భజగోవిందం తాత్పర్య సహితం
భజగోవిందం -
తాత్పర్య సహితం
ఓం స్థాపకయ చ ధర్మస్య సర్వ ధర్మ
స్వరూపిణే |
అవతర వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ: ||
1) భజగోవిందం భజగోవిందం
గోవిందం భజమూఢమతే |
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృఞ్కరణే ||
తాత్పర్యం: గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు.
ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు.
2) మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం |
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||
తాత్పర్యం: ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము.
3) నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగామోహావేశం |
ఏతన్మాంసవసాది వికారం
మనసి విచింతయ వారం వారం ||
తాత్పర్యం: స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపోయుము.
4) నలినీదళగత జలమతి తరళం
తద్వజ్జీవితమతిశయచపలం |
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||
తాత్పర్యం: తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి, జీవితమెంతో చంచలమైనది. జనులందరును రోగములతో బాధపడుతు, దేహాభిమానమును విడువక దుఃఖములో చిక్కుకొని యుందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము.
5) యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః |
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్ఛతి గేహే ||
తాత్పర్యం: ధనమును సంపాదించుచున్నంత వరకే నీ బంధు మిత్ర పరివార జనము నీ యందు అనురాగము, ఆసక్తి చూపుదురు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలుకరించు వారు ఎవ్వరూ ఉండరు.
6) యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్ఛతి కుశలం గేహే |
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే ||
తాత్పర్యం: శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును.
7) బాలస్తావత్క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః|
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరే బ్రహ్మణి కోపిన సక్తః||
తాత్పర్యం: బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్థక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని, పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరును లేరు.
8) కా తే కాంతా కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః |
కస్య త్వం కః కుత ఆయాతః
తత్త్వం చింతయ తదిహ భ్రాతః ||
తాత్పర్యం: ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము.
9) సత్సంగత్వే నిః సఙ్గత్వం
నిఃసఙ్గత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||
తాత్పర్యం: జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగును.
10) వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారో
జ్ఞాతే తత్త్వే కః సంసారః ||
తాత్పర్యం: వయసు మళ్ళిన వానికి కామ వికార మెక్కడిది? నీరు ఎండిపోయిన యెడల అది చెరువు ఎలా అవుతుంది? అట్లే, ధనము లేనప్పుడు పరివార మెట్లుండును? తత్వము అనుభూతమైన తర్వాత సంసార బంధము ఏముండును?
11) మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం |
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||
తాత్పర్యం: ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.
12) దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతౌ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః ||
తాత్పర్యం: రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు, శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చుచు పోవుచుండును. ఈ విధముగా కాలము క్రీడించుచున్నది, ఆయువు క్షీణించుచున్నది. అయిననూ ఆశాపిశాచము మాత్రము నిన్ను వదలకయే ఉన్నది.
13) కాతే కాంతా ధనగతచిన్తా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జనసంగతిరేకా
భవతి భవార్ణవతరణే నౌకా ||
తాత్పర్యం: ఓయీ! నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడును ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింతలేదా? నిన్ను సన్మార్గమున నడిపింప చేయగలవారెవ్వరు లేకపోయారా? నీవు ముల్లోకములు వెదకినను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము.
14) జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబరబహుకృతవేషః |
పశ్యన్నపి చన పశ్యతి మూఢో
ఉదరనిమిత్తం బహుకృతవేషః ||
తాత్పర్యం: జుట్టును జడలుగా కట్టించుకొనుట, తలను నున్నగా గొరిగించుకొనుట, కాషాయవస్త్రములు ధరించుట, ఇట్లు ఉదరపోషణ నిమిత్తము పెక్కు వేషములను వేయుచున్నారే కాని లోక పరిస్థితులన్నియు చూచుచున్ననూ జ్ఞానోదయమునకై ఎంత మాత్రము ప్రయత్నించరు.
15) అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం |
వృద్ధో యాతి గృహిత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం ||
తాత్పర్యం: శరీరము కృంగి, కృశించి, చిక్కి, మడతలు పడినను, తల పూర్తిగా నెరసిపోయినను, పండ్లు ఊడిపోయి నోరు బోసి ఆయినను, ముసలితనము వచ్చి కర్రను పట్టుకుని కాని నడవలేక పోయినను ఆశ మాత్రము అతనిని వదలదు.
16) అగ్రే వహ్నిః పృష్ఠే భానూ
రాత్రౌ చుబుకసమర్పితజానుః |
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాశః ||
తాత్పర్యం: తనవారితో గల సంబంధముల నన్నిటిని విడిచి, చెట్ల నీడలలో నివసించుచు, రాత్రులందు చలికి ముడుచుకుని, మోకాళ్ళపై గడ్డమును ఉంచుకుని పండుకొనుచు, పగలు సూర్యుని ఎండను ఆశ్రయించుచు, చేతిలో పడవేసిన భిక్షాన్నమును తినుచూ గడుపుచున్నను ఆశ మాత్రము వదిలి పెట్టదు.
17) కురుతే గంగాసాగరగమనం
వ్రతపరిపాలనమథవా దానం |
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన ||
తాత్పర్యం: గంగాసాగర సంగమము మున్నగు చోట్ల స్నానములు చేసినను, నోములు, వ్రతములు చేసినను, దాన ధర్మముల నెన్ని చేసినను సరే అతడు జ్ఞానము పొందలేకపోయినచో, నూరు జన్మములు ఎత్తినను ముక్తిని పొందడు.
18) సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతల మజినం వాసః |
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః ||
తాత్పర్యం: దేవాలయముల వద్దనుండు చెట్ల కింద నివసించుచు, నేలపై పవళించుచు, జింకతోలు మున్నగు చర్మములే వస్త్రములుగా కలిగి యుండి, భోగముల నన్నిటిని త్యజించిన వానికి అట్టి వైరాగ్యము వలన సుఖము ఎందుకు కలగదు?
19) యోగరతో వా భోగరతోవా
సఙ్గరతో వా సఙ్గవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ ||
తాత్పర్యం: యోగమునందు ఆసక్తి కలవాడైనను, భోగమునందు ఆసక్తి కలవాడైనను, ఏకాంతముగా నుండువాడైనను, బంధుమిత్రులతో కలిసి ఉన్నవాడైనాను, తన మనస్సును పరబ్రహ్మమునందు ఏకాగ్రతతో లగ్నము చేసి వినోదించువాడు ఎల్లప్పుడునూ ఆనందమును అనుభవించుచున్నాడు.
20) భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా ||
తాత్పర్యం: భగవద్గీతను కొంచెము అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా పానము చేసినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు! అట్టివానికి యమునివలన ఎంతమాత్రము భయము లేదు.
21) పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే ||
తాత్పర్యం: మరల మరల జన్మించుచు, మరల మరల మరణించుచు, తిరిగి తల్లి గర్భమున శయనించుచు, ఈ సంసారమును దాటజాలక నానాబాధలకు గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో సంసారము నుండి తరింపజేయుము.
22) రథ్యా చర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః |
యోగీ యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ ||
తాత్పర్యం: వీధులలో దొరికిన గుడ్డముక్కల బొంతను ధరించి పుణ్యపాపముల భేదములను వర్జించినవాడై యోగి తన చిత్తమును బ్రహ్మమునందు లగ్నము చేసి పసి బాలుని వలెను, ఉన్మత్తుని వలెను ఆనందముతో సంచరించును.
23) కస్త్వం కోఅహం కుత ఆయాతః
కా మే జననీ కో మే తాతః |
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||
తాత్పర్యం: సర్వవ్యాపకుడైన భగవంతుడు నీయందును, నాయందును కూడా ఉన్నాడు, అతడొక్కడే. సహనము కోల్పోయి, నిష్కారణముగా నాపై కోపముతో ఉన్నావు. నీవు శ్రీఘ్రముగా విష్ణువులో ఐక్యమును సాధింపగోరుదువేని, భేదబుద్ధిని వీడి, అంతటను సమచిత్తుడవై ఉండి గోవిందునే సేవింపుము.
24) త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః |
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాంఛస్య చిరాద్యది విష్ణుత్వమ్ ||
తాత్పర్యం: నాలోను, నీలోను, మనందరిలోను, ఈ చరాచర జీవకోటిలో ఉన్నవాడు ఆ విష్ణువే. అజ్ఞానముతో అన్నియు మరిచి అందరినీ దూషింతువు ఏల? సమ భావమును, సహనము పెంచుము, స్వార్ధము త్రెంచుము, సమతను పెంచుము, మానవ సేవే మాధవ సేవగా దైవత్వముతో దయతో మెలుగుము.
25) శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహసంధౌ |
సర్వస్మిన్నపి పశ్యా త్మానం
సర్వత్రో త్సృజ భేద జ్ఞానమ్ ||
తాత్పర్యం: శత్రువునైనా, మిత్రుడనైనా, పుత్రుడనైనా, బంధువునైనా కలహము చేయక, కూర్మిని చూపి శత్రు భావమును సంహరించుము. ఇతరుల పైన కోపము చేసిన నిన్ను నీవె కోపించిన తీరు నీలో, అందరిలొ శ్రీహరి నుండ ఇతరుల నేల దూషణ చేతువు?
26) కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వా ఆత్మానం భావయ కో అహం |
ఆత్మజ్ఞాన విహీనా మూఢాః
తే పచ్యంతే నరకనిగూఢాః ||
తాత్పర్యం: కామ క్రోధ లోభ మొహములను వదలి, నేను ఎవరిని అనే ఆత్మ విచారము చేయుము. ఆత్మజ్ఞాన విహీనులైన మూఢులు ఈ అరిషడ్వర్గమును వదలక వాటినంటి పెట్టుకొని సంసార నరకములో పడి మ్రగ్గుచుందురు.
27) గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం ||
తాత్పర్యం: భగవత్ గీతను, విష్ణు సహస్రనామములను సంకీర్తన చేయుచుండ వలయును, ఎల్లప్పుడూ శ్రీపతి రూపముపై మనసు నిలిపి ద్యానింప వలెను. ఎల్లప్పుడునూ సజ్జనులతో సహవాసము చేయవలెను. బీదలకు ధనము పంచి పెట్టవలెను.
28) సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్దంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం ||
తాత్పర్యం: ఇంద్రియ సుఖములు ఎన్నడూ తీరవు, కామ వాంఛలే కాల సర్పములై దేహమునకు రోగము మిగుల్చును. మనిషికి చివరకు మరణము తథ్యము, కాని అతని పాపములు అతనిని వదలవు.
29) అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యం |
పుత్రాదపి ధన భాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః ||
తాత్పర్యం: ధనమెల్లప్పుడును అనర్ధమునే కలిగించునని గ్రహించుము, ధనము వలన సుఖము కొంచెమైనను కలుగదు, ఇది సత్యము. ధనవంతులు పుత్రునివలన కూడా భయపడుదురు. ప్రపంచమంతా ఇదే రీతిగా ఉన్నది.
30) ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారం |
జాప్యసమేత సమాధివిధాన
కుర్వవధానం మహదవధానం ||
తాత్పర్యం: సద్గురువులను ఆశ్రయించుము, వారి కరుణతో విబుధుడవగుము. ఇంద్రియములపై నిగ్రహమును ఉంచి మనసును గురు చరణములపై ఉంచి, భవ బంధములు త్యాగము చేసి ఆ హరిని గాంచు.
31) గురుచరణాంబుజ నిర్భర భక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః |
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||
తాత్పర్యం: అష్టసాధనలు అవలంబించు, అంతర్ముఖముగ మనసును నిలుపు, ఏకాగ్రతను సంపాదించు. అటువంటి శాంతమునొందిన సమాధి స్థితిలో ఆనందము నీ సొంతము అగును.
ఇతి శ్రీమద్ఛంకరభగవత: కృతౌ
భజ గోవిందం సంపూర్ణం ||
Comments
Post a Comment