యోగవాశిష్ట సారము

శ్రీరామ
       (మనోవ్యధలే వ్యాధులుగా పరిణమిస్తాయి)

శ్లో// యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ /
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే//

(ఎవరిని స్మరించినంత మాత్రాన మనము జన్మ, జరా, విపత్తి, మరణములనే సంసార బంధముల నుండి విముక్తుల మవుతామో, సర్వ సమర్ధుడైన ఆ మహావిష్ణువునకు నమస్కారము).
                          --------------------
ప్రస్తుత జీవన విధానం చాలా కృత్రిమంగానూ, యాంత్రికంగానూ ఉంటున్నది. కష్ట,సుఖాలు పంచుకోవడానికి, మనస్సు విప్పి మాట్లాడటానికి ప్రతి వ్యక్తికీ ఆత్మీయులనే వారే కరువయ్యారు.

"చిక్కడు, దొరకడు" అన్నట్లు ఉంటున్నాయి మన సంభాషణలు. 

"స్వార్థం" రాజ్యమేలుతోంది.

అందరూ ఏదో గుట్టుగా కాలక్షేపం చేస్తున్నారు.  

తీవ్రమైన మనో వ్యధలను ఆత్మీయులతో పంచుకోక పోతే గొప్ప అనర్ధం సంభవిస్తుందన్న విషయం చాలామందికి తెలియదు.

మనోవ్యధలు క్రమ క్రమంగా తీవ్రమైన వ్యాధులుగా పరిణమిస్తాయి. ఆత్మీయుల మరణం, అవమానాలు, దారిద్ర్యం మొదలైనవి మనోవ్యధలకు కారణం. ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నవారిని బంధు, మితృలు ఓదార్చి, తగుసహాయం చేసి ఆదుకోవాలి. సాధ్యమైనంత వరకు వారి మనోవ్యధ పోగొట్టాలి.

మనోవ్యధ వల్ల వచ్చే వ్యాధులను " ఆధులు " అంటారు. వాతావరణ మార్పులు, ఆహారదోషములు, మొదలైన వాటివల్ల వచ్చే అనారోగ్యాన్ని " వ్యాధులు " అంటారు. ఈ విషయమునే వాల్మీకి మహర్షి రచించిన "యోగ వాశిష్ఠము" అనే గ్రంథం ఇలా తెలియజేస్తున్నది.

ఆధి, వ్యాధులను గురించి తెలియజేయమని అడిగిన శ్రీరామచంద్రునితో వసిష్ట మహర్షి ఇలా చెబుతున్నారు:

శ్లో //ఆధయో వ్యాధయశ్చైవ ద్వయం దుఃఖస్య కారణమ్/
తన్నివృత్తిః సుఖం విద్యాత్ తత్ క్షయో మోక్ష ఉచ్యతే//

(ఓ రామచంద్రా! ఆధి, వ్యాధులు, రెండును దుఃఖమునకు కారణభూతములు. వాని నివృత్తిచే సుఖముకలుగుచున్నది. జ్ఞానముచే నవి సమూలంగా నశించుటయే మోక్షమని పేర్కొనబడుచున్నది).

శ్లో//సంక్షోభా త్సామ్య ముత్సృజ్య వహన్తి ప్రాణవాయవః/

(మానసిక వ్యధలచే వ్యాకులమగు ప్రాణవాయువు తనసమత్వమును వదలి యన్యమార్గమున ప్రవహించును) అందువల్ల నాడులు విషమత్వము చెందును.

శ్లో//కాశ్చిన్నాడ్యః ప్రపూర్ణత్వం యాన్తి కాశ్చిచ్చ రిక్తతామ్/
ప్రాణా విధురితే దేహే సర్వతః సరితో యథా//

(ప్రాణవాయువు యొక్క విషమత్వముచే శరీరము విహ్వలము కాగా నదీ ప్రవాహము వలె కొన్ని నాడులు అధిక పూర్ణములుగాను, కొన్ని నాడులు రిక్తముగాను, నుండుచున్నవి).

శరీరాంతర్గతములైన అన్న రసములు, ధాతువైషమ్య రూప పరిణామముచే వ్యాధులుగా వ్యక్తమగును.

కంటికి కనపడని ఈ పరిణామాలు వల్ల మనోవ్యధలు వ్యాధులుగా పరిణమించుచున్నవి.

శ్లో//ఏవ మాధేర్భవేద్వాధి స్తస్యాభావాచ్చ నశ్యతి/
యథా మన్త్రై ర్వినశ్యన్తి వ్యాధయ స్తత్క్రమం శృణు//

( ఓం రామచంద్రా! ఈ విధముగా ఆధిచే, వ్యాధిసంభవించుచున్నది.
మరియు ఆధి లేకున్న వ్యాధియు నశించుచున్నది. ఇక మంత్రాదులతో వ్యాధి యెట్లు నశించునో ఆ క్రమమును వినుము).

వాయువు, అగ్ని, జలము, భూమి, ఆకాశము మొదలగు వానికి బీజములైన "య, ర, ల, వాది మంత్రవర్ణములు, జపించువాని భావనావశమున, రోగాకారము నొందిన యన్నరసములను సరి అయిన విధముగా పచన మొనరించి, రోగమును పోగొట్టు చున్నవి. పుణ్య కార్యములు, భగవన్నామస్మరణ, సాధుజన సేవ మొదలైనవి, మనస్సును నిర్మలము చేయుచున్నవి.

శ్లో//సత్త్వశుద్ధ్యా వహన్త్యేతే క్రమేణ ప్రాణవాయవః/
జరయన్తి తథాన్నాని వ్యాధిస్తేన వినశ్యతి//

(అంతఃకరణ శుద్ధి చేత ప్రాణవాయువు సక్రమముగా ప్రవహించును. మరియు అన్నమును లెస్సగా పచన మొనర్చును. అందువల్ల సమస్త వ్యాధులు నశించును).

అంతఃకరణ శుద్ధి అనగా మనస్సు నిర్మలం అవడము. 

 మనకు వేద శాస్త్రములు ఉపదేశించిన, "సత్యంవద" (సత్యము చెప్పుము),
"ధర్మం చర" (ధర్మమును ఆచరింపుము),
మొదలైన సత్కర్మానుష్ఠానము,
సదాచారము, దానధర్మములు, మంత్ర జపము, దేవతాస్తోత్ర పారాయణములు, హోమము మొదలైన శాంతికర్మలు, నిరంతర భగవన్నామ స్మరణ, మొదలైనవి చిత్తశుద్ధిని కలిగించి తద్వారా భగవత్సాక్షాత్కారానికి, దారి తీస్తాయి అని మనం తెలుసుకోవాలి.

ఇవన్నీ అనాదిగా మన భారతీయ జీవనవిధానములో ఆచారముల రూపంలో ఉన్నవే. వీటిని అవహేళన చేసి "నవ నాగరికత" మనకు సాధించి పెట్టింది దుర్భరమైన అశాంతితో కూడిన "కృత్రిమ" జీవన విధానమే.
అందువల్ల మానవతా విలువలతో కూడినవి, ఇహ, పర, శ్రేయస్సు కలుగజేసేవి అయిన పెద్దలు చెప్పిన మార్గాన్ని అనుసరిద్దాం.

"హేయం దుఃఖ మనాగతం" (ఈ క్షణం నుండి మనం దుఃఖ పడకూడదు)
అని యోగ శాస్త్రం మనల్ని ఉద్బోధిస్తోంది.

శుభమస్తు.

రఘుకుల రాజగురువు అయినటువంటి శ్రీ వశిష్ట మహర్షుల వారు, శ్రీరాముడికి   
బోధించిన సనాతన ధర్మ ఆచరణ సారములే యోగవాశిష్టము.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: