తెలుసుకో దగిన ధర్మ సూక్ష్మాలు

🚩మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!

అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశాం చూడండి.
ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:🚩

🌹ధర్మో రక్షతి రక్షిత:
 సత్య మేవ జయతే
 అహింసా పరమో2ధర్మ:
 ధనం మూలమిదం జగత్

🌹 జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి
🌹కృషితో నాస్తి దుర్భిక్షమ్
🌹 బ్రాహ్మణానా మనేకత్వం
🌹యథా రాజా తథా ప్రజా
🌹 పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
🌹శత శ్లోకేన పండిత:
🌹 శతం విహాయ భోక్తవ్యం
🌹 అతి సర్వత్ర వర్జయేత్
🌹బుద్ధి: కర్మానుసారిణీ
🌹 వినాశ కాలే విపరీత బుద్ధి:
🌹భార్యా రూపవతీ శత్రు:
🌹స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:
🌹వృద్ధ నారీ పతివ్రతా
🌹 అతి వినయం ధూర్త లక్షణమ్
🌹 ఆలస్యం అమృతం విషమ్
🌹దండం దశ గుణం భవేత్

  ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా!

ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా👇

🌹ధర్మ ఏవో హతో హంతి
"ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

🍃ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే, అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరుకోరు కదా !

🌹 సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్
విప్రతేజం✍️నిడుమోలు వెంకట సుబ్బారావు

🍃సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

🌹 అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్

🍃 అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన.

🌹 ధనమార్జాయ కాకుత్స్థ
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

🍃ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.

🌹 అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

🍃సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

🌹 కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

🍃చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.

🌹 గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్

🍃ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !

🌹 రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా

🍃రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

🌹 పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

🍃పుస్తకం, స్త్రీ, ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే. ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)

🌹 శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

🍃వంద నిష్కలు (ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.

🌹 విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

🍃పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.

🌹 శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

🍃వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.

🌹 అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
(ఇది మరోవిధంగా కూడా ఉంది)

🍃విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడాడు. అతి కామం చేత రావణుడు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ
అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.

🌹 సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

🍃లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !

🌹న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

🍃బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.

🌹 ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

🍃 అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.

🌹 ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

🍃 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !

🌹 అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

🍃అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.

🌹 ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

🍃ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా. 

🌹 సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

🍃వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.

🌹 విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !

ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.
పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: