నూరేళ్లూ బతకాలి
*‘జీవేమ శరదశ్శతమ్’* (నూరేళ్లూ బతకాలి), *'నందామ శరదశ్శతమ్’* (నూరేళ్లూ ఆనందించాలి), *‘అజీతాః స్యామ శరదశ్శతమ్’* (నూరేళ్లూ విజయాలను సాధిస్తూనే ఉండాలి) అనే వేదవాక్కులు మనిషిలోని ఆశావాదానికి అనువాదాలైన రుక్కులే!
గతించిన బాల్యం, గడచిన కౌమారం, ఆనందవాహినిలో తేలిపోయిన యౌవనం... ఎవరికైనా తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. సుదూర గతం, సమీప గతం అన్న తేడా లేకుండా అన్నింటినీ కాలం క్రమంగా సౌధంలా పేర్చి సుందర భవనంలా నిలుపుతుంది.
గతం కొందరికి మృతం అయితే మరికొందరికి అమృతం అవుతుంది. మేధకు అందినంత దూరం గతాన్ని మనిషి గుర్తుచేసుకుంటాడు. స్ఫూర్తిగా రాసుకుంటాడు.
అరచేతిలో ఉన్న అక్షయపాత్ర వర్తమానం. అందులోనుంచి ఎంతైనా అమృతాన్ని తోడుకోవచ్చు. మనిషి కృషికి, సంకల్పశక్తికి పరీక్ష పెడుతుంది వర్తమానం. తలుపు తట్టే లక్ష్మీదేవిని తలుపు తెరిచి ఇంటిలోకి ఆహ్వానిస్తే ఎంతటి సిరి సొంతమవుతుందో అంతటి లాభాన్ని అందించేది వర్త మానం.
వర్తమానాన్ని గుర్తించకపోతే భవిష్యత్తు శూన్యం. నేడు నాటిన విత్తనమే కదా రేపటి రోజున కొమ్మగా విస్తరించి- రెమ్మలు తొడిగి పూలు, కాయలు, పండ్లను ప్రసాదించేది. అందుకే వర్తమానం నిత్యం ఒక కొత్త విత్తును నాటమని బోధిస్తుంది.
మనిషిని ఉద్యుక్తుణ్ని చేస్తుంది. ఉత్సాహంతో ఉరకలు వేయిస్తుంది. అందుకోబోయే మధుర ఫలాలను చూపుతూ ఊరిస్తుంది. పారిపోయిన గతం నుంచి నేర్చుకొన్న అనుభవాలను రంగరించుకొని జారిపోని అభ్యుదయాన్ని సొంతం చేసుకొమ్మంటుంది. రేపు ఏమవుతుందోనని భయపడేవారికి వర్తమానం రక్షణ ఇస్తుంది. ధైర్యాన్ని నూరిపోస్తుంది.
వర్తమానం- మనిషి అందుకోలేని స్వర్గానికి చేరవేసే నిచ్చెనలాంటిది. ఒక్కొక్క మెట్టెక్కుతూ ఊహించని ఉన్నత శిఖరాలకు చేరుకొమ్మని ఆహ్వానించే హితైషి- వర్తమానం.
వర్తమానాన్ని గుర్తించే మనిషిని భవిష్యత్తు ఒక స్వర్ణసౌధంలా ఆకర్షిస్తుంది. గతంలోనూ వర్తమానంలోనూ చూడని అద్భుత విజయాలను అందించే రాజమార్గం- భవిష్యత్తు. ఏ మనిషి అయినా జీవించేది భవిష్యత్తు కోసమే.
భవిష్యత్తులో అన్నీ సాధించాలని తపిస్తాడు మనిషి. భవిష్యత్తు కోసం ఎంతో సాధన చేస్తాడు. నిరంతర శోధనలతో బంగారు బాటలు వేస్తాడు. వార్ధక్య దశలో చింతలు ఉండరాదని భావించే మనిషికి యౌవనం సాధనకు నెలవు అవుతుంది.
భవిష్యత్తు అగమ్యగోచరం కాదు అనన్య శోభామయంగా నిలవాలనుకుంటాడు మనిషి.
కాలం ఎవరితోనూ మాట్లాడదు. ఎవరినీ ఏమీ అడగదు. ఏమీ చెప్పదు. అన్నింటినీ చూస్తున్న ‘అంతర్యామి’లా ఎప్పుడూ నిలిచిపోతుంది. ఎంతటి మహనీయ గాథలైనా, ఎందరు మహానుభావులైనా కాలం ఒడిలోకి చేరిపోవలసిందే!
తిథులు, వారాలు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు మారిపోతూ కాలగమనాన్ని మనిషికి గుర్తుచేస్తాయి. కాలానికి అందరూ సమానమే. రాగద్వేషాలు లేని పరమాత్మ- కాలం. అనంతం, అవేద్యం, అశోధ్యం... కాలం! కాల లీలను జీవన వికాసహేలగా, ఆనందశాలగా, మందార సుమమాలగా ధరించడమే మానవ కర్తవ్యం.
Comments
Post a Comment