దీపం జ్యోతిః పరబ్రహ్మా*

🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀🌷



👌 *ఏష ధర్మః సనాతనః*👌

       *36. దీపం జ్యోతిః పరబ్రహ్మా*

✍️ పూజ్యగురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు.
🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹

🪔 *దీపం జ్యోతిః పరబ్రహ్మా* 🪔

🪔 జ్యోతిని పరబ్రహ్మగా ఉపాసించే సంస్కృతి మనది. అందుకే,  'దీపారాధన' అనే మంచి ఆచారాన్ని అత్యంత ప్రాచీనకాలం నుంచీ పాటిస్తున్నాం.

💫 ఈ సదాచారంలో చక్కని సూక్ష్మ విజ్ఞానం, సంస్కా రవంతమైన సద్భావన ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

💫 ఉభయ సంధ్యలలో ప్రతి ఇంటా దీపం వెలిగించాలని మనవారి నియమం. పూజలో ఒక భాగంగా దీపాన్ని వెలిగించడమే కాదు. దీపమే దేవత అని భావించి పూజించే సంప్రదాయం మనది.

🙏 *దీపజ్యోతి సాక్షాత్తు పరంజ్యోతి.* 🙏

💫 ఆదిత్య చన్ద్రాగ్నులకు సైతం మూలమైన పరమేశ్వరుని జ్యోతిగా ఆరాధిస్తాం. జ్యోతి అన్ని దిక్కుల్నీ ఎలా చూస్తుందో, విశ్వాన్నంతటినీ అలాగే పరిశీలిస్తూ, తన 'శక్తి' అనే వెలుగుతో నింపే పరాత్పరుడు సర్వజ్ఞశక్తిని చాటే శాశ్వత జ్యోతి. 

✅👉 *దీపాలలో కూడా అనేక పద్ధతు లున్నాయి.*

💫 పత్తితో చేసిన వత్తిని ఆవునెయ్యి, నువ్వులనూనె, ఆవనూనె, కొబ్బరినూనె వంటి దీపపు ఇంధనాలతో వెలిగిస్తారు. తామరతూడుల దారంతో కూడా వత్తులను చేస్తుంటారు. తైలంలో సుగంధద్రవ్యాలను కలపడం కొన్ని చోట్ల కనిపిస్తుంది. మట్టి ప్రమిదలు మొదలుకొని ఇత్తడి, రాగి, వెండి కుందెల వరకు అనేక రకాల ఆధారాలను ఏర్పరుస్తారు. దీపతోరణాలు, మాలికలు, దీపవృక్షాలు కూడా మన ఆలయాలలో గోచరిస్తాయి.


💫 దీపాలను వెలిగించేవారికి పుణ్యలోకాలు లభిస్తాయనీ, పితృపక్షమైన అమావాస్య నాడు దీపాలు వెలిగిస్తే పూర్వతరాల వారికి పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయనీ విశ్వాసం. దేవపక్షమైన శుక్లపక్షం, పూర్ణిమ దేవతలకు ప్రీతి కలిగించి మనకు మంచి స్థితులను ఏర్పరుస్తాయి.

💫 *దీప ప్రజ్వలన ఐశ్వర్యానికీ, శుభానికీ, జ్ఞానానికీ హేతువు. అవిద్యను పారద్రోలి విషయాలను తేటపరచి, విశాలంగా బుద్ధిని ప్రసరింపజేసే జ్ఞానం నిజమైన జ్యోతి. ఆ జ్యోతిని సాక్షాత్కరింపజేయమని ఉపనిషత్తు ప్రార్థిస్తోంది.*

*‘అసతోమా సద్గమయ*
*తమసోమా జ్యోతిర్గమయ'.*

💫 మన శరీరమనే ఇంటిలో చైతన్యమనే వెలుగును నింపి బతుకును నడిపిస్తున్న ఆత్మజ్యోతిని ఆవిష్కరించుకొనే బ్రహ్మవిద్యను వేదాంతం బోధిస్తోంది.

💫 దీపాలకు వాడే ఇంధనాలు వివిధ దైవశక్తుల్ని జాగృతం చేస్తాయి. విశ్వ వ్యాపక ఈశ్వర చైతన్యం ఒక్కటే అయినా, వివిధ శక్తులుగా వ్యక్తమవుతోంది. ఆ విభిన్న శక్తులే విభిన్న దేవతలు. వారిని ఆహ్వానించి, ఆవహింపజేసే ప్రక్రియ వత్తుల్నీ, ఇంధనాల్నీ సమకూర్చడంలో ఉంది. అందుకే సంప్రదాయ బద్ధంగా ప్రమిదలు, చమురు, వత్తి... వీటి యోగంతో దీపం వెలిగించడం ఒక అనిర్వచనీయమైన ప్రశాంత పవిత్రానుభూతిని ప్రదానం చేస్తుంది. ఇతర దేశ సంస్కృతుల్లో కూడా వారి పద్ధతుల ప్రకారం దీపారాధన విధానాలున్నాయి.

💫 *దీపజ్యోతిని చూస్తూ ధ్యానించమని శ్రీరామకృష్ణ పరమహంస బోధించారు. ఒక్క దీపజ్యోతిలో ఎరుపు, తెలుపు, నీలం, చివరగా ఒక బిందు పరి మాణంలో వెలుగు ఉంటాయి. ఇవి మహాలక్ష్మీ, మహాసరస్వతీ, మహాకాళీ, వీటికి మూలపుటమ్మ అయిన పరమేశ్వరిని తెలియజేస్తాయని పరమహంస నిర్వచనం.*

💫 *‘లోకైక దీపాంకురాం'* - అని పరాశక్తిని ప్రార్థిస్తాం. యోగశాస్త్రం ప్రకారం- ధ్యానంలో పరిపక్వత చెందిన వారికి మన శరీరంలో 'స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ' అనే నాలుగు భూమికలు ఉన్నాయని తెలుస్తుంది. వాటి వర్ణాలు కూడా ఎరుపు, తెలుపు, నలుపు, నీలబిందువు... అంటారు. వాటిలో వ్యాపించిన చైతన్యమే ఆత్మజ్యోతి. దానిని స్ఫురింప జేసేదే దీపజ్యోతి. దీపజ్యోతి ధ్యానం ఆత్మజ్యోతి ఆవిష్కరణకు సాధనం.

💫 ఈ జ్యోతిలోని భూమికలు అ, ఉ, మ, బిందు (అర్ధమాత్ర) - అనే ఓంకార స్వరూపాన్ని సూచిస్తాయి. అంటే జ్యోతియే ఓంకారం అన్నమాట. అందుకే జ్యోతిర్లింగార్చన మనకు ప్రధానం.


🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: