నటరాజు

"నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం
ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాదినేతత్‌ విమర్శే శివసూత్ర జాలం"

"అచలుడై శివుడు మౌనంగా ఉంటాడు. నృత్యానంతరం శివుడు తన డమరుకాన్ని మ్రోగించినప్పుడు భాషాశాస్త్రం పుట్టింది ఈ శ్లోక తాత్పర్యమిది.

నటరాజు నృత్యమాడుతున్నప్పుడు సనకసనందనాదులు, పతంజలి వ్యాఘ్రపాదుడు వంటి ఋషులు తన్మయతతో తిలకిస్తూంటారు. వారు మహర్షులవటం వల్ల సామాన్యులు చూడలేని, ఆ నర్తనని చూడగలుగుతారు. నటరాజుని నర్తనం చూడటానికి దివ్యచక్షువులు కావాలి కదా! దేవతలు, బుుషులు, యోగులు తమ తపశ్శక్తి వల్ల నటరాజు నర్తనాన్ని చూచే శక్తిని సంపాదించారు. దేవుడ్ని చూడటానికి కావలసిన సామర్థ్యాన్ని "దివ్యదృష్టి అంటారు. దీనినే భగవద్గీతలో ""దివ్య చక్షు" వన్నారు.
సనకసనందనాది ఋషులు నటరాజు నర్తనాన్ని తమ కళ్లతోనే చూస్తూ ఆనందిస్తున్నారు. పెద్ద డోలుని విష్ణువు వాయిస్తూంటే, బ్రహ్మ తాళం వేస్తున్నాడు. నర్తనం పూర్తి కావస్తున్న సమయానికి ఢక్క నుండి, పధ్నాలుగు దరువులున్న ""చోపు వస్తుంది. పై శ్లోకంలోని ""నవపంచవారం. అన్న పదం ఈ పధ్నాలుగు (తొమ్మిదికి అయిదు కలిపితే వచ్చేవి) దరువులని సూచిస్తుంది.
డమరుకపు దరువుల విద్యలుకూడ పధ్నాలుగే. హిందూ ధర్మానికి ప్రాతిపదిక పధ్నాలుగు విద్యలైతే, నటరాజుకూడ డమరుకంతో పధ్నాలుగు దరువులనే ఇచ్చాడు. ఆ పధ్నాలుగు దరువులూ సనకసనందనాది బుుషులకు ఆధ్యాత్మిక ప్రగతిని ఇంకా కల్పించాయి అంటుంది ఈ శ్లోకం. 

ఈ సనకాదులెవరు? ఆలయాలలో దక్షిణామూర్తి చుట్టూ నలుగురు వృద్ధులు కూర్చున్నట్టుగా ప్రతిమలుంటాయి. ఆ నలుగురూ సనక, సనందన, సనత్‌ కుమార, సనత్సుజాతులనే మహర్షులు. ఆ పధ్నాలుగు దరువులూ ఈ బుుషులకు శివరూప మెరగటానికి సోపానాలయాయి. ఆ శబ్దాలనే "శివభక్తి సూత్రాలంటారు. వీటిపై నందికేశ్వరుడొక భాష్యాన్ని వ్రాశాడు. ఆ శివతాండవాన్ని తిలకించిన వారిలో పాణిని ఒకడు. పాణిని గురించి కథా సరిత్సాగరంలో ఉంది. పాటలీపుత్రంలో (ఈనాటి పాట్నానగరం) వర్షోపాధ్యాయ, ఉపవర్షోపాధ్యాయ అని ఇద్దరుండే వారు. వారిలో రెండవవాడు చిన్నవాడు. అతని కుమార్తె ఉపకోశ్ల. పాణినీ, వరరుచీ వర్షోపాధ్యాయుని శిష్యులుగా విద్యనభ్యసిస్తూండేవారు. వీరిద్దరిలో పాణిని కొంచెం మందబుద్ధి. విద్య బాగా సాగలేదు. అందుచేత తపస్సు చేసుకోమని చెప్పి అతనిని హిమాలయాలకు పంపాడు గురువు. శిష్యుడు తపస్సు చేసి శివుని అనుగ్రహం సంపాదించాడు. నటరాజుని నర్తనాన్ని తన కళ్లతోనే చూడగలిగే భాగ్యాన్ని పొందాడు.

నర్తనం చివరిలో డమరుకపు పధ్నాలుగు దరువుల సహాయంతో పరమ శివుడు వ్యాకరణ సూత్రాలకూ బీజం నాటాడు. ఆ పధ్నాలుగు సూత్రాలను పాణిని కంఠస్తం చేసికొని "అష్టాధ్యాయి అనే ప్రాథమిక గ్రంథాన్ని రచించాడు. దీనిలో ఎనిమిది అధ్యాయాలుండటం వల్ల దీనిని ""అష్టాధ్యాయి అంటారు.

అ పధ్నాలుగు సూత్రాలనీ "మహేశ్వర సూత్రాలంటారు. ఈ పధ్నాలుగు సూత్రాలను శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ చేసేప్పుడు పఠిస్తారు. (ఈ ఉపాకర్మని తమిళంలో ఆవని అవట్టం అంటారు) నటరాజు డమరుక దరువుల నుండి ఉద్భవించిన మహేశ్వరసూత్రాలు వ్యాకరణానికి మూలం. శివునికీ, వ్యాకరణానికీ సంబంధమిదే. అందుచేతనే శివాలయాలలో వ్యాకరణ మంటపాలుంటాయి. సర్వం శివార్పితం.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: