రామరాజ్యంలో ఓ కుక్క కథ★

★రామరాజ్యంలో ఓ కుక్క కథ★

రామరావణ యుద్ధం ముగిసింది. రాముడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఆయన పాలనలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తోందన్న కీర్తి ముల్లోకాలకీ వ్యాపించింది. అలాంటి సందర్భంలో ఓ రోజున...

రాముడు తన దర్బారులో కొలువై ఉన్నాడు. అతని చుట్టూ మంత్రులు పరివేష్టించి ఉన్నారు. కశ్యపుడు, వశిష్టుని వంటి రుషివర్యులు ఉచితాసనాలని అలంకరించారు. అలాంటి నిండుసభలో రాముల వారు లక్ష్మణుని వంక చూస్తూ ఎవరన్నా పౌరులు కార్యార్థులై, తన సభకు చేరుకున్నారా అని అడిగాడు. సుభిక్షమైన రాముని పాలనలో... ప్రత్యేకించి విన్నవించుకునేందుకు ఎవరికీ ఏ సమస్యా, అవసరమూ లేవని బదులిచ్చాడు లక్ష్మణుడు. పోనీ రాజద్వారం దగ్గర ఎవరన్నా సమస్యలతో నిలబడి ఉన్నారేమో చూసి రమ్మని పంపాడు రాముడు.  

రాముని ఆజ్ఞ మేరకు రాజద్వారాన్ని చేరుకున్న లక్ష్మణుడికి అక్కడ ఓ గాయపడిన కుక్క కనిపించింది. ‘ఓ శునకమా! నీకేం ఆపద వచ్చింది? ఎలాంటి సంకోచమూ లేకుండా నీకు వచ్చిన సమస్యని చెప్పుకో!’ అంటూ అభయమిచ్చాడు లక్ష్మణుడు. దానికి ఆ కుక్క తన సమస్యని రామునికే విన్నవించుకుంటానని పట్టుపట్టింది. దాంతో దానిని రాముని సమక్షానికి తోడుకుపోక తప్పలేదు లక్ష్మణునికి
 

తనకి వచ్చిన ఆపదని చెప్పుకోమంటూ రాముడు అభయాన్ని ఒసిగిన వెంటనే ఆ కుక్క – ‘ప్రభూ! రాజన్నవాడు తన పౌరులకి దేవునితో సమానం. వారికి సృష్టి, స్థితి, లయకారుడు ఆ రాజే! అందుకనే తన రాజ్యంలోని ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత రాజు మీదే ఉంటుంది. దానం, కరుణ, సత్పురుషులని ఆదరించడం, మంచి నడవడి వంటి లక్షణాలన్నీ కూడా ఆ ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. కానీ నీ రాజ్యంలో ఒకరు ధర్మాన్ని తప్పి నా మీద దాడి చేశారు. సర్వదసిద్ధుడనే పరివ్రాజకుడు నన్ను గాయపరిచాడు,’ అంటూ వాపోయింది.

ఆ శునకం మాటలు విన్న రాములవారు వెంటనే సర్వదసిద్ధుని పిలిపించారు. ‘ఆ కుక్కను గాయపరిచిన మాట నిజమే ప్రభూ! నేను యాచనకు బయల్దేరిన సమయంలో ఈ కుక్క నా దారికి అడ్డంగా నిలిచింది. అసలే ఆకలితో ఉన్న నేను ఆగ్రహాన్ని పట్టలేకపోయాను. ఆ ఆగ్రహంతోనే ఈ కుక్కను గాయపరిచాను. నేను చేసిన పని తప్పేనని ఒప్పుకుంటున్నాను. అందుకుగాను మీరు ఎలాంటి శిక్షను విధించినా సంతోషంగా స్వీకరిస్తాను,’ అంటూ వేడుకున్నాడు సర్వదసిద్ధుడు.

సర్వదసిద్ధునికి ఎలాంటి శిక్ష విధించాలా అని దర్బారులో జనమంతా తర్జనభర్జన పడుతుండగా ఆ శునకం- ‘ప్రభూ! తమరేమీ అనుకోనంటే నాది ఒక విన్నపం. మీకు నిజంగా నా పట్ల జాలి కలిగితే, నన్ను కరుణించాలన్న తలంపు మీలో ఉంటే నేను చెప్పిన శిక్షను అతనికి విధించండి,’ అని కోరింది.

ఆ మాటలకు రాములవారు అంగీకరించగానే- ‘ఈ బ్రాహ్మణుడిని కులపతిగా నియమించండి. అతడిని కలంజర అనే మఠానికి అధిపతిని చేయండి,’ అని కోరింది.

ఆ మాటలు విన్నంతనే సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణుడు మాత్రం తనకు శిక్షకు బదులుగా పదవి లభించినందుకు సంబరపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘అదేమిటీ, నీకు జరిగిన అన్యాయానికి బదులుగా సర్వదసిద్ధుని కఠినంగా శిక్షించమని కోరతావనుకుంటే... అతనికి కులపతి హోదానీ, మఠాధిపతి పదవినీ కట్టబెట్టించావెందుకనీ,’ అంటూ అడిగారు సభలోని పెద్దలు.
 

దానికి ఆ శునకం ఇలా బదులిచ్చింది- ‘అయ్యా గత జన్మలో నేను ఆ మఠాధిపతిని. రుషులను ఆదరిస్తూ, దేవతలని పూజిస్తూ, సేవకుల బాగోగులను గమనిస్తూ, అందరికీ పంచగా మిగిలిన ఆహారాన్ని భుజిస్తూ చాలా నిష్టగా జీవించాను. అయినా కూడా కుక్కగా జన్మించాల్సి వచ్చింది. అంత సత్ప్రవర్తనతో మెలిగిన నేను ఈ స్థితికి చేరుకుంటే... చిన్నపాటి కోపాన్ని కూడా అదుపు చేసుకోలేని ఆ సర్వదసిద్ధుడి గతేమవుతుందో ఆలోచించండి,’ అంటూ నవ్వింది.

అధికారం చేతిలోకి వస్తే మనిషి విచక్షణలో మార్పు వస్తుంది. ఆ మత్తులో అతను తెలిసో తెలియకో చిన్నచిన్న పొరపాట్లు చేయడం ఖాయం. మఠాధిపతి హోదాలో అతిపవిత్రంగా ఉండాల్సిన మనిషి ఇంకెంత నిష్టగా ఉండాలో కదా! ఈ విషయాన్ని సున్నితంగా తెలియచేస్తోంది పై కథ. ఇందులో ఒక పక్క కుక్క చూపించిన సమయస్ఫూర్తి అబ్బురపరచినా... గురువుగా ఉన్నత స్థానాన్ని అలంకరించేవారు ఎంత పవిత్రంగా ఉండాలో హెచ్చరిస్తోంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: