ఆత్మ పరమాత్మ

ఆత్మను గురించి ఏం ఆలోచించగలం? 
ఏం చెప్పగలం? 
ఆలోచన మనస్సు పరిధిలోది. 'ఆత్మ' మనస్సు దాటిన తర్వాత కలిగే అనుభూతి. ఆత్మ ఉండీ లేనట్లు, లేకపోయినా ఉన్నట్లు అనిపిస్తుంది. అనుభూతికి మాత్రం అందుతుంది. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేవి మూడూ ఒక్కటే. 

రూపగుణాలు ఒక్కటే. అవధులు మాత్రం వేర్వేరు. ఒక్కటే అయిన ఆత్మ అవసరానికి 'అంతరాత్మ' అనిపిస్తుంది. పైకి వెళ్లాక 'పరమాత్మ'గా వ్యవహరిస్తుంది. ఆ రహస్యం తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. అసలు ఆత్మను తెలుసుకోవడమే జ్ఞానం. ఆత్మను గురించి మరింతగా తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఇక్కడ తెలుసుకునేది మనస్సుతో కాదు. అత్మతో - అది ప్రజ్ఞా విశేషం.
అయితే 'ఆత్మ' వివేకం ముందు కలగాలి. 

వివేకానికి జిజ్ఞాస జతపడాలి. అప్పుడు ప్రజ్ఞ బయటకొచ్చి ఆత్మజ్ఞానానికి తుదిమెరుగులు దిద్దుతుంది. 'ఆత్మ'ను గురించిన కనీస అవగాహన ఏర్పడితే అటువైపు దృష్టి సారించవచ్చు. మామూలు దృష్టికి ఆత్మ కనిపించదు. అందుకు అంతర్దృష్టి ఏర్పడాలి. మనస్సును నిద్రపుచ్చి లేదా శూన్యంచేసి ఆలోచనలు తలఎత్తకుండా చేసినప్పుడు ఆత్మ అనుభూతికి అందుతుంది. నిజానికి ఆత్మసహకారం లేనిది 'ఆత్మజ్ఞానం' కలగదు.

జీవితంలో సుఖభోగాలు అనుభవిస్తున్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే. సాధారణంగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు. మానవ జీవితం కష్టసుఖాల సంగమం. 

ఆపదల్లో ఉన్నప్పుడు కూడ ఈశ్వర చింతన కలిగి ఉండనివారున్నారీ లోకంలో. అట్టివారు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి వారిని నాస్తికులనడమే సమంజసం. 

వీరు ఎంత కష్టమొచ్చినా ఒక్క క్షణమైనా భగవన్నామోచ్ఛరణ చేయరు. ‘‘జాతస్య మరణం ధృవమ్’’ అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ భూమీద పడ్డ ప్రతి జీవిని మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది. అంచేత మొండికట్టెల్లా కాలాన్ని వ్యర్థంగా గడపకుండా దైవచింతన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఉత్కృష్టమైన మానవజన్మ ఎత్తికూడ అనివార్యమైన భగవత్ప్రేమకు పాత్రులు కాకపోవడం చింతించవలసిన విషయం. 

అభ్యాసం ఉంటే తప్ప ఎవరికి పరమాత్మ చింతన అలవడదు. ఉన్నతమైన మానవజన్మనెత్తి బుద్ధి జ్ఞానం కలిగి ఉన్న మనిషి కాలాన్ని వ్యర్థంచేసే బదులు ఏ క్రిమికీటకంగానో పుట్టి ఉంటే ఈ మానుషజన్మకు కళంకం ఉండదు కదా!

సర్వకాల సర్వావస్థలయందు సంసార సుఖభోగాల్లో పడినవారికి ఎంత ఆయుష్షుంటే ఏం లాభం? 

తనకు తెలీకుండానే అది హారతికర్పూరంలా కరిగిపోతుంది. కాలం వృధాగా పోతోందని గ్రహించిన వాడికి క్షణకాలమైనా చాలు మోక్షంకోసం ప్రయత్నించి సిద్ధిపొందొచ్చు. 

మనం చేసే మంచి పనుల్లోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి పది మందికి పనికొచ్చే సత్కార్యాల్ని చేయాలి. ఈశ్వరోపాసనకి పూజ, ప్రార్థన ముఖ్య సాధనాలు. మన స్థూల శరీరానికి కర చరణాదులు ఎలాగో అలాగే ఆత్మకు జ్ఞానాదులు అలాంటివని తెలుసుకోవాలి. 

లోకంలో జనులు దేహం మీదున్న అభిమానం చేత సర్వసుఖాల్ని పొందడంకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారే తప్ప ఆత్మానంద సుఖంకోసం గాని, సంసార బంధ విముక్తులవడానికి గాని యత్నించరు. 

అందువల్లే ఉత్కృష్టమైన ఈ మానవజన్మ వ్యర్థవౌతోంది. ఆత్మను పోషించుటకు, రక్షించుటకు పరమాత్మ చింతనే ముఖ్యసాధనం. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అలాగే భగవంతుణ్ణి తలంచని వాడికి ఆ దేవుడు కరుణించడు. ముక్తినివ్వడు. 

పండితులు, భాగవతులు తమ గానం చేత, నృత్యం చేత, పూజాది సత్కర్మలచేత జపతపముల చేత భగవంతుణ్ణి అనేక రకాలుగా స్తుతిస్తారు. 

మరి పామరుల సంగతేంటి? 

రాజదర్శనం కావాలంటే ముందుగా భటుని దర్శించవలసి ఉంటుంది. తోటలోని ఫలాలు కావాలనుకుంటే ముందుగా తోటమాలిని ఆశ్రయించాలి. అలాగే భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు భాగవతుల్ని ఆశ్రయించాలి. అది సాధ్యంకానప్పుడు సత్పురుష సాంగత్యమైనా చెయ్యాలి. అది కూడ దుర్లభం అనుకుంటే తన దుష్టప్రవర్తనను తానే సరిదిద్దుకోగలగాలి. అందుకు శుభాశుభములు తెలుసుకోవాలి. 

అవి తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి. వివేకం కలగాలంటే ముందు తను నీతిగా ఉండాలి. అందుకు విద్య అవసరం. విద్య అంటే ఆ సర్వేశ్వరుని మార్గాన్ని తెలుసుకోవడమే. తప్ప పొట్టకూటికోసం విద్యలుకావని గ్రహించాలి. 

ఈశ్వర చింతన యందు అభిలాష ఉంటే విజ్ఞానవంతులవుతారు. దాంతో సంసార భోగవాంఛలు వాటంతటవే నశిస్తాయి.

 మనమంతా పుణ్యంకోసం గంగానది స్నానాలు, గుళ్ళు గోపురాల దర్శనం చేస్తుంటాం. ఇవన్నీ బాహ్యేంద్రియ శుద్ధి చేసేవే గాని ఆత్మశుద్ధికి తోడ్పడవు. 

వాటన్నిటికంటె ముందు శుభకర్మల్ని ఆచరించాలి. పరోపకారం, సత్యం పలకడం, భూత దయ, సత్‌సాంగత్య విద్య దానాదిక ధర్మాలు, మాతృపితసేవ, బ్రహ్మచర్యం, ఈశ్వర స్తుతి మున్నగు ఉత్తమగుణాలే శుభకర్మలు అనబడతాయి. 

శ్రీహరిని పూజించనివారు జీవచ్ఛవంబులనే చెప్పాలి. అందుకే అంటారు పరమాత్మ చింతన లేని జన్మవ్యర్థం అని.

 నిద్రపోతున్నపుడు మన ఆత్మ పరమాత్మతో కలుస్తుందని మన వేదాంత శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 

కానీ, నిజంగానే ఈ రెండు ఒక్కటిగా కలుస్తాయా అనే ధర్మ సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. నిజంగానే ఈ రెండు కలుస్తాయట. ఇదెలాగంటారా... సాధారణంగా మన శరీరాల్లో ఐదు కోశాలుంటాయని వేదాంత శాస్త్రం చెపుతోంది. 

అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇవి పొరపొరలుగా ఉంటాయి. అన్నింటికన్నా పై పొర అన్నమయ కోశం. అన్నిటికన్నా లోపలి పొర ఆనందమయ కోశం. 

ఒక దానిలో ఒకటి ఇమిడిపోయే లక్క పిడతల్లాగా ఉంటాయట. వీటిలో నాలుగోది విజ్ఞానమయ కోశం. అంటే ఆత్మ. 

ఐదోది ఆనందమయ కోశం. అంటే పరమాత్మ. ఇందులో ముందు మూడు కోశాలు దేహం, మనస్సు, ప్రాణం అంటారు. 

అంటే దేహం, మనస్సు, ప్రాణం, ఆత్మ , పరమాత్మ వరుసలో ఉంటాయి. దీనికితోడు ఇంద్రియాలన్నింటినీ కలిగి వుండేదే దేహం. నాలుగో తొడుగు అయిన ఆత్మ మనం మెలకువగా ఉన్నపుడు దేహం, మనస్సుల వైపు అంటే విషయాల వైపు తిరిగి ఉంటుందట.

అదే గాఢ నిద్రలో ఉన్నపుడు దేహం, ఇంద్రియాలు, మనస్సు విశ్రాంతి తీసుకుంటాయి. 

ఆ సమయంలో ఆత్మ పరమాత్మ వైపు అంటే విజ్ఞానమయ కోశం అయనందున ఆనందమయ కోశానికి అభిముఖం అవుతుంది. 

మన రెండు అరచేతులు కలిపి నమస్కరించినట్టన్నమాట. అదే ఆత్మ పరమాత్మను కలత లేని, నిలకడ గల గాఢ సుఘుప్తిలో చేరుకోవడం. అంటే ఆత్మ పరమాత్మలు గాఢ నిద్రలో కలుస్తాయన్నటమాట.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: