"కుండలీలో ఉన్న భూతత్వ రాశులు -వాటి అధిపతులు - ఫలిత సూచనలు"💥

🌷ఓం శ్రీ గణేశ శారద గురుభ్యో నమః🌷
🌷మాతపితృభ్యో నమః🌷
🌷శ్రీ మాత్రే నమః🌷
🌷సభాయై నమః🌷

💥"కుండలీలో ఉన్న భూతత్వ రాశులు -
వాటి అధిపతులు - ఫలిత సూచనలు"💥

 మన మహార్షులు రాశిచక్రంలో వృషభ, కన్య, మకర రాశులను భూతత్వరాశులుగా నిర్ణయించారు. భూతత్వం అనగానే శబ్ద, రూప, స్పర్శ, రస, గంధం వంటి పంచ భూతత్వ గుణాలు కలిసి భూమికి ఉన్నాయి అని తెలుస్తుంది. భూమిని చూడాగనే చైతన్యం, ఉన్నతం, స్థిరత్వములకు ప్రతీకగా కనిపిస్తుంది. ఇంకా క్షమగుణం, ఓర్పు, సహనం, మమకారం, మాతృత్వం, మానవత్వం, కరుణ, కష్టపడి పనిచేసే తత్వం, గాంభీర్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

భూతత్వ రాశులలో ఎక్కువ గ్రహాలు ఉండగా జన్మించినవారు శరీరబలము, భోజనప్రీతి, ప్రారంభించిన పనిని పూర్తిగా చేయడం, సంపాదానాభిలాష మొదలైన లక్షణాలు కలిగి ఉంటారు. ఇంకా సహనం, ఓర్పు ఎక్కువ, సంతాన ఆపేక్ష, ఏదైనా సంతోషంగా అనుభవిస్తారు. అణిగిమణిగి వారి పరిధిలో వారు ఉండడం మరియు భరించేది భూమి అన్నట్లుగానే ఉంటుంటారు.

వృషభరాశి :- స్థిరరాశి, శుక్రుడు అధిపతి. వైశ్యజాతి, రజోగుణ ప్రధానమైనది. వృషభము అనగా ఎద్దు. గ్రామములు, వ్యవసాయ క్షేత్రములందు సంచరించునది. గాంభీర్యత, నిండైన వ్యక్తిత్వరూపం. కష్టపడి పనిచేయు లక్షణం, భాధ్యతలు మొయ్యటం వంటి లక్షణాలు కలది. ఒంటెద్దు పోకడ అని ఒక సామెత ఉంది. ఒక ఎద్దు ఉన్న అసమత్వం, ఇష్టమొచ్చిన రీతిలో గమనం ఉంటాయి. ఒకరు తోడుగా ఉంటే లక్ష్యమును సంతోషంగా అధికమిస్తారు. తప్పనిసరియైనపుడు ప్రతీకారం, ఆధారపడటం వంటి లక్షణాలు కనపడతాయి. వీరు అధికమైన ఓర్పుతో తోందరపడకుండా పనులను నెమ్మదిగా చేసుకొంటారు. పరోపకార చింతన బాగా ఉంటుంది. ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. భూతత్వ రాశి కావటం వల్ల క్షమగుణం, తివ్రకోపం కూడా ఉంటాయి. స్థిరరాశి కావటం మూలన ధనవిషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు. స్థిరాస్తులు సంపాదించడానికి ఇష్టపడతారు. భోజనప్రియులు కూడ.

వృషభ రాశి అధిపతి శుక్రుని పరిశీలిస్తే ఈ రాశివారు ఆకర్షణీయంగా నిండురూపంతో ఉంటారు. ఆశలు, కోరికలు కూడా ఎక్కువగానే ఉంటుంటాయి. కళలపై ఆసక్తి ఉంటుంది.

శుక్రుడు గ్రహరాజ్య వ్యవస్థ రీత్యా మంత్రి అయినప్పటికీ గురువుకు, శుక్రునకు కొన్ని భేదాలు కనిపిస్తూంటాయి. న్యాయబద్ధమైన, స్పష్టమైన జీవన విధానానికి గురువు కనిపిస్తే, అవసరానుకూలంగా నిర్ణయాలు తీసుకొంటూ అప్పటికపుడు సమస్యల నివారణకు ప్రయత్నం చేస్తూ నలుగురికి మంచి చేసేదిగా శుక్రుని తత్వం కనిపిస్తుంది. అదే తత్వం ఈ రాశివారిలో ఉంటుంది. సామాజికంగా కొంత ఉన్నతికి రావాలనే భావనతో పెద్ద హోదా కలిగినవారితో పరిచయాలు పెంచుకోవడం, వారి పరిచయం ద్వారా పనులు పూర్తి చేసుకోవడం, చేయించు కోవడం, ఈ పరిచయాలతోనే మరికొందరి పనులను చేసి పెట్టడం, వంటి మధ్యవర్తిత్వం చేయడం ఈ రాశివారికి ముఖ్య లక్షణంగా ఉంటుంది. ఈ విధంగా ఈ రాశివారిలో వృషభం మరియు శుక్రుని తత్వాలు కలిసి కనపడతాయి. 

కన్య రాశి :- ద్విస్వభావ రాశి, బుధుడు అధిపతి. వైశ్యజాతి, తమోగుణ ప్రధానమైనది. పర్వతములందు సంచరించునది. సౌమ్యరాశి.

కన్య ఒక చేతిలో వరి కంకెలు, మరో చేతిలో అగ్ని కలది. ఈ రూపాన్ని బట్టి ఒకరికి మార్గం చూపించేవారుగా, తమ వాక్చత్యుర్యంతో మరియు ఆకర్షణతో ఇతరులను ఆకర్షించేవారిగా ఉంటారు.

ఒంటరిగా ఉండే కన్య యొక్క మనస్సులో కలిగే హావభావాలకు ఈ రాశి ప్రతీక. అందరు తనను గమనించేటట్లుగా విద్యాత్మకంగానో, ప్రవర్తనాత్మకంగానో, వాచికంగానో, ఏదో రూపంలో కనిపిస్తుంది. ప్రతిభా పాండిత్యాలు అధికంగా ఉన్నప్పటికి వాటిని వినియోగ పరచడానికి అవసరమైన మార్కెటింగ్ టెక్నిక్స్ బాగా తెలిసిన వారు కన్యరాశికి చెందినవారౌతారు.

జాగ్రత్త వీరి సహజ లక్షణం. ప్రతి పనిలోను పూర్వాపరాలు గమనించి కార్యంలోకి దిగేవారు. ఇతరుల తప్పులను ఎన్నడంలో సంసిద్దులు, సుఖజీవనంపై ప్రీతి, అధికమైన దురాశ, ఆశయాలకు తగిన దానగుణం లేకపోవడం, చాలామంది స్నేహితులు, ఎటువంటి సాధ్యంకాని విషయమైనా తమ చాకచక్యంతో అనుకూలపరుచుకోవడం, తమ స్వభావాన్ని ఇతరులకు తెలియజేయకపోవడం, అంతర్గతమైన దయాదాక్షిణ్యాలు, ఖర్చు చేయడంలో అతి జాగ్రత్త, సత్య శీలత్వంతో పాటు అధికారులకు అనుకూలంగా ఉండడం, ధనం, సౌభాగ్యాదులతో ఆనందంగా కాలం గడపడం వంటి లక్షణాలు ఉంటాయి.

వీరు చాలా తెలివిగా, సంకోచం లేకుండా, వాక్ నైపుణ్యంతో తమను వ్యక్తపరచటం ద్వారా పనులను తొందరగా చేసుకొంటారు. చెయించుకొంటారు. (very talented and intelligent communications వీరి సొంతం అని చెప్పవచ్చు).

కన్యరాశి అధిపతిగా బుధుని చూసినప్పుడు గ్రహించడం, అందించడం అనే అంశాలు బుధుని ద్వారానే నిర్వహించబడతాయి అని తెలుస్తుంది. బుధుడు జారిపోయో తత్వం కలిగినవాడు. గ్రహరాజ్య వ్యవస్థ రీత్యా బుధుడు వ్యాపారస్తుడు. సహజంగా వ్యాపారస్థులు లేని ప్రదేశంలో కావలిసిన అవసరాలు తీర్చడం కష్టం. కాని బుధుడు అటువంటి పనులు చాకచక్యంగా చేయగల నేర్పరి. బుధుడంటే పండితుడు అని కూడా అర్ధం. కాలానుగుణమైన నిర్ణయాలు తీసుకొంటూ పనులు పూర్తి చేసే పాండిత్యం బుధునికి మాత్రమే సాధ్యం. ఎవరికి ఇబ్బందిని కలిగించకుండా అందరి అవసరాలు తీరేటట్లుగా చూస్తూ తన లాభాలు చూసుకొనే రీతి బుధునికి ఉంటుంది. తన లాభాలు తాను పొందుతూ అందరి మన్ననలూ పొందే నేర్పరి బుధుడు. అవసరానుకూలంగా ప్రవర్తించడం, ఎవరితో కలిస్తే వారికి అనుగుణంగా ప్రవర్తించి అందరినీ తనవారిని చేసుకొని తలలో నాలుకగా మెలగడం ఈ రాశివారికి ప్రత్యేక లక్షణం.

మకరరాశి :- శని అధిపతి. తమోగుణ ప్రధానమైనది. లేడి తల, మొసలి శరీరం.
వనముల యందు, భూమియందు సంచారం చేయునది. జలచరమని చెప్పబడినది. చరరాశి, సౌమ్యరాశి. 

మకరమంటే మొసలి. మొసళ్ళు సాధారణంగా నీటిలో ఎక్కువగాను, బయట కూడా సంచేరించేవి. అయినప్పటికీ నీటిలో సంచరించే మొసలికే అధికబలం ఉంటుంది. అనగా స్థానబలం ఎక్కువ. తన స్థానబలం అధికం కాబట్టి స్వంత ప్రదేశాలలో అత్యధికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. మొండి పట్టుదలతో సేవధర్మాన్ని కలిగి తాను చేసే పనిని ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బందికరమైనా, చేసి చూపించే తత్వం ఈ మకరానిది. సంతాన ఆపేక్ష, మొండితనం, దైవబలం కోసం ఎదురుచూడడం వంటి లక్షణాలు ఉంటాయి.

రాశ్యాధిపతి శనిని గమనిస్తే, గ్రహరాజ్య వ్యవస్థ రీత్యా శని సేవకుడు. సేవతత్పరతకు ప్రతీక శని, శాంతిని కలిగించేవాడు. లోకంలో సేవకు మించిన ధర్మం ఉండదు. ఈ రాశిలో సేవపరమైన భావనలే ఉంటాయి. నిజమైన సేవతత్వం అపదల్లోనూ, మంచిచెడులలోను సహకరిస్తూ, మానవత్వంతో ముందుకు వచ్చే వారంతా ఈ రాశులకు చెందినవారవుతారు. లోకంలో అత్యంత ఉదాత్తమైన ధర్మం, సేవధర్మం. ఈ ధర్మానికి ప్రతీకగా కూడా ఈ రాశివారిని చూడొచ్చు. అనగా పట్టుదల కల సేవకుడు అని చెప్పవచ్చు.

ఈవిధంగా భూతత్వరాశులు అధిపతులను, వాటి బలాబలాలను అనుసరించి ఫలిత విశ్లేషణ చేయవలసి వుంటుంది.

రాశిచక్రంలో గమనించినపుడు ఒకే తత్వం గల రాశులు ఒకదానికి ఒకటి కోణాలు అవుతాయి. అంటే జాతకంలో ఒకే తత్వ రాశ్యధిపతులు ఒకదానికి ఒకటి మిత్రులు అవుతాయి. లగ్నం అయితే మిగతా రెండు ఒకే తత్వ రాజ్యాధిపతులు ఆ జాతకానికి యోగకారకాలు అవుతాయి.

వివిధ లగ్నాలకు భూతత్వరాశులు ఎటువంటి కోణాలు అవుతున్నాయని పరిశీలన చేస్తే,

భూతత్వ రాశులు వృషభ/ కన్య/ మకర రాశులు లగ్నాలు అయితే వీటికి భూతత్వరాశులు ధర్మకోణాలు (1, 5, 9)గా ఉంటాయి.

అగ్నితత్వరాశులు మేష/ సింహ/ ధనస్సు లగ్నాలు అయినపుడు, భూతత్వరాశులు కామ కోణాలుగా (2, 6, 10) అవుతాయి.

జలతత్వ రాశులు కర్కాటక / వృశ్చిక/ మీన లగ్నాల అయితే వీటికి భూతత్వరాశులు అర్ధ కోణాలు (3, 7, 11) గా ఉంటాయి.

వాయుతత్వ రాశులు మిధున/ తుల/ కుంభ రాశులు లగ్నాలు అయితే వీటికి భూతత్వరాశులు మోక్ష కోణాలు (4, 8, 12) గా ఉంటాయి.

ఈ విధంగా ఆయా రాశుల స్థానాలు, భావాలను బట్టి ఫలిత సూచనలు చేయవలసి ఉంటుంది. వాతావరణ జ్యోతిషంలో భూతత్వరాశులను గమనించినపుడు, రవి వృషభంలో సంచరించునప్పుడు మే జూన్ నెలలలో రవి గరిష్ఠ ఉత్తర క్రాంతిగతిలో ఉంటాడు. అనగా ఉత్తరార్ధగోళంలో సూర్యుని కిరణాలు లంబంగా ప్రసరిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మనకు వెసవికాలం ఉంటుంది. అలాగే భారతదేశానికి వెసవితో పాటు నైరుతి ఋతుపవనాలు ఆగమనం, తొలకరి వానాలు పడతాయి. దక్షిణార్ధగోళంలో దీనికి వ్యతిరేక వాతావరణం అనగా చలికాలం ఉంటుంది.

కన్యరాశిలో రవి సమయం అనగా సేప్టెంబర్, అక్టోబర్ నెలలలో, రవి మధ్యమ క్రాంతిగతిలో (భూమధ్యరేఖ దగ్గర్లో) సంచరిస్తూ ఉంటాడు. ఈ సమయంలో మనకు వర్షకాలం. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల తిరోగమనం, ఈశాన్య ఋతుపవనాల ఆగమనం జరుగుతుంది. భారతదేశంలో అనేక ప్రదేశాలలో మంచి వర్షాలు కురుస్తూ ఉంటాయి.

మకరరాశిలో రవి సంచరించే సమయం అనగా జనవరి, ఫిబ్రవరి నెలలు. మనకు చలి కాలం. రవి గరిష్ఠ దక్షిణం అంతిగతిలో సంచరించే సమయం. రవి కిరణాలు ఉత్తరార్ధగోళంలో ఏటవాలుగా ప్రసరిస్తాయి. కావున మనకు చలి, చల్లటి గాలులు మరియు చల్లటి ఎండని ఇస్తాయి. దక్షణార్ధగోళంలో దీనికి వ్యతిరేఖ వాతావరణం అనగా ఎండకాలం ఉంటుంది.

ఇది భూతత్వ రాశులకు సంబంధించిన కొంత సారాంశం. ఇంకా వివిధ అంశాలు అనగా వృత్తి, విద్య, వ్యక్తిత్వం, బంధాలు, ఈ తత్వ రాశి వారు ఆలోచన విధానం, కష్టనష్టాలు వంటి అనేక అంశాలు వివిధ కోణాలలో కూడా విశ్లేషణ మరియు పరిశోధన చేయవచ్చు. తద్వారా మంచి పరిహార మార్గలు కూడా చెప్పాటానికి వీలు అవుతుంది.

ఈ విధంగా వివిధ రాశుల, గ్రహాల తత్వాలను, కారకత్వలను అనుసరించి, అవి ఉన్న స్థితిగతులను బట్టి ఫలిత విశ్లేషణ చేయవలసి ఉంటుంది. వీటికి పరిశోధన, ఉపాసనలు చేయడం కూడా చాలా అవసరం.

లోక సమస్త సుఖినో భవంతు. శ్రీ మాత్రే నమః.

లలిత శ్రీహరి

9490942935

వేద సంస్కృత పరిషత్ వారి ఉపన్యాసధార సమావేశపు ఉపన్యాసానికి వ్రాతపత్రి

26/09/2021

Comments

  1. 07/06/1988 time 7 am before puttanu please tell me my horoscope narsimha.nalla@gmail.com

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: