హిరణ్యాక్షుడు భూమిని భూమిపైనున్న సముద్రంలోనే దాచేసాడా?

ఏమిటేమిటీ? హిరణ్యాక్షుడు భూమిని భూమిపైనున్న సముద్రంలోనే దాచేసాడా?
దృష్ట్వాథ దైత్యహతకేన రసాతలాన్తే
సంవేశితాం ఝటితి కూటకిటిర్విభో! త్వమ్ ।
ఆపాతుకానవిగణయ్య సురారిఖేటాన్
దంష్ట్రాఙ్కురేణ వసుధామదధాః సలీలమ్ ॥ (నారాయణీయం)
“పరమాత్మా! మాయా వరాహరూపమున నీవు భూమిని వెదకుచూ, రాక్షసాధముడైన హిరణ్యాక్షుడు భూమిని రసాతలము క్రింద దాచెను అని తెలుసుకొంటివి. వెంటనే భూమిని తెచ్చుటకు పోగా రాక్షసులందరూ నీ పైన పడిరి. వారెవరినీ ఏ మాత్రమూ లెక్క చేయక నీ కోర చివర ఈ భుమిని అవలీలగ ధరించి ఉద్ధరించితివి”.
ఏమిటి? వరాహాస్వామి సముద్రంలో మునిగిపోయిన భూమిని పైకి ఎత్తి రక్షించాడా? అంటే హిరణ్యాక్షుడు భూమిని భూమి పైననే ఉన్న సముద్రంలో ముంచేసాడా? ఇది ఎలా సాధ్యం? ఇందులో ఏమైనా అర్థం వుందా అన్న అనుమానం చాలా మందికి రావచ్చు. ముఖ్యంగా హేతువాదులకి ఈ అనుమానం రావాలి కూడా. (హేతువాదులు అంటే మన మూర్ఖపు నాస్తికులు కాదు)
కానీ ఇక్కడ చెప్పబడిన సముద్రం మనకు తెలిసిన సముద్రం కాదు అని ముందుగా తెలుసుకోవాలి. పురాణాలలో చెప్పే సముద్రాలకి అనేక అర్దాలు ఉంటాయి. అవి అన్నీ భూమి పైననే ఉండకపోవచ్చు. అవి కాస్త శోధించి పట్టుకుంటే కానీ సమాధానం దొరకకపోవచ్చు. పురాణాలన్నీ విజ్ఞానాన్ని కథలుగా మార్చి అందిస్తాయి కాబట్టి, మన అవగాహనారాహిత్యం వల్ల అన్నిటినీ మనకు తెలిసిన భూమి పైననే మనం ఆపాదించుకుంటాం కాబట్టి, మనకు ఈ కంఫ్యూజన్ వస్తుంది. అది మన అవగాహనారాహిత్యమే కాని పురాణాలలో లోపం కాదు. కాని కేవలం ఎగతాళిగా చూస్తే మాత్రం మిగిలేది ఎగతాళే.
ఇక్కడ చెప్పబడ్డ సముద్రం భూమిపైన ఉన్న సముద్రం కాదు. ఇది "రసాతలము" అనబడే మరొక లోకము అని పురాణాలే చెబుతున్నాయి. పైన చెప్పబడ్ద శ్లోకమే దానికి ఒక ఉదాహరణ. అయినా మనకి ఈ రసాతలం అంటే ఏమిటో తెలియదు కాబట్టి, దాన్ని “సముద్రము” అనే మనం మళ్ళీమళ్ళి చెప్పేసుకుని, మనని మనమే ఒక సందిగ్ధతలో పడేసుకుని, తరువాత మనమే మన పురాణలని విమర్శించుకుంటాము. అసలు ఈ రసాతలం అంటే ఏమిటో ఆలోచిద్దాం.
ప్రస్తుతం సైన్సు మనకు చూపే విశ్వము ఒకేఒక్క ప్లేన్ లోనే ఉంది. మనకు తెలిసిన పాలపుంత (మిల్కీవే) కానీ, మిగితా గెలాక్సీలు కానీ ఇవి అన్నీ ఒకే ప్లేనులో కనిపిస్తాయి. అంటే ఒకే కంబళిపై పేర్చబడ్డ గ్రహనక్షత్రకూటముల సముదాయాలుగా కనిపిస్తాయి. అంటే ఈ ప్లేన్ కి క్రింద మరో 7 ప్లేనులు; పైన మరో 6 ప్లేనులు, అంటే భూమితో కలిపి మొత్తం 14 ప్లేనులు ఉన్నాయన్నమాట. లేక మనకు తెలియని మరో 13 ప్లేనులు ఉన్నాయన్న మాట. అవి అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాలు అనబడే అధోలోకాలు; భూలోకము (మనకు తెలిసినది), భువర్లోకము, స్వర్లోకము, మహార్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అనబడే ఊర్ద్వలోకాలు. మొత్తం 14 లోకాలు లేక 14 భువనాలు అని, పురాణాలు అన్నీ చెబుతున్నాయి. నిజానికి ఇవి లోకాలో లేక ప్లేనులో లేక డైమెన్షనులో ఏమిటో? వీటి గురించి సైన్సుకి ఇంకా ఏమీ తెలియదు. తెలియదు అంటే అవి లేవు అని కాదు అర్దం. ఇంకా వాటి గురించి మనకు తెలియదు అని మాత్రమే అర్ధం. సైన్సులో తెలుసుకోవాల్సింది ఎప్పుడూ చాలానే ఉంటుంది కదా.
అసలు ఈ రసాతలం అంటే ఏమిటో ఆలోచిద్దాం. ఈ రసాతలం అన్నది 6వ అథోకము అని చెప్పుకున్నాము కాదా. సామాన్యంగా దీన్ని ఒక నరకంగా ప్రస్తావిస్తారు మనవాళ్ళు. కానీ వామనుడు బలిచక్రవర్తిని ప్రస్తుతానికి పోయి రసాతలంలో తలదాచుకో, భవిష్యత్తులో ఇంద్రపదవి లభించగలదని పంపించాడు. అంటే అది బలి వంటి ఉత్తముడు పాలించే ప్రదేశం కాబట్టి, అది అందరూ అనుకునేటట్తుగా ఒక నరకకూపం కాకపోవచ్చు. అందుచేత అది భూలోకం అంత గొప్పది కాకపోయినా కనీసం మరొక లోకంగా మనం భావించవచ్చు. అలాగే రామరావణ యుద్ధం ముగిసాక రాక్షసులు ఈ రసతలానికి పోయి తలదాచుకుంటున్నారు అని కూడా పెద్దలు చెబుతారు. అలాగే భూమి నుంచీ ఈ లోకంలోకి వెళ్ళాలి అంటే ముందున్న 5 అథోలోకాలని దాటుకుని వెళ్ళనక్కరలేదట. ఎక్కడి నుంచైనా నేరుగా ఈ రసాతలంలోకి ప్రవేశించవచ్చునట. హాయగ్రీవుడు నేరుగా ఈ రసాతలాకి వెళ్ళి వేదాలను రక్షించాడని కూడా చెబుతారు. అంటే ఈ 14 భువనాలు కేవలం 14 ప్లేనులు కావు అని తెలుసుకోవచ్చు. ఈ లోకాలు వేరే ప్లేనులో లేవు అని తెలిసిపోయింది కనుక, వీటిని ప్లేనులు అనకుండా వేరే డైమెన్షను అని అనుకుని చూస్తే మొత్తం కథ సైంటిఫిక్కుగా సరిపోతుంది.
మనం ఉన్నచోటనే మరొక డైమెన్షనులో మరొక ప్రపంచం ఉండే ఆస్కారం ఉందనీ, దానినే మరొక డైమెన్షన్ అని అంటారనీ, అదే పారలల్ యూనివర్సు అని అంటారనీ నేటి సైంటిస్టులు చెబుతున్నారు. దానినే మనం వేరే లోకం అంటున్నామేమో పరిశీలించండి.
మనకు తెలియని డైమెన్షన్సు అనేకం ఉన్నాయి, అని సైన్సే మనకు చెబుతోంది కనుక, ప్రస్తుతానికి ఈ 14లోకాలనీ 14 డైమెన్షన్సు అని పిలుచుకుంటే మనకు సైన్సుపరంగా కాస్త సులువుగా వుంటుంది. ప్రస్తుతానికి మన సైన్సుకి 4 డైమెన్షన్స్ మాత్రమే తెలుసు. అంటే మనకు తెలియని మరింకో 13 డైమెన్షన్సు కనీసంగా ఉన్నాయి అని మనం గ్రహిస్తే విషయం కాస్త తేలికగా అర్థం అవ్వొచ్చు.
అప్పుడు వరాహమూర్తి భూమిని రసాతలం అనే డైమెన్షను నుంచీ (లేక లోకం నుంచీ) భూమిని ఉద్దరించాడు అని అంటే, అది ఎవరికి అర్థం అయినా కాకున్నా, నేటి సైన్సుకి మాత్రం అర్థం అవుతుంది. ఈరోజుల్లో తుఫానులకి మనం పేర్లు పెట్టుకున్నట్టుగా ఆ రోజుల్లో కొన్ని మహా ఉత్పాతాలకి లేక మహాశక్తులకి రాక్షసుల పేర్లు పెట్టుకునేవారు అనుకుందాం. అంటే ఒకానొక కాలంలో హిరణ్యాక్ష (Golden Axis) అనే ఒక రాక్షసశక్తి భూమిని తన కక్ష (Axis) నుంచీ వేరు చేసి మరొక డైమెన్షన్ లో ఉన్న రసాతలం అనే కక్షలోకి (Rasatala Axis/Orbit) కదిలించింది అని తెలుకోవచ్చు. అలా వేరే డైమెన్షన్లోకి పోయిన భూలోకవాసులు తల్లడిల్లుతూ వుంటే, వరాహమూర్తి అనబడే ఒక మహా సైంటిస్టు భూమిని తన అసలు కక్షలోనికి/డైమెన్షనులోకి/Axis లోకి పునఃప్రవేశపెట్తాడు అన్నమాట. అందుకే ఆయనని మహావిష్ణు అవతారంగా మనం కీర్తించుకుంటాము అని కథ చెప్పుకుంటే, నేటి వారికి వినటానికి సులువుగా ఉంటుంది. విషయం కూడా కాస్త అర్థం అవుతుంది.
పురాణాలని అర్థం చేసుకోవడం అనేక రకాలుగా చేసుకోవచ్చు. సామాన్యుడికి ఇది ఒక కథగా మాత్రమే అర్థం అవుతుంది. ఒక విజ్ఞానికి ఇది ఒక సైన్సు గ్రంథం. భక్తిమార్గంలో ఉన్నవారు భూమిలోని కొన్ని ప్రదేశాలనే ఈ లోకాలుగా కూడా గుర్తించగలుగుతారు. ఒక యోగి ఈ లోకాలన్నీ సూక్ష్మరూపంలో తనలో కూడా ఉన్నాయని గుర్తించగలుగుతాడు. ఒక కవికి ఇదో కవిత్వంలాగా తోస్తుంది. ఒక మూర్ఖుడికి ఇది కేవలం పిచ్చి మాటలుగా మాత్రమే అర్థం అవుతాయి. ఎవరి తాహతుని బట్టి వారికి ఒక్కోరకంగా అర్థం అవుతాయి మన పురాణాలు.
ఇలాగే పాలసముద్రం అంటే కూడా మన హిందూమహాసముద్రమో అట్లాంటిక్ మహాసముద్రమో కానక్కరలేదు. అది కూడా ఏమిటో మనం ఇంకా తెలుసుకోవాల్సి వుంది. కాకపోతే పూర్తి అవగాహన లేని మనం, అన్నిటినీ భూమి పైననే ఊహించుకుని కథ చెప్పుకుంటాము కనుక, కొన్ని అర్థంపర్థం లేని మాటలుగా తోచవచ్చు. సైన్సు మరింత ముందుకు వెళ్ళిన కొద్దీ విషయాలన్నీ ఒక దాని తరువాత ఒకటిగా మనకి పూర్తిగా అర్థం అవుతూ వస్తాయి. అప్పటిదాకా అవహేళన చేయకుండా, మనం హేతుబద్దమైన అవగాహనతో ముందుకు సాగుదాం.
==============================

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: