మాట్లాడే మౌనం!
మాట్లాడే మౌనం!
సరిగ్గా మాట్లాడటం ఎంత కష్టమో, మౌనంగా ఉండటమూ అంతే కష్టం. అది మనసుకు సంబంధించిన భాష. వాక్కు అసలు పలకకపోవడం మౌనం కాదు. వాక్కును నియంత్రించడం మౌనం. అది ఒక యోగం, ఒక యాగం, సకలభాషలూ సమ్మిళితమైన విశ్వభాష.
అన్నివైపుల నుంచీ సమున్నతమైన భావాలను, ఆలోచనలను ఆత్మీయంగా ఆహ్వానించమంటుంది రుగ్వేదం. అలా చేయాలంటే మౌనారాధనం అవశ్యం అనుసరణీయం. ‘మౌనంగా ఉన్నవాడే ఎల్లెడలా ప్రశాంతతను పంచగలడు’ అంటాడు చాణక్యుడు.
మౌనంలో మహత్తరశక్తి దాగి ఉంది. ‘మాట్లాడటం వెండి అయితే మౌనం బంగారం’ అంటారు. మితంగా మాట్లాడటమూ మౌనమే అని చెబుతోంది మహాభారతం. హితంగా, మితంగా మాట్లాడలేకపోతే మౌనమే మేలని విదురనీతి. మౌనం మాట్లాడినంత తీయగా మరే భాషా మాట్లాడలేదు. మాటలకు అందని కమ్మని భావాలు మౌనభాషకు ఉంటాయి. మౌనం పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నవాడికే మౌనం విలువ తెలుస్తుంది. ఆదిశంకరులు, విద్యారణ్యస్వామి, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి, శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మొదలైన మహనీయుల సందేశాలు, ఉపదేశాలు సాధకులకు మౌనగ్రాహ్యాలయ్యాయి. మన సనాతన సంప్రదాయంలో జిజ్ఞాసువులంతా ప్రబోధాలను, ప్రవచనాలను మౌనంగానే ఆలకించి, అవగాహన చేసుకుని హృదయాల్లో నిక్షిప్తం చేసుకున్నారు. పారమార్థికులకందరికీ మౌనసాధనే ప్రధాన సాధనమైంది.
పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, చాడీలు చెప్పడం, అసంబద్ధంగా ప్రేలాపనలు చేయడం- ఈ నాలుగూ వాగ్దోషాలుగా చెబుతారు. వీటన్నింటికీ పరిహారం మౌనం. మౌనవ్రతం వల్ల ఈ నాలుగు దోషాలూ అంటవు. మౌనంగా ఉన్నప్పుడు మనసును ధ్యానానికి, వైరాగ్యానికి అంకితం చేసినట్లయితే అటువంటి మౌనానికో చరితార్థత ఏర్పడుతుంది. భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన భాష మౌనమే. మనిషి మనుగడకు జీవనయాత్రకు శబ్దం ఎలా చోదక శక్తి అయిందో మౌనమూ అంతే! వినయం, శ్రవణం మౌనానికి అనుసంధానమైనప్పుడు శ్రోతకు గ్రాహ్యశక్తి పెరుగుతుంది. ధౌమ్య పురోహితుడు ఉపదేశించిన సేవాధర్మనీతిని పాండవులు మౌనంగా, శ్రద్ధగా ఆలకించి ఆకళింపు చేసుకున్నారు. విదురనీతి అంతా ధృతరాష్ట్రుడు విన్నదే. విశ్వామిత్రుడి యాగసంరక్షణార్థం వెళ్లినప్పుడు రామలక్ష్మణులు మహర్షి ఉపదేశమంతా మౌనంగా వింటూ ఆయన్ని అనుసరించారు. శిష్యుడి అభ్యుదయానికి మౌనమే ఎంతో దోహదం చేస్తుంది.
వానాకాలంలో కప్పలు బెకబెకమని అరుస్తాయి. పంచమ స్వరంలో మధురంగా పలికే కోయిల తనకిది సమయం కాదని మౌనంగా ఉండిపోతుంది. అలాగే మూర్ఖుల సభలో పండితుడైనవాడు మౌనంగానే ఉండిపోతాడు. అక్కడ మౌనమే పరమభూషణం. పరిశీలనలో, పరిశోధనలో ప్రవచన శ్రవణ సందర్భంలో విజ్ఞత గలవాడు మౌనంగానే ఉంటాడు. ‘అలజడితో అలజడి చల్లారదు, మౌనమొక్కటే దాన్ని అణిచేది’ అంటారు బాపూజీ. మౌనంగా చేసే ప్రార్థన మహిమాన్వితమైనది. మౌనం శ్వాసను తగ్గించి ఆయుష్షును పెంచుతుంది. మనిషికి మానసిక ఆరోగ్యం ప్రసాదిస్తుంది. ఆంతరిక శక్తిని వృద్ధిచేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
పతంజలి యోగసూత్రాల్లో మౌనానికి ఇచ్చిన ప్రాధాన్యం ప్రశంసనీయమైనది. రజస్తమోగుణాలను తగ్గించి మౌనం సత్వగుణాన్ని పెంపొందింపజేస్తుంది. ముక్తికి ప్రధాన సోపానం మౌనమే.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
Comments
Post a Comment