సంబంధాన్ని తెలుసుకుంటాడు. యోగ సాధన పరంగా కుండలిని ఆఖరి మజిలీ ఇది.ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు ఈ చక్రాన్ని చేరగలరు. దీనిని శైవులు శివస్థానమనీ, వైష్ణవులు పరమ పురుష స్థానమనీ, శాక్తేయులు దేవీస్థానమనీ, కొందరు హరిహర స్థానమనీ అంటారు. కుండలిని శక్తిని ఈ స్థానానికి చేర్చిన మనిషికి పునర్జన్మ నెత్తాల్సిన అవసరం లేదని యోగ శాస్త్రం స్పష్టం చేస్తోంది.*
ఈ దత్త షట్చక్ర స్త్రోత్రం ఒకొక్క చక్రానికి ఒకొక్క స్త్రోత్రం ఈ ఒక స్త్రోత్రం పారాయణ 40 రోజులు చేస్తే అద్భుత ఆశ్చర్య కరమైన మార్పులు వస్తాయి.
🕉🌞🌎🌙🌟🚩
Comments
Post a Comment