ఉద్ధవ గీత
ఉద్ధవ గీత
ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. రూపు రేఖలు, వేష ధారణ కూడా కృష్ణుని వలే ఉంటాయి. నిర్మలమైన భక్తి అంటే ఏమిటో మనకు తెలుసుకోవాలంటే, ఉద్దవుని గురించి తెలుసుకుంటేనే గాని అర్ధం కాదు. భక్తిలో పరాకాష్టకు చేరినవారు భగవంతుని తమలోనే దర్శించుకుంటారు. శ్రీ భాగవతంలోని గోపికల ద్వారా భక్తి అంటే ఏమిటో శ్రీ వ్యాస భగవానుడు తెలియచేశారు. ఉద్ధవ గీత అనేది శ్రీకృష్ణుడు ఉద్దవునికి చేసిన ఉపదేశం అనే దానికన్నా, ఆచరించవలసిన ఆదేశం అని చెప్పటం బాగుంటుందేమోనని నా అభిప్రాయం. ఈ "ఉద్ధవ గీత" అనేది శ్రీ భాగవతంలోని ఏకాదశ స్కంధంలోని, ఆరవ అధ్యాయం, నలుబదవ శ్లోకం నుండి ప్రారంభం అవుతుంది. ఇరువది తొమ్మిదవ అధ్యాయంతో ముగుస్తుంది. ఈ మొత్తం"ఉద్ధవ గీత"లో వెయ్యికి పైగా శ్లోకాలు ఉన్నాయి. ఉద్ధవుడు యదుకుల శ్రేష్ఠుడు, మహాజ్ఞాని. శ్రీకృష్ణ, ఉద్ధవుల సంవాదమే ఉద్ధవ గీతగా ప్రసిద్ధిగాంచింది. శ్రీ కృష్ణుడు చివరిసారిగా చేసిన బోధ ఇదే. ఒక విధంగా చెప్పాలంటే "ఉద్ధవ గీత" భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ మనకిచ్చే వీడ్కోలు సందేశం అని చెప్పవచ్చు. భగవద్గీత చదివిన "విద్యార్ధులకు" ఇది ఒక పునశ్చరణ కూడా!పరమాత్మలోని దివ్యసుగుణాలన్నీ ఈ ‘సృష్టి’లోనే ఉన్నాయి. వాటిని గ్రహించి ఆచరించగలగడమే మహాయోగం. భూమి నుంచి క్షమాగుణాన్ని, వాయువు నుంచి పరోపకారాన్ని, ప్రాణస్థితి నిలకడను, ఆకాశం నుంచి పరమాత్మ సర్వవ్యాపి అని, జలం నుంచి నిర్మలత్వాన్ని, పావనత్వాన్ని, అగ్ని నుంచి దహించే శక్తిని గ్రహించి తన దేహం పాంచభౌతాత్మకమని, పంచభూతాల గుణాలను కలిగి ఉండాలని తెలుసుకోవాలి జీవుడు. మనిషి కర్మాచరణే ధర్మంగా భావించాలి. దేనిమీద కూడా విపరీతమైన వ్యామోహం ఉండకూడదని చెబుతుంది ఉద్ధవ గీత. కొండచిలువ తన వద్దకు వచ్చిన ‘జీవి’ని మాత్రమే తింటుంది. సంతృప్తి చెందుతుంది. ఇంకా, ఇంకా కావాలని ఆశపడదు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నా తన గాంభీర్యాన్ని వీడదు. సుఖదుఃఖాల్లో సమస్థితి కలిగి స్థిరంగా ఉండాలన్న సత్యాన్ని చాటుతుంది. ఉద్ధవుడు కృష్ణుడిని కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతాడు. వాటిలో ఎందుకు నువ్వు అత్యంత ఆప్తుడవైనా పాండవులను కాపాడలేదు? అని. అప్పుడు కృష్ణుడు నేను ఖర్మలను మార్చలేను, కానీ ఖర్మలలో మీకు తోడుగా ఉంటాను. నేనున్నాననే జ్ఞానం మీకుంటే అసలు మీరు తప్పే చేయరు, అని కృష్ణుడు అంటాడు. ఇలా ఉద్ధవుడు అనేక ప్రశ్నలు అడిగాడు. వాటికన్నిటికీ శ్రీ కృష్ణుడు చక్కగా సమాధానాలు చెప్పాడు. ఇది అందరూ తప్పక చదవి అర్ధం చేసుకోవలిసిన గొప్ప సందేశం. ఈ గ్రంధాన్ని కొని చదువుకొని, భద్రపరచుకోవాలి. విలువైనవి తొందరగా లభించవు, అరుదుగా లభిస్తాయి!అరుదుగా లభించేవి విలువైనవి కూడా! దొరికిన విలువైన వాటిని కనీసం భద్ర పరుచుకుంటే, వాటి అవసరం జీవితంలో ఎప్పుడైనా రావచ్చు!
Comments
Post a Comment