రాహుకాలం, గుళిక కాలం, యమగండకాలం
వర్జ్యం, దుర్ముహూర్తం చూస్తాము సరే ఈ రాహుకాలం, గుళిక కాలం, యమగండకాలం అంటే ఏమిటి?
ఇతఃపూర్వం కాలం గురించి సమయాల్లో శుభ అశుభ సమయాలేమిటి? కాలగణనలో మరికొన్ని కాలాలు చెబుతున్నారు. వాటి ప్రాముఖ్యత ఏమిటి అని ఒకరు ప్రశ్నించారు. విశదీకరించడానికి ప్రయత్నిస్తాను.
మన వాంగ్మయంలో హోరా అని చెప్పబడి వుంది. ఆ హోరాను ప్రామాణికముగా తీసుకుని ఇంగ్లీష్ లో hour అని పేరు వచ్చింది. సూర్యోదయానికి ఏ హోరా నడుస్తుందో ఆ పేరున ఆ రోజు పేరు నిర్ణయించబడింది. ఉదాహరణకు సూర్యోదయానికి సూర్య హోరా నడుస్తుంది కనుక భాను వారము, ఆదిత్యవారము, ఆదివారము అని దానికి పేరు. అలాగే మిగిలిన వారాల పేర్లు కూడా.
ఈ హోరా ఒక రౌండ్ రాబిన్ పద్ధతి ప్రకారం నడుస్తుంది. వాటి క్రమం
సూర్య శుక్ర బుధ చంద్ర శని గురు కుజ ( మరల) సూర్య.....
ఇలా గంటను బట్టి ఆయా గ్రహాల ఆధిపత్యం నడుస్తూ వుంటుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించి వుంటారు. కేవలం 7 గ్రహాల క్రమం వివరింపబడి వుంది. మిగిలినవి రెండూ ఛాయా గ్రహాలు కావున వాటికి హోరా ఉండదు. కానీ కొన్ని పద్ధతులలో కొన్ని నిషిద్ధాలు పాటిస్తారు.
1. రాహుకాలం :
సూర్యోదయం నుండి సూర్యాస్తమయానికి పట్టే సమయాన్ని 8 తో భాగించి ఆ రోజుకు రాహువు ఉండే సమయాన్ని నిర్ణయిస్తారు. ఇది ఒక గంటన్నర కాలం. సాధారణంగా సూర్యమానం పాటించేవారు దీనిని ఎక్కువ పాటిస్తారు. రాహుకాలం తమిళ సాంప్రదాయంలో తప్పక పాటిస్తారు. చాంద్రమానం పాటించేవారు ఈ రాహుకాలాన్ని పట్టించుకోవడం అరుదు. కానీ మనలోను కొందరు తప్పక రాహుకాలం చూస్తారు.
ఇక్కడ కింద ఇవ్వబడిన పట్టికలో (సర్పాలు ఉన్న పట్టిక) ఏ రోజు ఏ సమయానికి రాహుకాలం వస్తుందో చెప్పబడి వుంది. చూడగలరు. దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక బండ గుర్తు ఇంగ్లీష్ లో వుంది.
7:30AM Mother Saw Father Wearing The Turban Suddenly (వీటిలో మొదటి రెండు అక్షరాలను తీసుకుంటే ఆరోహణ పద్ధతిలో ఆ సమయం వస్తుంది)
Mo (సోమవారం/Monday) – 7:30AM – 9 AM
Sa ( శనివారం/Saturday) – 9AM – 10:30AM
F ( Friday/శుక్రవారం) – 10:30AM – 12PM...ఇలా మిగిలిన వారాలకు లెక్క వేసుకోవచ్చు
ఈ రాహుకాలంలో మొదలుపెట్టిన ఏ పనైనా సరే పూర్తి అవ్వకపోయే అవకాశం ఎక్కువ వుంటుంది, లేదా మరల చెయ్యవలసి వస్తుంది. కాబట్టి విజ్ఞులు ఈ కాలాన్ని త్యాజిస్తారు. ఈ సమయంలో ముఖ్యమైన పనులు చెయ్యక వాయిదా వేస్తూ ఉంటారు. రాహుకాలం వశీకరణ ఇత్యాది పనులకు వాడుతూ వుంటారు. ఈ సమయంలో ప్రయాణాలు వాయిదా వెయ్యమని చెబుతారు.
2. యమగండకాలం :
రాహువు సంచారాన్ని ఆధారంగా చేసుకుని రాహుకాలం గణిస్తే కేతువు యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకుని యమగండకాలం నిర్ణయిస్తారు. ఇది కూడా 90 నిముషాల కాలం. ఈ కాలంలో మొదలుపెట్టిన కాలం మృత్యువు మొహం చూస్తుంది అంటే పూర్తవ్వదు అని నమ్మకం. పితృదేవత ఆరాధనలు, తర్పణాలు, అంత్యేష్టి సంస్కారాలు ఈ సమయంలో చెయ్యదగిన పనులు. మిగిలిన పనులు వాయిదా వెయ్యడం మంచిది అని చెబుతారు.
గురువారం :6 నుండి 7:30 వరకు, బుధవారం 7:30 – 9, మంగళవారం 9-10:30, సోమవారం 10:30-12, ఆదివారం 12-1:30, శుక్రవారం 1:30-3, శనివారం 3-4:30 వరకు ఈ కాలం. కింద రెండవ పట్టికలో ఇవ్వబడి వుంది.
3. గుళికకాలం :
ఇది కొంచెం విచిత్రమైన కాలం. శనిపుత్రుడు మాంది కి మరొక పేరు గుళిక. ఆయన ఉన్న కాలాన్ని గుళిక కాలం అని చెబుతారు. ఈ సమయంలో మొదలుపెట్టిన ఏ విషయమైనా సరే మరల మరల జరుగుతూ వుంటుంది. కాబట్టి విజ్ఞులు కొన్ని మంచి విషయాలు ఈ సమయంలో చెయ్యవచ్చని చెబుతారు.
ఈ సమయంలో చెయ్యదగిన పనులు: డబ్బులు తీసుకోవడం ( ఎవరికి ఇది చేదు? ), కొనుగోలు చెయ్యడం, అన్నదానాలు, హోమాలు, ఇతరత్రా ఏవయితే మరల మరల చెయ్యాలని అనుకుంటామో ఆ పనులు చేసుకోవచ్చు.
ఈ సమయంలో చెయ్యకూడని విషయాలు: అంత్యేష్టి సంస్కారాలు, అప్పు ఇవ్వడం, పెళ్ళిళ్ళు, లాంటివి.
కింద ఇచ్చిన మరొక పట్టిక లో ఈ సమయం చెప్పబడి వుంది.
శనివారం నుండి ఆదివారం వరకు 6 గంటల మొదలు 90 నిముషాలు వేసుకుంటూ వెళ్ళాలి. పట్టికను చూస్తె మీకే అర్ధం అవుతుంది. (చుక్కలు పెట్టిన పట్టిక )
భగవంతుని మీద భారం వేసి సరైన సమయంలో సరిగ్గా చేసిన పనులు తప్పక సఫలం అవుతాయని నమ్మిక. వీటిని పాటించడం వలన ఎవరికీ ఏ హానీ లేదు. కాదు ఈ సమయంలోనే చేసి చూస్తాను అంటే వారి ప్రారబ్ధం. అత్యంత బలమైనది కాలమే. కాలమే ఎవరు ఏది చేసినా సమయానికి సమాధానం చెబుతుంది. కాల స్వరూపుడైన ఆ ఆదిత్యునికి నమస్కారము. ఆదిత్యహృదయం చదువుకుని అన్ని గ్రహాలూ అత్యంత అనుకూలంగా జరగాలని ప్రార్ధించి సమయాచారాలను పాటించి మన పెద్దలు చెప్పిన పద్ధతిలో బాగుపడదాం.
!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!
Comments
Post a Comment