భారతీయం
భారతీయం
భగవద్గీత సత్వము, రజస్సు, తమస్సు అనే దృష్టికోణం నుంచి మనం చేసే అనేక పనుల్ని విశ్లేషిస్తుంది. ఉదాహరణకు మనిషి చేసే తపస్సు శరీరంతో చేసేది, మనసుతో చేసేది, మాటతో చేసేది అని మూడు విధాలు.
పెద్దల్ని పూజించడం, శుచిగా ఉండటం, అహింస పాటించడం మొదలైనవి శరీరంతో చేసేతపస్సు.
ఇతరుల్ని నొప్పించకుండా మాట్లాడటం, సత్యాన్ని పలకడం, నిష్టూరమైన సత్యాన్ని పలకకుండా ఉండటం, ఆధ్యాత్మిక విషయాల్ని అధ్యయనం చేయడం మొదలైనవి వాక్కుకు సంబంధించిన తపస్సు.
మనసులో ఎలాంటి ద్వేషభావం లేకుండా అందరిపట్లా సమబుద్ధి ఉండటం, ఇంద్రియాలు, మనసుపై నిగ్రహం మొదలైనవి మనసుతో చేసే తపస్సు.
అలాగే ఫలితంపై ఆసక్తి లేక కేవలం తన ధర్మంగా భావిస్తూ శ్రద్ధతో చేసే తపస్సు సాత్వికమైన తపస్సు.
అలాకాక తనకు సత్కారం లభించాలని, పాదపూజలు లభించాలని, డాంబికంగా చేసేది రాజస తపస్సు.
మొండిపట్టుతో శరీరాన్ని కష్టపెడుతూ, ఇతరుల హాని కోరి చేసే తపస్సు తామస తపస్సు.
దానం కూడా మూడు విధాలు. తనకు ఎదుటివాడు మళ్లీ ఉపకారం చేయాలనే ఉద్దేశం లేకుండా కేవలం తన ధర్మంగా భావిస్తూ సరైన వ్యక్తికి సరైన సమయంలో దానం ఇవ్వడం సాత్వికమైన దానం.
శ్రద్ధతో, వినయంతో, శక్తికొద్దీ దానం చేయాలి అని తైత్తరీయ ఉపనిషత్తు చెప్పే మాట.
ఎదుటివాడు మళ్లీ సహాయం చేస్తాడనే ఉద్దేశంతో చేసే దానం రాజస దానం.
ప్రభుత్వ పథకాలకు సహాయం పేరిట లేదా సామాజిక బాధ్యత పేరిట కార్పొరేట్ సంస్థలు చేసే సహాయం లేదా దానం ఈ కోవకు వస్తుంది.
ప్రభుత్వం నుంచి మరింత ఫలితాన్ని పొందాలనే ఉద్దేశంతో చేసే పనులివి. మూడవరకం దానం తామస దానం.
ఎదుటివాడి అర్హతను, ఉద్దేశాన్ని, గుణాన్ని గ్రహించకుండా ఇచ్చే దానం లేదా తిరస్కార భావంతో చేసే దానం. ఉగ్రవాదులకు సహాయం చేయడం వంటివి ఈ కోవలోనివే.
Comments
Post a Comment