గ్రహస్థితుల వలన లజ్జితాది అవస్థలు:
గ్రహస్థితుల వలన లజ్జితాది అవస్థలు:
శ్లో!!లజ్జితో గర్వతశ్చైవ క్షుధిత స్తృషిత స్తధా!
ముదితఃక్షోభిత శ్చైవ గ్రహ భావాః ప్రకీర్తితాః!!
తాః గ్రహముల ఆయాభావముల గ్రహ సంభంధములను అనుసరించి లజ్జితాది అవస్థలేర్పడును.1) లజ్జితము 2) గర్వితము 3) క్షుధిచము 4) తృషితము 5) ముదితము 6) క్షోభితము అను అవస్థలు కలవు.
1) లజ్జితముః పంచమభావమందున్న గ్రహము పాపులగు రవి,కుజ,శని,రాహు,కేతువులతో నెవరితో కలిసిన లజ్జితావస్థ పొందును.
2) ఏదైనా ఒక గ్రహము మూలత్రికోణమందును గాని ఉచ్చరాశి యందు గాని ఉన్నచో గర్వితావస్థపొందును.
3) శతృ రాశి యందున్న గ్రహము శతృ గ్రహముచే కలిసియున్నను చూడబడినను లేక శనితో కూడినను క్షుధితావస్థను పొందును.
4) జలరాశి యందు ఏదైనా గ్రహముండి శుభగ్రహ వీక్షణ లేనిదై శతృగ్రహ దృష్ఠి కలిగియున్నచో తృషితావస్తను పొందును.
5) మిత్రక్షేత్రమందున్న గ్రహము మిత్ర గ్రహములతో కూడినన, చూడబడినను గురినితో కలిసినను ముదితావస్థ పొందును.
6) ఏదైనా ఒక గ్రహము సూర్యుని తో కలిసిఉండగా పాపగ్రహములచేతగాని శతృగ్రహములచేతగాని చూడబడిన క్షోభితావస్థను పొందును.
ఏఏ భావములలో గ్రహములు క్షుధిత, క్షోభితావస్థలు పొందునో ఆ భావఫలములను నశింపజేయును.
1) లజ్జితాది అవస్థ ఫలములు:
గ్రహము లజ్జితావస్థను పొందినపుడు ఆ గ్రహము స్త్రీలయందు అనురాగహీనతను, బుద్ధిహీనతను, సంతానమునకు రోగములను, వ్యర్థ ప్రయాణములను, చెడ్డ విషయములందు పాపజనకములగు కథల యందు లేక విషయములందు అభిరుచిని, మంచి విషయములందు విముఖత్వమును కలిగించును.
2) గర్వితావస్థఫలము:
గర్వితావస్థను పొందిన గ్రహము నూతన గృహములను, ఆరామములను వాని వలన సుఖము నిచ్చును, ప్రభుత్వమును, కళలందు పాండిత్యమును అధికధనలాభమును వ్యవహార వృధ్ధిని కలిగించును.
3) క్షుధితావస్థా ఫలముః
క్షుధితావస్థపొందిన గ్రహము శోకమును మోహమును కలిగించును. పరివార జనము వలన కలుగు కష్టముల వలన మనో వ్యాధులచే శరీరము కృశింపచేయును. కలి దోషములు అనగా అసత్యములైన భాదలు కలిగించును, పాపకార్యములను చేయించును, శతృవుల వలన ధన సంబందమైన చిక్కులను కలిగించును, ధుఃఖముల వలన సమస్త శారీరక బలమును బుద్ధిబలమును నశించేయును.
4) తృషితావస్థ ఫలము:
తృషితావస్థను పొందిన గ్రహము వలన స్త్రీ సంయోగము వలన వ్యాధులు కలుగుట, దుష్ట కార్యములను చేయు అధికారము, స్వకీయ జనులచే వివాదములు కలుగుటచేత ధనహాని, క్షీణత్వము, నీచ జనుల వలన మనః క్లేశములు, గౌరవహాని కలుగును.
5) ముదితావస్థా ఫలము:
ముదితావస్థలో నున్న గ్రహము విశాలమైన గృహము స్వచ్ఛమైన వస్త్రములు, సుందరమైన అలంకారములు, మంచి భూములు కలిగించి సుఖమును ఇచ్చును. స్వజనులవలన విలాసము రాజగృహ నివాసము శతృనాశనము, బుద్ధి, విద్య, వృద్ధిపొంది వికాసమును కలుగజేయును.
6) క్షోభితావస్థ ఫలము:
క్షోభితావస్థలో నున్న గ్రహము దరిద్రమును, నీచ బుద్ధిని, కష్టములను కలిగించును, పాదములందు బాధను, రాజకోపము వలన ధనాదాయమునకు హాని కలిగించును.
మీ
తాడిప్రత్రి ప్రశాంత్ కుమార్
Comments
Post a Comment