శుద్ధ సలిలం
అంతర్యామి
Published : 10/01/2021 00:15 IST
శుద్ధ సలిలం
ఈ లోకంలో ఒక అనామకుడైనా అందరి శ్రేయస్సు కోసం పని చేయవచ్చు. అందరికీ ఉపయోగపడవచ్చు. అయితే బలమైన మాధ్యమం ఉంటేనే ఆ విషయం గాని, సందేశం గాని అంత బలంగా, విస్తృతంగా అనేకమందికి అందుతాయి. విషయం ఎంత ప్రధానమో, దాన్ని అందించే మాధ్యమం కూడా అంతే ప్రధానం. కారణం ఏదైనా ఒక వ్యక్తికి ఉన్న పేరు, ప్రాచుర్యం అతడి స్వరాన్ని అనేకమందికి చేరవేస్తుంది. చేరువ చేస్తుంది.
సాధారణ వ్యక్తికంటే అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తి తన అభిప్రాయాల్ని గాని, సందేశాన్ని గాని ఎక్కువమందికి అందజేయగలడు. ఆ వ్యక్తి స్వీయ క్షేమం కోసం గాక సార్వజనీన శ్రేయస్సుకై ఆలోచించేవాడై ఉండాలి. ఆకాంక్షించేవాడై ఉండాలి. ఒక భూభాగాన్ని తడుపుతూ పారే నీరు నిస్సారమై ఉన్నా, మలినమై ఉన్నా- ఆ నీటివల్ల ఆ భూమికేమీ ఉపయోగం లేదు, ఉండదు. అదే ప్రవాహం శుద్ధ జలమై, తగిన మౌలికాలు కలిగి ఉంటే ఆ భూమి సుక్షేత్రమై చక్కని పంట పండుతుంది. పదిమంది కడుపు నింపుతుంది. అలాగే వ్యక్తి పస కలిగినవాడై ఉంటే అతడి పని, ప్రయత్నం కూడా పదుగురికి శుద్ధ సలిలంలా సవ్యమైన మార్గంలో అందుతాయి... ఈ విషయం దేన్ని తేటతెల్లం చేస్తుంది? మంచి ప్రతిభ గాని, గొప్ప అభిరుచులు గాని కలిగి ఉన్న వ్యక్తులు కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం గాక సార్వజనిక ఉపయుక్తి సాధనకై పనిచేయాలి. మన చేతిలో జపమాల ఉన్నప్పుడు దాన్ని అత్యుత్తమమైన జపసాధనకై ఉపయోగించాలి. మెడలో అలంకరించుకునే పూసల దండలా కాదు. పూర్వజన్మ సుకృతం వల్ల మనలో భగవంతుడు ప్రతిభనో, పవిత్రతనో పాదుగొల్పి ఈ లోకంలోకి పంపినప్పుడు దాన్ని సవ్యరీతిలో, దాని సహజ ప్రకృతికి ఉపయుక్తమైన రీతిలో నియోగించాలి. ఆదర్శంగా నిలవాలి!
ఈ జీవితం మనదే అయినా, దానికిచ్చిన అత్యుత్తమ విలువల ఆధారంగానే మనం దాన్ని జీవించాలి... వినియోగించాలి. మన కృషితో దానికి మరింత నైపుణ్యాన్ని, చైతన్యాన్ని ఆపాదించాలి. తల్లిదండ్రులు చేతి ఖర్చులకు మన చేతికి చిన్న మొత్తాన్ని ఇచ్చినా వాళ్లు మన మీద పెద్ద నిఘానే పెట్టి ఉంటారు. మరి భగవంతుడు ఇచ్చిన జీవితమనే ఇంత పెద్ద మొత్తాన్ని, ఈ అపురూప సంపదను ఆయనే ఇచ్చిన అత్యుత్తమ విలువల వినియోగాన్ని మనం సవ్యరీతిలో నిర్వహించాలి కదా... నిభాయించాలి కదా?
ముందుగా మనం మనలోని గుప్తమైన అంతర్గత ప్రత్యేకతను గుర్తించగలిగితే, నిక్షిప్తమైన నిధులను గ్రహించగలిగితే- చేపట్టవలసిన కర్తవ్యాలకు సజావుగా తెరతీయగలుగుతాం. మనం ఎవరమైనా, ఎలాంటి లోపభూయిష్ఠమైన విలువలతో జన్మించినా - ఏ దశలోనైనా మారే అవకాశం, మార్చుకునే ప్రతిభా ప్రతి జీవికీ ఉన్నాయి. గొంగళి పురుగు అలాగే ఉండిపోదు. సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతుంది. దానిలాగా మనం రంగులు మార్చుకోవాలి. రెక్కలు మార్చుకోవాలి. ఖండితమైన వానపాములా స్వయం పునర్నిర్మితం కావాలి. ఆ అల్ప ప్రాణులే తమను తాము పునర్ నిర్మించుకుంటున్నప్పుడు అత్యంత ప్రతిభావనుల్లా మహోన్నత కార్యసాధనకు మనం పునరంకితం కాలేమా?
- చక్కిలం విజయలక్ష్మి
Comments
Post a Comment