చిత్రగుప్తుడి కి చెందిన గూఢచారులు

*🙏🌷చిత్రగుప్తుడికి చెందిన గూఢచారుల గురించి విన్నారా ?🌷🙏*

*శ్రీమహావిష్ణువు గరుత్మంతునికి నరకం గురించి, యముడు, ఆయన పరివారాన్ని గురించి అక్కడి శిక్షల గురించి అనేకమైన విశేషాలని వివరించారు. అదే మనకి గరుడ పురాణంగా లభ్యం అవుతూ ఉంది. ఇందులో నరకలోకం గురించిన పూర్తి వివరాలు పొందుపరచబడి ఉన్నాయి.

 యమధర్మ రాజు ఎలా ఉంటాడు? 
అసలు చిత్రగుప్తుడు ఎవరు?
ఆయన పనేమిటి?
మరణానంతరం మనతో పాటు వచ్చేవి ఏవి? వంటి విషయాలన్నీ ఇందులో వివరించబడ్డాయి. 
ఇందులోనే చిత్రగుప్తునికి సంబంధించిన గూఢచారి వ్యవస్థని గురించి కూడా వివరించారు. ఆ విశేషాలు తెలుసుకుందాం .

శ్రీ గరుడ పురాణంలోని మూడవ అధ్యాయములో శ్రీహరి గరుడునికి యమపురంలో ప్రవేశించిన జీవులు అనుభవించే నరక బాధలు వింటే నువ్వు భయపడతావు అంటూనే, వివరిస్తారు. 

ఆ వివరణలో బహుభీతి పురానికి 44 ఆమడల దూరంలో యమధర్మరాజు పట్టణం ఉంది. అక్కడ నరక బాధలు అనుభవించే పాపుల హాహాకారాలు వింటూనే ప్రేత ఏడుస్తాడు. యమపురంలో భటులు ఆ ఏడుపు విని, దక్షిణద్వార కావలి వాడు అయిన ధర్మధ్వజుడనే వానితో’ పాపాత్ముడు వచ్చాడు’ అని చెప్తారు.

అలా నరకద్వారందాకా వచ్చిన జీవుడు తన వెంట తెచ్చేది ఏదీ ఉండదు. తానూ చేసిన పాపంలో భాగం పంచుకునే వారు ఎవరూ ఉండరు. ఎవరికోసమైతే, ఎవరి సుఖం కోసమైతే అతను పాపకర్మములు చేసి, నరకద్వారాన్ని చూడాల్సివచ్చిందో, వారెవరూ అతని పాపాన్ని పంచుకోరు. కానీ, పాపం చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. 

యమపురంలో ద్వారపాలకుడు ధర్మధ్వజుని ద్వారా చిత్రాగుప్తునకు పాపి వచ్చాడు అనే సమాచారం చేరగానే, అతడా విషయాన్ని యమధర్మ రాజుతో చెప్తాడు. యమధర్మ రాజుకు వచ్చిన పాపుల్లో ఎవరు నాస్తికులో౼ ఎవరు మహాపాపాత్ములో తెలుసు! ఆయిన చిత్రాగుప్తుడిని అడుగుతాడు. చిత్రగుప్తుడు సర్వజ్ఞుడే! అయినా ఆయన తన బంట్లయిన శ్రవణులని అడుగుతాడు.

మనం చెప్పుకునే, ఈ శ్రవణులే, చిత్రగుప్తుని చారులు. వీరు బ్రహ్మ పుత్రులు. ఆ మాటకొస్తే, చిత్రగుప్తుడు కూడా బ్రహ్మ పుత్రుడే! వీరు స్వర్గలోక, మనుష్య లోక, పాతాళ లోకాల్లో ఎక్కడైనా ఏ ఆటంకం లేకుండా సంచరించే వాళ్ళు. దూరశ్రవణ౼దూరదర్శనాది విద్యలున్నవారు. వీరి భార్యలు అలాంటి వారే. వీరిని శ్రవణీ అంటారు. వీరు ముల్లోకాల్లో ఉన్న స్త్రీ చేష్టలను బాగా గమనించగలరు. ఈ శ్రవణీ౼శ్రవణులు ప్రత్యేకంగా ౼ పరోక్షంగా జీవులు ఏయే పాపాలు చేశారో, చిత్రాగుప్తునకు చెప్తారు.

యమధర్మరాజుకు గూఢచారి వంటి వారైన ఈ శ్రవణులుకు మనుషుల త్రికరణ శుద్ధి తో చేసిన పాపాలన్నీ తెలుస్తాయి. వీరు యదార్ధావాదులు. దాన వ్రతాధి పుణ్యకర్మలు చేసినవారికి స్వర్గ సౌఖ్యాలు కల్పించడంలో వీరి పాత్ర ఉన్నట్లే , సత్యవాదులు అయిన వీరివల్ల పాపుల చరిత్ర కూడా యమునికి తెలిసిపోతుంది. జీవులు చేసే సమస్త కార్యాలు కనిపెట్టడమే వీరి పని. సూర్యచంద్రులు, వాయువు, అగ్ని, అంతరిక్షము, భూమి ౼ నీరు, రాత్రింబగళ్లు ౼ రెండు సంధ్యల ధర్మము ౼ మానవుని ప్రవర్తన వీరు తెలిసి ఉంటారు. 

 ధర్మరాజు, చిత్రాగుప్తుడు, శ్రవణులు తదితరులు అణుక్షణంకూడా జీవులు చేసేటటువంటి పాపపుణ్యములను లెక్కగడుతూ ఉంటారు.

యముడు ఇలా శ్రవణ, చిత్రాగుప్తాదుల సహాయం వల్ల మనుషుల పాపాపుణ్యములు తెలుసుకుని వారిని పిలిచి తన నిజస్వరూపం చూపిస్తాడు. ఆతర్వాత వారికి ఉచితమైన శిక్షలు విధిస్తాడు . ఆ విధంగా శ్రవణి, శ్రవణులు చిత్రగుప్తునికి నమ్మిన బంట్లుగా గూఢచారులుగా ఉంటారు .

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: