భృగువు-పులోమ

నిండు గర్భిణిని కామించిన పులోముడు


నైమిశారణ్యం - 4


భృగువు-పులోమ

భృగుపు బ్రహ్మమానస పుత్రుడు, ప్రజాపతి. హిరణ్యకశిపుని కుమార్తె అయిన దితి ఇతని పెద్దభార్య. వీరికి కలిగిన కుమార్తె దేవవర్ణి. భృగువు తన కుమార్తె అయిన దేవవర్ణిని, విశ్వదోబ్రహ్మకిచ్చి వివాహం చేశాడు. దేవదానవుల మధ్య భీకరయుద్ధం జరుగుతున్న రోజులలో శ్రీ మహావిష్ణువు అండ చూసుకుని దేవతలు విజృంభించారు. వారి ధాటికి నిలబడలేని రాక్షసులు యుద్ధభూమి నుంచి పారిపోయి భృగుపత్ని అయిన దితిని శరణు కోరారు. దితి వారికి అభయం ఇచ్చింది. ఈ సంగతి తెలిసి శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో దితిని సంహరించాడు.






తన భార్య మరణానికి శ్రీహరే కారణమని తెలిసుకున్న భృగుపు కుపితుడై "నాలాగే నీవు కూడా భార్యా వియోగ దుఖాన్ని అనుభవిస్తావు." అని శ్రీహరిని శపించాడు. భృగువు యిచ్చిన శాపాన్ని శ్రీహరి, రామావతార కాలంలో సీతా వియోగం ద్వారా అనుభవించాడు. అనంతరం భృగువు, పులోమ అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ పులోమ విషయం కాస్త ప్రస్తావించాలి.



పులోమ అతిలోక సౌందర్యవతి. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన "పులోముడు" అనే దైత్యుడు, పులోమను, వివాహం చేసుకోవాలని సంకల్పించి, తన మనోరథాన్ని పులోమ తండ్రికి తెలిపాడు. పులోముడు కశ్యప ప్రజాపతి కుమారుడైనప్పటికీ రాక్షసప్రవృత్తి కలవాడగుటచేత, పులోమను అతనికిచ్చి వివాహం చెయ్యడానికి నిరాకరించాడు ఆమె తండ్రి. అప్పటి నుండి పులోమునికి పులోమ మీద వ్యామోహం అలాగే వుండిపోయింది. ఈ విషయాలేమీ పులోమకు తెలియవు. ఆ తర్వాత పులోమ వివాహం భృగు మహర్షితో జరిగిపోయింది. పులోమ భృగు మహర్షి సేవలో ఆదర్శమయ, అన్యోన్యానురాగ వైవాహిక జీవితాన్ని అనుభవిస్తోంది. వారిరువురి దాంపత్య సంసార మథనంలో పులోమ గర్భవతి అయింది.


ఒకరోజు నిత్యకర్మానుష్టానానికి భృగువు నదీ స్నానానికి వెళ్ళాడు. ఆ సమయంలో పులోమను అపహరించి తీసుకుపోవాలనే ఆలోచనతో పులోముడు భృగుపు ఆశ్రమానికి వచ్చాడు. ఒంటరిగా వున్న పులోమను చూడగానే అతనిలోని కామావేశం కట్టలు తెంచుకుంది. ఆమె వైపు అడుగు వెయ్యబోయాడు. అగ్నిహోత్ర గృహంలో ఉన్న అగ్నిదేవుడు ఒక్కసారి ప్రజ్వరిల్లాడు. అది చూసిన పులోముడు భయపడకః "అగ్నిదేవా, నేను మనసుపడ్డ ఈ పులోమ ప్రస్తుతం నీ సంరక్షణలో ఉన్నదని అర్థమైంది. అయినా నాకు భయం లేదు. నీవు పాపరహితుడవు అనే ఉద్దేశ్యంతో నిన్నో ధర్మ సందేహం అడుగుతాను. తీరుస్తావా " అని అడిగాడు అగ్నిదేవుడు అంగీకరించాడు.


"హుతాశనా, ఈ పులోమను నా మనస్సాక్షిగా వరించాను. కానీ ఈమె తండ్రి నా మనస్సాక్షికి విరుద్ధంగా నా ప్రియురాలైన ఈ పులోమను భృగువుకిచ్చి వివాహం చేసాడు ఈమె తండ్రి. ఇప్పుడు చెప్పు. ఈ పులోమ నా భార్యా? భృగువు భార్యా? నిజం చెప్పు " అని గద్దించాడు పులోముడు.
ఈ సంభాషణంతా భయభ్రాంత చిత్తంతో వింటోంది పులోమ. "దానవనందనా, నీవు మనసుపడ్డ పులోమ ఈమెయే. కానీ, నీవు విధి పూర్వకంగా, మంత్ర సమేతంగా ఈమెను వివాహమాడలేదు. వేదోక్త క్రియాకలాపంతో, శాస్త్ర పూర్వకంగా నేను సాక్షీభూతుడనై ఉండగా భృగువు ఈ పులోమను వివాహం చేసుకున్నాడు. ఈమె భృగువుకు ధర్మబద్ధమైన ధర్మపత్ని. పైగా పూర్ణ గర్భవతి. ఈమెను కామ దృష్టితో చూడడం మహా పాపం. బలముందనే గర్వంతో అధర్మానికి సిద్ధపడితే అంతమైపోతావు " అని హెచ్చరించాడు అగ్నిదేవుడు.


కానీ మదోన్మత్తుడైన పులోమునకు అగ్నిదేవుని హితోపదేశాలు రుచించలేదు. వెంటనే అతడు భీకర వరాహరూపం ధరించి, పులోమను ఎత్తుకుని ఆకాశానికి ఎగిరాడు. ఆ వేగానికి పులోమ గర్భంలోనున్న శిశువు తన యోగబలం చేత తల్లి ఉదరం నుంచి జారి (చ్యుతమై) వెలుపలికి వచ్చి కోపంగా పులోముని వంక చూసాడు. శతకోటి సూర్యకిరణ సమానమైన ఆ పసివాని చూపులకు పులోముడు, పులోమను వదిలి, మండి బూడిదగా మారి నేల మీద పడ్డాడు.


పులోమ, తన బిడ్డను ఎత్తుకుని, తనకు జరిగిన అవమానానికి విలపిస్తూ బ్రహ్మలోకానికి బయలుదేరింది. ఆమె కన్నీరు మహా ప్రవాహంగా మారి ఆమె వెనుకే బ్రహ్మలోకం దాకా వచ్చింది. బ్రహ్మ, విలపిస్తున్న తన కోడలు పులోమను, ఆమె వెనుకే వచ్చిన నదిని చూసాడు. జరిగినది తెలుసుకుని బ్రహ్మ పులోమను ఓదార్చి, ఆమె కన్నీరు నుంచి పుట్టిన ఆ నదికి "వధూసర"  అని పేరు పెట్టాడు తర్వాత ఆమెను భృగువుకు అప్పగించాడు. కళంకరహిత అయిన పులోమను భృగువు స్వీకరించాడు. ఇలా భృగువు, పులోమకు పుట్టినవాడే "చ్యవనుడు". తల్లి గర్భం నుంచి జారి (చ్యుతుడై) జన్మించాడు కనుక అతనికి చ్యవనుడు అని పేరు పెట్టారు భృగుదంపతులు. ఆ తర్వాత చ్యవనుడు విద్యాభ్యాసానికి గురుకులానికి వెళ్లాడు. పులోమ, భృగువులు తపోమయ వానప్రస్థ జీవితాన్ని అనుభవిస్తున్నారు.






Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: