కొప్పు చూడు... కొప్పందం చూడు

కొప్పు చూడు... కొప్పందం చూడు!
జుట్టంటూ ఉంటే ఎన్ని రకాల కొప్పులు చుట్టినా నప్పుతుందని సామెత. కేశసంపదను స్త్రీ సౌభాగ్యంగా ఈ దేశం పరిగణించింది. సుభద్ర జడ ‘పిరుద నొయ్యారంబు మెరయు చుండుట’ను విజయవిలాసంలో చేమకూర హృద్యంగా వర్ణించాడు. ఆమె కొలనులో మునిగినప్పుడు నీటిపై తేలియాడుతున్న జుట్టును చిక్కగా వ్యాపించిన నాచు(శైవాలలత)తో పోల్చాడు. రుక్మిణీదేవి పొడవైన కేశపాశాలను భాగవతం ‘జిత మత్త మధుకరశ్రేణి వేణి... గండుతుమ్మెదల బారులకన్న మిన్నగా ఉంది’ అంది. విప్పారిన జుట్టు నెమలి పింఛంలా ఉందన్నాడు వసుచరిత్రకారుడు. ‘అనయము నీలకంధరము అభ్రమున్‌ అన్న సమాఖ్యవారితోన్‌...’ అంటూ రామరాజ భూషణుడు చెప్పిన పద్యం సాహిత్యలోకంలో ప్రసిద్ధికెక్కింది. సీతమ్మతల్లి తన పొడవైన జడతో ఉరిపోసుకోబోయిందని వాల్మీకి రాశారు. ఆమె నీలవేణిని హనుమ వేదరాశిగా దర్శించాడంటూ వ్యాఖ్యాతలు ‘వేదేనాభి సయతి...’ అనే కృష్ణయజుర్వేదంలోని శ్రుతివాక్యాన్ని ప్రమాణంగా చూపించారు. స్త్రీకి కేశసంపద మంగళకరమని పెద్దల నిశ్చితాభిప్రాయం. పనికి అడ్డమొస్తోందనో, సౌకర్యంగా లేదనో జుత్తునుత్తరించే స్త్రీలకు సత్యభామను గుర్తుచేస్తారు ప్రవచనకర్తలు. ‘వేణిం జొల్లెము వెట్టి సంఘటిత నీవీ బంధయై... జుట్టు ముడెట్టి, కొంగు దోపి ఆమె ఏకంగా యుద్ధమే చేసింది సుమా’ అంటారు. కేశవర్ధినీ తైలాల వాణిజ్య ప్రకటనల్లో సినీతారలు పట్టులాంటి సొగసైన కురులను సుతారంగా జారవిడుస్తున్నప్పుడు ఇల్లాళ్ల కళ్లలో కనిపించే మెరుపును చూస్తే- కేశసంపద పట్ల స్త్రీల మక్కువ ఎంతటిదో తెలుస్తుంది.
‘నదమాపొక్కిలి, జాంబూ నదమా మెయిచాయ కోక నదమా పదమా, ఆపదమా(మేఘమా) జడ’ అన్న కూచిమంచి తిమ్మకవి ప్రసిద్ధ పద్యంలో శబ్దాలంకారం చెవికి ఎంత ప్రీతిని కలిగిస్తుందో- బారుజడ కంటికి అంత ఆకర్షణీయంగా ఉంటుందంటారు కవులు. ప్రబంధ కవులు మొదలు జొన్నవిత్తుల వంటి సినీకవుల వరకు స్త్రీల జడను ముచ్చటగా వర్ణిస్తూ వచ్చారు. అలిగిన సత్యభామను ‘నను భవదీయ దాసుని’ పద్యంలో శ్రీకృష్ణుడు ‘అరాళకుంతలా’ అని సంబోధిస్తాడు.  జడ పొడుగ్గా పాములా మెలికలు తిరిగి ఉందని అర్థం. పద్మినీ పరిణయకర్త యోగానంద సూరీ అదే అన్నాడు. దుర్యోధనుడి జండాపై సర్పధ్వజం ఉంటుంది... ‘దుర్యోధన ధ్వజ తులితమౌ కీల్జడ...’ నాయిక కీల్జడ అలా ఉందన్నాడు. వాల్జడో, కీల్జడో... అసలంటూ ఒత్తుగా జుత్తుంటే కదా అనేది ఆధునిక యువతుల బెంగ. వాతావరణ కాలుష్యం, ఒత్తిళ్లు, కుంకుడు రసానికి బదులుగా నెత్తిన రుద్దుతున్న రసాయనిక ద్రవ్యాల దుష్ప్రభావాల కారణంగా జుట్టు విపరీతంగాను, వేగంగాను రాలిపోవడం ఇప్పుడు మగ, ఆడ అందరి సమస్య. కురులకు మేలుచేసే ద్రవ్యాలను ఎలా ఎంచుకోవాలో తెలియక సినీతారలు చెప్పేవాటిని నమ్మి, కొనితెచ్చి వాడుతూ ఉంటాం. తీరా అవి మనకు పడకపోతే? కేరళవాసి ఫ్రాన్సిస్‌కు అదే జరిగింది. అనూప్‌ మేనన్‌ అనే నటుడు టీవీల్లో చెప్పాడని వాడిన ‘హెయిర్‌ క్రీం’ ఫ్రాన్సిస్‌కు ఫలితం ఇవ్వలేదు. దాంతో ఆయన వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ‘మీ హోటల్లో పదార్థాలు అస్సలు రుచిగా లేవు’ అని ఫిర్యాదు చేస్తే ‘నాకేం తెలుసు? నేనెప్పుడైనా తింటానా’ అని అడిగిన యజమాని తీరులోనే అనూప్‌ మేనన్‌ ‘నేను దాన్ని వాడను’ అని జవాబిచ్చాడు. న్యాయస్థానం ఒప్పుకోలేదు. జరిమానా విధించింది! పరిహారం దక్కింది సరే, తన బట్టతల సమస్య పరిష్కారం కానేలేదని ఫ్రాన్సిస్‌ బాధపడటమే కొసమెరుపు!

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: