🌸 శరభేశ్వర స్వామి 🌸
🌸 శరభేశ్వర స్వామి 🌸
ప్ర: తమిళనాడు ప్రాంతాల్లో శరభేశ్వరుడనే పేరుతో శివుని పూజిస్తున్నారు. అసలు పురాణాల్లో ఈ కథ ఉందా? నరసింహస్వామి ప్రతాపాన్ని నిగ్రహించడానికి ఈ స్వరూపం వచ్చిందని అంటారు. ఆయన పాదాల క్రింద నరసింహ రూపం కూడా ఉంది? ఎవరు ఇందులో ఎక్కువ?
జ: ఇందులో ఎక్కువ తక్కువలు లేవు. ఇది మంత్ర శాస్త్రపరమైన ఉపాసనా విషయం. అనేక కల్పాలలో అనేక మార్లు నృసింహావతారాలు జరిగాయి. శివస్వరూపుడైన వీరభద్రుని తేజమే శరభుడు. ఈ శరభేశ్వరునికి సంబంధించే మంత్రం, అనుష్ఠాన విధానం ఉన్నాయి. శత్రు సంహారకం, గ్రహదోషనివారకం, అభీష్ట సిద్ధిదాయకం అయిన స్వరూపమిది.
ఒక కల్పంలో - నృసింహుని ఉగ్రత తగ్గకపోయేసరికి - దేవతల ప్రార్థన మేరకు శివుడు శరభాకృతి ధరించి ఆ ఉగ్రతని ఉపసంహరించినట్లుగా పురాణ కథ. శివ, స్కందాది పురాణాల్లో చెప్పబడినది. "శరభోపనిషత్" పేరుతో ఒక ఉపాసనాపరమైన ఉపనిషత్తు ఉంది. శైవంలో "శరభ శరభ దశ్శరభ" అని ఘోషించి, 'వీరభద్ర పళ్లెం' వంటివి జరిపే సంప్రదాయాలు ఇప్పటికీ ఉన్నాయి. కథ ప్రకారం - ఆ సందర్భం వరకే గ్రహించాలి. అంత మాత్రాన ఎక్కువ తక్కువల చర్చ చేయరాదు. ఎవరి ఉపాస్యం వారికి ఎక్కువ - ఎవరి ఆహారం వారికి పోషకమైనట్లు. పురాణాల్లో కొన్ని చోట్ల శివాధిక్యం, కొన్నిచోట్ల విష్ణ్వాధిక్యం ఆయా సందర్భానుగుణంగా ఉంటాయి. తత్త్వతః అభేదమే. కథలు లీలా మాత్రమే. శరభం సింహం కన్నా భీషణ మృగం. అతి శక్తిమంతమైనది. అత్యంత బలవంతమైన చాలా మృగజాతులు ఇప్పటికే అంతరించాయి. శరభాలు ఇప్పుడు కానరాకపోవచ్చు. కానీ ప్రాచీన కాలంలో శరభ మృగాలున్నట్లు మన పురాణాల్లోనే కాక, కావ్యాలలో, ఇతర సాహిత్యాలలో గోచరిస్తుంది.
ఈశ్వర విభూతియే వివిధ జంతువులలో ప్రతాపంగా, పరాక్రమంగా, శక్తిగా వ్యక్తమవుతోంది. *"యద్యద్విభూతి మత్సత్త్వం"* - అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా. ఆ శక్తి యొక్క దివ్యత్వస్థాయియే దైవం. అది ఉపాసన ద్వారా ఉపాసకుని అనుగ్రహిస్తుంది. అలా కొన్ని విభిన్న శక్తులను కేంద్రీకరించుకున్న అక్షర, భావ సముదాయంతో కూడిన మంత్రంగా ఉన్న శరభేశ్వర మంత్రాన్ని ఉపాసించేవారిని అత్యుగ్రమైన శివాకృతి అనుగ్రహిస్తుంది. సింహం కన్నా గొప్ప జంతువు కనుక - నరసింహుని ఉగ్రతని ఉపసంహరించేందుకు వచ్చిన స్వరూపంగా పురాణం కథ చెబుతున్నది.
ఈ స్వరూపం 'శరభ సాళువ పక్షిరాజు' స్వరూపమని వివరణ. రెక్కలు, పెద్ద పాదాలు కలిగి బహు భుజాలతో సింహమువంటి వదనంతో శోభిల్లే మహాస్వరూపమిది. భయ నిర్మూలన కోసం, దుష్ట శక్తుల వినాశనం కోసం, ఆరోగ్య బలైశ్వర్యాది సంపాదన కోసం, కలహాల నివారణ కోసం శరభోపాసన చేస్తారు.
నిజానికి ఒకే పరమేశ్వరుని వివిధ రూపాలే శివ, కేశవాదులు, విష్ణు సహస్రంలో కూడా *"అతులః శరభః, భీమః"* అనే నామాలున్నాయి. సాటిలేని భీమత్వం కల శరభుని ఈ నామం తెలియజేస్తున్నది.
శివ, శంభు, రుద్ర, మహేశ్వర, స్వయంభు.. లాంటి శివనామాలను చెప్పిన విష్ణు సహస్రం "శరభ" నామాన్ని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. వైష్ణవ సంప్రదాయంలో నృసింహం, శివోపాసన సంప్రదాయంలో శరభం... రెండూ ఒకే శివకేశవ పరతత్త్వపు అభివ్యక్తులు (Manifestations). ఇందులో ఎక్కువ తక్కువలు లేవు. శివుని చేత ఆరాధింపబడే విష్ణువు, విష్ణువు చేత ఆరాధింపబడే శివుడు.. ఇరువురూ మనచే ఆరాధింపబడే వారే. శరభం, నృసింహం కలిసిన విగ్రహం ఒక మంత్ర శక్తి పరమైన అద్భుతమైన కూర్పు, రెండు శక్తుల సమ్మేళన ఈ ఆకృతిలో ఉన్నది. దీనిని ఆరాధించే వారికి అమోఘ సిద్ధులు కలుగుతాయని ఋషులు ఆవిష్కరించారు.
Comments
Post a Comment