ఆయుష్మాన్ భవ
💐ఆయుష్మాన్ భవ💐
*పెద్దలు వస్తుండగా లేచి వెళ్ళి నమస్కరించడం మంచి సంప్రదాయం. దాన్ని అభ్యుత్థానమని, అభివాదనమని అంటారు. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయని స్మృతులు చెబుతున్నాయి. నమస్కారాల్లో సాష్టాంగ ప్రణామం ఉత్తమం. దానికే ప్రణతి అని పేరు. అంటే గొప్పదైన నమస్కారమని అర్థం.
సంప్రదాయం తెలిసిన పెద్దలకు నమస్కరించినప్పుడు ‘ఆయుష్మాన్ భవ’ అని దీవిస్తారు. చాలాసార్లు ఆ మాట విని ఉండటంవల్ల వారేదో అలవాటుగా ఆశీర్వదించారని మనం అనుకొంటాం. నిజానికది అద్భుతమైన ఆకాంక్ష. చాలా విలువైన దీవెన. ఆ ఆశీస్సులో రెండు గొప్ప పదాలున్నాయి. వాటిలో ఆయుష్మాన్ అనేది యోగాల్లో మూడోది. భవ అనేది కరణాల్లో మొదటిది.
మన అందరికీ పంచాంగం ద్వారా ఎన్నో విశేషాలు తెలుస్తున్నా- తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదూ దానిలో ప్రధానమైన అంగాలు. అవి వరసగా శ్రేయస్సు, ఆయువు, పాపవిముక్తి, రోగ నివారణ, కార్యసిద్ధికి సంబంధించినవి. ఆ అయిదింటి శుభ అశుభ ఫలితాలను పంచాగం వెల్లడిస్తుంది. నిత్యం పూజావిధిలో ఆ అయిదు అంగాలనూ సంకల్పంలో చెబుతారు.
తెలుగువారి పంచాంగాలకు చాంద్రమానం ఆధారం. చంద్రుడి నడకనే చాంద్రమానం అంటారు. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. అంటే పదహారు కళలున్నవాడు. వాటినే తిథులు అంటారు. పాడ్యమి మొదలు పున్నమి వరకు, తిరిగి పాడ్యమినుంచి అమావాస్య వరకు విదియ, తదియ, చవితి, పంచమి అంటూ పౌర్ణమి/అమావాస్యతో కలిసి శుక్లపక్షం, కృష్ణపక్షం అని నెలకు రెండు పక్షాలున్నాయి.
పంచాగంలో రెండో విభాగం- వారం. ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు వారాలవి. నక్షత్రం అనేది పంచాంగంలో మూడో విభాగం. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి... నుంచి రేవతి వరకు మొత్తం 27 నక్షత్రాలు. ఒకో నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున మొత్తం 108 పాదాల్లో సృష్టిలోని ప్రతి జీవీ ఇమిడిపోతుంది. పుట్టిన ప్రతి మనిషికీ ఒక్కో నక్షత్రం ఒక్కో పాదం స్థిరపడతాయి. అష్టోత్తరశత నామావళి సంప్రదాయానికి ఇదే పునాది. ఆ 108 నామాల్లో ఒకటి ప్రతి మనిషికీ అనువర్తిస్తుంది. ఉపాసకులకు అదే ఆధారం. తమ నక్షత్రానికి చెందిన పాదానికి, 108లో ఒక నామానికి సమన్వయం తెలుసుకొని, సంపుటీకరణ ప్రక్రియను ఉపాసకులు ఆచరిస్తారు.
పంచాంగంలో నాలుగోది యోగం. యోగాలూ ఇరవై ఏడే. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్య, శోభన నుంచి వైధృతి వరకు 27 యోగాల్లో కొన్ని శుభ ఫలితాలకు, మరికొన్ని అశుభ ఫలితాలకు కారణమవుతాయి. ఆయుష్మాన్ అనేది వీటిలో చాలా మంచి యోగం.
ఇక అయిదోది కరణం. ఇది పంచాంగంలో ఆఖరి భాగం. కరణాలు మొత్తం 11. భవ బాలవ కౌలవ తైతుల గరజ వనజ భద్ర శకుని చతుష్పాత్తు నాగవం కింస్తుఘ్నం... అనేవి వాటి పేర్లు. వీటిలో మొదటిదైన భవకరణం ఎంతో శుభప్రదం.
శుభ తిథులు, అశుభ తిథులు వాడే పంచాంగంలోని మిగిలిన వార నక్షత్ర యోగ కరణాల్లోను మంచివి, చెడ్డవి రెండూ ఉంటాయని పంచాంగకర్తలు చెబుతారు. మనిషికి యోగాల్లో ఆయుష్మాన్, కరణాల్లో భవ- మంచి ఫలితాలనిస్తాయి. ఆయుష్మాన్ భవ అని పెద్దలు దీవించడంలోని ఆంతర్యం ఏమంటే- శుభ యోగం, శుభ కరణం రెండూ కలిస్తే ఎంత గొప్ప స్థితి లభిస్తుందో, అంత ఉత్తమ స్థితి నీకు కలుగుగాక అని.
మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో లోతైనవి, చాలా విలువైనవి. అందుకే పెళ్ళిళ్లు, శుభకార్యాల్లో వాటికి పట్టింపు ఎక్కువ.
Comments
Post a Comment