సౌందర్య లహరి
శ్రీ ఆదిశంకరాచార్య విరచితం
సౌందర్య లహరి– శ్లోకం – 3
అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబకమకరన్దసృతిఝరీ,
దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. 3
అమ్మా! నీ పాదధూళి ప్రభావము విచిత్రము. అజ్ఞానుల మనసులలోని అజ్ఞాన మహాంధకారమును గూడ పోగొట్టు సూర్యోదయ స్థానమైనది. జడులకు చేతనత్వ మును కలిగించు జ్ఞానపుష్పమునుండి స్రవించు మకరంద ప్రవాహమగుచున్నది. దరిద్రులకు కోరిన కోరికల నిచ్చు గుణ సమూహమగుచున్నది. సంసార సముద్రమున మునిగిన బాధితులను ఉద్ధరించుటలో సముద్రమగ్నమైన భూమినుద్ధరించిన వరాహ దంష్ట్ర యగుచున్నది. 🙏🏻
...
సౌందర్య లహరి– శ్లోకం – 4
త్వదన్యః పాణిభ్యామభయవరదో
దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటితవ రాభీత్యభినయా ।
భయాత్రాతుం దాతుం ఫలమపి చ
వాంచ్ఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవనిపుణౌ || 4
జననీ! దేవతలు-వరద-అభయముద్రలను హస్తములయందు ధరించి లోకరక్షణ నభినయించు చున్నారు. కాని నీవు వారివలె నీ హస్తములయందు వరదాది ముద్రలను ధరించి - లోకరక్షణను అభినయించవు. లోకముల భయములను పోగొట్టుటలో, కోరినదానికంటె నెక్కువ శుభమును కలిగించుటలో నీ పాదములే సమర్ధములు చతురములు. లోకైక శరణ్యా! జగజ్జననీ! నీపాద ములు-వాని ధూళి-వీని మహిమయే యిట్లున్నది. మరి నీ హస్తములు మున్నగువాని ప్రభావమెట్టిదో కదా!
.....
సౌందర్య లహరి– శ్లోకం – 5
హరిస్త్వామారాధ్య
ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్,
స్మరో౽పి త్వాం నత్వా
రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యన్తః ప్రభవతి హి
మోహాయ జగతామ్ || 5
తల్లీ! భక్తులకు సౌభాగ్యమును అనుగ్రహించు నిన్ను శ్రీహరి అర్చించి మోహినియై నీదయచే త్రిపురము లను దహించిన పురారిని శివుని గూడ మోహపరవశుని గావించెను. మన్మధుడును నీకు నమస్కరించుటచేతనే రతి మనోహర మగు దివ్యసుందరాకృతినంది నియమశీలురగు మునుల మనసులను, సర్వజగములను మోహతన్మయుల గావించెను. నీ దయా ప్రభావము మాటలకు అందనిది కదా.
......
సౌందర్య లహరి– శ్లోకం – 6
ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ
పఞ్చ విశిఖాః
వసన్త స్సామన్తో
మలయమరుదాయోధనరథః ।
తథా ప్యేక స్సర్వం హిమగిరిసుతే
కామపి కృపా
అపాఙ్గత్తే లబ్ద్వా జగదిద మనంఙ్గో
విజయతే ॥ 6
జగన్మాతా! మన్మధుని విల్లు - సుకుమార పుష్పమయము. వింటినారి చంచలములగు తుమ్మెదల వరుస. వాని పుష్పబాణములు అయిదు. వసంతుడు వానికి అనుచర సామంతుడు. మలయ మారుతము వాని రథము. ఇట్లు యుద్ధ పరమ సుకుమారుడగు మన్మథుడు ఒకడే అయినను నీ కరుణా వీక్షణమును కొలదిగా పొంది తాను శరీరహీనుడైనను జగముల నన్నిటిని గెలుచుచున్నాడు. ఇది వాని ప్రభావము కాదు. హిమగిరిపుత్రికా! జాలిగల నీ కడ గంటి చూపే వానికి అంతటి శక్తినిచ్చినది సుమా!
...
సౌందర్య లహరి– శ్లోకం – 7
క్వణత్కాణ్చీదామా కరికలభకుమ్భస్తననతా
పరిక్షుణ్ణా మధ్యే పరిణతశరచ్చన్ద్రవదనా |
ధను ర్బాణా నాపాశం సృణిమపి దథానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితురాహోపురుషికా ||7
తాత్పర్యము : అమ్మా! నీవు ధరించిన చిరుగజ్జెల మొల నూలు చిరుసవ్వడి చేయుచుండును. నీవు స్తన భారమున కొంత వంగియుందువు. నీ నడుము సన్ననై యుండును. నీ మొగము శరత్కాల పూర్ణ చంద్రబింబ సమానము. నీ హస్తములయందు ధనువు, బాణములు, పాశము, అంకుశము ధరించి యుందువు. ఇట్టి నీవు రూపము-త్రిపురాంతకుడగు పరమశివుని అహంకార స్వరూపమైన ఆహో పురుషికవు. జగన్మాతా! దయయుంచి అట్టి నీ రూపమున మాకు దర్శనమనుగ్రహింపుము తల్లీ!
.....
సౌందర్య లహరి– శ్లోకం – 8
సుథాసిన్ధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చిన్తామణిగృహే,
శివాకారే మఞ్చే పరమశివపర్యఙ్కనిలయాంభ
జన్తి త్వాం ధన్యాః కతిచన చిదానన్దలహరీమ్ ||8
అమృతమయ సముద్రము మధ్య కల్ప వృక్షముల వనమున్నది. ఆ వనము మధ్యలో మనోహర మగు మణిద్వీపము. ఆ ద్వీపమున కడిమిచెట్ల తోటలు. వాని మధ్య చింతామణులచే నిర్మితమగు దివ్యభవనము. అందు శివ (త్రికోణ) రూపము గల మంచము. దానిపై పరమశివుని అంకమున నున్న జ్ఞాన - ఆనంద తరంగ రూపనగు నీవుందువు. ఇట్టి నిన్ను జ్ఞాన-నిరతిశ-యానంద రూపను-కొందరు-ధన్యులు మాత్రమే సేవింతురు కదా! దేవి యొక్క యిట్టి దర్శనము నందినవారు కొందరే. వారే ధన్యులు.
Comments
Post a Comment