నిత్య జీవితంలో నిషిద్ధ కర్మలు

Jyothisham:
నిత్య జీవితంలో నిషిద్ధ కర్మలు:

 కర్మాచరణలో వర్ణాశ్రమ ధర్మముల ప్రకారము ఎవరికి ఎట్టి కర్మలు విధివిహితములో అవియే సత్కర్మలు. అటుల కానివి నిషిద్ధకర్మలు. అటువంటి నిషిద్ధకర్మలు ఏంటో తెలుసుకోవడం అవసరం. నిత్య జీవితంలో ఎదురయ్యే నిషిద్ధ కర్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తూర్పు దిక్కున సకలదేవతలు ఉంటారు. దక్షిణమున పితృదేవతలు ఉంటారు. పశ్చిమమున సమస్త ఋషులు ఉందురు. కనుక ఎప్పుడైనా సరే ఉత్తరం వైపునకే తుమ్మటం, ఉమ్మి వేయాలి. ఇక సుర్యాభిముఖంగా మూత్రవిసర్జన, మలవిసర్జన, ఉమ్మటం, పళ్ళు తోవటం చేయరాదు. ఇవి పంచ మహాపాతకాలలోకి వస్తాయి.

స్నానం నగ్నంగా చేయరాదు. ఒక వస్త్రం చుట్టుకుని చేయాలి. దిగంబరంగ స్నానం చేస్తే అది వరుణిడి (జలాది దేవత) పట్ల అపచారం, శరీరం పిశాచగ్రస్తం అవుతుంది. ఈ పాపకర్మకి (దిగంబరంగ స్నానం చేస్తే) ప్రాయశ్చిత్తం ఏంటంటే.. ప్రతి రోజు సువర్ణం (బంగారం) దానం చేయాలి అలా 12 ఏళ్లు చేయాలి.

సూర్య చంద్ర గ్రహణకాలంలో భోజనంచేసేవారు. నిశ్చయతాంబూలాలిచ్చక ఇతరులకు కన్యాదానం చేసేవారు. పార్ధివలింగాన్ని భక్తితో అర్చించనివాడు, విప్రుని భయపెట్టి ధనం అపహరించేవాడు. దేవతర్చనాది సత్కర్మలకు అడ్డుతగిలినవాడు. న్యాయాధీశుని లేదా నగరరక్షకుని దిక్కరించినవాడు. తులసీదళం చేబూనికూడా మాటతప్పినవాడు, దైవప్రతిమ ఎదుటప్రమాణంచేసి తప్పినవాడు.. నరకానికి వెళ్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.

మిత్రులను మోసంచేసినా, చేసిన మేలు మరచినా, తప్పుడు సాక్ష్యాలు సమర్పించినా, దేవబ్రాహ్మణ పరిహాసకులు, దైవజ్ఞుడు, వైద్యుడు అయినవారు తమకు విహితమైన ధర్మాలను ఆచరించక లోహ-రసాది విక్రయాలు చేపట్టి ప్రజలను వంచిస్తే నరకప్రాప్తి.

బ్రాహ్మణ, దేవతార్చన, శంఖద్వని, తులసి, శివారాధన లేని చోట, విష్ణు భక్తులని నిందించిన చోట, సంధ్యావందన విహీనుడు ఉన్నచోట, ఆచార వర్జితుడి ఇంట, వాచాలుడైన వాడి ఇంట, తడికాళ్ళతో, నగ్నంగా నిదురించేవాడి ఇంట, తోడపై దరువువేసే వాడిఇంట, బ్రాహ్మణ ద్వేషి, జీవ హింస చేసేవాడి ఇంట, దయాశున్యుడి ఇంట, విప్రులని నిందించే వాడి ఇంట, లక్ష్మిదేవీ క్షణకాలం కూడా నిలువదని శాస్త్రాలు చెబుతున్నాయి.

రుద్రాక్షధరించి లేదా ఏదైనా పవిత్ర వస్తువుని స్పృశించి అసత్యం చెప్పరాదు. శుభ కార్యాలకి బయలుదేరేటప్పుడు భర్త ముందు భార్య వెనుక నడవాలి. అశుభకార్యాలకి బయలుదేరేటప్పుడు భార్య ముందు భర్త వెనుక నడవాలి.         

నుదురు మీద బొట్టు, ఎడం భుజం మీద వస్త్రం లేకుండా ఇతరులకు బట్టలు పెట్టకూడదు. ఎవరికైతే వస్త్రం ఉండదో వారికీ ఆయుక్షీణం. నురుగు ఉన్న నీరు పూజకి పనికిరాదు, అలానే వెంట్రుక ఉన్న నీరు కూడా. పరస్త్రీలను కామించేవారు, పరద్రవ్యాలని ఆశించేవారు, పరులకు కీడు తలపెట్టాలి అనుకునేవారు మానసిక పాపులు.

పాడ్యమి, షష్టి, అష్టమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, రవి సంక్రమణలయందు, వ్రత, శ్రాద్ధ దినముల యందు శరీరమునకు తైలమును పట్టించుకోకూడదని విష్ణు పురాణం చెబుతోంది.

భోజనం చేసేటపుడు నిషిద్ధ కర్మలు:

ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయరాదు. శ్రాద్ధకర్మ చేసే రోజు మాత్రమే ఉత్తరాభిముఖంగా కూర్చుని భోజనం చేయాలి. బొట్టు లేకుండా భోజనం చేయరాదు. భోజనంలో వెంట్రుక వస్తే ఆ భోజనం త్యజించవలెను. కనీసం నేతితో (ఆవు నెయ్యి శ్రేష్టం) అభికరించిన (శుద్ధి) తరువాత తినాలి.

నిదురించేటపుడు.. ఉత్తరం వైపు తలవుంచి నిద్రపోకూడదు. తడికాళ్ళతోకానీ, నగ్నంగా కానీ నిద్రపోకూడదు.

దేవాలయ దర్శనంలో నిషిద్ధకర్మలు:

దేవాలయ ముఖ ద్వారం పాదరక్షలు వేసుకుని దాట కూడదు. దేవాలయం గడపని తొక్కరాదు. ఈ రెండు చేసిన వారికి రాబోవు జన్మలో వికలాంగులుగా జీవించే అవకాశం ఉంది. ఈశ్వరుడికి కాళ్ళుపెట్టరాదు, గుడిలో సాష్టాంగనమస్కారం చేసేటపుడు అన్ని వైపులా గమనించుకుని ఈశ్వరుడి వైపు కాళ్ళు రాకుండా చూసుకుని సాష్టాంగనమస్కారం చేయవలెను. ఒకవేళ అలా కుదరకపోతే నుంచుని నమస్కారం చేస్తే సరిపోతుంది.

పెళ్లి విషయంలో నిషిద్ధకర్మలు:

ఇంటిలో ఆరోగ్యంగా ఉన్న పెద్ద కుమారుడుకి పెళ్లి చేయకుండా చిన్నవాళ్ళకి చేయరాదు, అలాచేస్తే పెళ్లికొడుకు, అతని తల్లిదండ్రులు, పెళ్లి జరిపించిన పురోహితుడు అందరూ నరకానికి వెళతారు. ఇది ఆడపిల్లలకి కూడా వర్తిస్తుంది. పెళ్లికాని అన్నగారిని పరివిత్తి అంటారు. పరివిత్తితో కూడిన యజ్ఞాదులు కూడా పాపాలే అవుతాయి. పరివిత్తికి కన్యాదానంచేయడం అపాత్రదానం అవుతుంది.

ఏ వారం.. ఏ పూజ చేస్తే.. ఐశ్వ‌ర్యం వ‌స్తుంది?

కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. 

అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. 

మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. 

సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం. ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చెయ్యాల్సి ఉంటుంది.

ఆదివారం: ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్రరోగం, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.

సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.

మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.

బుధవారం: బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం: గురువారం ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.

శుక్రవారం: శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి.

శనివారం: శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేవాడు శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. సృష్టికి ఆదిలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు. పాపం చేయటం లేదా పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది. చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన..

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: